పునర్జన్మ పండుగ

నిన్న అమ్మ సమాధి వద్దకు వెళ్ళాను
ఖాళీగా ఉంది
అమ్మ అక్కడ లేకపోవడం
నిర్ఘాంతపరిచినా
ఆ రాళ్ళ ఇరుకున ఊపిరాడని చోట
అమ్మ లేనందుకు సంతోషం వేసింది

సమాధి దగ్గర్లో గుప్పెడు మట్టిని తీసి
జేబులో వేసుకున్నాను
నడుస్తుంటే చెమటతో తడిచిన మట్టిలో
ఏదో కదలాడినట్టై చూస్తే
లోపల కళ్ళు పేలని విత్తనం
కవి అబద్ధం కానందుకు ఆనందమేసింది

తెచ్చిన మట్టిని పెరట్లో ఒక మూల వుంచి
నీళ్ళు పట్టి నమస్కరించాను
కొన్నాళ్ళ నిశ్శబ్దం తర్వాత
మట్టిని పాతిన చోట పచ్చగా ఒక జీవం లేచింది
గాలి వీచినప్పుడు ఆకులు ఊగుతుంటే
అమ్మ దీవిస్తున్నట్టే వుంది
పువ్వులు చీరకట్టుకున్న చెట్టును చూస్తుంటే
అమ్మ బతికొచ్చినట్టు సంబరంగా ఉంది

రాత్రుళ్ళు చందమామ కొమ్మమీద కూర్చొని
నా పిల్లలకు కథలు చెప్పడానికొస్తోంది

రేపు పిట్టలతో చెప్పాలి
సమాధి పైన వాలి దుఃఖగీతాలు కావద్దని.

సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...