మేడ్‌ ఇన్‌ అమెరికా

ఆఫీస్‌ నుంచి రాగానే అంటే ఆరు గంటలకు భోజనం చేయటం అలవాటయి పోయింది. కారు డ్రైవ్‌ వేలో  ఆపుతుండగానే, ప్రసూన డైనింగ్‌ టెబుల్‌ మీద అన్నీ సిద్ధం చేస్తుంది. బట్టలు కూడా మార్చు కోకుండా,  ఆవురావురుమంటూ ఆత్మారాముడిని శాంతపరుస్తున్నాను.

గబగబా తింటుంటే, ప్రసూన ఎదురుగా కూర్చొని, నెమ్మదిగా తింటూ “మధ్యాహ్నం లంచ్‌ సరిగ్గా తినలేదా ?” అనడిగింది.

“తిన్నాను. కానీ చాల్లేదు !” అన్నాను, తినటం మాత్రం ఆపకుండా.

“రేపటినించీ ఏదన్నా స్నాక్‌ కూడా పాక్‌ చేసి ఇస్తాలే .. ఏ మూడింటికో తిందువుగాని …” అన్నది నవ్వుతూ..

“అలాగే” అన్నాను తినటం కొనసాగిస్తూ.

హటాత్తుగా గుర్తొచ్చి అడిగాను “సరస్వతి ఏదీ ?” అని.

“ఎవరో ఫ్రెండ్‌ తో బయటకు వెళ్ళాలిట. అక్కడే భోజనం చేస్తుందట ” అన్నది ప్రసూన.

తలపైకెత్తి, అనుమానంగా అడిగాను “ఫ్రెండా.. డేటా..” అని.

“ఫ్రెండే .. అనుకుంటాను. దాన్నే అడగరాదూ .. మేడ మీద వుంది…”

తినటం పూర్తిచేసి, చేయి కడుక్కుంటుంటే, ఫోన్‌ మోగింది.

ఫీనిక్స్‌ నించి సుబ్బారావు.

“ఏం బాబూ! ఏంచేస్తున్నావ్‌ ? లాస్‌ ఏంజలెస్‌ లో మాకన్నా ఒక గంట ముందుంటారుగా మీరు. డిన్నర్‌, గిన్నర్‌ అయిపోయాయా?” అన్నాడు.

“గిన్నర్‌ ఇంకా అవలేదు కానీ, డిన్నర్‌ ఇప్పుడే అయిపోయింది. ఏమిటి ఇప్పుడు పిలిచావ్‌ ” అడిగాను.

“ఇంకా మాలతి ఇంటికి రాలేదు. ఇవాళ ఆఫీసులో కొంచెం ఆలస్యమవుతుందిట. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి” అన్నాడు.

“చెప్పు” అన్నాను, కార్డ్‌ లెస్‌ ఫోన్‌ తీసుకొని, లేజీబాయ్‌ రిక్లైనర్‌ ఛైర్లో నడుం వాలుస్తూ. సుబ్బారావు ఏదో పెద్ద కధే చెప్పబోతున్నాడని తెలుస్తూనే ఉంది.

“మా ఊళ్ళో బాలు అనబడే బాలసుబ్రమణ్యం గారొకాయన ఉన్నాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు. ఇరవై ఆరేళ్ళ క్రితం అమెరికాలోనే  పుట్టింది. ఆ అమ్మాయి పేరు వసు. పోయిన సంవత్సరం ఇండియాకి వెళ్ళినపుడు హైదరాబాదులో కుమార్‌ అనబడే అబ్బాయిని ఒక పెళ్ళిలో  చూసింది. ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి తల్లితండ్రులకీ, ఆ అబ్బాయి నచ్చాడు. కుమార్‌ కూడా వసు అంటే ఇష్ట పడ్డాడు. పది రోజుల్లో  పెళ్ళి కూడా అయిపోయింది.” ఆగాడు సుబ్బారావు.

“అతను ఈ దేశానికి రావటానికి, వీసా ఇబ్బందులు ఏమీ వచ్చి వుండవు .. ఆ అమ్మాయి ఇక్కడే పుట్టింది కనుక” అన్నాను.

“అవును. ఆ అమ్మాయి అమెరికన్‌ సిటిజన్‌ కాబట్టి, అతను ఐదు నెలల్లో ఇక్కడకి రాగలిగాడు”

“తరవాత కధ ఫీనిక్స్‌ కీ,  మనం ఇంటికీ..” అన్నాను నవ్వుతూ.

“కాదు .. కాదు. కధ ఇక్కడే మొదలయింది. వసు టెలివిజన్‌ బ్రాడ్కాస్టింగులో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. ఫీనిక్స్‌ లోనే ఎస్‌.బి.సి. ఎఫిలియేట్‌  టీ.వి. స్టేషన్లో పనిచేస్తున్నది. కుమార్‌ ఇండియాలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివి, అక్కడ ఒక కంపెనీలో ఆరేళ్ళు ఉద్యోగంకూడా  చేశాడు. వసు సలహా మీద కుమార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజోనాలో, మాస్టర్స్‌ ప్రోగ్రాంలో చేరాడు రెండేళ్ళు చదివి డిగ్రీ తీసుకుంటే  మంచి ఆఫర్లు వస్తాయని”

“అవును. దట్‌ హెల్ప్స్‌ ” అన్నాను.

వాళ్ళిద్దరూ సుఖంగా ఒక నెలరోజులు ఉన్నారేమో. ఇద్దరికీ ఏ విషయంలోనూ పడలేదు. ఆ అమ్మాయి పద్ధతి ఆ అబ్బాయికీ, ఆ అబ్బాయి  పద్ధతి ఆ అమ్మాయికీ ఏమీ నచ్చలేదు. వసుకి తెలుగు అర్ధమవుతుంది కానీ, మాట్లాడటం రాదు. ఆ అమ్మాయి ఇంగ్లీషు ఉచ్ఛారణ  కూడా, కుమార్‌ కి పూర్తిగా అర్ధమయ్యేది కాదు. వసు మంగళసూత్రం తీసేసి, డ్రెస్సర్లో పడేస్తే నిర్ఘాంతపోయాడు కుమార్‌ .  చీర  కట్టుకోని, కట్టుకోవటం చేతకాని వసుని వింతగా చూశాడు. తన నిర్దుష్టమైన అభిప్రాయాలను సూటిగా చెప్పే వసుని,  అహంకారంతో అలా మాట్లాడుతున్నదని అపార్ధం చేసుకున్నాడు. మగవాళ్ళతో అరమరికలు లేకుండా మాట్లాడుతున్న వసులో తను  అనుకొన్న భార్యను చూడలేకపోయాడు. భార్య ఉద్యోగం చేస్తుంటే తను కాలేజీకి వెళ్ళటం చిన్నతనంగా భావించాడు.  ఉద్యోగం పురుషలక్షణం అనుకొనే అతన్ని, అతని భార్యే భరిస్తూఉంటే,ఆర్ధిక స్వాతంత్రంలేక, ప్రతిక్షణం అతనికి నరకంలా  అనిపించింది. అలాగే, అతని పధ్ధతికూడా వసుకి నచ్చలేదు. కుమార్‌ కాఫీ తాగినగ్లాసు అక్కడే వదిలివేయటం, అన్నం తిన్న ప్లేటు బల్లమీదే వదలివేయటం, ఇంటిపనిలో ఏమీ సహాయం చేయకుండా, టీవీకే అంకితమయిపోవడం, అమెరికాలో పెరిగిన వసుకి నచ్చలేదు.

“అవును మరి. ఇక్కడకు వచ్చాక, ఇంటి పనులు ఇద్దరం సమానంగా చేస్తాం కదా” నెమ్మదిగా అన్నాను, ప్రసూన ఒక్కత్తే అన్నిపనులు  చేస్తుంటే, నవ్వుతూ ఆమెని చూస్తూ.

చిన్నప్పటినించీ, తన తండ్రి, అన్న, ఇంట్లో అన్ని పనులు చేయటం చూసిన వసుకి, కుమార్‌ ఒక బద్ధకస్తుడిలాగా కనిపించాడు.  కాలేజీ లేని రోజున మధ్యాహ్నం నిద్రపోయే కుమార్ని చూసి “ఎందుకలా జీవితాన్ని వృధా చేసుకుంటావు” అని అడిగేది. ఆ సమయంలో  ఏదన్నా పార్ట్‌ టైం జాబ్‌ చేయచ్చుకదా అనేది.కుమార్ని తన స్నేహితులకి పరిచయం చేసినా, అతను వాళ్ళతో కలవలేకపోవటం  ఆమెని నిరుత్సాహపరచింది. వసూ, ఆమె మిత్రులూ మాట్టాడుకొనే విషయాలు అమెరికన్‌ జీవితానికి సంబంధించి ఉండడం వల్ల, కుమార్‌  కి ఉత్సాహంగా ఉండేవి కావు. అలాగే కుమార్‌ కి ఇష్టమైన ఇండియన్‌ రాజకీయాలూ, తెలుగు సినిమాలు, పాటలు, సాహిత్యం, వసుకి  అర్ధమయ్యేవికావు. అలా వాళ్ళిద్దరి మధ్యా దూరం పెరిగి పోయింది.

“మరి వాళ్ళిద్దరూ కావాలని పెళ్ళి చేసుకున్నారు కదా! ఆ సంగతి వాళ్ళు ముందే ఎందుకు ఆలోచించలేదు. చదువూ సంస్కారం  వున్న వాళ్ళే కనుక, ఇద్దరూ చెరో రెండు మెట్లూ దిగి సర్దుకుపోతే, వాళ్ళ జీవితం సుఖంగా ఉండేది. కాదూ!” అన్నాను, రిక్లైనర్‌  ఛైర్లో పడుకొని సుఖంగా ఊగుతూ.

“ఆ ప్రయత్నాలన్ని చేసారు కానీ, అవేమీ పనిచేయలేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ బదులు ద్వేషం మొదలయింది. బాగా మనస్పర్ద్ధలు  వచ్చాయి”.

“మరి మీ బాలూగారు, ఆయన పూబంతీ ఏమీ చేయలేకపోయారా?” అడిగాను.

” చెప్పి చూసారుకానీ.. వాళ్ళుమాత్రం ఏం చేస్తారు.. అసలు సర్దుకుపోవలసిన వాళ్ళు ఎడముఖం పెడముఖం అయిపోయినప్పుడు…  వసు అతనికి రెండు నెలల క్రితమే విడాకులు ఇచ్చింది” ఆగాడు సుబ్బారావు.

” అంటే పెళ్ళయిన పదినెలలకే విడిపోయారన్న మాట. నన్ను సలహా అడిగితే, అసలు వాళ్ళు పెళ్ళిచేసుకోకుండా ఉండాల్సిందనిపిస్తోంది”  అన్నాను. అడక్కుండా ఉచిత సలహాలెప్పుడూ ఇవ్వకు అని ప్రసూన రోజుకి రెండు సార్లు నాకు ఉచితంగా ఇచ్చే సలహాని మరచిపోయా ఆ  సమయంలో.

“ఎందుకని?” అడిగాడు సుబ్బారావు.

“ఎందుకనా? అమెరికాకి, ఇండియాకి సాంస్కృతికంగా ఎంత తేడాఉందో, వసుకీ, కుమార్‌ కీ అంత తేడా ఉంది. వసు ఈజ్‌ మేడ్‌ ఇన్‌ అమెరికా   కుమార్‌ ఈజ్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా అందుకని!”

“మరి మనలాటి భారతీయులం, ఇక్కడ అమెరికన్‌ సంస్కృతిలో భాగం అయిపోయి, పౌరసత్వం తీసుకుని, అమెరికన్స్‌ తో కలసిపోయినప్పుడు..  మరి వీళ్ళిద్దరూ ఎందుకు కలవలేకపోతున్నారు?” అడిగాడు సుబ్బారావు.

అప్పుడే గుర్తుకొచ్చింది ఈ సుబ్బారావు అనబడే వీడు, అక్కడ ఆంధ్రాయూనివర్సిటీ నించి, ఇక్కడ ఆరిజోనా యూనివర్సిటీదాక, డిబేట్లలో  ఎప్పుడు మొదటి బహుమానాలే గెలుచుకొనేవాడని.

ఒక్క క్షణం ఆలోచించి అన్నాను “ఇండియానించి వచ్చే మనకే కాదు, ఏ దేశంనించయినా సరే అమెరికాకు వచ్చే ఇమ్మిగ్రెంట్స్‌  కి ఒకటే ముఖ్యోద్దేశం. ఇక్కడ సుఖంగా సెటిలయి, సాంకేతికపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఆర్ధిక పరంగా కాని,  వాళ్ళ కలలని నిజం చేసుకోవటం. అందుకని జీవితంలో చాలా ఎడ్జెస్మ్టెంట్లను చేసుకోవలసి వస్తుంది. చేసుకుంటాం. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన పిల్ల ఆలోచన అలాకాదు. ఇంట్లో వాళ్ళు గోంగూర పచ్చడి తిన్నా బయట వాళ్ళ ప్రపంచం వేరు. చాలా  వరకూ అమెరికనైజ్‌ అయిపోతారు. ఆ ఆలోచనల తీరు, భావాలు, ప్రవర్తనలో ఆ తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళకి “నా” అనే  నిర్దుష్టమైన వ్యక్తిత్వం వస్తుంది. చాలామంది స్వతంత్రంగా బ్రతకటానికి ఇష్టపడతారు. భార్యాభర్తల్లో తక్కువ ఎక్కువలు  ఉండటం వాళ్ళు సహించలేరు. కట్నాలు తీసుకొనే మగవారికి విలువ ఉండదు. ఇంట్లో పనిచేయని మగవారిని సమర్ధించలేరు.  “ఇద్దరూ కలసి ఇంటాబయటా జీవితాన్ని సమానంగా పంచుకోవాలి” అనే అభిప్రాయం వారి నరనరాల్లోనూ ఉంటుంది. ఇద్దరికీ ఆర్ధిక  స్వాతంత్రం కావాలి. ఇండియానించి వచ్చిన చాలామంది మొదటితరం మగవాళ్ళలో ఆ భావన ఉండటం కష్టం. కొంతమందిలో  ఆ భావన ఉన్నా, అది భావపరంగానే ఉంటుందికానీ, చేతల్లో కనపడటం తక్కువ” ఆగాను.

“మరి కొన్ని సందర్భాలలో, ఇలాటి వివాహాలు ఏ గొడవా లేకుండా సుఖవంతంగా ఉంటున్నాయి కదా” అన్నాడు సుబ్బారావు.

“ఉండవని ఎవరన్నారు. అది ఆ ఇద్దరి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఇద్దరూ ఇక్కడే పుట్టి, పెరిగి, పెళ్ళి చేసుకొని సుఖంగా  ఉన్నవాళ్ళూ ఉన్నారు. విడిపోయిన వాళ్ళూ ఉన్నారు. ఇటువంటి విషయాల్లో స్టాటిస్టిక్స్‌ కన్నా, ఆ వ్యక్తుల నైజాన్ని బట్టి, ఆ నిర్ణయాలు జరిగితే  బాగుంటుందేమో!” అన్నాను, నాకు ముప్ఫైఏళ్ళనించీ, తిండీ, గూడూ, బట్టా, కారూ, సంపాదించిపెడుతున్న, స్టాటిస్టిక్స్‌ ని కొంచెం  దూరం చేస్తూ.

“అంతేనంటావా?” సాలోచనగా అన్నాడు సుబ్బరావు.

అతను అలా అంటుంటే, ఏదో అనుమానం వచ్చింది నాకు, మనసులో పెట్టుకోవటం ఎందుకని, వెంటనే అడిగేశాను.

“ఏమిటి సుబ్బారావ్‌.. అన్నీ తరచి తరచి అడుగుతున్నావ్‌.. విశేషమేమీ లేదు కదా?”

సుబ్బారావు ఒక్కక్షణం ఆగి అన్నాడు “ఉందనుకొంటే ఉంది.. లేదనుకొంటే లేదు.. కృష్ణ.. అదే మా అబ్బాయి కృష్ణ.. ఫిలడెల్ఫియా నించి పిలిచాడు నిన్న ..”

“ఏమంటాడు..” ఏదో అనుమానం తొలిచివేస్తుంటే అడిగాను.

“ఫోన్‌ చేసి నాన్నా నేను, ఇండియాలో పుట్టి పెరిగిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను అని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.”

పెద్దగా నవ్వి అన్నాను “మరింకేమయ్యా.. సంతోషించాల్సింది పోయి.. దిగులుగా మాత్లాడతావేం?”

” ముందు.. నేను, మాలతీ నువ్వన్నట్టుగానే సంతోషించాం. కానీ బాలుగారి అమ్మాయి కధ విన్న తర్వాత నాలో ఆలోచన ప్రారంభం  అయింది. అందుకే నీ సలహా అడుగుదామని.. ఫోన్‌ చేసాను. ఇక్కడే పుట్టి పెరిగిన వీడికీ, అక్కడనించి వచ్చే అమ్మాయికి కంపాటిబిలిటీ  ఉంటుందా అని. సుఖంగా ఉండగలుగుతారా అని”

ప్రసూన వచ్చి అక్కడే సోఫాలో కూర్చున్నది. ఆమె ముఖం చూస్తే, అసలు కధ అర్ధమయినట్లు కనిపించటంలేదు. పగలల్లా  ఉద్యోగం చేసొచ్చి, ఇంట్లో వంట, మిగతా పనులు చేయటం వల్ల అలసటగా ఉన్నట్లుంది.

నా సలహా అడిగాడు కనక, అది ఉచితమే అయినా ఉచిత సలహా అవదు కనుక, కొంచెం గొంతు పెంచి అన్నాను ” ఇందాక చెప్పానుకదా..  అది వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి ఉంటుంది అని. ఆ కంపాటిబిలిటీ ఉన్న పిల్లనే ఇచ్చి పెళ్ళి చేస్తే సరి” అన్నానే కాని, కొన్ని వేల మైళ్ళ  దూరంలో ఉన్న ఈ కుర్రాడికి, అక్కడికి వెళ్ళి, అలాటి పిల్లను చూసి పెళ్ళి చేసుకోవటానికి తగిన సమయంకానీ, అవకాశం కానీ ఉంటుందా?

“అదే మాలతి కూడా అంటున్నది. ఇండియా వెళ్ళి, మన వాళ్ళకు బాగా తెలిసిన సంబంధం చూసి, వీళ్ళిద్దరికీ పరిచయం చెస్తే  సరిపోతుంది. పెళ్ళి మాత్రం ఇప్పుడు వద్దు అంటుంది మా ఆవిడ. వాళ్ళిద్దరూ ఫోన్‌ ద్వారానూ, ఈమెయిల్‌ ద్వారానూ, ఉత్తరాల ద్వారానూ  ఒకళ్ళనొకళ్ళు అర్ధం చేసుకొని, పెళ్ళిచేసుకొంటే బాగుంటుంది అంటుంది మాలతి. అదే నాకు సబబనిపిస్తున్నది. ఏమంటావ్‌?”

“శుభం.. మంచి సలహా .. అలాగే కానివ్వు అంటాను” అన్నాను మనస్ఫూర్తిగా.

మరి కాసేపు మాట్లాడి, ఫోన్‌ పెట్టేసి, ప్రసూనకి ఆ కధ చెప్పబోతుంటే, డోర్‌ బెల్‌ మోగింది. ప్రసూన లేచి వెళ్ళి తలుపు తీసింది.

ఒక తెల్లటి అమెరికన్‌ కుర్రాడు, సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. నేను భయపడిందేదో జరగబోతున్నట్లుంది.

“ఐ యాం స్కాట్‌. ఐ కేం టు పికప్‌ శారా” అన్నాడు.

ఈ లోగా మా అమ్మాయి సరస్వతి గబగబా మేడమీద నించి వచ్చి “హాయ్‌ స్కాట్‌.. లెటజ్‌ గో..” అని మాఇద్దరికేసి చూసి, “బాయ్‌” అంటూ చేయి ఊపి, అతనితో బయటకు వెళ్ళిపోయింది.