సంభాషణలు ఆగిపోయాయి
టెలిఫోన్ తీగ తెగిపోయింది
వలలు వందిమాగధులు
వాడుకుంటున్నారు
అంతర్నేత్రం మూసుకుపోయింది
మకిలి పట్టిన పాత్రల్లో
మనుషులు బతుకుతున్నారు
తెరమీద బొమ్మలే
తెరలు చింపుతున్నాయి
చిటికెన వ్రేలు
చితికిపోయింది
బొటనవేలు
కుడిచి కుడిచి
నానిపోయింది
కనిపించకుండా
పోవడానికి ముందర
సరస్వతి ఒట్టిపోయింది
నాగరికత ముసుగులో
చీకటికి బట్టల్లేవు
వెలుగే లేనప్పుడు
ముఖం ఎవరు చూసేరు
వెంట్రుకల మధ్య
గోదావరి
తీగ తెగిపోయింది
భగవద్గీత వినడానికి
అస్త్ర సన్యాసమే
చేయక్కరలేదు
భ్రాతృహననాన్ని
ఎదిరిస్తే చాలు
సముద్రాన్ని తలుచుకుంటే
ఉప్పు ఉవ్విళ్లూరుతోంది
ఆడుతున్న నాలుకతో
గొంతు తడుస్తోంది
సంభాషణలు
ఎప్పటికైనా మొదలవుతాయి
పెదాలు తపనతో కదలాలి
బిగుసుకున్న చర్మం విచ్చుకోవాలి
ఎముకలు కొరుక్కునే కాలం
ఎల్లకాలం మంచుముద్దులు పెట్టదు
శిఖరారోహణ సమయంలో
జాగ్రత్త అవసరం
తెచ్చుకున్న జెండా
సకాలంలో ఎగరెయాలి
తమిస్ర సహస్రాలు గడిచేక
సహస్రకిరణాల సవితృ దర్శనం
శాంతి మంత్రానికి
సమయం వస్తుంది
భాష కొత్త రంగులేసుకుంటుంది
పతితపత్రాలలో
పాత విత్తనాలు
చిటపటలాడతాయి
వలల్ని విసరడం కళ
అల్చిప్పలు తీరం మీదే దొరుకుతాయి
ముత్యాలకోసం లోతుకు దిగాలి
మత్స్య కూర్మ వరాహాలు
నీటికి, నేలకి
సంబంధబాంధవ్యాలని
గుర్తు చేస్తాయి
గాలి అజరామర గీతాన్ని
వెదురుగొంతులో పాడుతుంది
మడ అడవుల్లో
నీటిగొడుగు విచ్చుకుంటుంది
వేళ్ళు కాళ్ళై మనిషి చెట్టు నడుస్తుంది
వసంతం ప్రతి ఏడూ తప్పక వస్తుంది.
“నిద్దుర చీకటి వెలుపల
వేకువ మెలకువ పుట్టును!”
(ఆఖరి రెండు వాక్యాలు సోమసుందర్ కవితలోవి — రచయిత).
