భూమీ! నీకో సందేశం!

చంకన నెలపాపనెత్తుకుని
గతించిన వత్సరాన్ని తారాధూళిలో కలిపేస్తూ;
నక్షత్రాల సాలుల్లో కొత్త స్వప్నాలను విత్తుతూ;
దీర్ఘవలయాకార కక్ష్యలో
నిరంతరంగా, నిబద్ధంగా;
వయ్యారపు నడకల్లో హొయలు పోయే
ఓ నీలమణి కాంతా!
విశ్వ సంకలనంలో
నీదే గర్వించదగిన కథ!

నీ పరిణామం
సృష్టికర్త ముఖం మీద
పొడసూపే
తండ్రి మురిపెం లాంటి
కించిత్ గర్వరేఖ!

ఓ అజ్ఞాత కవి వెలువరించిన
అసంఖ్యాక నిర్జీవ ఖగోళ పంక్తులలో
ఉటంకించదగ్గ ఉదాత్తమైన సజీవ కవితా పంక్తివి నీవు !
సాధన చేసి వెలయించిన
అనేకానేక గందర గోళాల గోలలో
అనూహ్యంగా మొలకెత్తిన శ్రావ్యమైన ఆదిభూపాల రాగం నీవు!
పేరుకుపోతున్న రాళ్ళూరప్పల
రోదసీ చెదారం మధ్యన మెరిసే
మణిపూసవి నీవు!
మృణ్మయ విశ్వంలో పుట్టిన ప్రాణస్పందన నీవు!

అదిగో అక్కడ ఆ మూల!
సుదూర కాంతి వత్సరాలకవతల
విసుగే లేని గేలక్సీలు
పురానృత్యవిన్యాసకళను అలవాటుకొద్ది ప్రదర్శిస్తూవున్నాయి!
విశ్వ కేంద్రకం వెలువరించే మార్మిక సంస్పందనలు
ఆ నృత్య విభావరికి సంగీతం సమకూరుస్తున్నాయి
ఖగోళ గర్భంలోంచి
ఓ నక్షత్రం పురుడు పోసుకుని వెలుగు తరంగమై ఎగసింది!

పుట్టిన పాపకు అలంకారంగా
చేద్దామనేమో; మురిసిపోతూ
కిరణమాలికలల్లే పనిలో పడింది, కాలం!

నీ ఎడమ చెవిలో;
‘ఈ విశ్వంలో ముగింపు అనేది లేదని,
ఉన్నది ఆరంభం మాత్రమేనని!
ప్రతీ అస్తిత్వం కొత్త ప్రయాణమే అని!
మాటలు రాని సృష్టికర్తకు
తనేంటో తెలుసుకోవడానికి
నీ కడుపులో పుట్టడం వినా
మరో మార్గం లేదని!’
కాంతా! నీకో రహస్యం చెప్పనా?
గుట్టు రట్టు చేయనా!

ఈ వత్సరారంభ ఘడియలలో
నీకో సందేశం ఇస్తున్నాడు కాలపురుషుడు!
దాన్నిలా డీకోడ్ చేసి చదువుకో…

ఎప్పట్లానే పరిణమించు!
నిండుగా శ్వాసిస్తూ ఉండు!
నా నమ్మకాన్ని వమ్ము చేయని
నీ స్వరూపాన్నలాగే నిలుపుకో!
విశ్వానికంతటికీ భూమీ!
నీ ఉనికే ఒకగొప్ప ఉదాహృత గీతం!