మూడు లాంతర్లు – 9

సృజన అనుభవం విషయంలో అంగీకారం, సామరస్యం పూజనమూ కాకుండా, తిరస్కారమూ, హేళనా, తల బిరుసూ కాకుండా సంశయము, వెదుకులాట ప్రధానమైన మనఃస్థితి లేదా వైఖరి (Attitude) ఒకటి ఉంది. దీనికి ప్రాతిపదిక అటు నిర్వేదం, అనాసక్తీ, అనిశ్చిత స్థితీ, అనాలోచితమైన వ్యతిరేక భావన – అంటే Cynicism ఇవేమీ కావు; ఇటు సామరస్యం, సుహృద్భావం, పెద్దవారి యెడల భక్తీ, ఉదారవాదమూ – ఇవీ కావు. దీని గమ్యం మూల్యాంకనం, నింద, స్తుతి, అనాసక్తి – వీటన్నిటికీ ఎడంగా అనిర్ణేయకమైన వెదుకులాటతో కూడిన విచికిత్స. ఇలాంటి వివేచన ‘జవాబులు’ అయితే ఇయ్యలేదేమో గాని సమాధానం, అంటే శాంతికి తోవ చూపించగలదు. డెరిడా (Jacques Derrida) సూచించిన పద్ధతులకు ఇలాంటి సంశయం ప్రాతిపదికగా సాధించుకున్న అనిర్ణేయత ముఖ్యం. సారస్వత చర్చలో త్రిపుర వైఖరి కూడా ఇదే. (“These are all possibilities.”) ఆయన్ని చూసి చూసి నేను అనుకున్నదేమంటే ఇదివరకు ఏకరువు పెట్టిన దోషాలు – దుడుకుతనం, గీర, బుకాయింపు, దబాయింపు, పెద్దమనిషి తరహా, అసహనం, కోపం వంటి వాటిని తరచి చూసుకోడానికి ఇలాంటి అనిర్ణయాత్మకమైన వైఖరి, వెదుకులాట ఉపయోగపడతాయి. చర్చ చేసేవాళ్ళు ఇలాంటి పరిణతిని సాధించుకొని ఉన్నవాళ్ళయితే వాళ్ళ సమక్షంలో సారస్వత వాతావరణం అనిర్వచనీయము, అనుభవైక వేద్యమైన స్వస్థతతో, వివేకంతో ఉంటాయి. బెకెట్ (Samuel Beckett) దగ్గర ఇలాగుండేదట. త్రిపుర దగ్గర ఇలాగుంటుంది. నామిని ఇలాంటి వివేకాన్నే అసంకల్పితంగా, అంటే instinctiveగా ఆయనకు తప్పనిసరి అయిన ప్రతీ సందర్భంలోనూ గురి తప్పకుండా ప్రకటించుకుంటున్నారు.

లక్షణమని, సిద్ధాంతమని అంటే అవి ఏవో పెద్ద మాటల్లా ఉంటాయి గాని, వాస్తవానికి ఈ పని కనీసం పాఠకులమైన ప్రతి ఒక్కరం అనివార్యంగా చేస్తూనే ఉన్నాము. ఇతరులు నిర్మించిన లక్షణ సిద్ధాంతాల్ని కూడా ఎవరి అనుభవంతో వాళ్ళం గీటు రాసి చూసుకోవలసిందే. ఇలా చేసే ప్రయత్నంలో పాత కాలపు లక్షణ సిద్ధాంతాల కాల దోషం అడుగడుగునా స్ఫురిస్తూ ఇబ్బంది పెడుతుంది. ఉదాహరణకు ధ్వని, వక్రోక్తి వంటి లక్షణాలను అష్టవిధ నాయికల ప్రణయానుభవాలకూ, నవరస భరితమైన అనుభూతులకూ అన్వయిస్తూ చేసే చర్చ ఇప్పటి సృజనకు కొంత నప్పీ, కొంత నప్పకా అసంతృప్తిగా ఉంటుంది. కొత్త కాలపు కధల వంటి సృజనలకు పాత లక్షణ సిద్ధాంతాల్ని యదాతధంగా అన్వయం చేసే ప్రయత్నాలు ఏమంత పొసగవు. ఇంగ్లీష్‌లో రస చర్చ, సిద్ధాంతం చేసేవాళ్ళు (aesthetes) Does it satisfy me first? అనే ఈ ప్రశ్నను ఒక దిక్సూచిలా వాడుకుంటారు. కవి, పాఠకుడు, సంపాదకుడు, విమర్శకుడు వీళ్ళందరూ ముందుగా పాఠకులు కాబట్టి, సృజనను చదవటం (Reading) అనే ప్రక్రియను గురించిన తమ ‘సిద్ధాంతం’ ఏమిటో ప్రతి ఒక్కరం తప్పనిసరిగా నిర్మించుకుంటున్నాము. ఈ నిర్మాణం మన వ్యక్తిగతమైన సారస్వత సిద్ధాంతానికి ముఖ్యమైనది; దీన్ని ఇతరులు – అంటే మిగిలిన కవులు, విమర్శకులు పరిశీలించాలనీ, ఒప్పుకోవాలనీ ఆశించి, చర్చకు తీసుకొచ్చే ముందుగా అది ఏమిటో మనకంటూ స్పష్టమైన, సంతృప్తికరమైన అవగాహన ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇలాంటి స్పష్టత కోసం అనుభవం – అంటే Cognitive experience ప్రాతిపదికగా చేసే వివేచన ఉపయోగపడుతుంది.

తర్కం ఏ రంగంలోనైనా కష్టమే. లోక సబువైన నిర్ణయాల్లోనే చాల వైవిధ్యానికీ, గందరగోళానికీ ఆస్కారం ఉందే అని తార్కికుల మీమాంస. మన పద్ధతిలోన తర్క మీమాంసకి న్యాయ, వైశేషికాలని పేరు. మన తార్కికులు వితండము, జల్పము, వాదకధ అని తర్క వాదనని మూడు రకాలుగా ప్రతిపాదించేరు. వితండమంటే ప్రతివాదిని ఏదో ఒకలాగ, వెక్కిరింత, తిట్లతో సహా ఎలాంటి పద్ధతుల్నైనా వాడుకొని ఓడించి, నోరు మూయించే పద్ధతి. జల్పమంటే వాది, ప్రతివాది ఇద్దరూ తర్కబద్ధమైన పద్ధతుల్ని, మర్యాదల్నీ పాటిస్తున్నప్పటికీ వాళ్ళ ఆంతరంగికమైన సంకల్పం (Agenda) సత్యాన్వేషణ కాదు. ఎదుటివాళ్ళది ‘తప్పు తోవ’, తమదే ఒప్పు అని ముందుగానే నిశ్చయించుకొని, తమ ప్రజ్ఞంతా ఒడ్డి వాళ్ళ వాదాన్ని పూర్వ పక్షం చెయ్యటమే ఇద్దరి సంకల్పమూను. వీళ్ళ చర్చను పరికించి చూసి ఇరు వైపుల వాదాల్లోని లోపాలు, పరిమితులూ ఏమిటో ఒక అవగాహనకు రావటానికి ఉపయోగిస్తాయి. ఏ మర్యాదనూ అతిక్రమించకుండానే లౌకికంగా జయించుకుని రావడానికి ముఖ్యంగా జల్పం ఉపయోగపడుతుంది. ఈ రెంటికీ ఎడంగా వాదకధ వాదీ ప్రతివాదీ ఇద్దరూ కేవలం సత్యాన్వేషణ కోసమే తర్కబద్ధంగా నిర్వహించే వాదం. ఇలాంటి చర్చకు సదసత్సంశయం, వెదుకులాట సబబైన ప్రాతిపదికలు అవుతాయి. అంతరంగాన్ని వస్తువుగా స్వీకరించి చెయ్యవలసినవి – రస చర్చ, తత్వ చర్చ వంటివాటిలో ‘సత్యం’ అంత సుళువుగా అందివచ్చేది కాదని మన పాతకాలపు తార్కికులు గ్రహించుకున్నారు. మాస్లో (Abraham Maslow) ప్రతిపాదించిన అవసరాల్లోనివి కడపటి రెండు – సృజన, తత్వ జిజ్ఞాస – ఈ రెండూ సబ్రహ్మచారులు, అంటే ‘కజిన్స్’ అనీ, ఈ రెండింటిలో తాత్విక సత్యాన్ని గురించిన వేదాంత చర్చకు వాదకధ బొత్తిగా పనికిరాదనీ వాళ్ళు తీర్మానించేరు. చివరికి తాత్వికము, దార్శనికమైన సత్యాలు కేవలం అనుభవైకవేద్యములనీ, వాటిని నిర్ధారించటానికి అంతిమంగా వాదకధ కూడా అనువైనది కాదని ప్రతిపాదిస్తూనే, చర్చను మాత్రం ప్రోత్సహించి దార్శనిక చర్చకు పద్ధతుల్ని ప్రతిపాదించేరు. కేవలం అనుభవైకవేద్యమైన విషయాల్ని చర్చించీ ఏం ప్రయోజనమని అడిగితే అలాంటి చర్చ అనుభవాన్ని కల్గించడానికి కాదని, సూచించటానికనీ చెప్పుకొచ్చేరు.

పాశ్చాత్యుల్లో పదిహేడవ శతాబ్దపు వైజ్ఞానికుడు డెస్కార్త్ (Rene Descartes) తర్క చర్చలోని ఇబ్బందుల్నీ, లోతు పాతుల్ని గురించి Discourse on the Method అని ప్రచురించేడు. లోక వ్యవహారాల్లో రక రకాల అభిప్రాయ బేధాలకి కారణం తర్కించే పద్ధతుల్లో, వైఖరుల్లో అపోహలని ప్రతిపాదించేడు. “The important thing is to rightly apply our mind to what we are doing.” అని. ఈ తర్క పద్ధతికి నాలుగు సూత్రాల్ని ప్రతిపాదించేడు. అవి: 1. మనకి నిజమేనని, సబబు అని స్వయంగా, బలంగా తోస్తేనే తప్ప ఇతరులు చెప్పే మాటల్ని, చేసే సిద్ధాంతాన్నీ ఏ ఇతర కారణాల వలనో తొందరపడో, మొహమాటపడో ఒప్పుకోకూడదు; 2. జటిలం, సంక్లిష్టమని తోచే విషయాల్ని చిన్న చిన్న అంశాలుగా విడగొట్టుకొని వివేచన చేస్తూ మొత్త విషయాన్ని అవగాహన చేసుకోవాలి; 3. సరళంగా అర్ధమయ్యేవాటిని ముందుగా స్వీకరించి అర్ధం చేసుకుని, ఆ పిమ్మట అంతకంటె కష్టమైనవి పరిశీలించాలి; 4. ఒక చర్చకు సంబంధించిన అన్ని విషయాల్నీ సంపూర్ణంగా, కూలంకషంగా పరిశీలించి, ఏదీ విడిచిపెట్టలేదని నిర్ధారించుకున్నాక గాని ఆ విషయాన్ని గురించి నిర్ధారణలకు రాకూడదు. ఆయన ఈ సూత్రాల ప్రాతిపదికన నిర్వహించే వివేచనను The Method అన్నాడు. పరిశీలించి చూస్తే ఇవి నాలుగూ చాలా ఉపయోగపడే సూత్రాలని బోధపడుతుంది. ఈ నాలుగు సూత్రాలనూ మన్నిస్తూ ఇక్కడ లేవనెత్తిన మూడు ప్రశ్నలనూ పరామర్శించినట్లయితే పనికొస్తుంది.

కాల్పనిక సృజన అనుభవం, అంటే ఇక్కడ సృజన అనుభవం అంటూ వస్తున్నది మౌలికంగా ఆంతరంగికమైనది. అంచేతనే కవి వ్యక్తిత్వం, పాఠకుని వ్యక్తిత్వం కలిసీ, విడి విడిగానూ సృజన ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. దీనికి తోడుగా కవి, పాఠకుడూ బతుకుతున్న సమాజపు సాంస్కృతిక, రాజకీయ వ్యవస్థల ఆవరణం కూడా సృజన వ్యాసంగాన్ని ప్రభావితం చేస్తాయి. అందువలన, సృజన స్వరూపాన్ని అర్ధం చేసుకోవాలంటే ఈ మూడింటినీ – కవి మనసు, పాఠకుని మనసు, వాళ్ళు బతుకుతున్న సమాజపు సాంస్కృతిక, రాజకీయ ఆవరణం – ఈ మూడింటినీ అర్ధం చేసుకోవాలి. ఇంగ్లిష్‌లో నేటి కాలపు రస సిద్ధాంతులు ఇలాంటి పద్ధతుల్ని ఉపయోగించుకొని లక్షణ చర్చను నిర్వహిస్తున్నారు. వ్యక్తిత్వం (self) లోని వైవిధ్యానికి కారణాలను ఇప్పటి మటుక్కి స్థూలంగానైతే ప్రకృతి, సంస్కృతి (Nature, Nurture) అని అర్ధం చేసుకోవచ్చు గాని, కళ, కాల్పనిక సృజన అనుభవాన్ని గురించిన వివేచన కోసం ఈ self స్వరూపాన్ని, స్వభావాలనూ కూలంకషంగా పరామర్శించవలసి ఉంటుంది. ఆధునికులైన లక్షణకారులు, దార్శనికులు కూడా సృజన తత్వపు వివేచనకు వ్యక్తిత్వాన్ని గురించిన అవగాహన తప్పనిసరి అని నిర్ధారిస్తున్నారు. ఇదివరకు Cognitive Science అన్నది selfను గురించిన ఈ అవగాహనను చర్చలో విస్తారంగా వాడుకుంటుంది.

వ్యక్తిత్వాల్లో, సామాజిక ఆవరణంలో బేధాలు సృజన అనుభవాన్ని ఎంతో బలంగా ప్రభావితం చేస్తాయన్న ప్రతిపాదనకు నాందిగా ఒక దృష్టాంతం. నది ఒడ్డున ఇసకలో ఒక నాలుగు రాళ్ళు పడున్నాయి. ఒకతన్ని కుక్కలు తరుముతూ వెంటపెడుతున్నాయి. అతను చప్పున ఆ రాళ్ళని అందుకుని కుక్కల మీదికి విసురుతూ తప్పించుకుంటాడు. ఇంకొకతను శివ భక్తుడు. ఆ రాళ్ళని చూసి పరవశించిపోయి ‘పరమేశ్వరా!’ అని దండాలు పెడతాడు. ఇంకొకతను రంగురాళ్ళ వ్యాపారి. ఒక్కోరాయినీ పరిశీలిస్తూ తన వ్యాపారానికి ఏవి ఎక్కువ పనికొస్తాయోనని లెక్క చూసుకుంటాడు. మరొకడు ఖనిజ శాస్త్రజ్ఞుడు. తను ఇదివరకు చదువుకున్న ఖనిజ శాస్త్రం నుండి రాళ్ళ లక్షణాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క రాయీ అది ఏ జాతికి చెందిందో పరిశీలిస్తాడు. ఇంకొకడు కళాకారుడు, దృశ్య శిల్పి. ఇతను ఆ రాళ్ళు ఇసకలో అమరి ఉన్న పద్ధతిని చూసి జాపనీస్ రాక్ గార్డెన్‌ను జ్ఞప్తికి తెచ్చుకొని మురిసిపోతాడు. అవే రాళ్ళని తమ పూర్వ జ్ఞానం, తమ వ్యక్తిత్వం, పరిస్థితుల ప్రాబల్యం వలన ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా ‘రూపించుకున్నారు’. అంటే ఒకే వస్తువు వాళ్ళ అంతరంగంలో నిర్మించుకున్న రూపకం (Metaphor) బేధం వలన కుక్కల్ని కొట్టే ఆయుధంగా, భగవత్స్వరూపంగా, వ్యాపార వస్తువుగా, పరిశోధనా వస్తువుగా, కళా వస్తువుగా ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా గోచరిస్తున్నాది. దీన్లో పరిస్థితులు – అంటే సామాజిక, రాజకీయ అవసరాల ప్రభావం అనేదానికి ఉదాహరణగా – కుక్కలు గనక వెంట తరుముతుంటే మాత్రం పై ఐదుగురిలో ఏ ఒక్కరూ కూడా, తనొక కళాకారుణ్ణనీ, శాస్త్రజ్ఞుణ్ణనీ, వ్యాపారిననీ, భక్తుడిననీ ఇలా స్పృహ లేకుండా, ముందు రాళ్ళు ఏరుకుని కుక్కల్ని తరిమికొట్టే పనిలోనే పడతారు: భద్రత అందరికీ మౌలికమైన అవసరం కాబట్టి. కాల్పనిక సృజన స్వరూపాన్నీ, దాన్ని వివరించే ఇదివరకటి లక్షణ సిద్ధాంతాలనూ అర్ధం చేసుకోడానికి రూపకం, ఉపమ వంటి సాదృశ రూపాల్నీ, వాటిని స్వీకరించటంపై వ్యక్తిత్వం, సామాజిక పరిస్థితులూ చూపే ప్రభావాన్నీ అర్ధం చేసుకుంటే పనికొస్తుంది.