ప్రయాణం

పొద్దున బస్సుకు పోవాలె
పట్నంల పరీక్ష
సదివిందాని మీద మనసు లేదు
అంతా ప్రయాణం గురించే
టికెటు కొట్టే బక్క కండక్టరు
ముందు సీట్ల ఎక్కే రెండు జళ్ళ సీత
నాతో పాటొచ్చే సీనుగాడు, వాని పుస్తకాల సంచి

నాకు పరిక్షలంటె భయం లేదు
అదోరకం విరక్తి
ప్రశ్నలన్ని ఏడ తెస్తరో
సీస పద్యానికి తాత్పర్యం రాయడంకంటె,
ప్రభలో మల్లిక్‌ మీద,
బాపు బొమ్మలతో వచ్చే దీపావళి కథల మీద
ఎవడో పారేస్తే కిందటిసారి బస్సుల దొరికిన
మహాప్రస్థానం మీదనో
రాయమంటె మంచిగుండు

కిటికీలనించేసిన దస్తీ ముందా, టవలు ముందా!
సీటెవరిదో తెలుసా అంటే, నోరును బట్టి డిసైడ్‌ చేద్దాం
మూడో ఆయన
కండ్లు నెత్తినున్నయా! ఒక తెల్లగుడ్డలాయన
సూడలేదు సారు, చెప్పుల్లేని మాట పెగలని ఇంకో పెద్దాయన
సుట్టలు తాగొద్దని బోర్డు, ముట్టించిన డ్రైవరు

గేగులు, ముంజలు, సుయ్యిమనే సోడాలు
అరటిపండ్లు, బఠానీలు, వేరుశణక్కాయలు ప్రతి స్టాపుల
ఒక్క షారణా కోసం కట్టె సాయంతో
బస్సెక్కి దిగే ముసలోళ్ళు
ఒకాయన బియ్యం బస్తా, ఇంకొకామె కూరగాయల సంచి
ఇంతమందితోటి ఇరుకిరుకుగ
బెరుకు బెరుకుగ
కొత్త పెండ్లిపిల్ల లాగ నేనెక్కిన బస్సు
గాలి కోసం వూరు దాటితె తిరిగొచ్చిన వూపిరి

ఇంజనాగింది, పట్నం ఇంకా దూరం
స్టార్టరు శబ్దం, మొరాయిస్తున్న మోటరు
అయ్యో నా బట్టీ పట్టిన తాత్పర్యం … పరీక్ష?

కుమ్మరి, మంగలి, మాల, మాదిగ
రెడ్లు, కంసలి ఒక్క తీరుగ కలిసి తోస్తే కదిలిన భారతం
దారెమ్మట బస్సు
మల్లీ మొదలు

ఎక్కే దిగే జనమంటే ఇష్టం
ప్రతి జాగా తెలుసు ఈ తొవ్వల
ఆగే ప్రతి స్టాపు
తిరిగే ప్రతి మలుపు
వచ్చే పొయ్యే చెట్టు, వాగు, వంతెన
పాత జ్ఞ్ఞాపకాల దొంతర
నేను చదివిన తెలుగు గైడు
మూడూర్లు పోయినయి, నా మనసంత పరీక్ష మీద
ఎన్నడో తప్పాల్సిన పరీక్ష మీద
పదేండ్లయింది, ఈ బస్సు రంగు మారలేదు
చెప్పుల్లేని పెద్దాయన, దస్తీలు, టవల్లు
జనం వీళ్ళే, రోడ్డు ఇదే
కాలం నిలబడ్డట్టు.
నా పయనం ఆగినట్టు.