ఒక సందర్భం

నువ్వు నడవటం కావచ్చు,
మాట్లాడటం కావచ్చు
నిన్ను వారో, వారిని నువ్వో
కలవటమో, కలవలేకపోవటమో కావచ్చు
సందర్భం ఒక రహస్యం

ఏదైనా పని జరగటమో, జరగకపోవటమో కావచ్చు
యుద్ధమో, వర్షమో, రోగమో
మానవజాతిని ఆవరించటం కావచ్చు
ఊరకనే పత్రిక తెరచి, మూయటమో
ఏమీ తోచక ఏదో ఒకటి ఊహించటమో కావచ్చు
సందర్భం అగాధమైన సముద్రం

ఫలంలో దాగిన బీజాల్లా
బీజాల్లో దాగిన ఆగామి కాలపు వృక్షాల్లా
ఒక సందర్భంలో ఏవి దాగి ఉన్నాయో
దాగినవాటిలో ఏయే జీవనరహస్యాలు
ఫలించటానికి ఎదురుచూస్తున్నాయో
ఊహకి అందదు

సందర్భమేమైనా కానీ
ఇష్టమైన ద్రవమేదో ప్రతిబిందువూ త్రాగినట్టు
దానిని ఆస్వాదించినపుడు,
హాయినిచ్చే సంగీతం విన్నట్లు
శ్రద్ధగా దానిలోకి మునిగినపుడు,
ప్రియమైన వ్యక్తి స్పర్శలోకి నిన్ను కోల్పోయినట్లు
దానిలో ఊరట పొందినపుడు

సందర్భాల రహస్యమేదో
చీకటిలో చంద్రోదయమైనట్టు నీలో ప్రకాశిస్తుంది
జీవితం చిరునవ్వు నవ్వినట్టు
ముఖంపై తెలియరాని వెన్నెల సంచరిస్తుంది


బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ...