మౌనంతో ముఖాముఖి

“మనమెవరైనా, మనతో ఆడుకునేవారెవరైనదీ ముఖ్యం”

నా కళ్ళు ఆ వాక్యం మీదుగా కదిలింది ఒక్కసారే. కానీ, ఆ వాక్యం మాత్రం మనసు పాలిటి గజినీ అయి కూర్చుంది, నీలాగే. అరువు తెచ్చుకున్న మాటలెన్ని ఉండీ ఏం లాభం? నీకూ, వాటికీ పొత్తు కుదరదుగా! నీకు నాతోనే కుదరదు మరి నా మాటల్తో కుదిరేదెప్పుడూ?

“నాకు నీతో కుదరదా? నిజం చెప్పు?” ఆ గోడ గడియారం కింద కాలును గోడకాన్చి, చేతులు కట్టుకుని వివేకానందుడిలా నవ్వుతూ అడుగుతున్నది నువ్వే కదూ!

ఈ మసక వెల్తురులో, ఈ ఒంటరి గదిలోకి – నువ్వెలా వచ్చావ్? ఎక్కణ్ణుంచి వచ్చావ్? ఇక్కడ నేను ఒంటరిగా లేనూ? కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాను – మొండిగోడా, ఒంటరి గడియారమూ! ఆశ్చర్యం, ఆ వెంటనే, కారణంలేని వెధవ నవ్వూ!


అసలెక్కడినుంచి వచ్చావ్? ఎలా వెళ్ళిపోయావ్? ఇలాగయితే, నేను నేనెవర్ని అన్న చింతమాని, నాతో ఆడుకునే నీ గురించీ, నీ మూలాల గురించీ ఆలోచించాలా? అదే ముఖ్యమా? లేక, అందర్నీ ఆడించే వాడి మూలాలు వెదకాలా?

“అందరితోనూ ఆడేవాడెవడూ లేడు.”

“ఉండొచ్చు, ఉండకపోవచ్చు.”

“ఉండొచ్చేమో, మనం చూడలేము కదా.”

“ఉన్నాడు అనుకోడంలో నష్టం లేదుగా.”

“ఉన్నాడు అనుకోవడం వల్లనే నష్టం ఉండదు. మనశ్శాంతి ఉంటుంది.”

“ఉన్నాడని నమ్ముదామని అనుకుంటున్నా.”

“కనీకనిపించకుండా ఉన్నాడనిపిస్తుంది.”

“ఉన్నట్లే ఉన్నాడోయ్!”

“ఉన్నాడున్నాడు.”

“తప్పకుండా ఉన్నాడు.”

ఒక్క నిముషంలోనే పరిణామవాదాన్ని సాక్షాత్కరింపజేసింది మనసు. ఇవి నా మనసు దశావతారాలు కాబోలు.

అయితే, నా బ్రతుక్కి నువ్వు ముఖ్యమా? వాడు ముఖ్యమా? అయినా, నా బ్రతుకు ఇంకోళ్ళ చేతిలో ఉండటమేమిటి? ఠాఠ్! నేనొప్పుకోను!

“ఒప్పేస్కున్నావ్. మాట వెనక్కి తీసుకోలేవు.” – మళ్ళీ నువ్వు, నీ నవ్వు. నవ్వు విని హాల్లోకొచ్చాను. సోఫాలో కూర్చుని పేపరు మడుస్తూ నన్నే చూస్తున్న నువ్వు.

“నేనా? నేనెప్పుడిచ్చాను నీకు మాట?”

“గుర్తులేదూ? అప్పుడే మరిచిపోయావూ?” నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వు.

చటుక్కున తలవంచుకున్నాను. సిగ్గా? భయమా? దాచిపెట్టాలని చూస్తున్న కోపమా? చూడ్డానికైనా ఇష్టం లేనంత ద్వేషమా? ఏమో! ఎలాగో మాట పెగుల్చుకుని-

“నువ్వెన్ని మాటలు చెప్పావ్? ఎన్ని తప్పావ్? నువ్వా నన్నంటున్నది?” అనగలిగాను.

అనగలిగాననుకున్నాను. నీ జవాబు వినబడక తల ఎత్తి చూస్తే – ఏముందీ? నా మనసులోని ఆలోచనల్లా చిందరవందరగా పడి ఉన్న కాగితాలతో నిండిన సోఫా!

మరో నిరాశ. నువ్వో మహామాయ కాబోలు. మరి నేనెవర్ని? యోగమాయనా? అజ్ఞాతవాస యోగమాయని.

“ఎవరి నుండి తప్పించుకోడానికి అజ్ఞాతం?” మనసు పదకొండో అవతారం.

“నా నుంచా?” ఆశ్చర్యంతో గిరుక్కున తిరిగిచూస్తే, మళ్ళీ నువ్వే! కవ్వించేలా నవ్వుతూ.

“నీ నుంచా?” అప్రయత్నంగా నా ప్రశ్న.

“కాదు, నీ నుంచే.” నీ జవాబు.

“ఏమో!”

“నువ్వూ, నీ ఆలోచనలూ నన్ను వదల్లేవు.” ధీమాగా చూస్తూ దగ్గరికొస్తున్న నువ్వు. నా నరనరాల్లోనూ పొంగుకొస్తున్న పౌరుషం ప్రవాహం తెలుస్తూనే ఉంది.

“వదల్లేనని నువ్వనుకుంటున్నావ్!” అనేలోపే అర్థమైంది నేనాడుతున్నది ఎంత పచ్చి అబద్ధమో. ఆ క్షణంలో, ఈ మసక వెలుగులో, చిట్టి చీకటిలో – మళ్ళీ నేనొంటరిని.

వర్షపు చినుకుల శబ్దం బయట. ఆరేసిన బట్టలు తీయలేదంటే, సాయంత్రం తథిగిణతోం!

వర్షం – మనం మొదటిసారి కలిసినరోజు కూడా పెద్ద వర్షం కదూ! ఈ ఆరిపోయిన తెల్లచొక్కా – ఆరోజు నేను తొడుక్కున్నదే. ఏళ్ళు గడచినా, దీన్ని వదల్లేకపోయాను. ఉరుము శబ్దాల ఆకాశం – ఆరోజు మేఘాల ఆకారాల గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా? నిన్నటి జ్ఞాపకాలన్నీ కరిగి, నీరై, కన్నీరై… ఆ వర్షంలో, ఈ వర్షంలో, నీ వర్షంలో… తడుస్తూ మిగిలిన నేను… ఇట్టే కనిపిస్తూ, అట్టే మాయమౌతూ, నాతో ఆడుకుంటూ, ఎక్కడో నవ్వుకుంటున్న నువ్వు!

జ్ఞాపకాలకు సమాధి కట్టేశానని గొప్పగా చెప్పాను, మన ఉత్తరాలన్నీ చింపేసిన రోజు.

జ్ఞాపకం నిజం – సమాధి అబద్ధం
ఉత్తరాలను చించడం నిజం – అవి చిరగడం అబద్ధం
నువ్వు నిజం – ఇప్పుడు నేనో?

బట్టలన్నీ తీసుకొచ్చి లోపలేసి తలుపు మూశాను. నేనూ-నా చీకటీ. వర్షం వస్తూ వస్తూ వెలుతురును మింగేస్తోంది. చీకటి మరో జ్ఞాపకం.

నా నిట్టూర్పు ముగుస్తున్న క్షణంలో దుర్గం చెరువు దగ్గర కబుర్లాడుతున్న మనిద్దరం. ఆశ్చర్యం నుండి తేరుకునే లోపే, సాగర్ రోడ్డుపై బైకును దౌడెత్తిస్తూ మనం. మరుక్షణం, ఈ గది గోడకానుకుని నీరసంగా కూర్చుని, ఫ్యాను వంక తలెత్తి చూస్తున్న నేను మాత్రమే!

గది నిండా మాటలు. నిన్నటివి, మొన్నటివి, అంతకు ముందువి. మాటల్ని పీలుస్తూ, మౌనాల్ని వదిలేస్తున్నా. మాటల పర్యవసానాలు మౌనాలే కాబోలు. గదంతా గుట్టలు గుట్టలుగా పోస్తున్నాను జ్ఞాపకాలని. తగలెడదామనుకుని, తగలడిపోతున్నట్లున్నా!

అదేమి వింతో, దాని గురించి నాకు ఇదేమి చింతో అర్థం కాదు. సరిగ్గా నేనిలా ఉన్నప్పుడే కరెంటు ఉండదు. బయట సూర్యుడు దాక్కుంటాడు. లోపలా, బయటా, చీకట్ల మధ్య నేను మిగిలి, ఏమిటీ చీకటి? అని ఆలోచిస్తూ ఉంటాను. ఏమన్నా సాయం వస్తావేమో అని పక్కకి తిరిగితే, అప్పుడు మాత్రం కనబడవు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోడానికి పక్కకెళ్ళి పోయావేమో! పోనీలే, ఆ మాత్రం సభ్యత ఏడ్చింది – సాడిస్టిగ్గా నా మొఖం మీదే నవ్వలేదు, అని తృప్తి పడాలి కాబోలు!

అర్థరాత్రి మెలుకువలో, పగటి పూట నిద్ర మత్తులు – ఇప్పుడెంత మామూలైపోయాయో!

“ఎందుకూ?”

నాకర్థమైపోయింది. నా వెనకో, ఆ గోడకవతలో ఎక్కడ్నుంచో ఊడి పడుతున్నావు మళ్ళీ. అంతే కదా.

“ఎందుకూ?” మళ్ళీ అదే ప్రశ్న.

“ఎందుకేమిటి?”

“నాకు తెలుసు.” అన్న నీ మామూలు నవ్వే ఆ క్షణాన నాకు పనిగట్టుకు చేస్తున్న వికటాట్టహాసంలా అనిపించింది. నాలో పెరుగుతున్న కోపం తాలూకా రక్తమంతా ముఖంలో ఎర్రగా నిండింది. మళ్ళీ నవ్వు!

“నీ అనుమానాన్నే, భయం అని కూడా అంటారు తెలుసా?”

“నేనెవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి?”

“…”

– జవాబు రాదు. నాకు తెలుసు. వెళ్ళిపోయి ఉంటావులే! ఎప్పుడు జవాబిచ్చావు గనుక!

నువ్వు మౌనానివా? ఇట్టే వచ్చి అట్టే మాయమైపోతున్నావ్. మాయమైపోతున్నావా… కాలగమనం స్పృహ నాకు లేకుండా పోతోందా? ఆలోచనలు ఆగడం లేదు, కొనసాగడం లేదు. మౌనానికి మాట రావడంలేదు. మాటకి మౌనమూ రావడం లేదు. అదెలా సాధ్యపడుతోందో మరి.

ఇదేమిటి? ఏడుస్తున్నానా! ఛీ!


“ఏమిటి, ఏడుస్తున్నావా… సారీ. ఈసారి వచ్చేశా నిజంగా”

“…”

“మాట్లాడూ – నిజంగా వచ్చేశా. ఇంకెప్పుడూ ఇలా ఆడుకోను. నిజం.”

“…”

“ఒకసారి మాట్లాడవూ… ప్లీజ్! సారీ…”

ఎదురుగ్గా నువ్వున్నావ్. నీ మాట ఉంది. కానీ, నాకే ఏమిటో, ఎంత ప్రయత్నించినా నోరు పెగలడం లేదు. ఇప్పుడు నేనే మౌనాన్ని అవుతున్నా కాబోలు…