కామవేదము

సూచన

తమిళ లిపిని తెలుగులో వ్రాయడములో పాటించిన కొన్ని నియమాలను మీకు తెలుపుతున్నాను. తమిళములో వర్గాక్షరములు తక్కువ. క, ఖ, గ, ఘ అక్షరాలను ఒక్క క-కారముతో మాత్రమే వ్రాస్తారు. సామాన్యముగా అచ్చ తమిళ పదాలు పరుషములతో ప్రారంభమవుతాయి. పదముల మధ్యలో వాటిని సరళముగా ఉచ్చరిస్తారు. తమిళములో రెండు న-కారాలు ఉన్నాయి. పదాదిలో త-వర్గములోని న-కారాన్ని, మధ్యలో మరొక న-కారాన్ని ఉపయోగిస్తారు. బండి ఱ అక్షరము తమిళములో ఎక్కువగా వాడుతారు. ఱ అక్షరానికి అదే అక్షరము ఒత్తుగా వస్తే దానిని ట్ర అని పలుకుతారు. ట్ర, త్ర వంటి అక్షరాలు తమిళములో ఆ రూపములో వాడరు, అవి ట్టిర, త్తిర గా మారుతాయి. తెలుగువలె కాక తమిళములో ఎక్కువ పదాలు హలంతాలు, నాన్, పణం, ఇటువంటివి. మిగిలిన భాషలలో లేని రెండు అక్షరాలు తమిళములో ఉన్నవి. అవి- పళం లాటి పదాలలో ఉపయోగించే ళ, ఇది మన ళ, ఫ్రెంచి జ ల మిశ్రణము అనుకోవచ్చు. తెలుగులో ఒకప్పుడు ఈ అక్షరము ఉండినది శాసనాలలో, కాని నన్నయ కాలానికే ఇది అంతరించిపోయింది. కన్నడములో మధ్య యుగమువరకు ఇది ఉపయోగించబడినది. ఈ ప్రత్యేక ళ-కారాన్ని ముద్ద అక్షరాలుగా చూపుతున్నాను. మరో అరుదైన తమిళ అక్షరము మూడు చుక్కల అక్ అక్షరము. ఇది తమిళములోనే అరుదుగా వాడుతారు.


అణంగుకొల్ ఆయ్ మయిల్ కొల్లో కనంగుళై
మాదర్కొల్ మాలుమ్ ఎన్ నెంజు (1081)

          అమరవనితయొ, యందాల నెమలియేమొ
          రమణభూషిత నన్నిట్లు భ్రమల ముంచె

నోక్కినా న్ నోక్కెదిర్ నోక్కుదల్ తాక్కణంగు
తానైక్కొం డన్న తుడైత్తు (1082)

          నాదు చూపుల ప్రశ్నించి నంగ జూచె
          మీద వచ్చెను కామాస్త్ర మెదను దాక

కండార్ ఉయిరుణ్ణుం తోట్రత్తాల్ పెండగై
ప్పేదైక్కు అమర్తన కణ్ (1084)

          ఆ యమాయకురాలి సోయగపు చూపు
          ప్రాయశము ద్రాగు యువ జీవరసముఁ జొక్కి

కూట్రమో కణ్ణో పిణైయో మడవరల్
నోక్కమిం మూన్ఱుం ఉడైత్తు (1085)

          అది చావొ, కన్నులో, హరిణమ్మొ, యెఱుగ నే
          ముదిత చూపులయందు మూడు గలవు

ఒణ్ణుదఱ్ కో ఓ ఉడైందదే జ్ఞాడ్పినుళ్
నణ్ణారుం ఉడ్కుమెన్ పీడు (1088)

          అరుల యుక్కు నణచు గురుశక్తి చినదాని
          విఱుపు భ్రుకుటి ముందు కరగిపోయె

పిణైయేర్ మడనోక్కుం నాణుం ఉడైయాడ్కు
అణియెవనో ఎదిల తందు (1089)

          జింక కనుల చూపు చెలువంపు సిగ్గున
          కింకఁ గలుప నంద మేమి కలదు

ఉండార్కణ్ అల్లదు అడునఱా క్కామంపోల్
కండార్ మగిళ్చెయ్దల్ ఇన్ఱు (1090)

          మదిరఁ ద్రాగిన వాని కది యిచ్చు మోదమ్ము
          హృది నిండు ముదముతో ముదితఁ జూడ

ఇరునోక్కు ఇవళుణ్కణ్ ఉళ్ళదు ఒరునోక్కు
నోయ్నోక్కొ న్ఱన్నోయ్ మరుందు (1091)

          వనిత కాటుక కళ్ళ వఱలు దృక్కులు రెండు
          తిని చంపు నొకటి మందిచ్చు నొకటి

నోక్కినాళ్ నోక్కి ఇఱైంజినాళ్ అక్దవళ్
యాప్పినుళ్ అట్టియ నీర్ (1093)

          చూచుచుఁ దల దించెఁ, జూపు నీరమ్ముల
          లేచె కామలతయుఁ, బూచె ప్రేమ

యాన్నోక్కుం కాలై నిలన్నోక్కుం నోక్కాక్కాల్
తాన్ నోక్కి మెల్ల నగుం (1094)

          నేను జూడ నామెను దాను నేలఁ జూచు
          నేను జూడనప్పుడు చూచి తాను నవ్వు

కుఱిక్కొండు నోక్కామై అల్లాల్ ఒరుకణ్
శిఱక్కణిత్తాళ్ పోల నగుం (1095)

          కన్నెత్తి చూడదు, కడగళ్ళఁ గాంచి తాఁ
          జిన్నగా నవ్వు నా చివురుబోడి

ఉఱాఅ తవర్పోల్ శొలినుం శెఱాఅర్చొల్
ఒల్లై ఉణరప్పడుం (1096)

          మొదట తోచును బలుకులు ములుకులుగను
          పిదప నయ్యవి మారును బ్రియముగాను

శొఱా అ చ్చిఱుశొల్లుం శెట్రార్పోల్ నోక్కుం
ఉఱా అర్పోన్ఱు ఉట్రార్ కుఱిప్పు (1097)

          నిందించు వాక్యాలు, నిశితమౌ చూపులు
          నవలాల కడుగొప్ప నాటకాలు

అశైయిఱ్కు ఉండాండోర్ ఎఎర్యాన్ నోక్క
ప్పశైయినన్ పైయ నగుం (1098)

          సన్నదాని యందచందములు సొగసు
          సన్నగాను నవ్వెఁ గన్నులఁ గన

ఏదిలార్ పోల ప్పొదునోక్కు నోక్కుదల్
కాదలార్ కణ్ణే ఉళ (1099)

          పట్టించుకొన నట్లు వర్తించుచుందురు
          బెట్టుతో నటనలన్ బ్రియు లొకపుడు

కణ్ణోడు కణ్ ఇణై నోక్కొక్కిన్ వాయ్ చ్చొర్గళ్
ఎన్న పయనుం ఇల (1100)

          కనులు కనులతో మాటాడు ఘడియలోన
          ననవసరమైన మాటల వినగ నేల

కండు కేట్టు ఉండుయిర్తు ఉట్రఱియుం ఐంబులనుం
ఒణ్దొడి కన్ణే ఉళ (1101)

          పంచేంద్రియముల కీయమ
          వంచన కేకుండ ముదముఁ బంచిడుఁ గాదా

పిణిక్కు మరుందు పిఱమన్ అణియిళై
తన్నోయ్క్కు తానే మరుందు (1102)

          భూమి మందుండుఁ బ్రతి రోగమునకు వెదుక
          నామె వ్యాధి కే యౌషధ, మామె తప్ప

తాం వీళ్వార్ మెందోళ్ తుయిలిన్ ఇనిదుకొల్
తామరై క్కణ్ణాన్ ఉలగు (1103)

          మధురమౌ వాని గవుగిలి నిదురకన్న
          మధురమా స్వర్గమన్నది ముదము నొసగ?

నీంగిన్ తెఱూఉం కుఱుగుంగాల్ తణ్ణెన్నుం
తీయాండు ప్పెట్రాళ్ ఇవళ్ (1104)

          దూరముండగఁ గాల్చుఁ, జేరఁ జల్లగౌను
          ఔర యనల మిదెటు లామె కబ్బె

ఉరుదోఱు ఉయిర్తళిర్ప త్తీండలాల్ పేదైక్కు
అమిళ్దిన్ ఇయన్ఱన తోళ్ (1106)
          
అతివ రెండు చేతులు నిజ మమృతమయము
          ప్రతి కవుంగిలి క్రొంగ్రొత్త బ్రదుకు నిచ్చు

వీళుం ఇరువర్కు ఇనిదే వళియిడై
పో ప్పడా అ ముయక్కు (1108)

          కవుగిలించు నపుడు గాలికైనను జోటు
          రవయు లేకనున్న రమ్యమగును

నన్నీరై వాళి అనిచ్చమే నిన్నినుం
మెన్నీరళ్ యాంవీళ్ పవన్ (1111)

          మృదువంచు పుష్పమా మురిసిపోకే నీవు
          మృదుతరమ్ము తెలుసా మధుర యువతి

కాణిన్ కువళై కవిళ్న్దు నిలన్ నోక్కుం
మాణిళై కణ్ణెణ్వోం ఎన్ఱు (1114)

          లలిత సుందరమ్ము లలన కన్నులు రెండు
          తలను వంచె సిగ్గుఁ గలువ పూవు

మదియుం మడందై ముగనుం అఱియా
పదియిన్ కలంగియ మీన్ (1116)

          ఏది యామె వదన మెక్కడ శశి యంచు
          చుక్క లొందె భ్రాంతి మిక్కుటముగ

అఱువాయ్ నిఱైంద అవిర్మదిక్కు ప్పోల
మఱువుండో మాదర్ ముగత్తు (1117)

           ఆ శశాంకు వోలె నంకము లున్నవో
          యామె సొగసు మొగమునందుఁ గూడ

మాదర్ ముగంపోల్ ఒళివిడ వల్లైయేల్
కాదలై వాళి మది (1118)
          
వెలుఁగు యామె ముఖముఁ జూచి వె లుఁగు మటుల
          వలతు నప్పుడు నెలరాజ తలచి నిన్ను

అనిచ్చముం అన్నత్తిన్ తూవియుం మాదర్
అడిక్కు నెరుంజి ప్పళం (1120)

          మృదు సుమమ్ము, లంచ తూలికలు ముండ్లు
          ముదిత మృదు మనోజ్ఞ పదములకును

పాలొడు తేన్ కలందట్రే పణిమొళి
వాలెయిఱు ఊఱియ నీర్ (1121)

          మధువు కలిపిన క్షీరము మధుర మగును
          మధురతర మామె పలికిన మృదు పదమ్ము

ఉడంబొడు ఉయిరిడై ఎన్నమట్రన
మడందైయొడు ఎమ్మిడై నట్పు (1122)
          
కాన మా యిర్వురి కమనీయ ప్రేమయు
          ప్రాణ దేహమ్ముల బంధ మగును

వాళ్దల్ ఉయిర్కన్నళ్ ఆయిళై శాదల్
అదర్కన్నళ్ నీంగుం ఇడత్తు (1124)

          సకియతో జీవిత మ్మది స్వర్గసమము
          సకియ లేక జీవిత మది చావె నాకు

కణ్ణుళ్ళార్ కాద లవరాగ క్కణ్ణుం
ళుదేం కరప్పాక్కు అఱిందు (1127)

          నేఁ గనుల దాచుకొందును నెమ్మిఁ బ్రియుని
          దాగకుండ కజ్జలము నద్దఁ గనులందు

నెంజత్తార్ కాద లవరాగ వెయ్దుండల్
అంజుదుం వేబా క్కరిందు (1128)

          కూరిమిని దాచుకొందును గుండెలోన
          కారమును తిన నతనికిఁ గష్టమంచు

ఉవందుఱైవర్ ఉళ్ళత్తుళ్ ఎన్ఱుం ఇగందుఱైవర్
ఏదిలర్ ఎన్నుం ఇవ్వూర్ (1130)

          వాఁడు హృదయమందు వాసమై యుండంగ
          రాడు, లేడు, నన్ను వీడె నంద్రు

కామం ఉళందు వరుందినార్కు ఏమం
మడలల్లదు ఇల్లై వలి (1131)

          కామ బాధలు తగ్గఁ గల దొక్క దారి
          తామసించక నెక్కు తాటి గుఱ్ఱమును

(చీలలు, ముండ్లు ఉండే తాటి బోదె లెక్క చెక్కతో చేసిన ఒక పలకపై ప్రేమికుని పరుండబెట్టి ప్రేమ పాటలతో ఊరేగింపు చేయడాన్ని తాటిగుఱ్ఱము ఎక్కడము అంటారు. అంటే ప్రేమికుని ప్రేమ బహిరంగమై “నీవు లేక నేనుండలేను” అనే స్థితికి వస్తుంది. తలిదండ్రులు ముందు వారించినా చివరికి పెళ్ళికి ఒప్పుకోవలసి వస్తుంది.)

నోనా ఉడంబుం ఉయిరుం మడలేఱుం
నాణినై నీక్కి నిఱుత్తు (1132)

          తపనతో మండెడు తనువు మనస్సు
          త్రప వీడి తానెక్కు తాటి గుఱ్ఱమును

కామ క్కడుంబునల్ ఉయ్కుమే నాణొడు
నల్లాణ్మై ఎన్నుం పుణై (1134)

          వగల వఱద వేగమ్మున వాలి మునిగె
          మగతనమ్ము , సిగ్గను నౌక మాయమాయె

తొడలై క్కుఱుందొడి తందాళ్ మడలొడు
మాలై ఉక్కుం తుయర్ (1135)

          తాటి గుఱ్ఱము సంధ్యల తపన లామె
          నా కొసంగిన బహుమతుల్, స్వీకరింతు

మడలూర్తల్ యామత్తుం ఉళ్ళువేన్ మన్ఱ
పడల్ ఒల్లా పేదైక్కెన్ కణ్ (1136)

          మూయ నీ కళ్ళు నిదురతో రేయిలోన
          తాటి గుఱ్ఱము నెక్కుటే తగిన పనియు

యాం కణ్ణిన్ కాణ నగుబ అఱివిల్లార్
యాంబట్ట తాంబడా ఆఱు (1140)

          వేడి నిట్టూర్పుతో నిండు వేదన లవి
          మూఢులకు నెటు లర్థమౌ భూమిపైన

కళిత్తొఱుం కళ్ళుండల్ వేట్టట్రాల్ కామం
వెళిప్పడుందోఱుం ఇనిదు (1145)

          కల్లు ద్రాగఁగ నెక్కువై కల్గు ముదము
          పొల్లు మాటలు బ్రేమకుఁ బొలుపు నొసగు

ఊరవర్ కెళవై ఎరువాగ అన్నైచ్చొల్
నీరాగ నీళు మిన్నోయ్ (1147)

          అల వదంతు లెరువవంగ, నమ్మ యాన
          జల మవంగఁ, బెరిగె నాదు వలపు బాధ

నెయ్యాల్ ఎరినుదుప్పేం ఎన్ఱట్రాల్ కెళవైయాల్
కామం నుదుప్పేం ఎనల్ (1148)

          గాలి వార్త లార్పుఁ గామాగ్ని కీలలన్
          జితిని యార్చు నటుల ఘృతముతోడ

శెల్లామై ఉండేల్ ఎనక్కురై మట్రునిన్
వల్వరవు వాళ్వార్కు క్కురై (1151)

          వెళ్ళుచున్నావు నను వీడి వేగ మిపుడు
          మళ్ళి వత్తువా మఱువక మఱలఁ జెప్పు

ఇన్కణ్ ఉడైత్తవర్ పార్వల్ పిరివంజుం
పున్కణ్ ఉడైత్తాల్ పుణర్వు (1152)

          ముదము నిండెను డెందాన మొగముఁ జూడ
          వదలు నని దోచె, కౌగిలి వదలజాల

అరిదరో తేట్రం అఱివుడైయార్ కణ్ణుం
పిరివోరిడత్తుణ్మై యాన్ (1153)

          వదలనని జెప్పి వదలెడు వాని నేను
          నమ్ము టెట్టుల నయ్యది వమ్ము గాదె

అళిత్తంజల్ ఎన్ఱవర్ నీప్పిన్ తెళిత్త శొల్
తేఱియార్కు ఉండో తవఱు (1154)

          చెప్పె నమ్ముమనుచుఁ, జప్పున వీడెనే
          తప్పెవ్వరిది నమ్మదగునె బ్రియుని

ఓంబిన్ అమైందార్ పిరివోంబల్ మట్రవర్
నీంగిన్ అరిదాల్ పుణర్వు (1155)

          వాని ప్రయాణమ్ము వలదంచు జెప్పుమా
          లేనియెడల జూడలేను వాని

పిరివురైక్కుం వన్కణ్ణర్ ఆయిన్ అరిదవర్
నల్గువర్ ఎన్నుం నశై (1156)

          కరకు మొగమ్ములోఁ గదలికల్ వీడ్కోలు
          మఱి వచ్చునను యాశ కరగుచుండె

తుఱైవన్ తుఱందమై తూట్రగొల్ మున్కై
ఇఱై ఇఱవా నిన్ఱ వళై (1157)

          జారిన గాజుల సడి రోదనమ్ములై
          వీడెడు ప్రియుగూర్చి జాడఁ దెల్పె

ఇన్నాదు ఇనన్ఇల్ఊర్ వాళ్దల్ అదనినుం
ఇన్నాదు ఇనియార ప్పిరివు (1158)

          కష్ట ముండుట యహితుల గ్రామమం దుఁ
          గష్టతర మీ విరహ మంతకన్న నిజము

తొడిఱ్చుడిన్ అల్లదు కామనోయ్ పోల
విడిఱ్చుడల్ ఆట్రుమో తీ (1159)

           తాక నగ్గియుఁ గాల్చును తక్షణమ్ము
          తాకకున్నను విరహాగ్ని తపన నిచ్చు

మఱైప్పేన్మన్ యానిక్దో నోయై ఇఱైప్పవర్కు
ఊట్రునీర్ పోల మిగుం (1161)

          దాచగా లేని దీ తాపమ్ము హృదయాన
          నూటలో నీళ్ళుగా నూరుచుండె

కామముం నాణుం ఉయిర్ కావా త్తూంగుంఎన్
నోనా ఉడంబిన్ అగత్తు (1163)

          కావడికుండలు కామమ్ము సిగ్గగు
          చేవలేక భుజాల మోసెన్ బ్రదుకు

కామ క్కడల్మన్నుం ఉండే అదు నీందుం
ఏమ ప్పుణైమన్నుం ఇల్ (1164)

          పెను కామ జలరాశి ననువుగాఁ గడతేర
          కనబడ దొక నౌక కనులముందు

ఇన్బం కడల్మట్రు క్కామం అక్తడుంగాల్
తున్బం అదనిఱ్ పెరిదు (1166)

          యోగసుఖము లగాధమ్ము లుదధివలె వి-
          యోగ బాధ లగాధమ్ము లుదధికన్న

కామ క్కడుంబునల్ నీంది క్కరై కాణేన్
యామత్తుం యానే ఉళేన్ (1167)

          నీరముల నీదుచుంటిని నేను, దూర
          తీర మది కనబడదె యీ తిమిరమందు

మన్నుయిర్ ఎల్లాం తుయిట్రి అళిత్తిరా
ఎన్నల్లదు ఇల్లై తుణై (1168)

          లాలిబాడె నందఱికి నీ రాత్రి యిపుడు
          కాళరాత్రికి నేఁ జెలికాడ నైతి

కొడియార్ కొడుమైయిన్ తాంకొడియ ఇన్నాళ్
నెడియ కళియుం ఇరా (1169)

          వాఁడు కఠినుఁడు, కఠినము వానికంటె
          పాడు నిశి, యంత మెపుడౌనొ జాడ లేదు

తెరిందుణరా నోక్కియ ఉణ్ కణ్ పరిందుణరా
ప్పైదల్ ఉప్పదు ఎవన్ (1172)

          నాఁడు తప్పుఁ జేసెగద నీ నయనయుగము
          నేఁడు బాధతో నేడ్చె నీ పాడు కనులు

కదుమెన తాం నోక్కి త్తామే కలుళుం
ఇదునగ త్తక్క తుడైత్తు (1173)

           ఆత్రమై నాఁడు కలిసిన నేత్రయుగము
          చిత్ర మై నేఁడు బాష్పాలఁ జిందుచుండె

పెయలట్రా నీరులంద ఉణ్ కణ్ ఉయలట్రా
ఉయ్విల్ నోయ్ ఎన్ కణ్ నిఱుత్తు (1174)

          ఏడ్చి యేడ్చి యీ నా కన్ను లెండిపోయె
          నేడ్చె వెతలతో కన్నీళ్ళ రాల్చలేక

ళందుళం దుళ్నీర్ అఱుగ విళైందిళైందు
వేండి అవర్ కండ కణ్ (1177)

          ఆశతో జూచిన యక్షిద్వయమ్ము ని-
          రాశతో నేడ్చె నీరాలె లేక

పేణాదు పెట్టార్ ఉళర్ మన్ఱో మట్రవర్
కాణాదు అమైవిల కణ్ (1178)

          పెదవితో బ్రేమించె హృదితోడ కా దతఁ ,
          డది యేలకో కోరె నక్షు లతని

వారాక్కాల్ తుంజా వరిన్ తుంజా ఆయిడై
ఆరజ్ఞర్ ఉట్రన కణ్ (1179)

          ఉన్నప్డు రాదు, లేకున్నప్డు లేదు, నా
          కన్నులకు నిదుర, కారు నీళ్ళు

మఱైపెరల్ ఊరార్కు అరిదన్ఱాల్ ఎంబోల్
అఱైపఱై కణ్ణార్ అగత్తు (1180)

          దండురా వేసెనో రెండు కళ్ళిచ్చట
          యుండ దిక రహస్య మొక్క నాఁడు

నయందవర్కు నల్గామై నేర్దేన్ పశందవెన్
పణ్బియార్కు ఉరైక్కో పిఱ (1181)

          నేనే పంపితి “నూ” యని
          యీ నా వైవర్ణ్యమునకు నెవ్వరు బాధ్యుల్

శాయలుం నాణుం అవర్ కొండార్ కైమ్మాఱా
నోయుం పశలైయుం తందు (1183)

          అందము నమాయకతఁ దా
          నందుకొనెన్, నీరసమ్ము నార్తి నొసంగెన్

ఉవక్కాణెం కాదలర్ శెల్వార్ ఇవక్కాణెన్
మేని పశప్పూర్వదు (1185)

          తను వీడిన తక్షణమే
          తనువున రక్తము హరించెఁ దగ్గెను జవముల్

విళక్కాట్రం పార్కుం ఇరుళేపోల్ కొణ్ కన్
ముయఱ్కట్రం పారాక్కుం పశప్పు (1186)

          దీప మారంగ వేచును తిమిర మదియు
          వాఁడు వీడంగ నా మోము వాడిపోయె

పశందాళ్ ఇవళ్ ఎన్బదు అల్లాల్ ఇవళై
త్తుఱందార్ అవర్ ఎన్బార్ ఇల్ (1188)

          ఈ విరహ కారణమ్ము వాఁ డిటుల వీడ
          నా వివర్ణతఁ గని తప్పు నాదె యనిరి

పశక్కమన్ పట్టాంగెన్ మేని నయప్పిత్తార్
నన్నిలైయార్ ఆవర్ ఎనిన్ (1189)

          అతఁడు సుఖముగా నున్న నా కదియె చాలు
          వెతల చిక్కనీ దేహ మమితముగాను

తాం వీళ్వార్ తంవీ ప్పెట్ట్రవర్ పెట్రారే
కామత్తు క్కాళిల్ కని (1191)

          గింజలు ఫలముల నుండవు
          రంజిలఁ జేసెడు ప్రియుండు రాజిల్లంగన్

వాళ్వార్కు వానం బయందట్రాల్ వీళ్వార్కు
వీళ్వార్ అళిక్కుం అళి (1192)

          ప్రేమించువారు జిలికెడు
          ప్రేమయు గగనము చిలికెడు బిందువు లగుగా

వీప్పడువార్ కెళీ ఇయిలర్ తాం వీళ్వార్
వీ ప్పడా అర్ ఎనిన్ (1194)

          ఎంద ఱెందఱు ప్రేమించనీ… వనితకు
          సుందరప్రియుఁ బ్రేమయె సుఖతరమ్ము

ఒరుదలైయాన్ ఇన్నాదు కామం కాప్పోల
ఇరుదలై యానుం ఇనిదు (1196)

           రెండువైపుల సమభార ముండవలయుఁ
          గావడికి, నట్టులేగద కామమునకు!

పరువరలుం పైదలుం కాణాన్ కొల్ కామన్
ఒరువర్కణ్ నిన్ఱొళుగు వాన్ (1197)

          వ్యధ లెఱిగి కాముఁ డేలకొ
          వృథగా నాయొకరితపయి వేసెను శరముల్

నశై ఇయార్ నల్గార్ ఎనినుం అవర్మాట్టు
ఇశైయుం ఇనియ శెవిక్కు (1199)

          ఆశలను దీర్చకున్నను
          యాశలఁ గల్గించును దన యా పలుకులతో

ఉళ్ళినుం తీరా ప్పెరు మగిళ్ శెయ్దలాల్
కళ్ళినుం కామం ఇనిదు (1201)

          మధురమైనది ప్రేమయు మదిరకంటె
          మదియు దలచిన క్షణమందె మధుర మగును

ఎనైత్తొన్ఱు ఇనిదేకాణ్ కామం తాం వీళ్వార్
నినైప్ప వరువదొన్ఱు ఇల్ (1202)

          తొలగును బ్రేమల బాధలు
          వలపగు మధురము మధురము వానినిఁ దలువన్

నినైప్పవర్ పోన్ఱు నినైయార్కొల్ తుమ్మల్
శినైప్పదు పోన్ఱు కెడుం (1203)

          తుమ్మఁ దోచిన యత్నము వమ్ముగ నయె
          వమ్ముగ నయెనో నా స్మృతి వాని కిపుడు

యాముం ఉళేంగొల్ అవర్ నెంజత్తు ఎన్ నెంజత్తు
ఓ ఒ ఉళరే అవర్ (1204)

          వాని హృదయమందు స్థాన మున్నదొ లేదొ
          వానికుండె చోటు మానసమున

తన్నెంజత్తు ఎమ్మై కడిగొండార్ నాణర్కొల్
ఎం నెంజత్తు ఓవా వరల్ (1205)

          తానొసంగఁడు హృదిలోన స్థాన మొండు
          తాను జొచ్చును నా హృదిఁ దప్పకుండ

మట్రుయాన్ ఎన్నుళేన్ మన్నో అవరొడు ఇయాన్
ఉట్రనాళ్ ఉళ్ళే ఉళేన్ (1206)

           అతనితో బ్రణయంపు స్మృతులను దల్చుట
          బ్రతుకులో నాకింక రసమయమ్ము

మఱప్పిన్ ఎవనావన్ మఱ్కొల్ మఱప్పఱియేన్
ఉళ్ళినుం ఉళ్ళం శుడుం (1207)

          మఱచిపోయిన నిన్ను నేమగునొ యెఱుగ
          మఱువ శక్యమె నీ స్మృతి మదిని మండె

విళియుమెన్ ఇన్నుయిర్ వేఱల్లం ఎన్బార్
అళియిన్మై ఆట్ర నినైందు (1209)

          ఒక్కర మిర్వుర మనె, నే
          నిక్కడ బ్రదుకున కృశించి యేడ్చుచునుంటిన్

విడా అదు శెన్ఱారై క్కణ్ణినాల్ కాణ
ప్పడా అది వాళి మది (1210)

          చనకోయి నెలరాజ, నను వీడెఁ బ్రియుఁ డిందు,
          నను వీడి మదినుండి చనఁడు వాఁడు

కయలుణ్కణ్ యానిరప్ప త్తుంజిఱ్ కలందార్కు
ఉయలుణ్మై శాట్రువేన్ మన్ (1212)

          మూయవే చేపకన్నులా, మూసి, నిదుర
          పోయి, కలలందు గానవే మోహమయుని

ననవినాల్ నల్గా తవరై క్కనవినాల్
కాండలిన్ ఉండెన్ ఉయిర్ (1213)

          మెలకువన్ గానలే నేను లలితముఖునిఁ
          గలలలోఁ గాంచి జీవించి కలగుచుంటి

కనవినాన్ ఉండాగుం కామం ననవినాన్
నల్గారై నాడి త్తరఱ్కు (1214)

          కలల నేను వానిఁ గడు రమింతు నిజము
          మెలకువందు వాఁడు మెదలఁ డెదుట

ననవినాల్ కణ్డదూ ఉం ఆంగే కనవుందాన్
కండ పొళుదే ఇనిదు (1215)

          చూడ వాని నెదుట సుఖమౌను తనువెల్లఁ
          జూడ కలలలోన సుఖతరమ్ము

ననవెన ఒన్ఱిల్లై ఆయిన్ కనవినాల్
కాదలర్ నీంగలర్ మన్ (1216)

          మెలకు వవకున్నఁ గల్గును మెండు సుఖము
          కలలలో నన్ను వీడఁడు కాముఁ డతఁడు

ననవినాల్ నల్గా క్కొడియార్ కనవనాన్
ఎన ఎమ్మై ప్పీ ప్పదు (1217)

          మెలకువను నన్ను జూడఁడు
          కలలో వచ్చును దఱచుగఁ గలతల నీయన్

తుంజంగాల్ తోళ్మేలర్ ఆగి విళిక్కుంగాల్
నెంజత్తర్ ఆవర్ విరైందు (1218)

          నిదురించనపుడు దూరును
          హృదిలో, నిదురించువేళ నెల్లెడఁ దాకున్

ననవినాల్ నం నీత్తార్ ఎన్బర్ కనవినాల్
కాణార్కొల్ ఇవ్వూరవర్ (1220)

          వారు జెప్పిరి నను వాఁడు వీడె ననుచు
          వారెరుంగరు వాఁడు వచ్చుఁ గలల

మాలైయో అల్లై మణందార్ ఉయిరుణ్ణుం
వేలై నీ వాళి పొళుదు (1221)

          ప్రాయంపు వధువును నీ యమ్ములన్ జంపి
          సాయంత్రమా నీవు చల్లగుండు

పుణ్ కణ్ణై వాళి మరుళ్ మాలై ఎంకేళ్ పోల్
వన్కణ్ణే తోనిన్ తుణై (1222)

          నీ రాజు వీడెనో క్రూరమై నావలె
          నీరసమౌ సంధ్య నిన్ను గూడ

పని అరుంబి ప్పైదల్కొళ్ మాలై తుని అరుంబి
త్తున్బం వళర వరుం (1223)

          మంచుతో సంధ్య చలించుచు నరుదెంచె
          మించె నా వ్యధ రమించలేను

కాదలర్ ఇల్వళి మాలై కొలైక్కళత్తు
ఏదిలర్ పోల వరుం (1224)

          చెంతలేఁడు సఖుఁడు చెలువారె సంధ్య
          యంత మొనర్చగ హంతకునివలె

కాలైక్కు చ్చెయ్ద నన్ఱు ఎన్కొల్ ఎవన్ కొల్యాన్
మాలైక్కు చ్చెయ్ద పగై (1225)

          ఉషకు నే జేసిన యుపకార మేమొ
          యసురసంధ్యకు జేయు నపకార మేమొ

మాలైనోయ్ శెయ్దల్ మణందార్ అగలాద
కాలై అఱిందదిలేన్ (1226)

          నా సఖుఁడు నగుచు నాచెంత నుండ
          నీ సంధ్య యేకాంత మెఱుగను నేను

కాలై అరుంబి ప్పగలెల్లాం పోదాగి
మాలై మలరుం ఇన్నోయ్ (1227)

          విరియు ప్రభాతాన, పెరుగు దిన మెల్ల,
          విరహ రోగము సంధ్య వెతల నిచ్చు

ల్పోలుం మాలైక్కు త్తూదాగి ఆయన్
కుల్పోలుం కొల్లుం పడై (1228)

          తోడుగా వచ్చెనో దూతగా సంధ్యతో
          పాడు యీ మురళి నన్ వ్యధల ముంచె

పదిమరుండు పైదల్ ఉక్కుం మదిమరుండు
మాలై పడర్ తరుం పోళ్దు (1229)

          సదమద మొనరించ సంధ్యవేళ యిటుల
          వ్యధల నిండిరి పురవాసు లెల్ల

పొరుళ్మాలై యాళరై ఉళ్ళి మరుళ్మాలై
మాయుం ఎన్ మాయా ఉయిర్ (1230)

          మసక వెల్తురులోన మ్రాగుచుంటిని నేను
          పసిడికై వెళ్ళేను వదలి వాఁడు

నయందవర్ నల్గామై శొల్లువ పోలుం
పశందు పనివారుం కణ్ (1232)

          బొటబొట రాలెగాఁ బొంగెడు కన్నీళ్ళు
          కటిక గుండెలవాఁడు కానరాఁడు

తణందామై శాల అఱివిప్ప పోలుం
మణందనాళ్ వీంగియ తోళ్ (1233)

          కౌగిలి నానాఁడు కడు పొంగెఁ గరములు
          మూగగా జారేను ముదము లేక

పణైనీంగి ప్పైందొడి శోరుం తుణైనీంగి
త్తొల్గవిన్ వాడియ తోళ్ (1234)

          కరములు సన్నయె గాజులు వదులయె
          స్మరియించె నతనిని జాల చాల

కొడియార్ కొడుమై ఉరైక్కుం తొడియొడు
తొల్గవిన్ వాడియ తోళ్ (1235)

          నగ లేక సొగసుల నిగ లేక వగచేను
          మగని క్రూరతఁ దల్చి మగువ యిచట

తొడియొడు తోళ్ నెగి నోవల్ అవరై
క్కొడియర్ ఎన క్కూఱల్ నొందు (1236)

          సన్నని చేతులు, జారిన గాజులు
          క్రూరునిఁ జేసె నా కూర్మి పతిని

ముయక్కిడై త్తణ్వళి పో ప్పశప్పట్ర
పేదై పెరుమళై క్కణ్ (1239)

          గాలి యూర్పు వచ్చెఁ గౌగిలి మధ్యలో
          నీలి కనులలోన నిండె నీళ్ళు

నినైత్తొన్ఱు శొల్లాయో నెంజే ఎనైత్తొన్ఱుం
ఎవ్వనోయ్ తీర్కుం మరుందు (1241)

          జ్వరము నాటినుండి వదలదె డెందమా
          త్వరగ మందు నొకటి సరిగఁ జెప్పు

కాదల్ అవరిలర్ ఆగ నీ నోవదు
పేదైమై వాళియెన్ నెంజు (1242)

          వాని దల్చుచు హృదయమా బాధపడకు
          వాని కెక్కడ నాపైన వాసి ప్రేమ

ఇరుందుళ్ళి ఎన్బరిదల్ నెంజే పరిందుళ్ళల్
పైదల్ నోయ్ శెయ్దార్ కణ్ ఇల్ (1243)

          ఎందుకే కూర్చుండి కుందుచుంటివి నీవు
          డెందమం దతనికి లేదె కరుణ

కణ్ణుం కొళచ్చేఱి నెంజే ఇవైయెన్నై
త్తిన్నుం అవర్కాణల్ ఉట్రు (1244)

          మనసా కనుల తీసికొని వెళ్ళు, లేనిచో
          గనుల యాకలి నన్ను దినునె విడక

శెట్రార్ ఎనక్కైవిడల్ ఉండో నెంజే యాం
ఉట్రాల్ ఉఱా అ తవర్ (1245)

          ప్రేమించకున్నను, హృదయమా, కటికుని
          ప్రేమించుచుంటిని, విడువలేనె

కలందుణర్తుం కాదలర్ క్కండాఱ్ పులందుణరాయ్
పొయ్ క్కాయ్వు కాయ్ది ఎన్ నెంజు (1246)

          రేగెడు నీ యల్క, హృదయమా, నటనలే
          కౌగిలింతువు నీవు కనిన క్షణము

కామం విడు ఒన్ఱో నాణ్విడు నన్నెంజే
యానో పొఱేన్ ఇవ్విరండు (1247)

          విడుము కామము, లేక విడుము బిడియమ్ము,
          యెడద రెంటికి తావు లెక్క డమ్మ

పరిందవర్ నల్గారెన్ఱు ఏంగి ప్పిరిందవర్
పిన్ శెల్వాయ్ పేదై ఎన్ నెంజు (1248)

          పాపము నిను వీడెఁ, బాషాణుని గనంగ
          నో పేద హృదయమా తాపమేల

ఉళ్ళత్తార్ కాద లవరాగ ఉళ్ళినీ
యారుళై చ్చేఱియెన్ నెంజు (1249)

          ఎవ్వని దలచుట, యెవ్వని జేరుట
          యవ్వాఁడు నిల్వ నీయందు నెపుడు

కామ క్కణిచ్చి ఉడైక్కుం నిఱైయెన్నుం
నాణుత్తాళ్ వీళ్త కదవు (1251)

          బిడియమున్ మౌనమున్ బిగియించు తలుపుఁ
          బడజేయు గొడ్డలి పఱగ కామమ్మె

కామం ఎనవొన్ఱో కణ్ణిన్ఱెన్ నెంజత్తై
యామత్తుం ఆళుం తొళిల్ (1252)

          కరుణయేలేని యొక శక్తి కామ మౌర
          చెఱుపు మనసును, నిదురను, చీకటందు

మఱైప్పేన్ మన్ కామత్తై యానో కుఱిప్పిన్ఱి
త్తుమ్మల్ పోల్ తోన్ఱి విడుం (1253)

          వమ్ము కామమ్ము దాచు యత్నమ్ము నాకు
          తుమ్మువలె వచ్చు నొక్క క్షణమ్ములోన

పన్మాయ క్కళ్వన్ పణిమొళి అన్ఱోనం
పెణ్మై ఉడైక్కుం పడై (1258)

          ఎన్ని తీదీపి మాటలఁ గన్నె మనసు
          నన్నిటిని బ్రద్దలుగఁ జేయు వన్నెకాఁడు

పులప్పల్ ఎనచ్చెన్ఱేన్ పుల్లినేన్ నెంజం
కలత్తల్ ఉఱువదు కండు (1259)

          చూడకూడ దనెను, వీడని యభిమాన,
          మోడి, ముద్దాడితిఁ జూడగాను

వాళాట్రు పుఱ్కెన్ఱ కణ్ణుం అవర్ శెన్ఱ
నాళొట్రి త్తేయ్ద విరల్ (1261)

          చక్కని నా కళ్ళు ఛవి లేక మసకాయె
          లెక్కెంచి దినములు వ్రేళ్ళు తరిగె

ఇలంగిళాయ్ ఇన్ఱు మఱప్పిన్ ఎన్ తోళ్మేల్
కలంగళియుం కారిగై నీత్తు (1262)

          దిగజారెఁ జెలువమ్ము దిగి జారె గాజులు
          వగకాని మఱువవే మగువ నీవు

ఉరన్ నశై ఇ ఉళ్ళం తుణైయాగ చ్చెన్ఱార్
వరల్ నశై ఇ ఇన్నుం ఉళేన్ (1263)

          అరిగె ధైర్యమ్ముతో నార్జించ విజయమ్ము
          మఱల జూడగ వాని మనుచునుంటి

కూడియ కామం పిరిందార్ వరవుళ్ళి
క్కోడుగొడు ఏఱుమెన్ నెంజు (1264)

          మది పొంగె ముదముతో మఱల కౌగిలిఁ జేర
          నెదురు జూచుచునుంటి నెనరు నిండ

కాణ్గమన్ కొణ్గనై క్కణ్ణార క్కండపిన్
నీంగుం ఎన్ మెందోళ్ పశప్పు (1265)

          తనివిదీరగ నేను గనులఁ జూతును వాని
          చనిన శక్తియు వచ్చుఁ దనువు నిండు

వరుగమన్ కొణ్గన్ ఒరునాళ్ పరుగువన్
పైదల్నోయ్ ఎల్లాం కెడ (1266)

          వచ్చుఁ, దా నొక దిన మిచ్చుఁ బీయూషమ్ముఁ
          దెచ్చు నానందమ్ము చచ్చు వెతలు

పులప్పేన్ కొల్ పొల్లువేన్ కొల్లో కలప్పేన్ కొల్
కణ్ అన్న కేళీర్ వరన్ (1267)

          మఱలి వచ్చినపుడు గురు స్వాగతము నాది
          సరసమో, విరసమో, సరిగ రెండొ

వినై కలందు వెన్ఱీగ వేందన్ మనై కలందు
మాలై అయర్కం విరుందు (1268)

          ఈ రేయి విజయుడై నా రాజు వెలుగనీ
          యీ రేయి సతితోడ నే రమింతు

(రాజు విజయము సాధించినప్పుడు, రాజు విజయాన్ని ఆనందించనీ, నేను నా భార్యతో ఆనందముగా ఉంటాను అని ఒక సైనికుడు తలుస్తాడు.)

కరప్పినుం గైమిగం దొల్లాదిన్ ఉణ్కణ్
ఉరైక్కల్ ఉఱువదొన్ఱుండు (1271)

          దాచ నెంతువు నీవు యోచన లెన్నియో
          లోచనమ్ములు దెల్పు దాచకుండ

కణ్ణిఱైంద కారిగై క్కాంబేర్తోట్పేదైక్కు
ప్పెణ్నిఱైంద నీర్మై పెరిదు (1272)

          ఇంపగు సొంపులు, వంపుల చేతులు
          నింపెను గన్నుల నెలత రూపు

మణియిల్ తిగళ్దరు నూల్పోల్ మడందై
అణియిల్ తిగళ్వదొన్ఱు ఉండు (1273)

          అరుదైన యొక వెలుం గామెలో దాగెఁ
          దరళ హారమునందు దారమ్మువోలె

ముగైమొక్కుళ్ ఉళ్ళదు నాట్రంపోల్ పేదై
నగైమొక్కుళ్ ఉళ్ళదొన్ఱుండు (1274)

          అరవిరిసిన విరియందున్న తావియో
          చిఱునవ్వు మర్మమ్ము లెఱుగ నగునె

శెఱిదొడి శెయ్దిఱంద కళ్ళం ఉఱుదుయర్
తీర్కుం మరుందొన్ఱు ఉడైత్తు (1275)

          గాజుల చినదాని గడులోతు తలపులో
          గాజుగుండెకు మందు గలదు నిజము

పెఱిదాట్రి ప్పెట్పగ క్కలత్తల్ అరిదాట్రి
అన్బినమై శూళ్వ తుడైత్తు (1276)

          వాని కౌగిళ్ళు యీ మేని కిచ్చు సుఖము,
          కాని లేకున్న నవి కలదె బ్రదుకు

నెఱునట్రు చ్చెన్ఱార్ ఎం కాదలర్ యాముం
ళునాళేం మేని పశందు (1278)

          నిన్న వెళ్ళె వాఁడు నన్ను వీడి యిచట
          నెన్న దోచె నదియు నేడు నాళ్ళు

పెణ్ణినాల్ పెణ్మై ఉడైత్తెన్బ కణ్ణినాల్
కామనోయ్ శొల్లి ఇరవు (1280)

          కన్నుదోయితోఁ బ్రార్థించు, నెన్నొ జెప్పుఁ,
          గన్నె తన కామబాధను గన్నెవోలె

ఉళ్ళ క్కళిత్తలుం కాణ మగిళ్దలుం
కళ్ళుక్కిల్ కామత్తిఱ్కుండు (1281)

          ఎదలోని చలనమ్ము లిఱుగళ్ళ మోదమ్ము
          మదిర యీయది ప్రేమ మధువె యిచ్చు

పోణాదు పెట్పవే శెయ్యినుం కొణ్గనై
క్కాణా తమై యల కణ్ (1283)

          తన కిష్టమైనదే తాఁ జేయు వాఁడు
          కనులెంత యలసినన్ గను వాని విడక

ఊడఱ్కణ్ శెన్ఱేన్మన్ తోళి అదు మఱందు
కూడఱ్కణ్ శెన్ఱదు ఎన్నెంజు (1284)

           చూడరా దనుకొంటి సుదతిరో వాని నే
          జూడలేకుండలే నోడిపోతి

ళుదుంగాల్ కోల్గాణా క్కణ్ణేపోల్ కొణ్గన్
ళిగాణేన్ కండ ఇడత్తు (1285)

          చిఱు కుంచె కనరాదు చిత్రించు వేళలో
          దరినుండ కనరావు తప్పు లన్ని

కాణుంగాల్ కాణేన్ తవఱాయ కాణాక్కాల్
కాణేన్ తవఱల్లవై (1286)

          తప్పులే కనరావు దగ్గరుండగ వాఁడు
          తప్పు తప్పకఁ దోచు దవ్వునుండ

ఇళిదక్క ఇన్నా శెయినుం కళిత్తార్కు
క్కళ్ళట్రే కళ్వనిన్ మార్పు (1288)

          నీ ఱొమ్ముపై తల నేనుంతు హృచ్చోర
          సారాయివలె నీయ దౌర మచ్చ

మలరినుం మెల్లిదు కామం శిలర్ అదన్
శెవ్వి తలైప్పడువార్ (1289)

          విరులకన్నను మృదుతరము గదా ప్రేమ
          యెఱుగ రందఱు యట్టి సరస ప్రేమ

కణ్ణిన్ తునిత్తే కలంగినాళ్ పుల్లుదల్
ఎన్నినుం తాన్విదు ప్పట్రు (1290)

          నచ్చదని దా నటించెను నన్ను గాంచి
          వచ్చె వేవేగ కౌగిలి వెచ్చగీయ

అవర్ నెంజు అవర్ కాదల్ కండుం ఎవన్ నెంజే
నీ ఎమక్కు ఆగాదదు (1291)

          లేదతని హృదయమ్ము మీదెవ్వరికి శక్తి
          నాదు హృదయ మేల నాది కాదు

ఉఱా అ తవర్కండ కణ్ణుం అవరై
చ్చొఱా అరెన చ్చేఱియెన్ నెంజు (1292)

          చూడు మెటుల నన్ను వాఁడవమానించె
          వాఁడనియెద వేల వదలకుండ

కెట్టార్కు నట్టార్ ఇల్ ఎన్బదో నెంజే నీ
పెట్టాంగు అవర్పిన్ శెలల్ (1293)

          వడిగ వానివెంట పరిగెత్తుచున్నావు
          చెడినవారి కిలను జెలులు లేరు

పెఱా అమై అంజుం పెఱిన్ పిరివు అంజుం
అఱా అ ఇడుంబైత్తెన్ నెంజు (1295)

          పొందలేని భీతి, పొందిన విడు భీతి
          కుందె నాదు యెడద కుమిలి కుమిలి

తనియే ఇరుందు నినై త్తక్కాల్ ఎన్నై
త్తినియ ఇరుందదెన్ నెంజు (1296)

          ఏకాంతమున వాని హృదిలోన తలువగా
          రాకాసివలె నన్ను పీకి తినెను

నాణుం మఱందేన్ అవర్మఱ క్కల్లా ఎన్
మాణా మడనెంజిఱ్పట్టు (1297)

          బిడియ మది వీడె నీ నన్ను బ్రియునిఁ దలువ
          విడెను మతి యిందు నేనొక్క పిచ్చిదాన

తున్బ త్తిఱ్కు యారే తుణైయావార్ తాముడైయ
నెంజం దుణైయల్ వళి (1299)

          నాదు హృదయమే దయలేక నన్ను మఱువ
          బాధఁ బాపంగ నెవ్వరు వత్తు రిపుడు

తంజం తమరల్వర్ ఏదిలార్ తాముడైయ
నెంజం తమరల్ వళి (1300)

          ఇతరు లెందుకు కరుణింతు రిపుడు నన్ను
          వెతల నీ హృది తడబడి వీడ నన్ను

పుల్లా తిరా అప్పులత్తై అవర్ ఉఱుం
అల్లల్ నోయ్ కాణ్గం శిరఱిదు (1301)

          అలుక నటియించు, చేరకు మతని నీవు
          కలగని మ్మతని యెడద, కనగ మనము

ఉప్పమైం దట్రాల్ పులవి అదు శిఱిదు
మిక్కట్రాల్ నీళ విడల్ (1302)

          అలుక ప్రేమకు లవణమ్మె యనగవచ్చు
          తొలగు రుచి యది యధికమై తోచ నిజము

అలందారై అల్లల్నోయ్ శెయ్దట్రాల్ తమ్మై
ప్పులందారై పుల్లా విడల్ (1303)

          కుపితకు నీయని కౌగిలి
          విపరీతముగా వ్యధ నిడుఁ బ్రియతమ కెపుడున్

ఊడి యవరై ఉణరామై వాడియ
వళ్ళి ముదలరం దట్రు (1304)

          అలిగిన సతి నోదార్చకఁ జెలగు చర్య
          తొలగజేయుటె వేరుతో లలితలతను

తునియుం పులవియుం ఇల్లామిన్ కామం
కనియుం కరుక్కాయుం అట్రు (1306)

          ప్రణయమునఁ గలహమ్ములు దనరుచుండుఁ
          గనరు కాయగ పండుగ మనికిలోన

ఊడలిన్ ఉండాంగోర్ తున్బం పుణర్వదు
నీడువదన్ఱు కొల్ ఎన్ఱు (1307)

          చిలిపి కలహముల ముగింపు తెలియదాయె
          కలయి కిప్పుడొ, యెప్పుడొ, తెలియదాయె

ఊడల్ ఉణంగ విడువారొడు ఎన్ నెంజం
కూడువోం అంబదు అవా (1310)

          కడు పిపాసతో రగులు యీ యెడద గోరె
          విడచి యలుకతో వెళ్ళిన పడుచు స్పర్శ

ఊడి ఇరుందేమా త్తుమ్మినార్ యాందమ్మై
నీడువాళ్గెన్బా క్కఱిందు (1312)

          అలుగుచుండగ, వానికిఁ గలిగె తుమ్ము
          పలుకలే దప్డు “దీర్ఘాయు”వనుచు నేను

కోట్టు ప్పూ చ్చూడినుం కాయుం ఒరుత్తియై
క్కాట్టియ శూడినీర్ ఎన్ఱు (1313)

          విరులతో నలంకృతమవ నఱచె నామె
          “సరస మెవ్వతెతో నాడ నరుగుచుంటి”

యారినుం కాదలం ఎన్ఱేనా ఊడినాళ్
యారినుం యారినుం ఎన్ఱు (1314)

          “యువతు లందఱికన్న యువతి నీవే మిన్న”
          “యెవరికన్నను జెప్పు, మెవరికన్న?”

ఇమ్మై ప్పిఱప్పిల్ పిరియలం ఎన్ఱేనా
క్కణ్నిఱై నీర్ కొండనళ్ (1315)

          “మన బంధ మే నాఁడు తునుగ దీ బ్రదుకులో”
          నన నశ్రు బిందువుల్ గనులఁ దోచె

ఉళ్ళినేన్ ఎన్ఱేన్ మట్రెన్మఱందీర్ ఎన్ఱెన్నై
ప్పుల్లాళ్ పులత్త క్కనళ్ (1316)

          “మనసులో నీవుంటి” వన వీడెఁ గౌగిలిన్
          గను లేడ్వ “మఱతువేల” నని యడిగె

ళుత్తినాళ్ తుమ్మినేన్ ఆగ అళిత్తళుదాళ్
యారుళ్ళి త్తుమ్మినీర్ ఎన్ఱు (1317)

          పొరబోవఁ బ్రార్థించె, మఱి మారె, నేడ్చె
          “తరుణి నెవ్వతె నీవు దలచినా” వనెను

తన్నై ఉణర్తినుం కాయుం పిఱర్కు నీర్
ఇన్నీరార్ ఆగుగదిర్ ఎన్ఱు (1319)

          కోపమ్ము దగ్గించఁ గొసర, “నెందఱితోడ
          నీపగిది పలుకు లిట్టు” లనెను

నినైత్తిరుందు నోక్కినుం కాయుం అనైత్తుం నీర్
యారుళ్ళి నోక్కినీర్ ఎన్ఱు (1320)

          తలచి యామెను జూడఁ దా నల్క నడిగేను
          “తలచుచు నుంటి వే తరుణి నిపుడు”

ఇల్లై తవఱవర్కు ఆయినుం ఊడుదల్
వల్లదు అవర్ అళిక్కు మాఱు (1321)

          అలుకజెందిన యట్టు లతని బ్రేమను బొంద
          మెలగుదు, నతఁడు నిర్మలుఁ డిది నిజము

ఊడలిన్ తోన్ఱుం శిఱుదుని నల్లళి
వాడినుం పాడు పెఱుం (1322)

          అలుకలు కలహము లవి దోచు మొదట
          నలరును బ్రేమయు నమరమై పిదప

ఉణలినుం ఉండదు అఱల్ ఇనిదు కామం
పుణర్దలిన్ ఊడల్ ఇనిదు (1326)

          తినుటకన్నను జీర్ణించుకొనుట మిన్న
          కినుక మిన్న కవుగిలించుకొనుటకన్న

ఊడలిల్ తోట్రవర్ వెన్ఱార్ అదుమన్నుం
కూడలిఱ్ కాణప్పడుం (1327)

          కలహమం దోడుటె కడు విజయమ్ము
          మిలనమం దగు మోద మిరువుర కెపుడు

ఊడుదల్ కామత్తిఱ్కు ఇన్బం అదఱ్కిన్బం
కూడి ముయంగ ప్పెఱిన్ (1330)

          కలహమే మధురమ్ము కాముకుల కెపుడు
          కలయిక యలరించుఁ గరము దాని

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...