జీవితం ఈజీకొల్టు సమస్యల వలయం, సుడిగుండాల నిలయం, కష్టంస్ అండ్ మోర్ కష్టంస్, నిట్టూర్పులు, కోపతాపాలు, నో శాంతి ఓన్లీ అశాంతి అని తేల్చేశాడు ప్రద్యుమ్నుడు. అనుభవించేవే కష్టాలు, ఊహించుకునేవే సుఖాలు అని కూడా తీర్మానించాడు. ప్రద్యుమ్నుడికి ఈ జ్ఞానోదయం ఇప్పుడే కలిగిందా అంటే చెప్పడం కష్టం.
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అని పాడుకుంటూ, సిగరెట్టు పొగ వలయాలలో ఎవరినో ఊహించుకుంటూ, పిహెచ్. డి. చేసుకొంటూ హాయిగా రోజులు గడిపేస్తున్న సమయంలో విధి క్రూరమైనది, బలీయమైనది, తప్పించుకోజాలనిది అని గ్రహించేటప్పటికి ప్రభావతి తన మెడలో దండ వేసేసి తన చేత బలవంతంగా తన మెడలో కూడా దండ వేయించేసుకొని, పక్కకొచ్చి నుంచోని ఫోటోలకి పోజులిచ్చేసింది.
1971లో కాపురం పెట్టిన కొత్తలో నాలుగయిదు నెలలు ప్రభావతి ఆలపించిన మోహనరాగంలో పరవశించి ప్రద్యుమ్నుడు గగన విహారం చేస్తూ “బ్రతుకు వీణ పై ప్రణయ రాగములు ఆలపించినది నీవే! నీవే! నీవే!” అంటూ స్వరపేటికకు విసుగొచ్చేదాకా పాడుకొని, ఇలాతలం పైకి తిరిగి వచ్చేటప్పటికి పరిస్థితులు తారుమారయ్యాయి. చొక్కా జేబు లోని, పర్సు లోని నోట్లు అన్నీ విచిత్రంగా ప్రభావతి హాండ్ బాగ్ లోకి వెళ్ళిపోయాయి. మేజా సొరుగులో పెట్టిన చెక్ బుక్ బీరువాలోకి వెళ్ళిపోయింది. బీరువా తాళం చెవులు ప్రభావతి నడుము వద్ద స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయి. పాపం పాసు బుక్కు అక్కడే ఉండి ప్రద్యుమ్నుడిని వెక్కిరించింది. చూస్తుండగానే ప్రద్యుమ్నుడి ఆర్ధిక వ్యవహారాలు అన్నీ తన గుప్పిటిలోకి తీసుకొని అయామ్ ది కేప్టెన్ ఆఫ్ దిస్ సంసారనౌక అని అనేసింది ప్రభావతి. ప్రద్యుమ్నుడు వాటీస్‌దిస్ మ్యుటినీ? అని కోప్పడ్డాడు కానీ ప్రయోజనం లేకపోయింది.
ఎందుకంటే కొంతమంది చిన్నప్పటి నుంచి కొన్ని రాజముద్రలు భరిస్తూ వస్తారు. మొండివాడు, చవట, సన్నాసి, పొగరుబోతు, వెఱ్ఱివెధవ, మూర్ఖుడు, బుద్ధిమంతుడు, అమాయకుడు, మంచివాడు, ఇత్యాదులు. ఈ ముద్రాధారులు పెరిగి పెద్దై ఎన్ని ఘనకార్యాలు చేసినా ఇంటిలో ఇలాగే చెలామణి అవుతారు. ప్రద్యుమ్నుడు కూడా వెఱ్ఱినాగన్న అనే ముద్ర మోస్తూ వస్తున్నాడు. ఈ ముద్ర ప్రేమగా అతని తల్లి తండ్రులే వేశారు. చిన్నప్పుడు నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు ఆకలేసినా ఏడిచేవాడు కాడుట. పాపం వాళ్ళమ్మగారు బుజ్జీ, వెఱ్ఱి నాగన్నా ఆకలేస్తోందామ్మా అంటూ పాలు పట్టేవారుట ప్రద్యుమ్నుడు ఏడవకుండానే. అసలు వాడికి ఆకలి వేయనిస్తేగా, ప్రతి గంటకి పాలు పడుతుంటే వాడెందుకు ఏడుస్తాడు? అంటూ పక్క ఇంటివాళ్ళు గుస గుస లాడుతున్నా ఆవిడ పట్టించుకొనేది కాదుట. ఈ వెఱ్ఱి నాగన్నగారు ఇల్లాగే దినదిన ప్రవర్ధమానుడై పసి బాలుడు కాస్తా బాల భీముడై పోయాడుట. ఈ భీమబాలుడు ఏడాదిన్నర వచ్చి మెల్లిగా నడిచే వయసులో ఎవరేమిచ్చినా తినేవాడు కాదుట. బిస్కెట్టో, చాక్లెట్టో నోటిలో పెట్టినా ఉమ్మేసేవాడుట. అప్పుడు వాళ్ళమ్మగారు వెఱ్ఱి నాగన్న ముద్రకి ఒక టాగ్ లైన్ కూడా చేర్చిందట. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు అని.
కొద్దిగా బుద్ధి, జ్ఞానం వచ్చేటప్పుడు ధైర్యం చేసి ఒకమాటు వాళ్ళ అమ్మగారి వేలు కొరికాడు. వీపు విమానం రన్‌వే అయింది కాని ముద్ర పోలేదు. అంచేత వయసు వచ్చినా ఈ ముద్రాటాగ్ టాగ్‌ముద్రలకు అనుగుణంగా బతకడం అలవాటు అయిపోయింది ప్రద్యుమ్నుడికి.
పెళ్ళి అయిన తరువాత కొడుకుని వాళ్ళమ్మ కోడలి చేతిలో పెట్టి వీడు వెఱ్ఱి నాగన్న, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు జాగ్రత్తగా చూసుకో తల్లీ అని అప్పజెప్పింది. అల్లాగే అని అత్తగారికి హామీ ఇచ్చేసింది ప్రభావతి. మా పద్దుగాడు అమాయకుడు తల్లీ అని తండ్రి కూడా వంత పాడాడు. నలుగురిలో తండ్రి పద్దుగాడు అన్నందుకు ఏడవాలో, తల్లి వెఱ్ఱి నాగన్న అన్నందుకు విచారించాలో తెలియక ఒక వెఱ్ఱి నవ్వు ముఖానికి అద్దుకున్నాడు పాపం ప్రద్యుమ్నుడు. అత్త ఇచ్చిన అలుసుతో, ఈ ముద్రను అడ్డు పట్టుకొని ప్రద్యుమ్నుడి జీతం మీద సకల హక్కులు దాఖలు పరచుకుంది ప్రభావతి. పాపం ప్రద్యుమ్నుడు నిమిత్త మాత్రుడిగా మిగిలి పోయాడు.
ఈ వెఱ్ఱి నాగన్న ముద్రని ప్రభావతి చాల తెలివిగా ఉపయోగించుకుంది. పద్దుగాడి ఖర్మ కొద్ది దీనికి హై కమాండ్ అంటే అత్తగారి ఆమోదం కూడా లభించింది. పైగా మా ప్రభ చాల తెలివైనది అని ఒక ప్రశంసా పత్రం కూడా అత్త మామల దగ్గర కొట్టేసింది. దాంతో ఈవిడకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. కాపురానికి వచ్చిన కొద్ది కాలానికే పద్దుగాడి ఆర్ధిక స్వాతంత్ర్యం రద్దు చేసి సర్వాధికారాలు తాను దఖలు పరచుకొన్న తరువాత ఇంటి బడ్జెట్ మీద దృష్టి పెట్టింది.
“శంకర శాస్త్రీ! మనం పొదుపు పాటించాలోయ్,” అంది ఒక శుభ ముహూర్తాన.
“ఆయనెవరూ?” అని అడిగాడు పద్దుగాడు.
“ముద్దుగా, ప్రేమగా, లవ్వుతో పిలిచానోయ్ రంగనాధం!” అంది. “సినిమాలు చూడవా, నవలలు చదవ్వా, వాటిలో అల్లాగే పిలుచుకుంటారోయ్ భజగోవిందం!” అని కూడా దబాయించింది.
“ఒళ్ళు కొవ్వెక్కి, ప్రేమ కొండెక్కి వాళ్ళెలా పిలుచుకున్నా, నువ్వు అల్లా పిలవడాన్ని నేను ఒప్పుకోను!” పద్దుగాడు ఆక్రోశించాడు.
“మీ ఇష్టం. మీరు పిలవకపోయినా, నాకు ముద్దు వచ్చినప్పుడు నేను అల్లాగే పిలుస్తాను!” నొక్కి వక్కాణించింది ప్రభావతి. ఏమి చెయ్యలేక నిస్తేజుడై, నిర్వేదంతో అంగీకరించక తప్పలేదు నారాయణ ఉరఫ్ పద్దూకి.
పొదుపు పాటించాలని ప్రభావతి ప్రకటించిన నాలుగు రోజులకి ప్రధమ పొదుపు సూత్రం ప్రద్యుమ్నుడికి అనుభవంలోకి వచ్చింది. ఆదివారం కావటం చేత ఇంట్లో ఉండడం వల్లా 11గం. లకి కాఫీ ఇస్తావా ప్రభా, అని అడిగాడు.
“కాఫీ రోజుకి మూడు మాట్లకన్నా ఎక్కువ ఇవ్వబడదు. అప్పుడే రెండు మాట్లు అయిపోయాయి. 3గం. కి కావాలంటే ఇప్పుడు నో. ఇప్పుడు ఇస్తే అప్పుడు నో. మీరే నిర్ణయం తీసుకొన్నా నాకు శిరోధార్యమే, పతిదేవ్!” అని వ్రాక్కుచ్చింది. అవాక్కవడం నాధుడి వంతయింది.
రోజుకి పావులీటర్ పాలు =2రూ., నెలకి 60, సంవత్సరానికి రూప్యములు 720, అని లెఖ్ఖ కూడా చెప్పింది. ప్రభావతి పొదుపు ఉద్యమంలో మొదటి సమిధ ప్రద్యుమ్నుడి కాఫీలు.
పది రోజుల తరువాత, “మేఘనాద్, ఈ చాకలి అమ్మాయి పధ్ధతి ఏమి బాగాలేదు. పొగరు పెరిగిపోయింది. కబురు పంపిన నాలుగైదు రోజులకి కాని రావడం లేదు. బట్టలు తీసుకెళ్ళిన వారం పదిరోజులకి కాని తీసుకు రావటం లేదు. అవసరం మనది కదా అని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. దీనికి బుద్ధి చెప్పాల్సిందే!” అని ఆవేశంగా ఉపన్యసించింది ప్రభావతి. పద్దూ మహాశయుడు అమాయకంగా ఔను ఔను నీవన్నది నిజం అనేశాడు.
రెండు రోజుల తరువాత ప్రభావతి ఐరన్ కొనేసింది.
మన బట్టలు మనమే ఉతుక్కుందాం, మన బట్టలు మనమే ఇస్త్రీ చేసుకుందాం, మన బట్టలు మన కళ్ళముందే ఉంటాయి అని ఆవేశ పడిపోయింది. ఉత్సాహం ఉప్పొంగి పోతుండగా ఉద్రేకానందంలో పద్దుగాడు కూడా సెహభాష్ శశికళా సెహభాష్ అని మెచ్చేసుకున్నాడు. మరునాడు నుంచి ఇంకో ఏభై రూపాయలు ఎక్కువ ఇచ్చే ఒప్పందం మీద పని మనిషితో బట్టలు ఉతకడానికి ఒడంబడిక ఖరారు అయిపొయింది. ఇంకో మూడు రోజుల తరువాత అబ్బే మీ పాంటులు, షర్టులు ఇస్త్రీ చెయ్యడం నా వల్ల కావటం లేదు. మీరు ప్రయత్నించండి అంది. పైగా మీలాంటి కుశాగ్రబుద్ధులు, విజ్ఞాన వేత్తలు ఇట్టే సులువుగా పట్టేస్తారు అని ఉబ్బేసింది. నాకు చేత కాదు అని అభ్యంతరం చెప్పాడు ప్రభాపతి. అదేం బ్రహ్మవిద్యా, చదువురాని చాకలివాడే ఇస్త్రీ చేస్తున్నప్పుడు, పిహెచ్.డి చేస్తున్న మీరు చెయ్యలేరా అని సవాలు విసిరింది. మీరు చెయ్యగలరు అనే నమ్మకం నాకు ఉంది అని ధైర్యం చెప్పింది. రెండు మూడు మాట్లు చూస్తే ఇట్టే గ్రహించేస్తారు అని ఉత్సాహపరిచింది.
ఇక తప్పక, వీధి చివరి ఇస్త్రీ చాకలి కొట్టు వద్ద ఏకలవ్య శిష్యరికం చేశాడు పద్దుగాడు. లాగు ఎల్లా మడత పెడుతున్నాడు, ఎన్ని మాట్లు నీళ్ళు చల్లుతున్నాడు. నీళ్ళు చల్లిన చోటే ఇస్త్రీ చేస్తున్నాడా, పక్కనుంచి మొదలు పెడుతున్నాడా, పొడుగు చేతుల చొక్కా, పొట్టి చేతుల చొక్కాల ఇస్త్రీలో మౌలిక బేధాలేమిటి, లుంగీ మడత పెట్టడంలోను, చీర మడత పెట్టడంలోను సారూప్యాలు ఏమిటి, ఇస్త్రీ చేస్తున్నప్పుడు పెళ్ళాన్ని ఎన్ని మాట్లు తిట్టాడు, ఆ చొక్కా స్వంతదారుని ఏమని తిట్టాడు మొదలైనవి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. శ్రద్ధగా ఓ నోట్‌బుక్‌లో వివరంగా వ్రాసుకున్నాడు.
ఇస్త్రీ ప్రారంభోత్సవ కార్యక్రమం భార్యామణి సమక్షంలో మొదలు పెట్టి తూచా తప్పకుండా చేయడం మొదలు పెట్టాడు. రెండు చొక్కాలు, మూడు లాగులు, కొన్ని బనీన్లు అక్కడక్కడ నల్లబడినా ఒక దజను బట్టలు ఇస్త్రీ చేసేటప్పటికి ప్రావీణ్యం సంపాదించాడు. తన బట్టలు ఇస్త్రీ చేసుకుంటుంటే, మెల్లిగా చేరిన జాకెట్లతో మొదలు పెట్టి చీరలు కూడా ఇస్త్రీ చేయడంలో అనుభవం పెంపొందించుకున్నాడు ప్రద్యుమ్నుడు.
“భళా భళి, శోభన్ బాబూ! నెలకి చాకలికి 75-80 అయ్యేది. అది అంతా ఆదా చేసేయ్యగలిగాము,” అని ఆనంద పడి పోయింది ప్రభావతి.
“అదేమిటి, అందులో పనిమనిషికి 50రూపాయలు ఇస్తున్నాం కదా?” అని ప్రతిపక్ష నాయకుడి లాగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాడు.
“అయినా కూడా ఇంకా కనీసం 30రూపాయల ఆదా,” తేల్చేసింది ప్రభావతి. “నెలకి 30, ఏడాదికి 360 రూపాయలు!” అని ఉద్ఘాటించింది. “చూశావా, ఇప్పటికి రూ.1080 పొదుపు చేసేశాం,” అని కూడా విశదీకరించింది.
“ఇంకా మన పొదుపు ఉద్యమం ఉధృతం చెయ్యాలి. చిన్నమొత్తాల పొదుపులో ఏడాదికి కనీసం రూ.4000 ఆదా చెయ్యాలి,” అని ఉద్బోధించింది. అంతే కాదు ఆచరణలో కూడా పెట్టింది.
“ఏమండీ, రోజూ ఆ ఇంగ్లిష్ న్యూస్ పేపర్ ఒక గంట చదువుతారు కదా. పూర్తిగా చదివేస్తారా?”
“లేదు. ముఖ్యమైన వార్తలు చదువుతాను. మిగతావి చూసి వదిలేస్తాను. స్పోర్ట్స్ పేజీ కూడా పూర్తిగా చూస్తాను.”
“అల్లాగా, ఆదివారం అనుబంధం కూడా పూర్తిగా చదువుతారా, శలవు రోజు కూడా కదా.”
“లేదు, ఏమైనా మంచి వ్యాసాలు ఉంటే చదువుతాను. అంతే.”
“అలాంటప్పుడు ఆ వీక్లీ న్యూస్ మాగజీన్ ఎందుకు దండగ. అంతగా కావాలనుకుంటే క్లబ్బులో చదువుకోవచ్చు గదా. మనం తెప్పించడం, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు చదవడం అవసరమంటారా?”
“…”
“నెలకు ఇంకో నలభై రూపాయలు పొదుపు చేసాం. అంటే ఏడాదికి సుమారు 480!”
“…”
“ప్రతినెలా ఒక ఇంగ్లిష్ నవల కొనుక్కోవాలా, ఘోషు బాబు, బారువా కూడా కొంటారు కదా, వాళ్ళ దగ్గర తెచ్చుకొని చదవవచ్చు కదా. పోనీ రెండు నెలలకి ఒకటి కొనుక్కోండి. ఆరరవైలు మూడొందలరవై పొదుపు ఏడాదికి.”
“…”