సాహిత్యమంటే ఏమిటి? శబ్దార్థాలతో కూడినది సాహిత్యమని ఒక వివరణ ఉంది కదా! మరొకవిధంగా హితాన్ని చేకూర్చేది సాహిత్యం అని చెబుతారు. హితం పథ్యం. పథ్యమంటే తీసుకొనే వేళలో అయిష్టంగా ఉన్నా ఉత్తరకాలంలో మేలును కూర్చేది. మరి సాహిత్యం ద్వారా మనకు చేకూరగలిగే మేలు ఏమిటి?
సాహిత్యానికి ఒక వివరణ శబ్దార్థాలతో కూడినదని కదా? అంటే వాక్కు, ఆ వాక్కు ద్వారా అభివ్యక్తమయే భావం. వీటి ద్వారా హితాన్ని కూర్చేది సాహిత్యం అని చెప్పుకోవచ్చు.
వాక్కు ద్వారా మనకు చేకూరే మేలు ఏమిటి? వాక్కు మనలో నాభి దగ్గర మొదలై వెన్ను పొడవునా కంఠం వరకు, అక్కడి నుండి ముఖం వరకు ఎన్నో నాడులను కదిలిస్తూ సాగే ఒక ప్రవాహం. ఒక్కొక్క శబ్దం ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలకు పుష్టినిస్తూ ఊపిరితిత్తులను బలపరుస్తుందని, శ్లేష్మాదులను హరించి ఆరోగ్యాన్ని చేకూర్చుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అంటే ఇది ప్రాణాయామం వంటిది. ఇతర భాషల విషయమేమోగాని, సంస్కృతం ఇటువంటి శబ్దశక్తిని గమనించి, తదనుగుణంగా సంస్కరింపబడిన భాష కనుక ఆ శబ్దాలకు అపభ్రంశం కలుగ కుండా సవ్యంగా, స్పష్టంగా వాటిని వాడటం చాలా ముఖ్యం. ఇక ఇటువంటి శక్తిలేని భాషలోనయినా అస్పష్టతకు ఆస్కారం లేకుండా నియమబద్ధంగా భాషాప్రయోగం చేయక పోతే వ్యక్తి నుండి వ్యక్తికి, ఒక కాలం నుండి మరొక కాలానికి భావం మారిపోతూ దెబ్బతినే ప్రమాదముంది. కనుక అపభ్రంశాలు లేని స్పష్టమైన నియమితమైన వాక్కు, భాష మంచి సాహిత్యానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి.
సాహిత్యంలో ఉన్న మరొక అంశం భావం. భావంలో హితం ఏది? భావం బుద్ధికి, మనస్సుకు అందే విషయం. బుద్ధి వికాసానికి, మానసికారోగ్యానికి తద్వారా ఆత్మ వికాసానికి పరమానందానికి ఏది తోడ్పడుతుందో అది మనకు హితం. ధర్మం, సత్కర్మ, విశ్వప్రేమ, సత్యం, వీటికి మనిషికి చేరువగా తీసుకువెళ్ళే రచనలు మనకు హితాన్ని చేకూర్చుతాయి.
ఈ విధంగా దివ్యమైన విషయాలను సలక్షణమైన భాషలో చెప్పే ఆధ్యాత్మిక, శాస్త్రాది విభాగాలతో పాటు సాహిత్యంలో కవిత్వం కూడా ఒక భాగం కదా! మరి ఈ కవిత్వ లక్షణ మేమిటి? మిగిలిన సాహిత్యం నుండి కవిత్వాన్ని వేరు చేసేది సౌందర్యం అంటారు కదా! ఈ సౌందర్యం రెండు రకాలు. ద్వంద్వ స్వరూపమైన సౌందర్యం. ద్వంద్వాతీతమైన సౌందర్యం.
మొదటిది పంచేంద్రియాలకు, ఇంద్రియాల స్థాయిలోని మనసుకు తోచేది. ఇది సౌందర్యం, జుగుప్సాకరం అనే ద్వంద్వంలోని ఒక భాగం. ద్వంద్వాతీతమైన అనంత నిరా కార నిర్గుణసత్యంలో ఆకార గుణభేదాలు లేవు. సౌందర్యం సౌందర్యరాహిత్యమనే ద్వంద్వంలేదు. ఆ అనంత నిరాకార నిర్గుణ నిశ్చలస్థితిలో ఆకారం ఒక వక్రత. కనుక ఆకారంలో మనం చూచే సౌందర్యానికి ఆ వక్రత మూలం. సాహిత్యంలో కూడా సాధారణాభివ్యక్తి నుండి కవిత్వాభివ్యక్తిని వేరు చేసేది ఈ వక్రతే. ఈ వక్రతలో బుద్ధిని గిలిగింతలు పెట్టే చమత్కారాన్నీ, హృదయాన్ని కదిలించే అనుభూతినీ సాధించవచ్చు.
ఇక ద్వంద్వాతీతమైన సౌందర్యం రెండవది. ఇది సాధారణ పరిభాషలోని సౌందర్యం వంటిది కాదు. మనకు సాధారణంగా ఉండే సౌందర్యస్పృహ ప్రకృతి సహజమైన ప్రేరణ. జీవులుగా మనకు జీవం కొనసాగటానికి అనుకూలమైనవి, దోహదపడేవి, జీవంతో తొణికిసలాడేవి ఆమోదయోగ్యంగా, ఆహ్లాదకరంగా, అందంగా అనిపించటమూ, దానికి వ్యతిరేకమై నవి తిరస్కారయోగ్యంగా అనిపించటమూ జరుగుతూ వుంటుంది. ఈ సహజ ప్రేరణలను దాటి సత్య స్వరూపాన్ని చూడగలిగిన దృష్టికి ఒక ద్వంద్వాతీతమైన సౌందర్యం గోచరి స్తుంది. ఇది నిర్వికార స్థితిలోని నిశ్చలత్వపు అనుభూతి. పరమ సత్వంతో మమైకమైనప్పటి దివ్యానుభూతి. ఇది ఆహ్లాదాన్ని, సంతోషాన్ని మించిన ఆనందం.
అయితే శాంతమైన ఈ ఆనందంలోని సౌందర్యాన్ని నేరుగా గ్రహించే శక్తి అందరికీ ఉండదు. కనుక ఈ పథ్యానికి ద్వంద్వ స్వరూపమైన సౌందర్యమనే తేనెను రంగరించి స్వాదుత్వం ద్వారా ఈ పథ్యాన్ని అందిస్తే అది ఎక్కువమంది గ్రహించగలుగుతారు. అంటే వేదశాస్త్రాలలో ప్రభు, మిత్ర సమ్మి తాలుగా చెప్పిన సత్యాన్నే కాంతా సమ్మితంగా చెప్పటమన్న మాట. ఈ మార్గం రసమార్గం. రసోవైసః అని ఆర్యోక్తి కదా! రసం పరబ్రహ్మ స్వరూపం. అది సత్యస్వరూపం సత్యం ప్రేమ స్వరూపం. ఇది అనురాగం, మమకారం వంటి అనుభూతుల కోవకు చెందింది కాదు.
పిపీలికాది బ్రహ్మాండ పర్యంతం సర్వజగత్తుగా తనకూ ఉన్న అద్వైత స్థితిని అనుభూతి చెందినపుడు, అహం బ్రహ్మాస్మి తత్త్వమసి అనే స్పృహతో మానవ హృదయంలో వెలిగే విశ్వప్రేమ అహమనే మాయను మరచినప్పటి ప్రేమస్వరూపమైన ఆనందం.
ఇటువంటి సుందరమైన వస్తువు, సుందరమైన అభివ్యక్తి రెండూ కవిత్వానికి చాలా ముఖ్యం దేహాత్మలలో ఏ ఒకటి లోపించినా మనిషికి ఉనికి ఎలా ఉండదో అలాగే అభివ్యక్తి, వస్తు సౌందర్యాలలో ఏ ఒకటి లోపించినా ఆ కవిత్వానికి పరి పూర్ణత సిద్ధించదు. జార్జ్ శాంతాయనా తన Sense of beautyలో beauty is its cooperation of pleasures అంటారు. ఒక వస్తువు అందమైనదంటే ఆ అందం ఆ వస్తువులోని అన్ని అంశాల సమన్వయం నుండి వచ్చినదే. ఏ ఒక్క అంశమో మాత్రమే అందమైనదైతే ఆ వస్తువు మొత్తంగా అందమైనదని అనం కదా! అలా అన్ని అంశాలూ అందమైనవే అయినపుడు కూడా ఆ వస్తువులో మనకు తోచే అందం ఆ వస్తువులోని అన్ని అంశాల సమన్వయంగానే ఉంటుంది కాని, వాటి విడివిడి అందాలుగా తోచదు కదా! కనుక వస్తువు, అభివ్యక్తి రెండూ అందంగా అనుకూలంగా సమ్వయమైనపుడే అది అందమైన కవిత్వం అవుతుంది.
సత్యదర్శనం, సౌందర్యదర్శనం ఒక యోగం. యోగశ్చిత్త వృత్తి నిరోధః తదాద్రష్టుః స్వరూపేన స్థానం॥ అన్నారు పతంజలి. అలాంటి యోగాన్ని తన రచనలో సాధిస్తాడు రచయిత. అంటే సాధారణ దృష్టిలో మనం గ్రహించలేని సౌందర్యాన్ని తన శిల్పం ద్వారా చూపిస్తాడు. శిల్పం అంటే ద్రష్టదృష్టిని ఒక కోణంలో కేంద్రీకరిస్తూ మిగిలిన వస్త్వంశాలను, దృష్టికోణాలను మూసివేయటం, తద్వారా ఆహ్లాదమనే మెట్టు మీదుగా ఆనంద ద్వారాలకు సహృదయుల్ని తీసుకుపోగలిగేది మంచి సాహిత్యం.
ఆనందం మానవజీవిత పరమార్థం. మనకది పరమ వాంఛితం. సత్వస్థితి నుండి, అద్వైతస్థితి నుండి, నేను అనే స్పృహ, మాయ, మనిషిని వేరు చేసినపుడు ఆ సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ లోని దుఃఖాన్ని తొలగించుకోవటానికి మనిషి తపనపడుతూ వుంటాడు. తానున్న మాయలో అతనికి వెంటనే కనిపించే దుఃఖ రాహిత్యం తానున్న ఆ ద్వంద్వ ప్రపంచంలోని రెండవ భాగమైన సుఖం. కాని సుఖం ఎప్పుడూ దుఃఖంతో కలిసే ఉంటుంది. ఈ దుఃఖంలేని శాశ్వత సుఖం కోసం అతను పడే ఆరాటంలో మాయను దాటి సత్యాన్ని చూడగలిగినపుడు అతనికి ఆనందాను భవం కలుగుతుంది.
ఇలాంటి ఆనందాన్ని రుచి చూపించగలిగినది దానికి ద్వారం తెరవగలిగినది, తద్వారా మనకు పరమహితాన్ని చేకూర్చేది ఉత్తమ సాహిత్యమని చెప్పవచ్చు.