గుప్పిట ప్రేమ

ప్రతి నువ్వు
ప్రతి నేను
మరులుగొన్న
ప్రతీసారీ

మంకెన పువ్వులు విచ్చే కాలం
పచ్చని ఆకులు మెరిసే కాలం
వెన్నెల పువ్వులు తురిమే కాలం
చంద్రుని చల్లని ముద్దుల కాలం
సూర్యుని వెచ్చని కౌగిలి కాలం

కాలం మారే
ప్రతిసారి
సెలవని
నేను

గాలి విసురుగానూ
నీటి సుడిగానూ
పర్వతాలని ముద్దాడి
సాగిపోయే
మబ్బు దొంతరగానూ
మారి

ప్రేమని
ఆనందాన్ని
సౌందర్యాన్ని
మోహాన్ని
నాలో
నింపుకుంటూ
సాగిపోతాను.

అప్పుడు
ప్రతి నువ్వు
నువ్వే
ప్రతి నేనూ
నేనే
ప్రేమ కాలం
ఎప్పటికీ
తర్లి పోదు.

హఠాత్తుగా
మనం
ఎదురైన
ప్రతిసారి
మన కళ్ళల్లో
తళుక్కున
అది
మెరిసి
తిరిగి
విరగ బూసి
మనల్ని
ఏకం చేస్తుంది.