ఏటి ఒడ్డున

ఏటవాలుగా రెక్క విప్పిన నీటికొంగలా
మధ్యాహ్నం ఏటి పై నెమ్మదిగా పరచుకుంటుంది.
రాత్రి వానలో రాలిన స్వప్నాలను నెమరువేస్తూ
ధ్యానముద్రలో మునిగిన యోగుల్లా
పూర్తిగా తడి ఆరని జటాజూటాలతో
చెట్లు ఒంటికాలిపై నిశ్చలంగా నిలబడతాయి.

ఏటి ఒడ్డున
పచ్చని ఆకుల పట్టుగొడుగుల క్రింద
సగం తెరిచిన పుస్తకాలతో నువ్వూ, నేనూ
ఓ అలౌకిక రసాస్వాదనలో మునిగిన సహ గాయకుల్లా
నులివెచ్చని మధ్యాహ్నపు స్పర్శను అనుభవిస్తూ
చిత్తరువుల్లా మిగిలిపోతాము.

అప్పుడప్పుడూ గలగలపారే ఆలోచనల సవ్వడి కూడా లేకుండా
కాలం నా కనురెప్పల క్రింద మాగన్నుగా ఒదిగిపోతుంది.
ప్రక్కనే కాన్వాస్ మీద తడి ఆరని బ్రష్ కొనలలో
ఓ అనావిష్కృత సౌందర్యం అందమైన రహస్యం లా మెరుస్తుంది.

సాయంత్రమవగానే
చెట్లకొమ్మల్లోంచి దానిమ్మ పువ్వులా జారిపడి
నీటిపై మెరిసే సంధ్యాకాశాన్ని,
ఏటిపై పగడాల దండలై ప్రవహించే జలతారు సంగీతాన్ని,
చెట్లక్రింద వెలుగు నీడలతో దోబూచులాడే
చల్లగాలి చిరుమువ్వల సవ్వడిని,
పిక్నిక్ బాస్కెట్ లో సర్దేసి
మళ్ళీ మన రణగొణ ధ్వనుల యాంత్రిక దినచర్య లోకి
డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము .

ఓ మధురమైన మధ్యాహ్నపు స్మృతి మాత్రం
మనల్ని అగరొత్తుల పరిమళంలా ఆవరించి
వెంటాడుతూనే ఉంటుంది.


రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...