మలిసంధ్యవేళ

1

ఆమె రాయమంటుంది కొన్ని అక్షరాలు
ఎన్ని రాస్తే
సడిచేయని వెన్నెల పాదముద్రలవుతాయి
వానచినుకు నేలపై తెరిచిన వృత్తాలవుతాయి
పోనీ, సీతాకోక ఎగిరిపోగా మిగిలిన ఖాళీలవుతాయి
అంటావు నువ్వు

2

పలకమంటుంది కొన్ని పదాలు
ఎన్ని పలికితే
జీవనసారంలోంచి పూవులా విచ్చుకొనే చిరునవ్వులవుతాయి
దుఃఖపుశిల చెమరించి రాల్చిన కన్నీరవుతాయి
మన స్పర్శలో మేలుకొనే దయాపూర్ణ లోకాలవుతాయి
అనుకొంటావు

3

ఊరికే కూర్చుందామా ప్రక్కప్రక్కన కాసేపు అంటుంది
ఎన్ని యుగాలు కూర్చుంటే మన తనివి తీరుతుంది
ఎంత సమీపిస్తే మనమధ్య వెలితి నిండుతుంది
ఏనాటి వేసవిగాడ్పు మనని విడదీయక వెళ్ళిపోతుంది
అనిపిస్తుంది నీకు

4

ఆమె తన లోపలికి వెళుతూ
నన్ను దయగా నా లోపలికి ప్రవేశపెడుతుంది
పచ్చిక మైదానంపైన నక్షత్రాలు మెరుస్తున్నాయి
ఇద్దరమూ లేని ప్రశాంతి చలిగాలిలా అలముకొంది

బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ...