చిన్నప్పుడు పత్రికల్లో వారఫలాల్లో ‘వచ్చే వారం మీకు వాహన యోగం వుందీ’ అంటే, ఎప్పుడో సైకిల్ రిక్షా ఎక్కడం తప్ప ఎక్కడికి పోయినా నడిచే పోయే ఆరోజుల్లో చాలా ఉత్సాహంగా ఎదురు చూసేవాళ్ళం. ఏదో ఒక రకమయిన వాహనం మన జీవితాల్లో అంతర్లీనమయిన ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయం కాకపోవచ్చు. అయితే ఏ వాహనమయినా ఉపయోగించటంలో మనందరి అనుభవాలు ఒక్కటిగా ఉండవు. అందుకని నా అనుభవాల్లో ఉన్న గమ్మత్తును ఈ వ్యాసం ద్వారా పంచుకోవాలని ఈ ప్రయత్నం.
నా చిన్నప్పుడు ఇంట్లో అన్నయ్య, నాయనల దగ్గర్నుంచీ, ఇంటికొచ్చే నాయన ఆఫీసు జవాన్లు, ఇంటికి వచ్చే అతిథులవరకూ, అందరూ చాలా వరకూ సైకిళ్ళ మీద వచ్చేటివాళ్ళు. నాకూ సైకిలు నేర్చుకోవాలనిపించింది. అప్పట్లో కర్నూల్లో సెయింట్ మేరీస్ స్కూల్లో నేను సెకెండు ఫారం (ఏడో క్లాసు) చదువుతున్నాను. స్కూల్లో కొందరు ఆడపిల్లలు స్వంత సైకిళ్ళు తొక్కుకుని రావటం చూశాను. నేనూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటే, ఒక లేడీస్ సైకిల్ కొనివ్వమని నాయనను సతాయించొచ్చుకదా అనుకున్నాను. ఇంట్లో నాయన ఆఫీసు ఫైళ్ళు తీసుకు పొయ్యేదానికి వచ్చే సలాం అనే జమానును నాకు సైకిల్ నేర్పమని అడుక్కున్నాను. రోజూ సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి కొంచం దగ్గర్లో ఉన్న ఏదో స్కూలు మైదానానికి పొయ్యేవాళ్ళం. అప్పటికింకా కర్నూల్లో అమ్మాయిలం సల్వార్ కమీజుల వరకూ రాలేదు. లంగా వోణీలతోనే సైకిళ్ళమీద తిప్పలు పడే వాళ్ళం. నేను సైకిలు తొక్కుతూ, సలాం సైకిల్ క్యారియర్ కొసను పట్టుకునీ, వదిలేసి, నావెంట పరిగెత్తేవాడు. వారం రోజులు ఇదేమాదిరి కష్టపడినాక, కొంచం ధైర్యం వచ్చింది.
నాయనను నాకు సైకిలు కొనివ్వమని తగులుకున్నాను. “నా సైకిలుందిగదా? దాన్ని తొక్కుతుండు. రేపు నేను క్యాంప్‌కు పోతున్నా. సైకిలెటూ ఊరికేనే ఉంటుంది,” అని అప్పటికి తప్పించుకున్నారు. ఇన్నాళ్ళూ తొక్కడం నేర్చుకున్న ఆయన సైకిల్లోనే వారం రోజులు స్కూలుకు పొయ్యాను. రెండో వారం, సోమవారం ఉదయం సైకిల్ తీసుకుని హుషారుగా స్కూలుకు బయలుదేరాను. మామూలుగా పొయ్యే దారిలో నిదానంగానే తొక్కుతూ వెళ్తున్నాను. అంతలో నా క్లాసుమేట్లు నలుగురు దార్లో నడుస్తూ కనిపించారు. వాళ్ళ ముందు పోజు కొట్టాలని కొంచం వేగం పెంచానేమో, మెయిన్ రోడ్డులో మా స్కూలు వైపుగా, కుడిపక్క వీధి లోపలికి తిరగబొయి, బ్యాలన్సు తప్పిపోయి నేరుగా నా సైకిలు ముందు చక్రం ఎదురుగా ఎడమ పక్క నుంచీ వస్తున్న ఎద్దుల బండి చక్రం లోకి దూసుకు పొయింది. చక్రం పూర్తిగా సొట్టపోయింది. నేను కిందపడి, మోకాళ్ళు, మోచేతులు దోక్కుపోవడంతో పాటు, సైకిలు హాండిల్ బార్, కుడి చెయి మీదుగా దూసుకుపోయింది. సైకిలు అక్కడే పడేసి, రోడ్లో నాకు సహాయం చేసిన వారే నన్ను సైకిల్ రిక్షా ఆపి ఎక్కిస్తే వస్తున్న ఏడుపు ఆపుకుంటూ, అవమానం భరించలేక ముఖం చిన్నది చేసుకుని ఇంటి దారి పట్టాను. అదే ఆఖరు, నా సైకిలు ప్రయోగం. “సైకిలు మాటెత్తితే చంపుతా …” అని బెదిరించి ఊరుకోబెట్టింది మా అమ్మ. ఏ కాలో చెయ్యో విరిగితే, ఏమిటి గతీ అని భయం ఆవిడకు.
సైకిలు తొక్కటం, ఈత కొట్టడం జీవితంలో ఒకసారి నేర్చుకుంటే చాలు. ఎప్పటికీ గుర్తుంటాయీ అని అంటారు. చాలా ఏళ్ళ తర్వాత, మా అమ్మాయి షివానికి నాలుగేళ్ళొచ్చిన తర్వాత, నేనొక ఉద్యోగంలో చేరాను. నేను పని చేసేది మా ఇంటినుంచీ సిటీబస్‌లో వెళ్తే, రెండు బస్ స్టాపులు దాటాలి, అంతే! అయినా ఆఫీసుకు త్వరగా వెళ్ళి రావచ్చని మావారు నాకోసం ఒక సెకెండ్ హాండ్ లూనా మోపెడ్ కొన్నారు. దాన్ని నడపడం నేర్చుకోవాలి కదా? నాలుగు రోజులు మా ఇంటి నుంచీ కొంచం దూరంలో ట్రాఫిక్ తక్కువగా ఉండే రోడ్లలోకీ తీసుకు పోయేవాళ్ళం మోపెడ్ను. లూనా మోపెడ్ ఎంత చిన్న బైక్ అంటే, మా వారు చాలాసేపు నా వెనుక కూర్చుని నన్ను నడపమనాలంటే కష్టం. స్థలం చాలదు. ఆ సెకెండ్ హ్యాండ్ బండి ఇద్దరి బరువు లాగటం కూడా సులువేం కాదు. చిన్నప్పుడు నాకు సైకిలు నేర్పిన సలాంలాగే ఈయన కూడా మెల్లిగా బండి నడిపిస్తున్న నావెంట పరుగెత్తాల్సివచ్చేది. పాప షివానిని ఒక చోట బెంచ్ మీదో, బండ మీదో కూర్చోబెట్టి మేం ఒక రౌండు వేసి వచ్చే లోపల, ఏముందీ? పిల్ల భయంతో నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంటుంది. గట్టిగా ఏడవాలన్నా దారిలో ఎవరయినా చూసి, “ఏమయిందమ్మా?” అని పలకరిస్తారేమోనని దానికి భయం! నిజంగానే సైకిల్తో నేర్చుకున్న రెండు చక్రాల బ్యాలన్సు వల్ల లూనా నడపడం త్వరగా వచ్చిది. త్వరలో ఆఫీసుకు వెళ్ళి రావటమే కాక అనాయాసంగా షివానిని కూడా వెంట తీసుకుని ఇంటిక్కావలిసిన షాపింగ్ కూడా చేసేదాన్ని.
సెకెండ్ హ్యాండ్ లూనా నుంచీ కొత్త బజాజ్ స్కూటరుకు ఎదిగితే బాగుంటుంది, ముచ్చటగా ముగ్గురం కలిసి ఎక్కడికయినా పోవొచ్చు అనుకున్నాము. అప్పట్లో కొత్త బజాజ్ స్కూటర్ సులభంగా దొరికేది కాదు. త్వరగా కావాలంటే, ఎవరయినా ఏజెంటు దగ్గర ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కోవాలి. అప్పుడు బజాజ్ చేతక్ మాడల్ కొత్తగా వచ్చిన రోజులు. ఆ ఏడాది బజాజ్ 150 కన్న పెద్దది, చేతక్ కన్నా చిన్నది ‘ప్రియ’ అని ఒక మాడల్ తీశారు. మా వారు ఇద్దరి ఉపయోగానికి బాగుంటుందని అది కొన్నారు. స్కూటర్ నడపడం మా బావగారు ఆయనకు నేర్పిస్తే, తను నాకు నేర్పారు. సైడ్ మౌంటెడ్ ఇంజిన్ ఉండే బజాజ్ స్కూటర్ను ఒక పక్కకు ఒంచిన తర్వాత, కిక్‌స్టార్ట్ చెయ్యటం, ఎక్కడయినా ఆగిపోతే స్పార్క్ ప్లగ్ తీసి శుభ్రం చెయ్యడం, వెనక సీట్లో నా నడుం గట్టిగా పట్టుకుని కూర్చున్న కూతురు షివానిని భరిస్తూ, షాపింగుతో నిండిన బ్యాగులు కాళ్ళ దగ్గర నింపుకుని కూడా, ఫుట్ బ్రేక్‌ను ఉపయోగించగలగటం ఈ స్కూటర్ ఉపయోగంలో నేను ఎదుర్కొన్న కొన్ని సవాళ్ళు. అప్పట్లో మా వారు రోజూ రైల్లో ప్రయాణించి వైట్‌ఫీల్డులో ఉన్న కాలేజికి వెళ్ళి వచ్చేవారు. మేమిద్దరం ఆయన్ను ఉదయం స్టేషన్‌కు, సాయంత్రం ఇంటికి పిలుచుకు రావడానికి, స్కూటర్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. అప్పట్లో కిక్-స్టార్ట్/గేరూ ఉన్న బజాజ్ స్కూటర్ను నడిపే ఆడవాళ్ళు వీధుల్లో ఎక్కడా కనిపించేవారు కాదు, మేము మామూలుగా తిరిగే ప్రాంతాల్లో.
స్కూటర్ నడిపే మోజు తీరింది. ఆ ఏడాది నేను ఉద్యోగంలో చేరిన విప్రో ఆఫీసు, కొంచం దూరంలో ఎం. జీ. రోడ్లో ఉంది. స్కూటర్ను అంత దూరం తీసుకెళ్ళటం, అక్కడ పార్క్ చేయటం నాకు శ్రమ, రిస్కు అని టివిఎస్ మోపెడ్ ఒకటి నాకోసమే కొన్నాం. ఈ బండి కూడ పాత బడి కొంచం ట్రబుల్ ఇవ్వటం మొదలుపెట్టేలోపల, ఆ ఏడు మొదటి సారిగా గేర్లు లేకుండా సెల్ఫ్ స్టార్ట్ తొ వుండే కైనెటిక్ హోండా స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ స్కూటర్ నిజంగా స్త్రీలకోసమే తీశారా అన్నట్లు వుండేది. ఈ స్కూటర్ ఒక్క దెబ్బతో అసంఖ్యాకంగా మహిళలను రోడ్ల మీదికి తీసుకొచ్చింది. అప్పుడు కొన్న కైనెటిక్ హోండా స్కూటరు ఎనిమిదేళ్ళు, మొదటి కారు కొనేవరకూ నడిపాను. తర్వాత కాలేజికి వెళ్తున్న షివానికోసం ఉండిపోయింది కైనెటిక్.
1996 వరకూ మా జీవితాల్లోకీ కారు అనే వాహనం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అందుకనేనేమో మా స్వంత ఇంట్లో ఒక కారు గ్యారేజ్ కూడా ప్లాను చేసి ఉండలేదు మేము. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వల్ల మనదేశం లోకి మారుతి సుజూకి అనే కారు ఒకటి రాకపోతే, మనలో చాలామందికి కార్లున డిపే మొదటి అవకాశం రావడానికి ఇంకా ఎన్నేళ్ళు పట్టేదో! అప్పట్లో కారు లోన్లివ్వడానికి ఇన్ని బ్యాంకులు ముందుకొచ్చేవి కాదు. విప్రో కారు లీజు స్కీంలో మా మొదటి తెలుపు మారుతి 800 కొన్నాము. మాకు ముగ్గురికీ డ్రైవింగ్ రాదు. ముగ్గురం వెనుకా ముందుగా డ్రైవింగ్ స్కూల్లో చేరి నేర్చుకున్నాం. కారు ఉపయోగం నాదే ఎక్కువ కాబట్టి, సహజంగా నాకు డ్రైవింగ్ త్వరగా వచ్చేసింది. ముగ్గురం ఒకేసారి నేర్చుకునే సందడిలో కారుకు దెబ్బతగలని బాడీ పార్ట్ అంటూ లేదు. ఒకసారి బానెట్ భాగం మొత్తం ట్రాఫిక్ సిగ్నల్ లో లారీ గుద్దితే మార్చాల్సొచ్చింది. పార్క్ చేసేటప్పుడు ఒక పక్క గోడ ఒరుసుకుని పూర్తిగా కుడివైపు రెండు డోర్లు గీచుకుని పొయ్యాయి. రెండు తలుపులు కొత్తవి వెయ్యాల్సొచ్చింది. మరో వైపు డోర్లు, కొంచం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్లో, నిలబడి ఉన్న సిటీ బస్ హఠాత్తుగా స్టార్ట్ అయే సరికి, కారు రెండో వైపు గీచుకుని పోయింది. ఈ డోర్లను కూడా మార్చే అవకాశం వచ్చింది.
నేను కారు ప్రతి రోజు ఆఫీసుకు తీసుకెళ్ళి రావటం వల్ల కారు డ్రైవ్ చెయ్యటంలో ప్రావీణ్యాన్ని మొదట నేనే సంపాదించాను. అందుకని కూతురు షివాని రాత్రి పూటల డ్రైవింగ్ ప్రాక్టీసుకు నేనే తీసుకు పొయ్యేదాన్ని. ఒక సారి ఇలాగే ప్రాక్టీసు చేస్తుండగా విండ్సర్ మ్యానర్ బ్రిడ్జ్ దగ్గర కారు ట్రాఫిక్ సిగ్నల్‌లో ఆపిన షివాని, ఆకు పచ్చ లైటు పడినప్పుడు, కాస్త ఎత్తుగా ఉన్న రోడ్లో ముందుకు కదల్లేకుండా ఉంది. హ్యాండ్ బ్రేక్-ఆక్సిలరేటర్ రెండిటినీ ఒకేసారి ఎలా ఉపయోగించాలో నేను చెప్పటం, వెనకాల నిలుచున్న బళ్ళ హారన్ శబ్దాలు షివానికి సహాయం చెయ్యటం లేదు. చివరకు హ్యాండ్ బ్రేక్ వేసి, ఇద్దరం సీట్లు మార్చుకున్నాక, నేను కారు ముందుకు కదిలించి వెనకాలున్న వాహనాలకు దారి చేసిన తర్వాత గానీ మేమిద్దరం ఊపిరి పీల్చుకోలేదు. కొన్ని రోజుల తర్వాత, ఒక ఆదివారం ఉదయం, రిసార్ట్-హోటల్లో ఆరోజు గడపాలని వెళ్తున్నాము. డ్రైవింగ్ షివాని చేస్తోంది. వెనుక కూర్చున్న మావారు తన డ్రైవింగ్ లో తప్పులు చెప్తున్నారు. కొనసాగుతున్న ఈయన ఫీడ్‌బ్యాక్ నచ్చని షివాని హఠాత్తుగా కారు ఆపి, “నువే చేసుకో డ్రైవింగ్!” అని వచ్చి వెనకాల కూర్చుంది. ఇప్పటికీ ఈ రెండు సంఘటనలను అనుకుంటే, మరొకటి గుర్తు రాకుండా ఉండదు.
ఆరేళ్ళ తర్వాత మేం, నా ఆఫీసు పని మీద శాన్ ఫ్రాన్సిస్కోకు ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు, ఫ్లారిడాలో పనిచేస్తున్న షివాని మమ్మల్ని కలవడానికి ఒక శనివారం రాత్రి వచ్చింది. విమానాశ్రయం నుంచీ అద్దెకు టొయోటా క్యామ్రీ కారు తెచ్చుకుంది తను. ఉదయం మా ఇద్దర్నీ శాన్ ఫ్రాన్సిస్కో అంతా కార్లో తిప్పి చూపింది. ఆ సిటీకి తను రావడం అదే మొదలు. మ్యాపులు పెట్టుకుని, గూగుల్ మ్యాపుల్లో కొంతవరకూ చూసుకుని తనంత తను సునాయాసంగా డ్రైవ్ చేసుకుని వెళ్తున్న కూతురి గురించి గర్వపడుతూ తన పక్కనే కూర్చున్నాను. వెనకాల కూర్చున్న మావారు గప్‌చిప్ అని ఎప్పుడు నిద్రలో పడిపోయారో తెలీదు.
మారుతి 800 కారు పోయి వ్యాగన్-ఆర్ కారు దాని తర్వాత, జెన్-ఎస్టీలో కారు వచ్చాయి. అయినా ఇప్పుడు కారు డ్రైవ్ చెయ్యటం మానేశాను కాబట్టి పెద్దగా ఉత్సాహంగా ఉండదు కారు మారి కొత్తదయినప్పుడు. పాతదయి అమ్మేసే ముందు మైలేజ్ ఎక్కువ ఇచ్చిన మా మొదటి కారు మారుతి 800 అంటే మా ఉమేశ్ కు కూడా ఒక ప్రత్యేకమయిన అభిమానం. ఉమేశ్ 2002 లో నా దగ్గర చేరిన మొదటి/ఒకే డ్రైవర్. అతనికీ ఇది డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మొదటి ఉద్యోగం. డ్రైవర్ మాత్రమే కాక, ఒకే కూతురు అమెరికా చేరిన తర్వాత, మరీ ఎక్కువగా మా కుటుంబంలో ఒకడుగా మెలిగే ఉమేశ్ ఒక ప్రత్యేకమయిన వ్యక్తి. అతనేం పనిచేసినా తప్పుపట్టలేం. మిలియన్ అవకాశాల్లో 3, 4 మాత్రమే తప్పులుంటాయి తన డ్రైవింగ్‌లో. తనను నేను సిక్స్ సిగ్మా డ్రైవర్ అని గర్వంగా అనుకుంటాను.