షేమ్.. షేమ్.. పప్పీ షేమ్!
ఈ మధ్య ప్రముఖ కథా నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారితో కలిసి హైదరాబాదు నగరంలో ఓ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో ఆయనో ప్రశ్న వేశారు.
“నగరంలో ఉండే ఇంత వైవిధ్యమైన, సంక్లిష్టమైన జీవితాలపై కథలెందుకు ఎక్కువగా రావటం లేదు?”
ఆలోచిస్తే నిజమేననిపించింది. పల్లెటూళ్ళు, పట్టణాలు; అక్కడ వేగంగా మారుతున్న పరిణామాలపై వచ్చినంత విస్తృతంగా నగరజీవితం కథల్లో రికార్డు కావటం లేదేమోననిపించింది. ఆ చర్చ తర్వాత దేశరాజు కథాసంపుటి షేమ్.. షేమ్.. పప్పీ షేమ్! నా చేతికొచ్చింది. ఆవురావుమంటూ 18 కథలూ చదివేశాను. సన్నపురెడ్డిగారి ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ సంపుటిలో దాదాపు అన్ని కథల్లోనూ నగరజీవితమే ఆవిష్కృతమైంది. బ్రేకింగ్ న్యూస్ కథాసంపుటి తర్వాత మరో కథాగుచ్ఛంతో పాఠకుల దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు దేశరాజు. ఇరుకిరుకు ఇళ్ళు, అగ్గిపెట్టెల్లాంటి అపార్టుమెంట్లు, ఆకాశమెత్తున కనిపించే గేటెడ్ కమ్యూనిటీ టవర్లు; వాటిల్లో జీవితాలు సాగించే మనుషులు ఈ కథల్నిండా కనిపిస్తారు. ఆర్థికంగా మరింత బలం పుంజుకునేందుకు, ఉద్యోగాల్లో ఉన్నతి సాధించేందుకు, సంసారాల్ని చక్కదిద్దుకునేందుకు నగరవేదికపై నిత్యం నృత్యం చేసే పాత్రలు మన ముందు ప్రత్యక్షమవుతాయి. విపరీత మనస్తత్వమున్న మనుషులు, స్వోత్కర్షను సోగ్గా అలంకరించుకుని తిరిగే మహిళలు, రేప్‌ను మించిన భౌతికదాడుల నుంచి తమను తాము రక్షించుకోక తప్పని యువతులే కాదు; ధైర్యాన్నే ప్రధానావయవంగా ధరించి తిరిగే వ్యక్తులు, హక్కుల కోసం సంచలన రీతిలో నిరసన తెలిపే అమ్మాయిలు, వ్యాపారంలోనూ మానవీయ సంబంధాలు ఉండాలని నిరూపించే చిరువ్యాపారులు సరికొత్తగా మనల్ని పలకరిస్తారు.
పాఠకుణ్ని కథల్లోకి లాక్కెళ్ళటానికి ప్రతి రచయితకూ తనదైన ఓ మంత్రదండం ఉండాలి. దేశరాజు సొంతం చేసుకున్న ఆ మంత్రదండం: శైలి. ఉపోద్ఘాతం లేకుండా సరళసుందరమైన వాక్యాలతో నేరుగా కథను ప్రారంభిస్తాడు. సంపుటిలో మొదటి కథ ‘కమ్యూనిస్టు భార్య’లోని మొదటి వాక్యంలోనే ఆ విద్యను ప్రదర్శించాడు: ‘భార్యలందరిలోకీ పతివ్రతా శిరోమణి ఎవరూ అంటే కమ్యూనిస్టు భార్యేనని కొడవటిగంటి కుటుంబరావు ఎందుకు చెప్పలేదో ఆమెకు అర్థం కావడం లేదు.’ ఈ వాక్యం చదివిన పాఠకుడు బుడుంగున ఆ కథలో మునిగిపోకుండా ఉండగలడా! అలా మొదలైన ఆ భార్యగారి అంతరంగ విన్యాసాలు కథ పొడవునా మనముందు ఆశ్చర్యార్థకాలను వేలాడదీస్తూ ఉంటాయి.
పార్టీలో పనిచేసిన ఓ స్నేహితురాలింటికి చాలా కాలం తర్వాత వెళ్తుంది ఆ భార్యామణి. ఆనాడు హక్కుల కోసం గర్జించిన స్నేహితురాలు ఇప్పుడు వైభోగాల మధ్య జీవించటాన్ని జీర్ణించుకోలేకపోతుంది. గోడల మీద పెయింటింగ్స్, హాలులో చెక్క, రాతి శిల్పాలు, అందమైన ఫాల్స్ సీలింగ్, ఈశాన్యంలో కొలువైన గణపతి బొమ్మ… వ్యాపారం చేస్తున్న భర్త, రెండు కార్లు… ‘ప్రతి దానికీ స్త్రీల హక్కులు, అధికారాలు, ఆత్మవిశ్వాసం అనే మనిషి అంత మామూలు ఇల్లాలిలా ఎలా మారిపోయింది?’ అని బోలెడు ఆశ్చర్యపోతుంది మన నాయకి. ‘మన అనుకున్న వాళ్ళను తన భర్త రేంజ్ రోవర్‌లోనే డ్రాప్ చేస్తా’డని స్నేహితురాలు చెప్పటం… ఫెమినిజంపై చర్చలు జరిపిన యువతి ఇప్పుడు ‘ఇలా అయితే అతనికి నచ్చదు, అలా అయితేనే అతనికి ఇష్టం’ అని భర్తకు మడుగులు ఒత్తటం… మరోవంక ఇప్పటికీ సిద్ధాంతాల గురించి మాట్లాడటం, రాయటం వింతగా అనిపిస్తుంది.
ఉపన్యాసాల జోలికి వెళ్ళకపోయినా, నాయకి భర్త ఆచరణలో పాటించే చిత్తశుద్ధిని (ఆమె తను చేద్దామనుకున్నదే చేస్తుంది. అతడు మాత్రం ఆమెను అడిగి చేస్తాడు) అంతర్లీనంగా కథలో భాగం చేయటం రచయిత ప్రతిభ.
సున్నితమైన ఇదే అంశాన్ని ‘తాబేళ్ళు’ కథలో రచయితలైన ‘భార్యాభర్తల చేతల’ ద్వారానూ భలే విశ్లేషించాడు. కొడుక్కి జ్వరంగా ఉందని చెప్పినా స్పందించని భర్తతో ‘నాకు మాత్రమే కొడుకు కదా వాడు, అందుకని నేను మాత్రమే కంగారు పడతా. నువ్వు మాత్రం హాయిగా, కులాసాగా కబుర్లు చెప్పకుంటూ కూర్చో’ అంటుంది. దానికతను అంతే వ్యంగ్యంగా సమాధానమిస్తాడు.
‘వాళ్ళుండేది మూడు గదుల ఇల్లు. అందులో మొదటి దాన్ని గది అనడానికి వీల్లేదు. ఓ పక్కగా చిన్న చెప్పుల స్టాండూ, ఆ పక్కన గ్యాస్ సిలిండర్, అక్కడే పాత పేపర్లు, ఎవరైనా వస్తే కూర్చోవడానికి అన్నట్లు ఓ పాత కుర్చీ. వీటి మధ్యే పిల్లాడి ఆటసామాను. ఆ తర్వాత ఒక గది, దాని తరువాత వంటిల్లు. ఈ రెండు గదులూ సమానంగా వుంటాయి.’ ఈ కథలోని ‘భార్య’ కూడా తన స్నేహితురాలి ఖరీదైన ఇంటిని చూసి తన ఇరుకింటిపై అయిష్టత పెంచుకుంటుంది. పగలు గొడవ పడినా, రాత్రికి ఒక్కటై ‘వాళ్ళకంటే మనం తక్కువ సుఖంగా వున్నాం కాబట్టి, మన రచనల్లో కాస్త ఆవేశం ఎక్కువ కనపడొచ్చు. కానీ, అందుకోసం ఇలా పేదగా మిగిలిపోవాలా మనం?’ అని ఆమె భర్తలో ‘ఆలోచన’ రేకెత్తిస్తుంది. ఆ తర్వాత రుతువులు మారి, వాళ్ళ జీతాలు పైపైకి పాకుతాయి. ఆమె ఆహార్యం మారుతుంది. అతని దృష్టి రియల్ ఎస్టేటుపై పడుతుంది. ‘ఆ విధమ్ముగా, వీరు కూడా జనజీనవ స్రవంతిలో కలిసిన’ వైనాన్ని వ్యంగ్యభావగంభీరంగా ఆవిష్కరించాడు దేశరాజు.
ఇంతకీ సుఖం అంటే ఏమిటి? ఇదే ప్రశ్నను ‘సుఖం’ కథలోని నాయకుడు ఓ బైరాగిని అడుగుతాడు. కాళ్ళచెప్పులక్కూడా కాసుల్లేక అల్లాడిన అతగాడు కష్టపడి కాలిఫోర్నియా వెళ్తాడు. బాగా సంపాదిస్తాడు. ఇండియాలో ఫ్లాట్లు, ప్లాట్లు కొంటాడు. సహాయం కోసం బంధువులు ‘మీద పడకుండా’ జాగ్రత్త పడతాడు. అతని భార్య ఆధునికంగా ‘జీవించటానికి’ శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. ఆఖరికి పనిమనిషిపైనా అక్కసు తీర్చుకోకుండా ఉండలేని కృషి. ఇద్దరూ ఇండియాకి తిరిగొస్తారు. బంధువులెవ్వరూ అతన్ని ఖాతరు చేయరు. కూటికి లేనివారు సైతం ఆమెను ‘నోరెళ్ళబెట్టి’ చూడరు. ఇద్దరిలోనూ భరించలేని ఉక్రోషం. డబ్బుంది. ఆస్తులున్నాయి. ఇంకా సంపాదించగల ప్రణాళికలున్నాయి. కానీ, సుఖం లేదు. సంతోషం లేదు. నెమ్మది లేదు. మొహాల్లో నవ్వుల్లేవు. అదిగో, అప్పుడు అడుగుతాడు బైరాగిని ఆ ప్రశ్న. బైరాగి ఏం చెప్పాడు? వారికి సుఖం చిరునామా దొరికిందా? విస్తుగొలిపే వాక్యనిర్మాణంతో ఈ కథను పరుగులు తీయించాడు రచయిత.
‘నెంబర్ లాక్’ లోని భార్యాభర్తల మధ్య కూడా సుఖం అదృశ్యరూపిణే. ఇద్దరూ ఉద్యోగ విరమణ చేశారు. విశ్రాంత జీవితం గడుపుతున్నారు. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. ఈయన కూడా ఓ కవితాసంపుటిని ప్రకటించి, పేరు గడించిన సృజనశీలుడే. లేటు వయసులో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. పెరగదు; ఆయనే పెంచుకుంటాడు. వాట్సాప్ కాల్స్ ద్వారా ఎవరెవరో మహిళలతో అర్ధరాత్రులు సైతం మాట్లాడుతుంటాడు. ఆ తతంగాన్ని కనిపెట్టిన భార్య ముఖాముఖి నిలదీసి, కడిగేస్తుంది. తన ఫోన్ పాస్‌వర్డ్ భార్యకెలా తెలిసిందో అర్థం కాక ఆ పెద్దాయన తల పట్టుకుంటాడు. ఎలా తెలిసిందో ఆమే క్లూ ఇస్తుంది. ఆయనకు మూర్ఛ వచ్చినంత పనవుతుంది. ఆ రహస్యం తెలియాలంటే ‘నెంబర్ లాక్’ చదవాల్సిందే.
గేటెడ్ కమ్యూనిటీలోని ఓ సంసారంలో అత్తపై కోడలు ఆధిపత్యం సాధించటానికి నిరంతరం ఎదురు చూస్తూంటుంది. పనిమనిషికి కోడలు ఏదో ఇచ్చేస్తోందని, అదేమిటో తెలుసుకోవాలన్న ఆరాటంతో వెంబడించిన అత్త కాలు జారి పడినప్పుడు భారీ విజయం సాధించినట్లు కోడలు మురిసిపోతుంది. కాలు జారకపోయినా కాలం జర్రున జారిపోయి, కోడలు కాస్తా అత్త పాత్రలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏమైందో వివరించే కథ ‘అత్త-కోడలు-అత్త.’
‘స్ఫూర్తి’ కథలోని అత్త క్షణం ఖాళీగా ఉండదు. రకరకాల వంటకాలతో అపార్టుమెంటులోని ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంటుంది. అదే ఆమెకో కుటుంబ పరిశ్రమలా మారుతుంది. ఆమె చేసిన చేగోడీలు తిన్న కోడలు అత్తను ఆత్మీయంగా కౌగిలించుకుంటుంది. ముసలితనానికీ కష్టపడటానికీ సంబంధం లేదంటూ ఆ ‘చేగోడీల మామ్మగారు’ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు. ‘చేయీ కాలూ ఆడినన్నాళ్ళూ చేతనైన పని చేసుకుంటూ పోవడమే ముసలితనానికి విరుగుడు’ అని రచయిత ఈ కథ ద్వారా సందేశమిస్తున్నాడు.
సంపుటిలో సంచలనాత్మకంగా కనిపించే రెండు కథలు: ‘షేమ్.. షేమ.. పప్పీ షేమ్!’, ‘రేప్… యాప్!’
కూతురంటే పిచ్చిప్రేమ ఉన్న ఓ తండ్రికి ఇప్పుడు ఆమె చేసిన పనికి పిచ్చెక్కిపోతుంది. ఘోరమైన అవమానం జరిగినట్లు మద్యంలో మునకలేస్తుంటాడు. ఫేస్‌బుక్‌లో కూతురు నడిపే ‘షేమ్.. షేమ్.. పప్పీ షేమ్!’ పేజీకి అమ్మాయిల మద్దతు వరదలై పారుతుంది. ఇంతకీ ఆ పాప లక్ష్యం ఏమిటి? ఇంట్లోంచి అడుగు బయట పెడితే, అమ్మాయిలకు టాయిలెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవటం ఆమెను కుంగదీస్తుంది. అబ్బాయిలు మాత్రం యథేచ్ఛగా రోడ్ల పక్కనే పని కానిస్తున్న దృశ్యాలు ఆమెను బాగా డిస్టర్బ్ చేస్తాయి. అసలు, బాల్యం నుంచి పెంపకంలోనూ దుస్తుల విషయంలోనూ ఇంకా అనేక అంశాల్లో బాలబాలికల మధ్య తల్లిదండ్రులు చూపే భేదభావం పట్ల ఆమె మనసులో కసి పెరిగిపోతుంది. ఆ కసిలోంచే ఓ విప్లవాత్మకమైన ఆలోచన పురుడు పోసుకుని, ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్షమవుతుంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వివిధ కార్యాలయాల నుంచి సమూహాలుగా తరలి వచ్చిన అమ్మాయిల ఆసరాతో ఆ ఆలోచనను అమల్లో పెడుతుంది. అది దేశవ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఈ కథ చదవటం పూర్తయినా, మనం ఆ పేజీని మూసెయ్యలేం. చివరి వాక్యాల మీద గడ్డ కట్టుకుపోయిన చూపుల్ని అంత తేలిగ్గా తిరిగి సొంతం చేసుకోలేం. భౌతిక దాడి మాత్రమే రేప్ కాదని, ఆ భావనతో దూసుకొచ్చే చూపులూ చేష్టలూ మాటలతూటాలూ అత్యాచారంతో సమానమేనని చెబుతుంది ‘రేప్… యాప్!’ ఒక ప్రత్యేక టెక్నిక్‌తో రాసిన ఈ కథ ఆసాంతం మనల్ని ఉద్విగ్నపరుస్తుంది.
‘ఇగటం’, ‘సామూహిక స్వప్నం’ కథల ప్రారంభం ఒక్కటే. పల్లె క్రమంగా పెరిగిపోయి, పట్టణ వేషం ధరిస్తూ, నగర సంస్కృతిని వంట బట్టించుకుంటున్న వాతావరణ చిత్రణతో రెండు కథలూ ప్రారంభమవుతాయి. ఇతివృత్తాలు వేరు. కార్పొరేట్ మార్కెట్టు- కూరగాయలమ్మే మహిళల్ని సైతం దెబ్బ తీయటం మొదటి కథలో కనిపిస్తే; నిరాదరణలో కుంగిపోతున్న గ్రంథాలయానికి కొత్త సొబగులద్ది ప్రజలకు దగ్గర చేయాలన్న ఓ పెద్దాయన సంకల్పం రెండో కథలో వెల్లడవుతుంది.
ఓ ఇల్లాలు సూపర్ మార్కెట్టులో సరుకులన్నీ కొనుక్కొని, కూరగాయల కోసం రోడ్డు పక్కనున్న ముసలామె అంగడి (ఏళ్ళ తరబడి కూరగాయలమ్ముతున్నా ఓ లైటు కొనుక్కోగల స్థోమతను ఇవ్వలేనంత అంగడి) వద్ద ఆగుతుంది. ఆకుకూరల కట్టలు చూస్తూ ‘కట్టలు చిన్నగా ఉన్నాయి కదా, నాలుగిస్తావా?’ అంటూ బేరం మొదలెడుతుంది. దానికా కూరగాయలమ్మికి తిక్క రేగుతుంది. ‘ఓ అమ్మా. అక్కడెట్టు. పో! రిలన్స్‌కే పో. ఆడ మా లావు ఇస్తున్నారు’ అంటుంది. ఇల్లాలు అలిగి, వెళ్ళిపోతుంది. వెంటనే తేరుకున్న పెద్దావిడ బతిమాలి, మళ్ళీ పిలుస్తుంది. అక్కడ మొదలవుతుంది, వారి మధ్య ఒక ఆత్మీయ ప్రవాహం. కూరగాయలు మొగ్గుగా తూచి, అడక్కుండానే ఆకుకూర కట్ట ఒకటి ఎక్కువ వేసిన ఆ పేద వ్యాపారిపై ఇల్లాలికి ప్రేమ పుట్టుకొస్తుంది. నిజానికి, ప్రేమకు మూలం మాల్. అక్కడ అవసరమైనవీ కానివీ బుట్టల్లో నింపుకొని బిల్లు చెల్లించేందుకు గంటసేపు క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్ ఆఖర్లో బెడిసికొడుతుంది. మెంబర్‌షిప్ మీద వచ్చే పాయింట్లకు డిస్కౌంటు లభించదు. ఏ ప్రశ్న వేసినా కౌంటర్లో బాలుడు ‘అవన్నీ నాకు తెలీదు మేడమ్’ అంటూ మరబొమ్మలా పని చేస్తుంటాడు. అలాంటి చికాకు వ్యవహారాలన్నీ గుర్తుకొచ్చి కూరగాయలమ్మిపై గౌరవం పెరుగుతుంది.
‘మాల్ వాళ్ళలాగే ముసల్దానిదీ వ్యాపారమే. కానైతే, వాళ్ళలా దోచుకునే వ్యాపారం కాదు, మనసులు పంచుకునే జీవనవ్యాపకం’ అనుకుంటుందామె.
‘మనం మనం పరాసికాలాడుకున్నా ఒక తీరుంటాది. సూసావూ, ఆడు, ఆడు మనతోని అసలైన ఇగటమాడతన్నాడు. మన జీవితాలు కిందమీద సేసేత్తన్నాడు’ అంటూ మాల్ వేపు తిరిగి కాండ్రించి ఉమ్మేసిన ముసలమ్మ ద్వారా మార్కెట్టు మాయాజాలాన్ని బోధిస్తాడు రచయిత.
‘సామూహిక స్వప్నం’ కథలోని పెద్దాయన ద్వారా ఈ తరానికైనా, రేపటి తరానికైనా పుస్తకమే నిజమైన ఆస్తి అని మరో మంచి సందేశం అందించాడు దేశరాజు.
‘ద లాస్ట్ కాల్’ కథ ముగింపు ఏమిటో అర్థం కాదు. ఏ ప్రయోజనాన్ని ఆశించి రాశారో కూడా అంతుబట్టదు. ఐసీయూలో ఉన్న శ్రీమతిని కాచుకొని ఉండాలన్న కనీస బాధ్యత లేని మగానుభావుణ్ని ‘సంస్కారి’ కథలో పరిచయం చేసిన రచయిత, కాలు పోతుందేమోనన్న భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన అమ్మాయికి నిండుగా ధైర్యం నింపిన దివ్యాంగ భార్యాభర్తల్ని ‘ధైర్యాంగులు’ కథలో మనకు స్నేహితుల్లా మారుస్తాడు.
రెండు పేజీల చిన్న కథ ‘కన్ను’ లోంచి మనకో పెద్ద ప్రపంచాన్నే చూపెడతాడు. అడ్డగోలుగా డబ్బు సంపాదించే డాక్టరుకు గోల్ఫ్ బాల్ తగిలి ఎడమ కన్ను పోతుంది. మనుషుల అవయవాలతో వ్యాపారం చేస్తున్న ఆ వైద్యుడు తేలిగ్గానే ఓ ముసలాయన్ని పట్టుకొని, అతని కన్నును తనకు అమర్చుకుంటాడు. ప్రతిగా, తన భార్యను బతికించమని కాళ్ళావేళ్ళా పడిన ఆ తాత ద్వారా జీవితం విలువ తెలుసుకుంటాడు. తన కన్ను పోగానే, అక్రమాస్తులన్నిటినీ మూటగట్టుకొని ఉడాయించిన భార్య గుర్తొచ్చి, జీవితంలో తాను సంపాదించుకోలేకపోయిన మూలకమేమిటో గుర్తించి, తాతను గుండెలకు హత్తుకుంటాడు.
ఈ కథల్లోని పాత్రలకు రచయిత నామకరణం చేయకపోవటం వెనక మతలబు ఏమిటో అర్థం కాదు. నిన్నటి తరం రచయితల కథల్లోని కొన్ని పాత్రలు ఇప్పటికీ మన మనసుల్లో తమ పేర్లతో నిలిచిపోయాయి. ఇకముందైనా దేశరాజు తన పాత్రలకు పేర్లు పెడతాడని ఆశిస్తాను.
ఇవన్నీ చిన్న చిన్న కథలే. రెండు మూడైతే మరీ చిన్నవి.
క్లుప్తంగా రాయటం చేతనైన రచయితే సాగతీత లేకుండా కథ చెప్పగలడు. గాఢంగా ఆవిష్కరించగలడు. ఆ నైపుణ్యం దేశరాజులో పుష్కలంగా ఉంది. విషయాన్ని పాఠకుడి మనసులోకి నేరుగా బట్వాడా చేస్తాడు. జర్నలిస్టుగా తనకున్న సుదీర్ఘ అనుభవంతో కథనాన్ని ఆసక్తిగా తీర్చిదిద్దుతాడు. సరళమైన పదాలతో ఆకట్టుకునే వాక్యాలు ఆయన కథలకు రక్తమాంసాలు ఎక్కిస్తాయి. ఫలితంగా శైలీశిల్పాలు ఆటోమేటిగ్గా కథల్లో మఠం వేసుక్కూచుంటాయి. ఛాయ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన ఈ పుస్తకం ముఖపత్రంపై రచయిత గంభీరంగా మనవైపు చూస్తుంటాడు. అదే ప్రత్యేక ఆకర్షణ. ఈ కథాసంపుటిని తనకెంతో ప్రేరణనిచ్చిన కృష్ణాబాయి గారికి అంకితమివ్వటం హర్షణీయం.
మరిన్ని వైవిధ్యభరితమైన ఇతివృత్తాలతో, మరింత సీరియస్ కంఠస్వరంతో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత సృజనాత్మకంగా దేశరాజు ఆవిష్కరించాలని నా ఆకాంక్ష. తప్పనిసరిగా చదవాల్సిన కథాసంపుటి షేమ్.. షేమ్.. పప్పీ షేమ్!
పుస్తకం: షేమ్.. షేమ్.. పప్పీ షేమ్!
రచన: దేశరాజు
ప్రచురణ: ఛాయా ప్రచురణలు, 2022.
వెల: ₹ 150
లభ్యత: లోగిలి, ఇతర పుస్తకవిక్రయకేంద్రాలు.