ఉత్సాహానికి దూరంగా…

ఉన్నట్లుండి నీ ఉత్సాహం జారిపోతుంది
పూలలోని రంగులు జారిపోయినట్టు
ఇంద్రధనువులోని కాంతి మాయమైనట్లు
మధురమైన భావనేదో మరపులోకి కృంగినట్లు

ఉన్నట్లుండి లోకం చేతులు విడిచి
ఏకాంతంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది
మెలకువలోనే నిద్రపోతున్నంత
ఖాళీగా ఉండిపోవాలనిపిస్తుంది

వాన చివరి చెమ్మగాలివంటి నిర్వేదం
మిణుగురు చుట్టూ ముసిరిన రాత్రిలాంటి నిరాశ
దేనినీ మొదలు పెట్టనీయని, ముగించనీయని
వెలిగీ వెలగని దీపం లాంటి ఒంటరితనం
నిన్ను నీ ప్రక్క లాలనగా కూర్చోబెడతాయి

నీకు నువ్వే స్నేహితుడివి, ప్రియురాలివి అప్పుడు
రేకుల మీది ఉదయపు కాంతిలా, గాలిలా
లాలనగా నిన్ను తాకబోతున్న
ప్రపంచానికి ఎడంగా జరుగుతుంటావు

బహుశా, అప్పుడు
బిడ్డ కోపగించిన తల్లిని దూరం నుండి చూస్తున్నట్టు
జీవితం దూరంగా నిలిచి నిన్ను చూస్తూ వుంటుంది.


బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ...