కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం

మా నాన్నగారు పుట్టి వందేళ్ళవుతోంది. ఈ సందర్భంగా కొందరు పాఠకులకు ఆయన జీవితవిశేషాలు తెలుసుకునేందుకు ఆసక్తి పెరుగుతోంది. ఆ కుటుంబ నేపథ్యం ఆయన రచనలలో ఎలా కనపడుతుందో నేను విన్నవీ, నాకు తెలిసినవీ కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను.


కొడవటిగంటి కుటుంబరావు
(షు. 1949 లో)

1909లో తెనాలిలో పుట్టిన మా నాన్నకు పదిపదకొండేళ్ళ వయసు వచ్చేసరికే తల్లిదండ్రులిద్దరూ మరణించారు. వారిది సనాతన భావాలు కలిగిన కుటుంబ వాతావరణం. ఉదాహరణకు ఇంట్లో నల్లుల బెడద తగ్గడానికని తన చిన్నతనంలో తల్లి ‘రు’ అనే అక్షరంతో అంతమయే అరవై ఊళ్ళ పేర్లు (గుంటూరు, ఏలూరు వగైరా) తనచేత రాయించిందని మా నాన్న ఒక వ్యాసంలో రాశారు. మొదటి నుంచీ మా నాన్నకు ‘మానసిక గవాక్షాలు’ తెరుచుకోవడానికి దోహదపడినది చదువే. జీవితంలో తన చుట్టూ సమాజంలోనూ, వ్యక్తుల ప్రవర్తనలోనూ కనబడుతున్న అసమంజసమైన అయోమయానికి విరుగుడు ఆయనకు విద్యద్వారా లభించిన వివేకమే అయి ఉండాలి.

ఏ పన్నేండేళ్ళకో పెదతల్లి సంరక్షణలోకి వచ్చిన మా నాన్నకూ, ఆయన చెల్లెలికీ, తమ్ముడికీ ఆవిడే వండి పెట్టేది. ఆ వంటలో తప్పనిసరిగా రోజూ అన్నం వండడం, అందులో కొంత మిగలడం, ఆ మిగిలినది మర్నాటికి చద్దన్నంగా ప్రత్యక్షమవడం జరిగేది. ఆ వయసులోనే మా నాన్న తర్కానికి అది నచ్చక “నువ్వు ఒకే ఒక రోజు అన్నం వండడం గనక మానేస్తే రోజూ నాకీ చద్దన్నం తినే బాధ తప్పుతుంది కదా” అన్నారట. పెద్దావిడకది నచ్చలేదు. “అన్నం వండకపోతే ఎట్లాగురా?” అనేదట. “నే చెప్పినట్టు చేస్తే ఒక్కపూటే కదా చద్దన్నం తినాలి, ఆ తరవాత చక్కగా రోజూ పూర్తిగా వేడన్నమే తినచ్చు కదా” అని ఈయన వాదన. ఆవిడ మటుకు వినిపించుకోలేదట.

పెద్దవారిలో అడుగడుగునా కనబడే ఇటువంటి మూర్ఖపు వైఖరి ఆయనకు చిన్నతనంనుంచీ గిట్టేదికాదు. సైన్స్ ద్వారా తెలిసిన విజ్ఞాన విషయాలు ఆయన అవగాహనకు నిర్దుష్టతను కలిగించాయి. పైపైన కనబడే విషయాలను సరిగ్గా, స్పష్టంగా అర్థం చేసుకోవడానికి విజ్ఞానం ఎలా సహాయపడుతుందో తెలిశాక ఆ పద్ధతులను పట్టించుకోనివారిపై ఆయనకు చిన్నతనంనుంచీ ఏహ్యభావన పెరగసాగింది. ఆధునికత విషయానికొస్తే తన చుట్టూ ఉన్నవారిలో ఎక్కువమంది మూర్ఖులేనని ఆయనకు అనిపించ సాగింది. పెద్దవుతున్నకొద్దీ, తమ చేజేతులా బాల్యవివాహాలు జరిపించి, ఆ తరవాత విధవలైన కూతుళ్ళతోనూ, చెల్లెళ్ళతోనూ అవస్థలుపడే కుటుంబీకులూ, ఆచారాల పేరుతో కూర్చున్న కొమ్మను నరుక్కునే పద్ధతిలో ఇబ్బందులు కొనితెచ్చుకునే పెద్దమనుషులూ అందరూ ఆయనకు బుద్ధిహీనులుగా కనబడేవాళ్ళు. ఇటువంటి ప్రవర్తనకు మూలకారణాలు సమాజంలోనే ఉన్నాయని ఆయనకు అర్థమవడానికి కొంత సమయం పట్టింది.

చిన్నతనంలో మా నాన్నమీద వాళ్ళ పెద్దన్నయ్య ప్రభావం ఉండేది. వయసులో పదహారేళ్ళు పెద్దవాడైన వెంకటసుబ్బయ్యగారు స్వయంగా కవి, ఆలోచనాపరుడు. సాహితీసమితి సభ్యుడు. ఆయన మిత్రవర్గంలో తల్లావఝ్ఝల శివశంకరశాస్త్రి, గోవిందరాజు సుబ్బారావు, పెద్దిభొట్ల చలపతిరావు తదితరులుండేవారు. గిండీ ఈంజనీరింగ్ కాలేజిలో చదువుకుని ఓవర్సీరుగా పనిచేసిన సుబ్బయ్య గారికి ఆధునిక భావాలు పుష్కలంగా ఉండేవి. చిన్నతనంలో మా నాన్నకు పాతపద్ధతిలో వెనక పిలక ఉండేది. తన స్నేహితులతో సైకిళ్ళు ఆపి నిలబడి కబుర్లు చెప్పుకుంటున్న సుబ్బయ్యగారు మా నాన్న రావడం చూసి “ఏరా ఎక్కణ్ణుంచి రావడం?” అని అడిగారట. “గుడికెళ్ళి వస్తున్నా” అని జవాబు చెప్పగానే “గుడినుంచా? వాటె ఫెలో” అన్నారట సుబ్బయ్యగారు. వెంటనే స్నేహితులంతా పగలబడి నవ్వారట. మా నాన్నకు చిన్నతనంగా అనిపించినప్పటికీ కుర్రవాడవడంచేత ఏమీ అనలేకపోయారట. ఎటొచ్చీ మా నాన్న, ఆయనకన్నా చిన్నవారైన మా అత్తయ్యా, బాబాయీ పెరిగేనాటికి సుబ్బయ్యగారు కుటుంబాన్నంతటినీ వదిలేసి వెళిపోయారు. అది వేరే కథ.

మా నాన్నా, మా బాబాయీ ప్రతిఏటా తల్లిదండ్రులకు తద్దినాలు పెడుతూ ఉండేవారు. ఒకసారి తమతో ఉపవాసం ఉండవలసిన పురోహితుడు పూజకు ముందు రహస్యంగా హోటలుకెళ్ళి తినిరావడం వారి కంటబడిందట. బైటికొచ్చి హడావిడిగా కుర్రాళ్ళతో “పదండి పదండి తద్దినానికి వేళ అయింది” అంటున్న పురోహితుణ్ణి ఎగాదిగా చూసి వారిద్దరూ “తద్దినం గిద్దినం ఏమీ పెట్టక్కర్లేదు నువ్వు వెళిపో” అని చెప్పేశారట. “అదేవిట్రా పురుగులు పడిపోతారు” అని పురోహితుడు భయపెట్టినా వారు లెక్క పెట్టలేదట. ఆ తరవాత వారిద్దరూ జంధ్యాలు తీసిపారేసి, తద్దినాలూ వగైరా తంతులన్నీ మానేశారట. బంధువర్గంలో ప్రతివారూ వాళ్ళని ‘రావణుడూ, కుంభకర్ణుడూ’ అనీ, ‘హిరణ్యాక్షుడూ, హిరణ్య కశిపుడూ’ అనీ తిట్టినా లక్ష్యపెట్టే వారు కాదట. తల్లిదండ్రుల అజమాయిషీ లేకపోవడం ఈ విషయంలో మా నాన్నకు లాభించింది. మానసికంగా ఆరోగ్యవంతమైన వైఖరి అలవడేందుకు స్వేచ్ఛ దొరికినట్టయింది.

చిన్నప్పుడు నేర్చుకున్న పెళ్ళి మంత్రాలూ, తద్దినం మంత్రాలూ వగైరాలన్నీ ఆయనకు చివరిదాకా గుర్తున్నాయి. సంప్రదాయకవిత్వాన్ని నేర్చుకుని రాయగలిగిన తరవాత ఆ పద్ధతిని నిరసించి, చెండాడిన శ్రీశ్రీలాగే మా నాన్నకు తాను తరవాతి కాలంలో సహేతుకంగా, తార్కికంగా విమర్శించిన సంప్రదాయాలన్నీ మొదటినుంచీ బాగా తెలుసు. అది సంప్రదాయవాదులకు కంటగింపుగా ఉండేది. ఆయన రాయడం మొదలుపెట్టాక ఆయనను సమీపబంధువులే ఎలా ఈసడించుకుంటూ ఉండేవారో మా. గోఖలే ఒక వ్యాసంలో వివరించారు. ఆయన రాసిన మొట్టమొదటి కథల్లో దాదాపు ప్రతిదీ ఒక యువ వితంతువు గురించే అనేది గమనిస్తే ఆయన ఆ సమస్య గురించి ఎంత ఆలోచించారో తెలుస్తుంది. ఆ కాలంలో బతకనేర్చిన తెనాలి బ్రాహ్మణ కుటుంబీకులందరూ గడుసుపిండాలే. సంప్రదాయం ముసుగులో సొంతలాభాన్ని ఓ కంట కనిపెడుతూ, పెద్దమనుషులుగా చలామణీ అయే రకాలను ముందుగా గురజాడా, ఆ తరవాత చలం సమర్థవంతంగా ఎండగట్టారు. దీన్ని మా నాన్న కొనసాగిస్తూ, వారి ప్రవర్తనను శాసించే సామాజిక, ఆర్థిక, రాజకీయశక్తులను కూడా విశ్లేషించారు.

మా నాన్న తెనాలిలో చదువుకునే రోజుల్లో వాళ్ళ స్కూల్ లైబ్రరీకి Strand Magazine వంటి బ్రిటిష్ పత్రికలు వస్తూ ఉండేవట. అందులో Sir Arthur Conan Doyle రాసిన షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ కథలూ వగైరాలన్నీ ఆయన సీరియల్ రూపంలో చదువుతూ ఉండేవారట. మరొకవంక తెలుగులో ఆధునికసాహిత్యం మొదలుపెట్టిన తొలితరం రచయితల కథలన్నీ ఆయన చదవగలిగారు. చలం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, చింతా దీక్షితులు, భమిడిపాటి కామేశ్వరరావు మొదలైనవారి రచనలన్నీ ఆనాటి సరికొత్త తెలుగుసాహిత్యానికి సూచికలుగా ఆయనకు అందుబాటులో ఉండేవి. పన్నెండో ఏటినుంచీ ఏ వార్తాపత్రికలోనో పడ్డ ప్రతి హెడ్‌లైన్ సమాచారాన్నీ ఆధారం చేసుకుని ఒక కథ రాసి, చదివి చూసుకుని చింపెయ్యడం మా నాన్నకు అలవాటు. కథా రచనకు నిరంతర అభ్యాసం అవసరమని గుర్తించడంవల్లనే అలా చేసేవాణ్ణని ఆయన అన్నారు. ఏదైనా విషయాన్ని సమగ్రంగా అర్థంచేసుకోవటానికి నిదర్శనం దాన్ని గురించి రాయగలగడమే అని అప్పటి నుంచే ఆయన నమ్మేవారనిపిస్తుంది.

తన రచనలు తన తరం ఆలోచనలను ప్రతిబింబించాలనీ, తన ముందుతరం కథకులు వదిలిపెట్టిన స్థాయినుంచి సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలనీ ఆయనకు తపన ఉండేది. చదివేవాణ్ణి మూఢుడికింద జమకట్టకుండా, అతని బుద్ధికి పదునుపెట్టి, పని కల్పించేలా రాయాలని ఆయన ప్రయత్నించేవారు. మొదటి ప్రపంచయుద్ధం తరవాత తెలుగు ప్రాంతాల చిన్న పట్టణాల్లో కూడా కొంత అంతర్జాతీయ విషయాలూ, వాటి ప్రభావమూ కనబడడం మొదలయింది. నిజమైన ఆధునికత ఎటువంటిదో తెలుసుకోవడానికి చదువుకున్నవారందరికీ అవకాశాలు ఏర్పడ్డాయి. వాటన్నిటినీ మానాన్న వినియోగించుకున్నట్టుగా కనబడుతుంది. అందుకేనేమో ఆయన రచనల్లో పల్లెజీవితపు అందాల గురించిన ప్రస్తావన కనబడదు. గ్రామాలన్నీ వెనకబాటుతనానికి నమూనాలుగా ఆయనకు అనిపించేవేమో. కందుకూరి, గురజాడ, గిడుగు మొదలైన సంస్కర్తల తరవాతి తరానికి చెందినవాడుగా మానాన్న తన తరం ఆధునికతను విడనాడకూడదని అనుకుని ఉంటారు.

సాహిత్యం, శాస్త్రీయసంగీతం ఆయనకు చిన్నప్పటినుంచీ అభిమాన విషయాలు. ఔత్సాహిక, ప్రొఫెషనల్ నాటకరంగాలూ, సినిమాలూ అన్నిటి ఆవిర్భావమూ, ఎదుగుదలా, పరిణామాలనూ grandstand view పద్ధతిలో వీక్షించే అవకాశాలు ఆయనకు కలిగాయి. వివిధరంగాల్లో పేరు తెచ్చుకున్నవారెందరో ఆయనకు సన్నిహితులు. స్థానం నరసింహారావు, సి.ఎస్.ఆర్., ముదిగొండ లింగమూర్తి, నటగాయకుడు రఘురామయ్య, సినీ దర్శకుడు పి.పుల్లయ్య, చక్రపాణి తదితరులంతా ఆయనకు చిరకాలమిత్రులే. పుల్లయ్య సినిమా తీస్తున్నాడని విని అతనికి తనను పరిచయం చెయ్యవలసిందిగా చక్రపాణి అడిగారని మా నాన్న ఒక వ్యాసంలో రాశారు. ఆ విధంగా చక్రపాణి సినీ రచయితగా మారడం, చివరకు మా నాన్నకే చందమామలో ఉద్యోగం ఇప్పించే స్థాయికి ఎదగడం మొదలైనవన్నీ తరవాతి సంఘటనలు.

ఈ నేపథ్యమంతా మా నాన్న రచనల్లో కనబడుతుంది. వ్యక్తిగతంగా తనకు సంగీతం, నాటకాలూ, సాహిత్యవిషయాల్లో ఉండిన అభిమానం ఆయనకు వాటన్నిటితోనూ సన్నిహిత సంబంధాలను పెంపొందించాయి. అందువల్లనే సమాజమూ, కళలూ ఒకదాన్నొకటి ఎలా ప్రభావితం చేసుకున్నాయో నిశితంగా పరిశీలించి, అర్థంచేసుకోవడమే కాక, వాటి గురించి విశ్లేషణాత్మకమైన వ్యాసాలను రాయడంకూడా ఆయనకు సాధ్యమైంది. స్పష్టంగా కనబడకుండా, అంతర్లీనంగా సమాజాన్నీ, వ్యక్తులనూ ప్రభావితం చేసే శక్తులను అన్నిటినీ అర్థంచేసుకుని వివరించడమనేది ఆయన దాదాపు ఒక సామాజిక బాధ్యతలాగా చేపట్టి రచనలు చేశారు.

ఆ తరవాత ప్రపంచాన్నంతటినీ దెబ్బతీసిన డిప్రెషన్, ఆర్థిక సంక్షోభం, రెండో ప్రపంచయుద్ధం మొదలైనవన్నీ అప్పటి మధ్యతరగతిని అధోగతిలోకి నెట్టడంతో మానాన్న జీవితంకూడా అస్తవ్యస్త మైంది. బెనారెస్‌లో ఎం.ఎస్‌సీ. చదువు అర్ధాంతరంగా ముగిసిపోవడం, ఆస్తులన్నీ హరించుకుపోవడం, నిరుద్యోగసమస్యలూ అన్నీ ఆయనను విడవకుండా బాధించాయి. ‘విశ్వదాత’గా పేరుపొందిన నాగేశ్వరరావు పంతులుగారు బతికున్న రోజుల్లో ఆంధ్రపత్రికలో పడ్డ తన రచనలకు పారితోషికం ఎంతకీ అందటంలేదని మా నాన్న చెపితే “ప్రతివాళ్ళూ డబ్బడిగేవాళ్ళే” అని పెద్దాయన విసుక్కునేవాడట. ఆయనమీద పంచరత్నాలు రాసినవారికి మటుకు పారితోషికాలు వెంటనే అందించేవారట. మద్రాసులో శ్రీశ్రీవంటి ఇతర యువ రచయితలతోబాటు మానాన్నకూడా రాత్రి భోజనానికి బదులు ఏ ఇడ్లీలో తిని, రాత్రంతా మద్రాసు బీచ్ ఒడ్డున పడుకుని నిద్రపోయిన సందర్భాలుండేవి. మానాన్నకన్నా కాస్త మెరుగైన ఆర్థికపరిస్థితిలో ఉండిన వడ్లపట్ల ప్రసాదరావుగారి వంటి వారు బెనారెస్‌లో ఎం.ఎస్‌సి. పూర్తి చెయ్యగలిగినప్పటికీ చివరకు మానాన్నతో బాటే ఆంధ్రపత్రికలో జర్నలిస్టుగా పనిచెయ్యవలసి వచ్చింది. అప్పటి నిరుద్యోగ సమస్య అటువంటిది.

1945లో మా అమ్మ వరూధినిని పెళ్ళిచేసుకున్న తరవాత మా నాన్న వ్యక్తిగతజీవితం కుదుట పడసాగింది. 1952లో చందమామలో చేరాక ఆయనకు పూర్తి ప్రశాంతత లభించినట్టయింది. ఆ తరవాత దాదాపు మూడు దశాబ్దాలపాటు ఆయన నిలకడగా రచనలు చెయ్యగలిగారు. దిన, వార, మాసపత్రికల్లో ఎన్నో సందర్భాల్లో జర్నలిస్ట్‌గా పనిచెయ్యడం ఆయనకు లాభించింది. అలాగే అవన్నీ రచయితగా ఆయన పటిమనూ, సామర్థ్యాన్నీ బాగా వినియోగించుకున్నాయి. ప్రింటింగ్ టెక్నాలజీ నుంచి పత్రికల సామాజిక ప్రభావం దాకా అన్నిటినీ ఆయన సమగ్రంగా అవగాహన చేసుకోగలిగారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో జరుగుతూవచ్చిన ప్రగతీ, సినిమాలవంటి ప్రచార, ప్రసారసాధనాల ప్రభావమూ ఇలా ప్రతిదీ ఆయన దృష్టిని ఆకర్షించడం, ఆయన వాటిని విశ్లేషించడం జరిగింది. ఇరవయ్యో శతాబ్దపు మానవుడుగా, రచయితగా, చింతకుడుగా ఆయన చివరిదాకా క్రియాశీలంగానే ఉన్నారు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...