లోను

శీతాకాలం ఎండ చురుక్కుమనిపిస్తుంటే చెట్ల వారకి మంచం లాగుకొని చేరబడ్డాను. గాలి సాగడం లేదు. గాలివాటం తెలుసుకోడానికి అంటించిన ‘కొంటు’ పొగ తిన్నగా ఆకాశం వైపు సాగుతోంది. కళ్ళంలో గాలిపోత ఆగిపోయింది. గాలిపోత దండి నుండి ధాన్యాన్ని తెగతీసి రాసి పోస్తున్నారు కొందరు. మేటి చుట్టూ ఉన్న గడ్డిని తెగతీస్తూ కుప్పమీదకి ఎగరేస్తూ గడ్డి కుప్ప సరిచేస్తున్నారు ఇంకొందరు. ఈ కల్లంపని ఎప్పుడు పూర్తవుతుందా అని ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాను నేను.

ఉద్యోగరీత్యా పైరాష్ట్రాల్లో ఉన్న నేను అమ్మని చూడడానికి ప్రతీ సంవత్సరం వస్తాను. ఎప్పుడూ వేసవి సెలవుల్లో కుటుంబాలతో రావడం మూలంగా ఈ కల్లం తిప్పలు తప్పిపోయేవి. ఈ సంవత్సరం అర్థ మధ్యాంతరంగా సెలవులు కలిసొచ్చి పండుగ ముందు నేనొక్కడిని వచ్చాను.

‘‘నాన్నా, నూర్పులవుతున్నాయి. ఈ నాలుగు రోజులు కల్లంలో కూర్చోవూ’’ అంది అమ్మ. అమ్మ మాటను కాదనలేక ఈసాలిగూటిలో చిక్కుకుపోయాను.

‘‘నాయినా! ఓరి గుంపసోమీ! ఔన్రా అయ్యా! ఎక్కడున్నావురా’’. కర్రని నేలకి తాటించుకొంటూ పరుగు పరుగున వచ్చాడో ముసలాయన.

‘‘ఏందిరా సిన్నయ్యా! నా నిక్కడున్నాను. ఏటయింది అలా పారొత్తన్నావు?’’ ఎగవేస్తున్న గడ్డిని అలాగే వదిలి కుప్పపై నుంచి ఒడుపుగా జారాడు గుంపస్వామి. ఆయాసంతో రొప్పుతూ కల్లంలోకి వచ్చిన ముసలాయన కర్ర జారవిడిచి నేలపై చతికిల బడ్డాడు. చేస్తున్న పనులను అలాగే వదిలి అందరూ గుమిగూడారు.

‘‘ఏటయిందిరా సిన్నయ్యా! అంతలా ఆయాస పడిపోయి పరిగెత్తుకచ్చినావు? ఏటయిందసలు?’’ గుంపస్వామి దగ్గరగా వచ్చి ముసలాయనను లాలనగా అడుగుతున్నాడు. చెప్పాలని ప్రయత్నిస్తున్న ముసలాయనకు ఆయాసం సహకరించడం లేదు.

‘‘బేంకోళ్ళు ఒచ్చినార్రా … డబ్బులు … కట్టకపోతే … జప్తు సేత్తారట. బావుని … అల్లకల్లోలం … సేత్తన్నారూ .. నిన్నోపాలి … బేగి రమ్మంతన్నాడు’’ ఆయాసాన్ని అణుచుకుంటూ ఒక్కక్కటిగా చెప్పాడు ముసలాయన.

‘‘నాయినా గుంపసోమీ ఒక్క పాలెల్లరా. ఈలు సూసుకుని కట్టేత్తామని నువ్వు సెప్పరా. నేదంతే ఒక్కపాలి బేగెల్లి నాయుడోరి సినబావుని తీసుకురా. ఆతగానితో సెప్పించుము. ఈడసలే ఎర్రి బాగులోడు. ఎవుల్తో ఎలా మాట్టాడాలో తెలీదు. ఏదో ఒకటి పుసుక్కున వాగేసినాడనుక్కో సచ్చిన సాపత్తాది. నాయిన్నాయిన ఒక్క పాలెల్లుమీ’’ ముసలాయిన గుంపస్వామి గడ్డం పట్టుకొన్నాడు.

‘‘ఓస్సి … దానికేన్రా. ఇంత ఇదై పోతన్నావు. పరిగెత్తి పరిగెత్తి నువ్వు జాపోసిపోయి కొత్తుంటే ఏటయి పోనాదో అని మామడలి పోనాం కదరా! నెగురా మామా! బేంకోళ్ళేటి సేత్తార్రా. అప్పు కాదన్నామురా? ఎగమెడ్డీసినామా? ఇయ్యేల కాకపోతే రేపు తీరుత్తాం … అయితే ఏటయిపోద్ది’’ తేల్చేవాడు గుంపులో ఒకడు.

‘‘నెగురా! ఈ పర్రాకులు నీకేటి తెల్సు. మంత్రసానికి తల్లిపోతేనేటి పిల్లపోతేనేటి? ఇయ్యేల డబ్బులు కట్టకపోతే ఎద్దులు జప్తు సేత్తానని కూకున్నాడతగాడు. మా దగ్గరేటుంది? ఎర్రని ఏగాని నేదు. పోనీ … నాయినా బావూ అంతన్నాడా మా వోడు … గయ్‌ గయ్‌ మంతన్నాడు. మనకు అవన్నీ ఏల? నీ సంగతి సూడ్రా అంతే ఇంతన్నాడా? – ఊళ్ళో ఆడు కట్టినాడా? ఈడు కట్టినాడా? అని సాపత్తెం సూసి రీజిన్లు తేత్తన్నాడు. ఆళ్ళకేటి ఆళ్ళు ఉజ్జోగత్తులు ఎద్దుల్ని జప్తుచేసి నాయుడోరింట కట్టేసినారంటే మన పని – అప్పుడు సూడాల …!’’ తన భయాన్ని వివరిస్తున్నాడు పెద్దాయన.

విషయం తెలియగానే ఎవరి పనులలో వారు దూరిపోయారు. ‘‘నానోపాలి ఊర్లోకెల్లి ఒత్తాను బావూ’’ గుంపస్వామి బయలుదేరాడు.

‘‘ఏటి ఇంకింటి ముమ్మరి పనుల టయిముల లోన్లు – జప్తులు అంతే ఏటి సెబుతాము. ఎవులుకేటి తీరికవుద్ది? బేంకోళ్ళెనకాల ఎవురు తిరగ్గలరు? ఇప్పుడు నా నెల్లినాననుకోండి ‘సమయానికి దొరికినావు లోను కట్టు’ అని నన్ను పట్టుకుంటారు గావాల. ఎల్లకపోతే ఈ ముసలాడు తినేత్తండు’ తనలో తానే గొణుక్కుంటున్నట్టు బయటకే వల్లిస్తున్నాడు గుంపస్వామి ఊరివైపు బయలుదేరుతూ.

ముసలాయన నిమ్మళంగా లేచి గావంచా సర్దుకొన్నాడు. ‘గాలి పోతయి పోయిందా? ఏమాత్రమైనాయేటి? రాలికెలాగుంది?’’ ధాన్యపు రాశిని గాలికి పట్టవలసిన ధాన్యపు కుప్పను పరకాయించి చూస్తూ – ‘‘అయితే పూర్తిగా గాలికవ్వనేదన్న మాట. నిరుడు మీన బాగానే రాలినట్టుగున్నాయి’’ అంటూ నా దగ్గర కొచ్చాడు.

‘‘నాయినా నువ్వు మా బావు శివున్నాయుడు కలిసి సదువుకొన్నారు కదా. నువ్వు రైలు కాడ ఉజ్జోగము సంపాయించినావు. ఆడు అయిటియ్యే (ఐటిఐ) సేసి ఉజ్జోగము కోసం అన్నంమన్నంట తిరిగి కడావరికి మనూరు సేరిపోనాడు. సెయ్యడానికి యవసాయమునేక సదువుకున్నాడు – మరి కూలికీ ఎల్లనేక యాపారం చేతగాక కంచాలు మార్చి బొందులు – బొందులు మార్చి కంచాలు అన్నట్టు దినం గడుపుతున్నాడు. ఏట్నాయినా ఎన్ని పర్రాకులు పడితే – ఎన్ని కౌకులు పడితే ఉజ్జోగము సాటొత్తాది సెప్పుమీ’ గడ్డి పరకలు లాగుకొని వాటిపై చతికిల పడ్డాడు ముసలాయిన.

‘‘ఏంటి సూరయ్యా! ఆరోగ్యం బాగుందా?’’ అన్నాను పలకరింపుగా.

‘‘ఏట్నాయినా ఆరోగ్గెము. ఊరికి దూరం కాటికి సేరువా. ఏ పొద్దు ఆ బగమంతుడి పిలుపొత్తాదో – ఎల్లిపోడానికి సిద్ధంగున్నాము.

‘‘అయితే నీ కొడుకు హైదరాబాదు నుండి వచ్చేశాడన్న మాట.’’

‘‘ఆీ. ఎప్పుడో వచ్చీసినాడు. ఆ ఉజ్జోగము ముండమోసిపోయింది. ఏటిబావూ! పైవేటు కంపినీల పని. పొద్దత్తమానం కట్టపడితే మూడు కాన్ల దమ్మిడి సేతి కెట్టేవోరు. పట్నంల ఆ డబ్బు లేటి సరిపోతాయి. సాలకపోతే అప్పులు – పడ్డీలు. ఉన్న నొడ్డు లొసుకు అమ్మేసుకొని మనూరు పారొచ్చినాడు ఇక్కడేటుంది? కూలి దొరుకుతే కుండ ఉడుకుతుంది. నేదంటే నేదు.’’

‘‘ఒక బూములా – పుట్రలా ఏటున్నాయని? ముండ పేట్రీవచ్చి నా బూవి మింగేసింది. నా కట్టమూ నా సీమూ నెత్తురూ అన్నీ దాని మీదనే ఎట్టినాను. అదంతా తుడుసుకు పోయింది. ఎముకల గూడయి పోనాన్నేను. జబ్బు మనిషయి పోయింది ముసల్దాయి. ఆళ్ళు మాటలు ఈల్ల మాటలు నమ్మి ఊకొట్టేసినాను. అన్నాయమై పోనాను. బావూ! కుర్రోడి కుజ్జోగమంతే బెమిసిపోనాను. నా బెమే నన్ను ముంచేసింది’’ శూన్యంలోకి చూస్తున్నాడు ముసలాయన. అతని కళ్ళల్లో నీళ్ళు తళుక్కుమన్నాయి. గతం కళ్ళ ముందు మెదిలింది. ఏదో గొణుకుతున్నట్టుగా. స్పష్టాస్పష్టంగా అతని గొంతు పణుకుతోంది.

**

మా అయ్య సనిపోగానే ఓ సంవచ్చరం ముండదాయి గుండిపోయి మా మావకాడ నన్నొదిలేసి మాయమ్మ వల్లరగుడబ మారుమనువు కెల్లిపోయింది. సిన్నప్పుడు కాడినుండి మావే నన్ను పెంచినాడు. మా మావనే నాను సిన్నప్పుడు ‘అయ్యా! అని పిలిసే వోడినట. ఒక్కలు కాసి, కన్నాళ్ళు బుగతోరింటికాడ కంబారిగుండి, మా మావతో పాటు కూలినాలి కెల్లి ఆల్లకాడే తిని తొంగుంటు పెరిగి పెద్దోడినయినాను.

గోర్జి కెత్తల కాసి మెరకలో మా మావకి రెండెకరాలుంది. అదే ఆడి ఆస్తి. దానిమీన జీనుగులు, ఉలవలు పండేవి. కొన్నాళ్ళు పచ్చి జొన్నలు కూడా ఏసేవోడు.

‘‘ఓరయ్యా! నువ్వు నా సెల్లి కొడుకువి. దాని దినం దిబ్బతీరక అది మారు మనుమెల్లిపోనాది. మనసు పట్టనేక సూసొత్తన్నాను. ఆడికీ ఏటినేదు. కూలికెల్తే కద్దు నేకపోతే నేదు. సిన్నప్పుడుకాడినుండి నువ్వు నాకాడే పెరిగినావు. అల్లుడవయినా కొడుకు వయినా నీవే. అదొ సావిత్రమ్మని నీ సేతులో ఎడతన్నాను. ఇదొ ఈ బూమాతని నీ కప్పగిత్తన్నాను. ఇవి నా పేణాలు. ఈటిని జాగరత్తా సూసుకో’’ అన్నాడు మావ. అన్నట్టుగానే సావిత్రినిచ్చి యాసవుల్లో పెల్లి సేయిసినాడు.

మా పొలానికి ఆత్రంకాసి ఓ గుమ్మి నాగుండేది. అదెప్పుడో తాతలనాటి నుయ్యిట. కప్పడిపోయి గుమ్మయిపోయింది. వందో యాబయ్యో కర్సుపెట్టి దాన్ని బాగుసేయించి ఏతమెత్తితే ఆ గడ్డి ముక్కల మీన బంగారం పండించొచ్చు. కానీ డబ్బు నేదు. ‘‘అప్పు సెయ్యెద్దో’ అంతాడు మావ. ‘ఒక్క పాలప్పుసేత్తే మరి తేరుకోలేం’’ అంతాడు. ‘అప్పు సెయ్యడం బాగుంతాది. అది తీర్సడం కట్టం’ అంతాడు.

‘కొత్త పెల్లాం మోజు’ కూడా మర్సిపోయి రాత్రనక పగలనక పొలం మీన పడ్డాం. గడ్డి ముక్కల్ని సాపుసేసి గట్లెత్తినం. మళ్ళు సేసినాం. ఆ యేడు పర్షాలు బాగా పడినాయి. కాలం కలిసొచ్చింది. ఎదలు జల్లినాను. మావకి తెలీకుండా అప్పుసేసి గుండలు జల్లినాను. ఎదలిరగబడి పండేసినాయి. ‘నీ అల్లుడు గొప్పగా పండించినాడంతే – మా గొప్పగా పండించినాడ’ని అందరూ మావతో సెప్పినారు.

తిండి గింజలిడుకొని మిగిలిన వమ్మేసినాను. సావిత్రికి జుంకాలు సేయించినాను. అప్పుసేసినా తీర్చగలనని దవిర్యమొచ్చింది. ఆ వేసవుల్లో అప్పుసేసి నలుగుర్నెట్టి నుయ్యి పని సేసినాను. కప్పడిపోయిన నుయ్యి కింద రాతి కట్టలో బయలుపడినాది. తియ్యటి కొబ్బరి నీటి నాగుంది నీరు. ఏటిజల మోసెయ్యొలం పడింది. బూర్జిమాను కట్టి తాటిదొన్నె సేయించి ఏతామెత్తినాను. సల్లటి గంగతల్లి మల్లల్ల పల్లక దిగిపోనాది.

నూకలాదెల్లి వంగనారు, ఉల్లినారు తెచ్చుడిసినాను. కాసింత మిరపనారు పోసినాను. గట్టంచున కాసిన్ని బెండిమొక్కలు, గోరుసిక్కుడు పిక్కలు ఏసినాను. ఇల్లు – పొలము నాకు మరోటి నేదు. కొండడం ముసిలోడికి ఇంటికాడ పడ్డించి మిగిలింది ఆ దాకలతోటే తట్టలో కెత్తుకొని పొలానికి పార్రావడం సావిత్రి పని. కోడి కూతేలకి నాను పొలానికెల్లిపోతే మళ్ళీ రాత్రి తొంగున్న ఏలకే ఇంటికి రావడం.

వంకాయలు, మిరపకాయలు, కాసిన్ని టమాటాలు ఆకుకూరలు సాయింత్రమేళ అరసాడి బజారు కొట్టుకెల్లి అమ్ముకొచ్చే వోడిని. పైసా పైస కూడెట్టి అప్పులు తీర్చేసినాను. గేదిని సంపాయించినాను. పెందిలి, సాయంత్రం పాలు అరసాడు హోటీలుకు పోసేవోళ్ళం. పూరిపాకను మిద్దిల్లు సేసినాను. అలాగే పిల్లా – జల్లా, సుట్టాలు – పక్కాలు అన్నీ సూసినాను. కడావరకి పెద్దమ్మకి, నడిపమ్మికి పెళ్ళిళ్ళు సేసినాను. కుర్రోడిని బొబ్బిల్ల నడిపించినాను.

నాయినా కడాకు ఒక్కనాగే ఉండిపోద్దా? ముండబగమంతుడికి కన్ను కుట్టీసినాది. ‘ఓ కూలికెల్లక – నాలికెల్లక పొద్దత్తమానం కూరాకుతడినాగ ఆ బడ్డిల కూకుండిపోయి కాయకసవో అమ్ముకొని ఈ సూరిగాడు బతికేత్తన్నాడు. ఈడ్ని బయటకు ఈడిసీలేనా! అని ఆలోసించి ఈ ఊరికి కందసార పెట్రీ తెచ్చీసినాడు. అయ్యకు పెళ్ళవుతుందని సందడే గాని అమ్మకి సవితి పత్తందని తెలీసి గుంట పాపడునయి పోయాను నేను.

గోర్జి కత్తలకాసి బూమంతా బుగతోరిది. అతగాను ఆ బూమిచ్చేత్తే నాకే పర్రాకులు లేకపోను. ససేమిరా నా నివ్వననీసినాడు బుగత. మెరకంతా పరకట్టించి బోరింగెట్టాలన్నాడు. ‘పేక్టరీ పత్తే ఊరు బాగుపడతాది కాని నా నేల నట్టపోవాల?’ అనీసినాడు.

గోర్జి కత్తల కాసిపడ్డారు పెద్ద మడుసులు. ఆడిదో ఎకరా ఈడిదో అరెకరా ఇలాగున్నాయి సిన్ని గుడ్డముక్కలు. ఒగ్గీడానికి రైతువోరే అంతా ఇష్టపడిపోనారు. నాయకులంతా కూకుని కరీదు కట్టేసినారు. ఎవుడూ మారు మాట్లాడనేదు. రాత కోతలయి పోనాయి. డబ్బులు సెల్లింపులు అయిపోనాయి.

కానీ మద్దిన నానుండి పోనాను. నా రెండకరాల మడి. నా నుయ్యి నా బతుకు నాను కాదన్నాను. ఇంటికి నాయుడొచ్చినాడు. పెద్ద బుగత పచ్చినాడు. కరణ మొచ్చినాడు. ఊర్లో నాయకు లొచ్చినారు. ఊరందరి కిచ్చిన దాని కంటే ఎక్కువా ఇత్తామన్నారు. నా బూమికి నన్నే ఎలకట్టుకోమన్నారు.

‘‘దద్దీ! నువ్వు కాదంటే ఇంత మా పెయిత్నము బూడిదలో పోసిన పన్నీరయిపోద్ది. సేతులు దులుపుకొని సాహుకారి ఎలిపోతాడు. అత్యం రాయిపిల్లి మెరక మీనో, ఇత్తల పడుకు పలస రేవళ్ళ మీనో మిల్లు కట్టిత్తాడు. అప్పుడు నట్టపోయేది మనమే. మిల్లొత్తే ‘కూలీ’ పెరుగుతుంది. ఆర్నెల్లు కూలీళ్ళు బతుకుతారు. సదువుకొన్న సిక్కు రోళ్ళకి ఉజ్జోగాలొత్తాయి. ఆల్ల బతుకులు సల్లగుంతాయి. సెరుకు పండించుకొని నాలుగు రూపాయలు కల్ల సూత్తాడు రైతు. బూవులుకి రేటొత్తాది. ఇదంతా ఊరుకి నువ్వు సేసిన ఉపకారమే. నీ పేరు సెప్పుకొని నాలుగు మెతుకులు తింతారందరూ.’’

‘‘అయితే బూమిపోతే నానెలా బతుకుతాను’’ అని అడుగుతావు నువ్వు. ఇయ్యేల సాహుకారిచ్చిన డబ్బుంతాది, నువ్వు జాగరతా మనిషివి. కోడలు మా గడుసుది. పాయిదాలకి తిప్పుకోగలదు. నీలాంటోడు కట్టపడతానంటే బూమి బాగానికి ఎవరైనా ఇత్తారు. ఎవురో ఏల నానిత్తాను. అదా సీనేటి సెరువు కింద నాలుగెకరాల పల్లముందా – అది నువ్వు సెయ్యి సారెడి నువ్వు తిను నాకో సారెడియ్యి సాలు. ఏతంతావు?’’ ఇంట బాసింపట్టేసుకు కూకుని మా నాయిడాలుకి నాకు నచ్చ సెబుతున్నాడు నాయుడు.

‘‘అస్సలు నా మెరకే ఇచ్చేద్దామనుకున్నాను. మా తమ్ముడి ససేమీరా అనేశాడు. మా పెద్దవాడు దానికి వంత పాడాడు. కుటుంబ కలహాలు పెంచుకోవడం ఇష్టంలేక నేను చేతులెత్తేశాను. ఆ మెరక పశువులు తిరగడానికి తప్ప నేనెప్పుడు వరకట్టిస్తాను? అంత డబ్బు నా దగ్గరేది? నలుగురికి మనం పెట్టలేకపోయినా పెట్టేదారి చూపించాలన్నారు పెద్దలు సూరయ్యా. మరి నువ్వు కాదనకు.’’

‘‘సరే! ఇదిరా పరిస్థితీ’’ అంటే తలో గుడ్డిముక్కా పదిలీడానికి మన వాళ్ళంతా ఒప్పుకున్నారు. మధ్యలో నువ్వున్నావు. అది కూడా కలిస్తే గాని చాలదంటాడు ఇంజనీరు. ‘ఇచ్చెయ్యరా అని గెట్టిగా అడగడానికి నాకు నోరు రావడం లేదు. నువ్వు ఎన్నాళ్ళు కష్టపడి వాటిని బాగు చేశావో నాకు తెలుసు. దానిపైనే నువ్వు ఆధారపడ్డావు. నీ ఆధారాన్ని లాక్కోవడమంటే నీకు అన్యాయం చెయ్యడమే కానీ ఇది ఊరి సమస్య …’’ నాన్చినాడు బుగత.

‘‘దద్దీ నానొకటి ఆలోసించినాను. కోడలా! నువ్వు ఇనుకో. ఇలాంటి ఇసయ్యాల్లో మొగోళ్ళ కంటే ఆడోల్లకే ఆలాపన ఎక్కువ. నీ కొడుకు సదువులోడు. ఉజ్జోగమే సేత్తానంతాడు గాని నీలా నేలబుగ్గి నెత్తిని పోసుకొని యవసాయం సేత్తాననడు. అయిద్రాబాదులోనో, ఇసాక పట్నంకానో ఉజ్జోగమొచ్చి ఎలిపోతాడు. నువ్వు బలిమి ఉన్నంత వరకు ఎవసాయం సేత్తావు. ఆ తరువాత ఏటి? మీవోడు అవిటియ్యే (ఐటిఐ) పాసయినాడు. ఇది పంచదార మిల్లు. ఇందులో మీ వోడికి ఉజ్జోగమయినాదనుకో హాయిగా మీవోడు కల్ల ముందుంతాడు. నెలా అయ్యేసరికి ఠంచనుగా జీతం రాళ్ళు పత్తాయి. బాగుసేసి నువ్వు పండిన గింజలుంతాయి. బూమి అమ్మిన డబ్బు పాయిదాలు పత్తాయి. నాడమయిన సంబంధము సూసుకొని పక్కూరు దాయికి పెండ్లి సేసి గొంతావు. ఇంతకన్నా ఎవురికేటి కావాలి? ఒక్కపాలి ఆలోసించు. అవకాసం తలుపు కొట్టుకు ఒత్తాది. మనం ఇనియోగ పర్సుకోవాల’’

‘‘సూరయ్యా! నాయుడు చెప్పింది ప్రశస్తంగా ఉంది. నీ కొడుకుకి ఇందులో ఉజ్జోగం ఖాయం. అయ్యారావు గారూ! మీ ప్యాక్టరీల మొదటి ఉద్యోగం వీళ్ళబ్బాయిది. నేను చెప్తున్నాను కదా. ఎకరాకి మరో వెయ్యి ఎగష్ట్రా. ఊీ. పైసలందుకోండి’’ బుగత తొందర చేశాడు. ఉజ్జోగమనేసరికి నాను బెమిసిపోనాను. మా నాయురాలు కరిగిపోనాది. అదురుట్ట మీ రకంగా తలుపు తట్టినాదని మురిసిపోనాము. బుగత అందించిన నోట్లకట్టలు అందేసి కొన్నాము. కరణం రాసిన కాగితాలు మీన ఏలిముద్ర వేసీసినాను. నా బూమి బుగ్గిల కలిసిపోనాది. నా బతుకు తెల్లారి పోనాది.

**

మా ఊర్లో కందసార మిల్లు నిర్మాణం అబ్బో పాతిక సంవత్సరాల క్రితం నాటిమాట. పారిశ్రామికీకరణం కోసం ప్రభుత్వం, బ్యాంకులు డబ్బులు దోచిపెడుతున్న కాలం. ఇంటర్‌ అయిందనిపించి ఉద్యోగాల వేటలో పడ్డ మాకు అది తీయని వార్త. జిల్లాలో నాలుగయిదు కండసార మిల్లులు గల బడా వ్యాపారవేత్త మా ఊర్లో మిల్లు పెడుతున్నాడంటే మేమంతా ఎగిరి గంతులేశాం.

‘‘ఉన్న ఊర్లో ఏదో చిన్న ఉద్యోగం దొరికితే వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా వ్యవసాయం చూసుకొంటూ హాయిగా బ్రతకవచ్చు’’ అని రంగుల కలలు కన్నాం. బురద చిమ్ముకొంటూ జీపులు వస్తుంటే పెద్ద పెద్ద ఇంజనీర్లు దిగి ప్లాన్లు వేస్తుంటే – ఊరి పెద్దలతో మంతనాలు జరుపుతుంది. మాదే సందడి. కందసార మిల్లుకు శంఖుస్థాపన చేసి గ్రూపు పోటోలు దిగిన ఎమ్మెల్యేగారు మా ఊరు ఎంత అభివృద్ధి చెందబోతోందో వివరిస్తుంటే ఆనందంతో కేరింతలు కట్టాం.

గ్రామ కంఠంలో రావిచెట్లు నరికి ఇటుకలు కాల్చి ప్యాక్టరీకి తరలిస్తోంటె, రకరకాల మిషన్లు లారీలపై దిగుతుంటే, ఆకాశంలోకి ఎత్తయిన పొగగొట్టాలు నిలబడుతుంటే మాలో – చెప్పలేని సంతోషం. మా నిరుద్యోగ మిత్ర బృందమంతా అక్కడే తిరుగుతూ యజమాని కళ్ళల్లో పడాలని తెగ ఆరాట పడేవాళ్ళం.

రెండు పెద్ద సైజు చెరుకు గానుగలు, పెద్ద సైజు డ్రమ్ములు, మరో రెండు పెద్ద పొగ గొట్టాలు, నాలుగ్గదుల ఆఫీసు, మరో రెండు అసంపూర్తి నిర్మాణాలు, తూనిక యంత్రం వెరసి కందసార మిల్లు అనగానే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ‘ఓస్‌ ఇంతేనా …’ అనిపించింది.

పెళ్ళి వారికంటే పెట్టెలు మోసేవారి సందడే ఎక్కువయినట్టుగా మిల్లు ప్రారంభోత్సవం నాడు మా హడావుడే ఎక్కువయింది. రంగుల కాగితాల జండాలు కట్టడం, బేనర్లు కట్టడం, స్టేజి డెకరేట్‌ చేసి, ఎనౌన్స్‌మెంట్లు ఇచ్చి అంతా మాదే అయినట్టు తిరిగాం.

మినిష్టరు గారి చేతి మీదుగా మిల్లు ప్రారంభం అయింది. ముహూర్తానికి చెరకు గానుగ ఆడించారు. వచ్చిన వారందరికీ రంగునీళ్ళు పంచబడ్డాయి. కోళ్ళు మేకలు తలలు తెంచుకొని ముఖ్యులకు విందు చేశాయి. మర్నాటి పేపరులో తాటికాయంత అక్షరాలతో మిల్లు ప్రారంభ వార్తలు ఫోటోలు వచ్చాయి. రాష్ట్రం పారిశ్రామికంగా ఎలా అభివృద్ధి చెందిందో మంత్రిగారి స్టేట్‌మెంటు వచ్చింది.

సీజను ముగిసింది కాబట్టి మరి క్రషింగ్‌ లేదన్నారు. రైతులంతా చెరుకు పండించి ప్యాక్టరీకి తోలాలన్నారు. పూర్తి స్థాయిలో మిల్లు ప్రారంభం అయింతర్వాత ఉద్యోగాలిస్తామన్నారు. మిత్రులమంతా కలిసి తిరుగుతున్నా ఉద్యోగం కోసం ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటున్నారు.

ఫ్యాక్టరీ ఆస్తుల సంరక్షణ కోసం చౌకీదారు నియమింప బడ్డాడు.

మళ్ళీ క్రషింగ్‌ సీజను ప్రారంభం అయింది. మిల్లు తెరుచుకోలేదు. చెరుకు పండించిన వారు చూసి చూసి బెల్లం గానుగకు తోలుకున్నారు. జీతం అందటం లేదంటూ చౌకీదారు బిచాణా ఎత్తేశాడు. వారసులు లేని ఆస్తిలా ఫ్యాక్టరీ అందరికీ కనిపించింది. ఎవరికి అవసరమైనది వాళ్ళు యధేచ్ఛగా తీసుకు పోయేవాళ్ళు. మిల్లు ఆవరణలో పశువులు మేసుకొనేవి. సొమ్మల కాపర్లు పశువుల మంద నిలిపి అక్కడే ఆటలు ఆడుకొనే వారు.

యజమాని మా ఊరు మరి రాలేదు. అతని పేర వచ్చిన ఉత్తరాలు తిప్పి పంపబడేవి. లారీలు వచ్చి ఫ్యాక్టరీలో ముఖ్యమైన భాగాలను రాత్రుళ్ళు తీసుకు పోయేవని ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. ఒకనాడు సాయంత్రం బ్యాంకు జీపు వచ్చి ‘ఈ ఆస్తి ఫలానా బ్యాంకు వారిచే జప్తు చేయబడినది’ అని బోర్డు తగిలించి వెళ్ళిపోయింది.

మా ఆశలపై కందసార మిల్లు ఆ విధంగా నీళ్ళు కుమ్మరించగానే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాం. నేను రైల్వేలో దూరిపోయి రాష్ట్రేతరుడిని అయిపోతే శివున్నాయుడు తన ఐటిఐ సర్టిఫికెటును నమ్ముకొని హైదరాబాద్‌ వెళ్ళిపోయాడు.

అయితే శివున్నాయుడు ఇప్పుడేం చేస్తున్నాడు’’ అని అడిగాను సూరయ్యని.

‘‘ఏటంతే ఏటి సెప్పమంతావు నాయినా. ఉజ్జోగమంతూ ఊర్లు తిరిగినాడు. ఏం ఉజ్జోగము? ఓ తిరమా? – పాడా? సమురు తక్కువ సాకిరీ ఎక్కువ. పెళ్ళాం పిల్లల్తో మనూరు పారొచ్చినాడు. యాపారమన్నాడు. అరసాడు రెడ్డోళ్ళ బావుతో జతకలిసి ధాన్య మేపారం సేసినారు. దరల్తగ్గినాయి. సేతి సమురొగ్గీసింది. నార యాపారమన్నాడు. సాహుకారి సత్తెం ఎనకాల తిరిగినాడు. సాహుకారెప్పుడైనా నాబాలు సూపిత్తాడా? అదీ అయిపోయింది. బాంకీల అప్పులుసేసి బండి ఎడ్లుకొని ఇప్పుడు సంతలకి తిప్పుతున్నాడు. ఇది ఇప్పుడీ పెళయ మొచ్చింది. బేంకోళ్ళు బండి బక్కల్ని జప్తు సేత్తామని కూకున్నారు. ఏటవుద్దో ఏటో?’’ సూరయ్య ఆశగా ఊరి వంక చూస్తున్నాడు.

పెద్ద పెద్ద అంగలు వేసుకంటూ గుంపస్వామి వస్తున్నాడు. ‘‘ఏటయిందో ఏటో? ఆడింత బేగి పారొత్తన్నాడు. ఆడిమాట ఇన్నారో నేదో? ఓలమ్మ నానేటి సేయడమో?’’ తనలో తానే గట్టిగా గొణుక్కుంటున్నాడు సూరయ్య.

‘‘ఏటిబావూ! ఈ అన్నాయము. అప్పులుండొచ్చు. నాను కాదన్ను. కానయితే అడగడానికి ఏలాపాలా పద్దా? రైతుకాడ గింజలలికిర్లో డబ్బులుంతాయి నిజమే. అయితే గింజలు నూర్చాల. అమ్మాల. సాహుకారి సొమ్ములియ్యాల. అవేటి అక్కడనేదేటి? ఇప్పుడు కాకపోతే మరెప్పుడో కడతావంతాడు? బేంకి కాడకొచ్చినప్పుడు అయ్యా బావూ అనే వోడికి ఇప్పుడేటిలా మాట్లాడతావంతాడు. ‘మా కట్టము సుకము ఇనుకోవా?’ అంతే డబ్బులు కట్టేయి తరువాత ఇంతానంటాడు. కాలికేత్తే ఏలికి ఏలికేత్తే కాలికి మాట. సొరనిత్యన్నాడా?’’

‘ఎవర్రా అది? నువ్వెళ్ళిన పని ఏంటయింది’’ అన్నాను గుంపస్వామితో.

‘‘అవున్రా అయ్యా! ఏటయినాదిరా? నీ మాటిన్నారా? మా బక్కల్ని ఒగ్గేసినారా? ఆత్రంగా అడిగాడు సూరయ్య.

‘‘ఏటయి పోనేదు. నీకేటి బెంగనేదులే. సిన్నబావుని తెచ్చినాను. బేంకోల్లకి బోదపరిచినాము. మరేటి నేదులే’’ సూరయ్యని సమాధాన పరిచాడు గుంపస్వామి.

‘‘కొత్తగా పచ్చినాడు బావూ ఆయాపీసరు. డబ్బు కడతావా సత్తావా? అంతాడు. మనమాట సొరనివ్వడు. అప్పుడు నాయుడోరి కొత్త సెడ్డు కాడికి పరిగెత్తి నాయుడు తమ్ముడు నేడా ‘సినబావు’ అంతారు. అతగాన్ని ఉన్న పళంగా లాక్కొచ్చినాను.’’

‘‘బావూ! అదేటి మాయ సేసినాడో మంత్రమే ఏసినాడో గాని అతగాడు సెప్పినాడంతే బేంకోళ్ళు కట్టిపారేసేరు. ఈ మూడూళ్ళు మొత్తం మీన ఆ అతగాని మాట ఏదవాక్కు. ‘ఈడికి లోనియ్యాల’ అంతే. ఆడికేటుందని గాని దేనిమీద ఇయ్యాలని గాని నేదు. ఇచ్చీవలసిందే. బూమి అడంగులు కావాల? గుండ రసీదులు కావాలా? తోటలు ఏసినట్లు బుజువులు కావాలా? బేంకోళ్ళ కేటికావాలన్నా చినబావు సిటికలో తెత్తాడు. అతగాను కనుక నేకపోతే బేంకిల లోను పుట్టదు. అందుకే అతగాను నేకుండా బేంకల కెల్లం. లోనయింతరువాత అతగానికి ఐదొందలు. బేంకోల్లకి పార్టీ. అదీ కండీసను. సబ్సిడీ లంతాడు అవంతాడు ఇవంతాడు అన్నీ అతగానికే తెలుసు.

‘‘అతగాడొచ్చినాడు. ఏదో ఒకటి సేసి శివున్నాయుడి లోను వోయిదాలు కట్టేత్తాడని నచ్చ చెప్పినాడు. ఈ గింజలికిర్లోనే డబ్బులు వసూలు సేసేద్దామని హామీలిచ్చినాడు. ముమ్మిరి పనులు అని ఎవురికీ తీరిక లేదని ఇల్ల కాడెవురూ దొరకరని ఆళ్ళకి సెప్పి పంపీసినాడు.’’

‘‘సాహుకార్నాగే బేంకోళ్ళు కూడా పెద్ద పండుగ ముందే పచ్చి పడిపోతే ఎలాగవుద్ది? ఆళ్ళకి ఎప్పుడు కడితే ఏటిపోతాది కనుక’’ అన్నాడు మరొకాయన.

‘‘బావూ నాకు తెలవకడుగుతాను. మావు కడితే ఎంత? కట్టక పోతే ఎంత? నచ్చలు నచ్చలు వోడు కున్నోళ్ళున్నారు. ఆల్లనోపాలి గట్టి గడిగితే బావుండును గావాలి? ‘‘అనాదోడి పెళ్ళాం ఊరందరికీ పరసే’ అన్నట్టుగుంది’’ గుంపస్వామి వ్యాఖ్యానం.

‘‘నాయినా ఆ సుగరు పేట్రేకి నచ్చలు నచ్చలు బేంకు లప్పులిచ్చినాయి. ఏళ్ళు పూళ్ళు గడిచిపోతున్నాయి. ఒక్క పైసా వసూలు సేసినారా? ఒక్కో సుట్టు అతగాన్ని నిలేసి అడిగినారా? నేదేÑ బండికి ఒక్కకి ఐదేలు అప్పిచ్చి మమ్మల్ని సతాయిత్తన్నారు. తేపతేపకి మా ఇంటిమీన పడిపోయి కక్కుతావా? సత్తావా? అని పీకల మీన కూకుంతన్నారు. ఏటీ నాయము? ఏటీ దరమమూ?’’ సూరయ్య వాపోయాడు.

‘‘సుగరు పేట్రీవోడు ఐపీ పెట్టేసినాడ్రా. ఆడి కేటుంది ఇచ్చీడానికి. ఆడ్నెవురూ ఏటీ సెయ్యనేరు.’’

‘‘ఆడి కాడేటీ నేకపోవడమేటి? పట్నంకాడ ఆడి మేడలు, మిద్దెలు, ఆడోళ్ళు మెడనిండా బంగారమూ, కార్లు, నౌకర్లు – సాకర్లు అతగాడు బంగారు పిచ్చుక. ఐపీ ఎట్టేసినానని గవుర్నమెంటోడి నెత్తిన కొంగేసినాడు గాని … ఆడికేటి తక్కువ నేదు’ అన్నాడు గుంపస్వామి.

‘‘ఊరు మీన ఊరొచ్చి పడినా కరణం మీన కాసుపడదంతారే’ అలాగ ఎటునుంచీ ఎటుపచ్చినా మనలాంటోళ్ళకే గాని పెద్దోళ్ళ కేటికాదు. ఆళ్ళకీ ఆళ్ళకీ లోపాయకారీ ఎవ్వారాలుంతాయి. అంతా సక్కగా సద్దుకొంటారు. కట్టబడిన – నట్టపోయినా మద్దిల మనవే’’ తేల్చేస్తాడు వేరొకాయన.

‘‘నిజమేర్రా! వాళ్ళన్న దాంట్లో తప్పు లేదు. పెద్దవాళ్ళ దగ్గర బ్యాంకులు చేతులు కట్టుకొనే నిలబడతాయి. నిలదీసి అడగడానికి దమ్ములు చాలవు. కానీ మనలాంటి మధ్య తరగతి మానవుల దగ్గర వాళ్ళు జులుం ప్రదర్శిస్తారు. జప్తులుచేసి జరీమానాలు వేసి నానా రభసా చేస్తారు. ఎందుకంటే ఎదురు తిరిగే శక్తి మనకుండదని వాళ్ళకి తెలుసు. అతి తక్కువ వడ్డీలకు కోట్లు, కోట్లు కంపెనీలకు కుమ్మరిస్తారు. ఏ కంపెనీ ఎప్పుడు బోర్డు తిప్పేస్తుందో, ఆ డబ్బు వసూలయ్యేది ఎప్పుడో ఎవరికీ తెలీదు. మన ఊరి పంచదార మిల్లే మనకు సాక్ష్యం. అయినా బ్యాంకులు దాచుకోడానికి కాదు. పెద్దాళ్ళు దోచుకోడానికి పెట్టారు’’ అన్నాడు నాతో మా ఊరి వాడు.

పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తల ఆలోచనా సరళిని ఈ పల్లెటూరి గబ్బిలాయులు హేళన చేస్తున్న వైనం నాకు నవ్వు తెప్పించింది. కానీ ఆర్థిక రంగంలో ఉవ్వెత్తున లేస్తున్న అపశ్రుతుల తరంగాలు ఈ హేళనకి వంతపాడుతుంటే … కాదనగలనా?

కడుపు కట్టుకొని నాలుగు డబ్బులు దాచుకొందామంటే వడ్డీ రేట్లు దారుణంగా తగ్గించి దోచుకొంటున్న బ్యాంకులు. కంపెనీలకు కోట్లు కుమ్మరించి చేతులు కాల్చుకొంటున్న వాటివైనం బినామీ బ్రోకర్ల చేతుల్లో చిక్కి విలవిల లాడుతున్న వాటి విన్యాసం గుర్తొచ్చి ‘అయ్యో’ అనుకొన్నాను మరోసారి. *