అదో డ్యూప్లెక్స్ ఇల్లు. ఇంటి పేరు హరివిల్లు. ఆ ఇంట్లో మూడు తరాలవాళ్ళు వుంటున్నారు. మొదటితరం మనిషి రామ్మూర్తి. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉద్యోగం చేసి రెండేళ్ళ క్రిందట పదవీ విరమణ చేశాడు. ఆయన భార్య సుమిత్ర.
రెండోతరం వాడు రవితేజ. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతని భార్య ఉష. మూడోతరం వాడు ఆదిత్య. వాడికి అయిదేళ్ళు. ఒకటో తరగతి చదువుతున్నాడు.
తెల్లవారింది. సుమిత్ర వంటింట్లో కాఫీ పెడుతోంది. పైన ఉన్న నీటి టాంక్ నిండి నీళ్ళు కిందకి పోతున్నాయి.
‘‘ఉషా, మోటర్ ఆపేయ్, నీళ్ళు పోతున్నాయి,’’ అంది కోడలితో.
ఉష ఆదిత్యని తయారుచేస్తోంది. అందుకే, ‘‘రవీ, మోటర్ ఆపేయ్. నీళ్ళు పోతున్నాయి,’’ అని మొగుడికి చెప్పింది.
రవి ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేస్తున్నాడు. అందుకే, ‘‘నాన్నగారూ, కాస్త మోటర్ ఆపండి. నీళ్ళు పోతున్నాయ్,’’ అని తండ్రికి చెప్పాడు.
ఆయన వరండాలో కూర్చుని పేపరు చదువుకొంటున్నాడు. ‘‘సుమిత్రా, మోటర్ ఆపేయ్, నీళ్ళు పోతున్నాయి,’’ అని పొలికేక పెట్టాడు.
తను చెప్పినపని గోడకి కొట్టిన బంతిలా తిరిగి తన దగ్గరకే వచ్చేసరికి సుమిత్రకి చిర్రెత్తుకొచ్చింది. ‘ఛ, నేను బతికుండగా ఈ సంసారం బాగుపడదు,’ అని విసుక్కుంటూ వెళ్ళి మోటర్ ఆపేసింది. కాఫీ కోసం అందరూ హాల్లో చేరినప్పుడు ఆ విషయం లేవనెత్తి అందరికీ అక్షింతలు వేసింది.
‘‘నా చెయ్యి ఖాళీలేదు, అవతల స్కూలు బస్సు వచ్చేస్తుంది. అందుకే ఈ శాల్తీకి చెప్పాను,’’ అంది ఉష.
‘‘రోజు మొత్తం మీద ఒక్క అరగంటైనా ఎక్సర్‌సైజ్ చెయ్యకపోతే నా ఒళ్ళు నా మాట వినదు. అందుకే నాన్నగారికి చెప్పాను. అయినా పొద్దున్నే పేపరంతా కంఠస్థం పట్టాలా?’’ అన్నాడు రవితేజ.
‘‘అవున్లే… మిషను మీద నడిస్తేనే వ్యాయామం చేసినట్లు. నేలమీద నడవడం నామోషీ,’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘మళ్ళీ మొదలెట్టారా మీ ఫైటింగూ?’’ అన్నాడు ఆదిత్య పాలు తాగుతూ.
‘‘నువ్వు నోరుముయ్యరా కుర్రకుంకా!’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘వాడినెందుకు అనడం. వాడేమన్నాడనీ! వున్న మాటేగా! అయినా మీ వ్యవహారం ఏమీ బాగాలేదు. మరీ పులీ మేకాలాగా వుంది మీ గొడవ,’’ అంది సుమిత్ర మనవడిని వెనకేసుకొస్తూ. ఆవిడ మాట నిజమే.
ఆ తండ్రీ కొడుకులకి క్షణం కూడా పడదు. ప్రతి విషయం లోనూ వాదులాడుకుంటూ వుంటారు. మళ్ళీ ఒకరితో ఒకరు డైరెక్ట్‌గా మాట్లాడుకోరు. ఓ మనిషిని అడ్డం పెట్టుకుని వాదించుకుంటారు. సామాన్యంగా వాళ్ళిద్దరికీ వారధి సుమిత్రే.
డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరతారు టిఫిన్ చెయ్యడానికి. ‘‘నాకు దోసె వద్దు, నూనె ఎక్కువుంటుంది. కార్న్‌ఫ్లేక్స్ తింటానమ్మా,’’ అంటాడు రవి.
‘‘ఇవే మరి తిక్క ఆలోచనలంటే. కమ్మగా దోసె, కొబ్బరి చట్నీ వేసుకుని తినక తెల్లదొరల్లాగా ఆ పిచ్చివన్నీ తినడం ఏమిటో కదా సుమిత్రా,’’ అంటాడాయన.
‘‘ఏం చేస్తాం? గతంలోలా ఒకసారి గవర్నమెంటు ఉద్యోగంలో చేరి నిశ్చింతగా కూర్చునే రోజులు కావుగా ఇవి! మా ఆఫీసులో ఏడాదికోసారి వైద్యపరీక్షలుంటాయి. అందులో ఏదైనా తేడా వస్తే ఇంటికి పొమ్మంటారు. అందుకే ఈ తంటాలు. లేకపోతే నేనూ దోసెలూ, పూరీలు, గారెలూ లాగించేసేవాడినే అమ్మా!’’ అంటాడు కొడుకు.
‘‘వారమంతా ఈ గడ్డీగాదం తిని వారాంతంలో అంగుళం మందాన చీజ్ వేసిన పిజ్జా, ఓ ఐస్‌క్రీమ్ ఇటికా తెచ్చుకుని లాగించేస్తే కొలెస్టరాలు అదుపులో వుంటుందా సుమిత్రా?’’ అంటాడు తండ్రి.
నెల మొదట్లో వుంటుంది వాళ్ళ తమాషా. కంప్యూటరు ముందు కూర్చుని, వచ్చిన జీతం, కట్టాల్సిన బిల్లులూ, ఖర్చులూ లెక్క వేసుకొని డీలాపడిపోతాడు రవి.
‘‘ఏమిటో! గతంలో అయితే చక్కగా నెల జీతంతో ఇల్లు గడిచిపోయేది. ఇంకా మిగిలేది. రిటైరయ్యాక కూడా రాజుగారి భరణంలాగా పెన్షను కూడానూ. అదృష్టం అంటే అదీ. ఏ టెన్షనూ వుండేది కాదు కదా అమ్మా,’’ అంటాడు రవి.
‘‘క్రెడిట్ కార్డు జేబులో వుంది కదా అని పిచ్చి ఖర్చులన్నీ పెట్టేసి ఆఖర్న ఏడిస్తే ఏం లాభం? మా రోజుల్లో ఇలా కార్డుల మీద ఖర్చు పెట్టుకోడమూ లేదు. వాడికి డబ్బు కట్టేటప్పుడు ఇలా మొత్తుకోవడమూ లేదు. అందుకే సుఖంగా వున్నాం. కదూ సుమిత్రా!’’ అంటాడు రామ్మూర్తి.
రుసరుసలాడుతూ కంప్యూటర్లో జమాఖర్చులు చేసేస్తూ వుంటే, మళ్ళీ ఆయనే, ‘‘సుమిత్రా! ఎవరికైనా ఏదైనా అవసరం వుంటే నా దగ్గర డబ్బు తీసుకోవచ్చు. ఎంత కావాలో చెప్తే చెక్ రాసిస్తా. ఇందులో నామోషీ ఏంలేదు. తండ్రి దగ్గర తీసుకోవచ్చు,’’ అంటాడు.
‘‘ఇప్పుడంత అవసరం లేదులే అమ్మా. ఊరికే ఖర్చులు చూసి అనుకున్నా అంతే,’’ అంటాడు రవి.
రవి ఆఫీసుకి వెళ్ళేటపుడు హాల్లో కూర్చుని, ‘‘అన్నీ తీసుకున్నాడేమో కనుక్కో. పర్సు, సెల్‌ఫోను తీసుకొన్నాడేమో అడుగు. కార్లో పెట్రోలుందేమో చూసుకోమను,’’ అంటాడు భార్యతో.
‘‘అమ్మా! ఇవన్నీ రోజూ చెప్పాలా? నేనేమైనా స్కూలుకెళ్ళే పిల్లాడినా?’’ అని విసుక్కుంటాడు రవి.
‘‘ఏమోలే. వూరికే గుర్తు చేస్తున్నా నోరు వూరుకోక. క్రిందటి వారం మెళ్ళో పుస్తె (ఐ.డి. కార్డు) మర్చిపోయి ఆఫీసుదాకా వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చింది ఈ మహానుభావుడే కదూ!’’ అని దెప్పి పొడుస్తాడాయన.
ఒక్కోరోజు మాత్రం తండ్రీకొడుకూ కూర్చుని క్రికెట్ గురించీ, రాజకీయాల గురించి ఓ పావుగంట ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. కానీ అది చాలా అరుదు.
ఒక్కోసారి చాలా సీరియస్‌గా వాదించుకుంటారు.
వెంటనే పేపరు తిరగేసి, ‘‘సుమిత్రా అక్కడెక్కడో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇళ్ళు కట్టారుట. కొంత డబ్బిస్తే రూమ్ ఇస్తారుట. తర్వాత నెలనెలా ఇంత అని కడితే తిండీ తీర్థం మందూ మాకూ అన్నీ వాళ్ళే చూసుకుంటారుట. మనం అక్కడికి వెళ్ళటం ఉత్తమం ఏమో అనిపిస్తోంది,’’ అంటాడు.
రవి కూడా, ‘‘ఉషా, మనం వేరే ఇల్లు అద్దెకి తీసుకుని వెళ్ళిపోదాం! పెద్దవాళ్ళు వెళ్ళడం ఎందుకూ? మనం కావాలనుకుంటే ఇంకో నాలుగేళ్ళల్లో ఇంకో ఇల్లు కొనుక్కోగలం,’’ అంటాడు.
ఒకరోజు చాలా పెద్ద గొడవ జరిగింది, తండ్రీ కొడుకుల మధ్య. ఆవేళ శనివారం. రవికి శలవు. ఇంట్లోనే వున్నాడు.
రామ్మూర్తి మధ్యాహ్నం టీవీలో ఏదో తెలుగు సినిమా చూస్తున్నాడు. ‘‘ఛ, వెధవ సినిమా. ఇంట్లో ఫ్రీగా చూస్తుంటేనే విసుగొస్తోంది. ఇంక థియేటర్‌కి వెళ్ళి చూసేవాళ్ళు గుండె బాదు కుని ఏడవరూ! ఆ హీరో చూడు, చీకేసిన తాటిటెంకలా మొహమూ వాడూనూ. ఇక ఆ హీరోయిను బట్టలు కాశీలో వదిలేసి వచ్చినట్టుంది,’’ అని ఒకటే సణుగుడు.
వింటున్న రవికి విసుగొచ్చింది. ‘‘అంత తిట్టుకుంటూ ఎందుకు చూడ్డం? ఛానల్ మార్చరాదా! లేకపోతే టీవీ తీసేసి అలా ఎటన్నా వెళ్ళచ్చుగా,’’ అన్నాడు.
దాంతో ఆయనకి కోపం వచ్చేసింది. ‘‘ఏం నా కొంపలో సణుక్కునే అధికారం కూడా లేదా నాకు?’’ అన్నాడు భార్యని పిలిచి.
‘‘సినిమా చూస్తూ రన్నింగ్ కామెంట్రీ చేస్తుంటే వినేవాళ్ళకు తలనొప్పి రాదా అమ్మా!’’ అన్నాడు రవి.
మాటామాటా పెరిగింది. ‘‘ఈ కొంపలో నేనుండలేను. వేరే దారి చూసుకుంటాను,’’ అన్నాడు రామ్మూర్తి భార్యతో.
‘‘వాళ్ళెందుకు వెళ్ళడం, మనమే పోదాం ఉషా,’’ అన్నాడు రవి.
రామ్మూర్తి పేపరు తీసి, సీనియర్ సిటిజన్స్ హోమ్ కోసం వెతికి వాళ్ళందరికీ ఫోన్లు చేశాడు. రవి కంప్యూటర్ ముందు కూర్చుని తన ఆఫీసుకి దగ్గరగా వున్న అద్దె ఇళ్ళ వివరాలు వెతికి వాళ్ళతో ఛాటింగ్ చేశాడు.
ఆ రాత్రి రామ్మూర్తికి కాస్త నలత చేసింది. వాళ్ళు కిందనున్న బెడ్‌రూమ్‌లో పడుకుంటారు. పైన మూడు బెడ్‌రూములున్నాయి. ఒకదాంట్లో రవి, రెండో దాన్లో ఆదిత్య వుంటారు. మాటిమాటికీ మెట్లెక్కి వెళ్ళటం కష్టం కాబట్టి రిమోట్‌తో పనిచేసే బెల్ ఒకటి పెట్టుకున్నారు.
రామ్మూర్తి ఆయసపడుతూ వుంటే గుండెకి అమృతాంజనం రాసి, పంచదార నీళ్ళు ఇచ్చి చూసింది సుమిత్ర. తగ్గకపోవడంతో బెల్ నొక్కింది.
పరుగున వచ్చేశారు రవి, ఉష. తండ్రిని చూసి, గాభరపడ్డాడు రవి. పైకెళ్ళి బట్టలు మార్చుకుని, పర్స్ తీసుకుని వచ్చేశాడు. తండ్రిని, తల్లిని కార్లో ఇంటి దగ్గరున్న హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళాడు.
పక్కింటావిడని లేపి ఆదిత్యకి సాయంగా పడుకోమని అప్పగించి హాస్పిటల్‌కి వెళ్ళింది ఉష. రామ్మూర్తిని ఎడ్మిట్ చేసుకుని ఉపశమనానికి మందులిచ్చారు. ఆయన దగ్గర ఒక్కరు మాత్రం వుండొచ్చు అంటే సుమిత్ర కూర్చుంది.
రవి, ఉష బయట కూర్చున్నారు. ‘‘ఏవిటో మొండిమనిషి. తన పట్టుదల తప్పించి ఎదుటివారి మాట వినిపించుకోరు. ఎంతసేపూ ఇతరుల గురించి ఆరాటం తప్ప తన గురించి ఆలోచించుకోరు. ఆయనేనా! నాకు మాత్రం వుండదా ఆయన మీద అభిమానం. మంచి బ్రాండెడ్ షర్టు కొనుక్కొచ్చి వేసుకోమంటే వేసుకోరు. నాకెందుకురా ఇవన్నీ, నువ్వు వేసుకో అంటారు. మంచి బూట్లు కొన్నా, మంచి వాచీ కొన్నా అంతే. కొత్తది నువ్వు వాడుకో. నువ్వు వాడుతున్న పాతది నాకిచ్చెయ్ అంటారు. విసుగొచ్చేస్తోంది నాకు,’’ అని ఆవేశంగా మాటాడుతున్నాడు రవి.
లోపల రామ్మూర్తీ అంతే. ‘‘ఇన్నేళ్ళొచ్చినా ఇంకా చిన్నతనం లక్షణాలు పోలేదు. ఈకాలం పిల్లలకున్న తెగింపు లేదు. ఎంత సేపూ అమ్మా అమ్మా అంటూ నీవెంట తిరుగుతాడు. నా మీద అభిమానంతో అమెరికా పోకుండా ఇక్కడే వుండిపోయాడు. నేను వాడి కోసం సంపాదించిందీ ఏమీలేదు. ఎప్పుడో కొని పడేశాను ఈ స్థళం. ఇంటి కోసం తనే లోన్ తీసుకున్నాడు. వెర్రి సన్నాసి. తీసుకోగానే సరా! తీర్చుకోవద్దూ,’’ అని మాట్లాడుతుంటే, ‘‘వూరుకోండి, మీరు హైరానా పడకండి,’’ అంటోంది సుమిత్ర.
మర్నాడు ఆదివారం రామ్మూర్తికి అన్ని టెస్ట్‌లూ చేస్తామన్నారు డాక్టర్లు. అప్పుడే ఆయన సెల్‌ఫోన్‌కి ఫోనొచ్చింది సీనియర్ సిటిజన్స్ హోమ్ నుండి. చూడ్డానికి వస్తామన్నారు కదా, వెహికిల్ పంపించమా అని అడిగారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన మార్చుకొన్నాం అన్నాడు రవి. అలాగా అని బాధపడిపోయి, మళ్ళీ మనసు మార్చుకుంటే మాకు తెలియజెయ్యండి అన్నారు వాళ్ళు.
రవికి కూడా చాలా మెయిల్స్ వచ్చాయి, అద్దె ఇంటి సమాచారంతో. అందరికీ ఇప్పుడొద్దు అనే సమాధానం ఇచ్చాడు.
రామ్మూర్తిగారికి టెస్ట్‌లు అన్నీ అయ్యాయి. ఏమీ తేడా లేదు. అంతా సవ్యంగా వుంది. అప్పుడేదో కారణం వల్ల ఆయాసం వచ్చింది, అంతే అని ఇంటికి పంపించేశారు.
ఆరోజు సోమవారం. రవి తీరిగ్గా కూర్చుని వున్నాడు. ‘‘సుమిత్రా! ఏం ఆఫీసు లేదా? వెళ్ళడా?’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘మీకు ఒంట్లో బాగాలేదు కదా! అందుకే రెండ్రోజులు శలవు పెట్టాడు,’’ అందావిడ.
‘‘నాకేమైంది? దుక్కపిక్కలా వున్నాను. వెళ్ళమను. మళ్ళీ అక్కడ పన్లన్నీ పేరుకుపోతాయి,’’ అన్నాడు.
‘‘అంత కొంపలంటుకుపోయే పన్లేం లేవు. శలవులు కూడా మిగిలిపోయాయి,’’ అన్నాడు రవి.
‘‘శలవులుంటే భార్యాభర్తా, పిల్లవాడిని తీసుకుని ఏ ఊరికో వెళ్ళచ్చు. అప్పుడు వాడుకోవచ్చు ఆ శలవులు. ఇప్పుడు ఆఫీసుకెళ్తే బాగానే వుంటుంది. ఆ మాటే చెప్పు ఆయనగారికి,’’ సలహా ఇచ్చాడు రామ్మూర్తి.
‘‘ప్రపంచంలో అంతా నా మాట వినాలి, నేను మాత్రం ఎవరి మాటా వినను అంటే ఎలా కుదురుతుంది చెప్పమ్మా?’’ అన్నాడు రవి.
ఇద్దరూ ఆవిడని తడికలా అడ్డం పెట్టుకుని వాదులాడు కున్నారు.
‘భగవంతుడా వీళ్ళిద్దరూ ఇక ఈ జన్మకి మారరు,’ అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది సుమిత్ర.
నిజమే మారరు. కారణం వాళ్ళిద్దరూ భారతీయులు. భారత దేశంలో పుట్టిన వాళ్ళకి ఆత్మాభిమానాలు, సెంటిమెంట్సూ కూడా ఎక్కువే.
(ప్రముఖ కథా, నవలారచయిత. అప్పుడప్పుడు సినిమాలకు మాటలు రాస్తుంటారు. ముఖ్యంగా హాస్యకథలు, హాస్య సన్నివేశాలు రచించటంలో ప్రత్యేకత ఉన్నవారు. మూడు కథాసంపుటాలు ప్రచురించారు. వీరిక నవల శ్రీవారికి ప్రేమలేఖ సినిమాగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చింది.)