నిర్విరామం

నడిరాతిరి
చప్పుడు లేదు వెలుతురు లేదు గాలిలేదు
చీకటిలో నిద్రలో నడిరేతిరి
నడిరేతిరి నిద్రలో నిద్రరాత్రి మధ్యలో
ఎక్కడో ఎవరిదో
తల్లికడుపు చీల్చుకొచ్చిన శిశువుకేక
జీవసారం ఒట్టిపోయిన మనిషి చివరిచూపు
పులివాతబడ్డ ప్రాణి అంతిమ ఆర్తనాదం
పైకెత్తిన హంతకుడి చేతిలోని కత్తిమెరుపు
తొలి ప్రేమికుల అధర ముద్ర
గస్తీ తిరిగే గూర్కా చేతికర్ర చప్పుడు
భయాందోళన గుండె టక్ టక్
మరో బేరం కోసం దీప స్తంభం నీడలో కళ్ళ వెదుకులాట
స్వయంగా ఉరిపోసుకుంటున్న ముఖం
లోని దైన్యత మేధావి బుర్రలో
పరిష్కారం లేని గందర గోళం
ఎన్నడో తిండి తిన్న నిరుపేద కడుపులో మంట
బల్ల మీద గడియారం టిక్కు టిక్కు
ఒంతెన మీద చలిలోంచి దూసుకెడుతున్న రైలుకూత
ఎక్కడో ఎవరిదో