వెతలే వెతుకులాట

తాడు కోసం వెతుకుతుంటే
బొంగరం దొరికింది
బొంగరం గుక్కపెడితే
గొంతు బొంగురుపోయింది

గొంతు పగిలి
తాడు బిగుసుకొని
మెడ సాగింది
కాళ్ళ కానని నేల

నేల మీద నలికెల పాము
పాముల నర్సయ్య ఇంట్లో
గుడ్డు పులుసు
వెదురు బుట్టకింద
కోళ్ళ సంత

కొబ్బరిపీచుతో ఉరి
పెంకుల కపాలమోక్షం

రహస్యానికి రాత్రేమిటి?
పగలేమిటి?

అసురసంధ్య వేళ
ఎల్లెడలా రక్తం
తుడిచేసినా
చెరగని భక్తిమరక

దేవతల లీలావతి గణితంలో
పితృ హంతకుడు ప్రహ్లాదుడు


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...