1.
తట్టి లేపిన ఉదయం
మాటల ఎండ మధ్యాహ్నం
రంగుల పరిహాసం సాయంత్రం
రాత్రే, ఎటూ తేలకుండా ఉంది!
2.
కోకిల పాట వినిపించి
తురాయి చెట్టు పూసింది
జాజుల వాసన తగిలి
ఆమె జడ అల్లుకుంటోంది
ఇంద్రధనుస్సు రెక్కలమీద
కొంగలు బారు కట్టేయి
సముద్రం కోసం కావ్యమంతా
వెతుకుతున్నాడు చంద్రుడు
3.
చిరు చీకట్లవేళ
అందరికీ దూరంగా
గుసగుసలాడదామని
రమ్మన్నాను
కానీ
ఇక్కడంతా వేయి దీపాల వెలుగు
ఇంకేం మాట్లాడతాను
చూస్తూ ఉండడం తప్ప!