గేటు కాడ్నించి మేడంగారి కారు లోపటికి తిరగడం సాన. కిసుక్కుమని నవ్వుతాది కుమారి. “ఏదైనా వొక యేడివొస్తువూ …” అనీసి గుడ్లు మిటకరించుకోని నాదుక్కూ నాగలష్మి దుక్కూ మార్చిమార్చి సూసుకోని, బ్రైనని ఈ చంకలోంచి ఆ చంకలోనికి ఎగదోసుకోని “బాస్పీబవనమూ …” అనీసి అచ్చం మేడంగారు చెయ్యి తిప్పినట్టుగే తిప్పుకోని కానుగ బెత్తం పువ్వుల్చెట్లమీద, మొక్కల గోలేల మీద కొట్టుకుంటూను. మా పనోల గుంట్లకి ఇగటాలకి కుమారీయే లీడర. విల్లా నెంబర సెవన్ అమిరికావోలింట్లో పన్లోనున్నాననీసి దానికి డబలెగష్టా లాగుంటాది. పెద్ద పైల్మేన్లాగ బ్రైనకి నోట్లోన పాలబుడ్డీ తోసీసి, బేబీ స్ట్రోలర చెత్తలోడి బండీలాగ ఇటూ అటూ కోల్నీయల్లా తిప్పుకోని “గార్భేజ మేడం ! రీసైకలింగ సార్ !” అనీసి చెత్తల ముసిలోడికి ఎక్కిరించుతుంటే మా పనోలందరం నవ్వుతుంటే బ్రైను, జాఖరీ, ఆలక్కా మాతోటొచ్చీసి నవ్వడాలు. బ్రయినోలమ్మగారు అమిరికావోలవబట్టి సరిపోయింది గాని అదే మనోలయితే దానికుండీదీపాటికి – మ్రోగింది కల్యానవీనా!
వల్లీ మేడం టింగుమని కార్నుండి దిగిపోయి మహీందర చేత పుస్తకాలు, చార్ట్రులు, బిస్కట్లున్న సంచీలు క్లబ్బౌసు ముందర షెడ్డుకాడ దింపించింది. ఆపగాడు, బేకుడు, సిరీషా ఎర్రటెండలోన నెత్తిమీద గమేలాలు బోర్లించుకోని ఇసక్కుప్పల మీద కూకోని ఇటికబెడ్డలు దొంతులు పేరుస్తన్నారు. రాజేష్ గాడు, దీక్షూ గాడు సరుగుడు కర్రలతోటి కత్తియుద్దం చేసుకోనొచ్చి మేడానికి చూసి కర్రలు బీపెనకాల దాసీసుకోని బుర్రలు దించీసుకున్నారు. నాగలష్మీ ఆల విల్లా నెంబర నైన్ మేడానికి చెట్టుకింద కుర్చీలోన కూకోబెట్టి మీగడా పసుపు మొహానికి రాసి, దోసకాయ చక్రాలు కళ్ళమీద పెట్టి బుర్రకి హెన్నా రాస్తంది. మేడం కారు దిగీదిగ్గానె ఎక్కళ్ళేని పనోల గుంట్లందరికి సిమింటుబస్తాల షెడ్డుకాడికి రమ్మనీసి ఆర్డర్లెల్తాయి. నీనెల్లి ఆపగాడికి, బేకుడికి, సిరీషాకి, దీక్షూ గాడికీ రాజేషకీ చేతిలోన కర్రముక్కలు పారీయించి షెడ్డు గుమ్మంలోన వరాసగా లైన్లో నిలబెట్టించేను. ఇక్షునాకొడుకు చేతిలోన కర్ర పారీసినా ఇంకా “జుజ్జుజ్జుజ్జుజ్జూ… షువ్హో… డిష్షుడిష్షుడిష్షోం…” అని రాజేషకి గన్ను కాల్చెత్తనాడు. కుమారీవాలమ్మ, నాగలష్మోలమ్మా గిన్నిలు తోఁవడాలు తుడ్డాలాపీసి “అమ్మా కుమారీ! బ్రెయినుకి నీన్సూస్తాను ఎల్లండర్రా ఎల్లండి…. అమ్మా! నాగలక్ష్మీ…?!” అనీసి పనోలగుంట్లందర్ని మోపుచేస్తనారు. శనాదివారాలు మద్యానమయ్యిందంటే సాన ‘ఆ మేడంగారొచ్చిందర్రా పాఠాలకెల్లర్రా!’ అనుకోని పవిటల్తోటి మొకాలు తుడుచుకోని విల్లా విల్లాకి ఎక్కీగుమ్మం దిగీగుమ్మాలెల్లి బెత్తాయించుతారు మాయమ్మోలు. ఉన్నోలకి ఉన్నకాడుణ్ణీకుంట హైరాన! వల్లీమేడం మా పనోల గుంట్నాకొళ్ళందరికీ రానీలాగ కటింగిచ్చుకోని, నడుమ్మీద చెయ్యేసుకోని సెడ్డు తాళం తీయించీసి “అంతా రడీయర్రా పిల్లలూ? ఏంటే … లష్మీ? ఊఁ …. అంతా రడీయేనఱ్ఱా?” అంటంది.
మహిందర కిందటాదివారం పరిచిన జంబకానాలు అలాగే వున్నాయి. బచ్చానాకొళ్ళు ఒక్కొక్కలే పుస్తకాలు ఇస్తిరాకుల్లాగ ముందరేస్సుకోని బోయనాలకి బంతిస్తళ్ళు కూకున్నట్టు కూకుంటే నీను కుమారీ దుక్కు నాగలష్మీ దుక్కు సూసి టూటీఫూటి పుల్లతోటి తాగినట్టిగ ఏక్సన్ చేస్తుంటే ఆలు కిసకిసామనీసి నవ్వుతుంటె. సిమింటుబస్తాలు పోగా మీఁవు కూకోగా ఉన్న ఈరికముక్కలోనే మేడం తెల్ల ప్లాష్టిక్కుర్చీలోన కూలబడిపోయి, ఫేనేయించుకోని కూడా పంజాబీడ్రెస్స వోనీతోటి ఇసురుకుంటంది ‘ఇస్సో’ మని. “ఏంటఱ్ఱా..? ఏంటి ఫన్నీగా వున్నానా? ఎందుకే నవ్వుతున్నారూ..?” అనీసి సిలకలాగ తియ్యట తియ్యట మాటలు మాటాడుతుంటే ఆపగాడు, బేకోజి, సిరీషా గుంట్నాకొళ్ళందరు కిసకిసకిసాలమనీసి నవ్వుల్నవ్వుల్నవ్వులే. ఆపగాడు ఉట్టుట్టికె పల్లకోలేక “మేడం వీల్లకి టూటీఫ్రూటీ కావాలంట మేడం!” అన్నాడు పెద్ద పోటుగాణ్ణాగ. విల్లా నెంబర సిక్సోల బాబుకి భర్తడే పార్టీ చేసిన్రోజు సుడాల ఆపనాకొడుకు కుక్కుకోని కుక్కుకోని ఎన్ని కేకుముక్కలు తిన్నాడో, సెక్రూరిటీవోలు సూడకుంట కడుపుబ్బరించుకోని ఎన్ని కోకులు తాగేడో!
వల్లీమేడం ఇంగ్లీషు బుక్కు తీస్సి ఇంకా సద్దుకుంటందో లేదో అంకిత్ బాబు సాగర్ బాబోలు వాటర గన్స్ తోటొచ్చి షెడ్లోకొచ్చీసి మేడాం కుర్చీ ఎనకాల దాగుండిపోనారు. ఆ బాబోలు ఎస్సాటాడతుంటె వాల్ని పట్టుకోడానికి జస్వంత్ బాబు, జాఖరి బాబు, సమీర్ బాబు ఎతకడాలకొచ్చీసి. మేడం అంకిత్ బాబోలని సిమ్మింటుకట్టల యెనకాల్నుండి లేపించీసి “ఏయ్! నాట్ హియర్ నాట్ హియర్…” అనీసి పార్కులోన ఆడుకోమనీసి గసిరీసింది. అంకిత్ బాబోలు ‘డంబ్ పనమ్మా కిడ్స్ ..’ అనీ తిట్టుకోని బేకుడి బుర్రమీద అంగలు దాటుకోని పార్కుదుక్కెలిపోయేరు. మీఁవు పనమ్మా పిల్లలఁవి పనోల్లాగుండకుంట ఎర్రటెండలోన ఇలాగ షెడ్నోన కూకోని వల్లీమేడం సుత్తినాలంటే నాకు సించుకున్నట్టుగుంటాది. అంకిత్ బాబోలు క్లబ్బౌసు పూల్లోన స…ల్లగా ఈతలకి దిగుతారింక. నాకు గేటవతల బందలోన ఈతలు కొట్టుకోని, సీమసింతబొట్టలు ఈత గుడ్లు తెంపుకోనొచ్చి రాతిబండల మజ్జిన వేపచెట్ల కింద తినుకుంటు కూకోవాలుంటాది. సెక్రూరిటీగాడ్రంకులాల కేబిన్లోన కిరికిట్లైన చూస్కోనివ్వకుంట పన్నిండున్నరకి బెల్లుకొట్టి పిల్సినట్టుగు ఈవిడొచ్చెత్తాది ‘ఏ ఫర్దీ యెపిల్ బీ ఫర్దీ బేట్’ అనీసి. నీను సెవంత తోని ఆపీసేననీసి నాగలష్మీ తెంత పోయిందనీసి మా ఇద్దరిమీదా పట్టించింది మేడఁవు. యెక్కడ్లేనింగ్లీష్ పుస్తకాలు, నెక్కలబుక్కులు తెచ్చీసి మా అయ్యకిచ్చీసి రాయించమంటె మాయమ్మా నాగలష్మాలమ్మా “మనోల మంచికే సెప్తన్నారు మేడం గారు! ఆయమ్మన్న ముక్కలేటో రాసీయర్ర మరేద!” అనుకోని. ఈ మేడాము బుక్కులు మా పేనాల్తిండానకి!
“ఎల్డర్స్ అంటె..?” అంటంది నాదుక్కు కొంగనాగ మెడకాయెత్తీసి ‘యేటమ్మా కొండబాబూ నువ్వీని కదమ్మా నా పుడింగివీ!’ అన్నట్టుగ. ఇంకీవిడితోటి మనకెందుకనీసి నీను చేతులు కట్టీసుకోని ‘యెల్డింగు చేసీవోలు మేడం! ‘ అంటే పకాలమనీసి నవ్వీసింది నలుగురున్నారనీసి, ఆడోలున్నారనీసీ లేకంట. మా అయ్యోలకాడ, సారోల కాడా తిట్లుకాసి తిట్లుకాసి రాటుదేలిపోయున్నాను. నాకేటి?! గెట్టిగ నవ్వితె గాలికి, మెల్లిక నవ్వితె మేడకి! కుమారీకి తెలుగచ్చిరాలే రావు అది అమిరికావోల్లాగ కటింగిచ్చుకోని “అచ్చి! యెళ్డర్సంటె పెద్దవారు …” అన్నాది. మేడం దాందుక్కొక యెరీగుడ్డిసిరీసి “రెస్పెక్ట్ యెల్డర్స్! పెద్దలను గౌరవింపుము..” అనీసి ఎత్తుకున్నాది బాగోతము. ఆపనాకొడుకు, బేకుడు,రాజేష బిస్కట్ల బేగీల్ల తిండాలకేటున్నాయా అనీసి సొంగలు కార్చుకుంటనారు. ఇక్షుగాడు టూట్టిప్రూట్టి సంచీ ఇప్పీసి తాగీనాలకి లడీగున్నాడు. సిరీషా, నాగలష్మీ, యెల్డర్సకి పోటుగత్తిలాగ కుమారీ మఠాలేసుక్కూకోని మేడం తెచ్చిన బుక్కునోకి సూస్కోని పెద్దవారి యెడలా, సాటి విధ్యార్ధుల యెడలా మడత కటింగులిచ్చెత్తనారు. వల్లీమేడం మహిందరకి పిల్చి కర్ర స్టేండీకి చార్ట్రు యేలాడకట్టించింది. దనిమీద కిందటసుట్టు తెచ్చినట్టుగ ఆహారాల బొమ్మల్నేవు. డబ్బులు! వెయ్యా, ఐదువొందలూ, వొందా యేబయ్యీ ఇలాగ డబ్బుల్నోట్లు బొమ్మలూ, రూపాయిల బొమ్మలూని! కల్లు జిగీలుమంటంటె మీఁవు పన్నాకొడుకులందరిఁవి తేపకార్సుకోని ఆ డబ్బులికి సూస్తంటే మేడం గర్రాగా నిలబడిపోయి నడుముల కిందాకి సేతులెట్టీసుకోని “చార్ట్రు పైకొసాకి ఏంటునాదో సదవ్వే నాగలష్మీ!” అన్నాది. అది మా సిన్నానాల బొట్టి. ఉట్టప్పుడే దానికి ఊరంతా సిగ్గు. అదింకా ముడుసుకుపోయి లెగిసి “ఎం – వో – ఎన్ – ఈ – వై ….. మొనేయ్ అమ్మ! మోనేయ్ …” అంటంటే మేడం దాని బుజం మీద తట్టీసి “మోనేయ్ కాదు, మనీ! మనీ!! వోకే? మనీ అంటే ..?” అనీసన్నాదో లేదా ఇక్షుగాడితోటి సహా పన్నాకొళ్ళందరిఁవీ “డబ్బులు..!” అనీసరిస్సేము. మేడం ఆ డుబ్బులన్ని లాట్రీ గెలిచిసిందాన్లాగ గట్టెక్కి నిలబడపోయి “యెస్స్! మనీ అంటే ఏంటో అందరికీ తెల్సు కదఱ్ఱా చిల్డ్రన్? డబ్బు! డబ్బులెలాగొస్తాయీ….? ఊఁ? ఎక్కడ్నుంచొస్తాయి డబ్బులు? హౌ..?” అనీసి ఒకొక్కల్లకీ అడుగుతన్నాది, కోకిలా… కో – కి – లా టైపులోన. డబ్బులెక్కణ్ణుంచొత్తాయి?! బేంకీకాడ మిసన బటాలు నొక్కితే వొస్తాయి! నీను ఉండబట్టక “కుమారికయితే బ్రెయినకి సూసినందుకు అమిరికావోలు జీతాలిత్తారు మేడం!” అనీసేను. వల్లీమేడం ఇందాకట కుమారీకి పెట్టీసిన కిరీటము వూడదీస్తెచ్చి నాకు పెట్టీసి “కరక్ట! జీతం … సేలరీ! మరి మీ అమ్మకి నాన్నకి జీతాలొస్తయ్యా కొండబాబూ? వాట్..?” అంటంటె కుమారి సుద్దముక్కలు గురిసూస్కోని నా టెంకిమీదకి ఇసుర్తంది. ‘నీకున్నాది బేండుమేలం, మేడం ఇలగెల్నీవే నీపని!’ అనిసి దానికి నాలిక మడతపెట్టి వార్నింగిస్తె, అది కిరీటాఁవు మల్ల లాగీసుకుందామనీసి నిలబడిపోయి “ఆల్ పనమ్మా కిడ్స్ గెటింగ్ సేలరీ మేడం. ఇక్షు రాజేస్ స్మాల్ చిల్డ్రన నాట్ గెటింగ్ మెడెం !” అనీసింది అమిరికావోలమ్మా మొగుడ్నాగ.
“పనమ్మా చిల్డ్రన్ ఏంటి కుమారీ?” అనీసి ఇసుక్కున్నాది మేడం. “సే వర్కర్స్ చిల్డ్రన్..” అంట. పనోల పిల్లలకి పనమ్మా సిల్డ్రన్సనకుంట పైల్మేన్ సిల్డ్రన్సంతారా? మేడం ఇక్కడ్నుండి ఎటుదుక్కెల్తాదో మాకందరకి తెల్సును సరస్పతీదేవి. పనోలమ్మలకి జీతాలు ఏపాటొస్తాయనీసి, పనోలు గోడవతల రేకుల్సెడ్డుల్లోన కాపరాలుంతామని, బురదల్లోకెల్లి మా ఇళ్ళకి రానానికి తోవల్లేవనీసి, డ్రమ్ముల్లోన్నీల్లు తాగితే జ్వరాలొచ్చెస్తాయి పాపము పూరు పీపుల్సనీసి మామీద ఈవిడికి డబల కనికారము. కుమారాలింట్లోన మా ఇంట్లోన టీవీలున్నాయి. నాకాడ కత్తిలాటి సెల్లున్నాది మేడానికే లేదు నాలాట సెల్లు! మీఁవు బీదోలమంటె నీనొప్పుకోను. మా నీలూసు నిప్పులూసు ఈలకెందుకు? మేడానికి ‘ఎందుకులే!’ అనీసి పల్లకుంటంటె మడతకటింగులెక్కువైపోతన్నాయి! నీను గూబలు, బుజాలు నిగడదన్నీసి “కుమారి, కుమారి! సే వుయార్దీ వర్కర్స చిల్డ్రన్ , వోక్కె?” అనీసి రోబోనాగ అనీస్సరికి పన్నాకొడుకులందరు గొల్లుమనీసి నవ్వీసేరు. దానికలాగే కావాల యెక్కడిదక్కడే ఇచ్చెత్తాను దానమిరికా కటింగులికి! మేడానికి నామీద నవ్వించుతాదా యెల్డర్స?! ఆపగాడు, బేకుడు, ఇచ్చుగాడు అందరు “వోక్కె! వోక్కె!!” అంటంటె మేడాలు గాబరాలెత్తిపోయి “ఏంటఱ్ఱా ఓకే..?” అంటంటె నాగలష్మీ ఉడతనాగ పల్లికిలించుకోని “శ్రీనివాసాలమ్మ – రోబో ఆడతందమ్మ – ఈడు కొండబాబు పనోల పిల్లలఁవందరము ఎల్దామివాల మేడంగారొచ్చీసరికి అనీసమ్మ … ‘మేడం క్లాసొద్దర్ర రోబోకెల్దారి ‘ అంటనాడమ్మ!” అని నా సీక్రీట దండోరా ఏస్సింది. అది మా సిన్నాన కూతురనీసి కిందటిసుట్టు ఒగ్గీసేనుగాని ఇంకోసుట్టు నా ఊసొచ్చేవంటె నిద్దట్లో ఉణ్ణిచ్చి పిలకలు కత్తిరించెత్తాననీసి దానికి కిందట శనోరమే వోర్నింగిచ్చేను. చేతులు కత్తిర్లాడిస్తంటె కిసుక్కుమనీసి మూతికి చెయ్యడ్డం పెట్టుకున్నాది. వల్లీ మేడం డబ్బుల చార్ట్రుకి కర్ర చూపించుకోని “రోబో ఎవరెవరు చూసేరఱ్ఱా? చిల్ద్రన్?! రైజ్ యువర హేండ్స్?” అన్నాది. కుమారీ మేడానికి తందానతాన్నాగ ‘రోబో ఎవలెవలు చూసేరో చేతులెత్తర్రా?’ అంటే ఆపనాకొడుకు, ఇచ్చుగాడు, రాజేష చేతులెత్తీసేరు. “తిండాలక్కాదర్రా! రోబో చూసేరర్ర..?” అని గసిరితే చేతుల్దించీసేరు. మంటిబొక్కడం నాకొల్లు! ఆపగాడికి బకిట్లు బకిట్లు నీల్లు మొయ్యడాల్తప్పించి కేట్‌కీ డాగ్‌కీ తేడా తెలీదు. ఆడి చెయ్యట్టుకుని టకామని దించీసి కిసుక్కుమనీసి నవ్వుతంది నాగలష్మి ఉట్టుట్టికే సిగ్గుపడిపోయి ‘ఎవలం సూల్లేదమ్మ!’ అనుకోని.
వల్లీమేడం రోబోనొగ్గీసి గాందీజీ మీదకెల్దారనీసి డిసైడింగు చేయిస్సి “చూడండఱ్ఱా! ఈ నోటు చూసేరా? దీనిమీద ఈయనెవరూ?” అన్నాది. సిరీషా కుమారీ ఆడోలిద్దరూ ఒక్కసుట్టే “గాందీ గాందీ” అంటంటె నాగలష్మే కలగచేసుకోని “అలాగనకోడదర్ర! మహాత్మా గాందీజీ అనాలి!” అనీసెత్తుకున్నాది నెక్చర! మేడం తరవాత ఇదే చిన్నమేడం నాగ. ఆలమ్మాలు దానికి విజీవాడ సైడు పెల్లిసమందాలు సూస్తన్నకాణ్ణించి పెద్దవారి యెడాల, సాటి విద్యార్ధుల యెడాల ఎచ్చులెక్కువైపోతన్నాయి దానికి. వల్లీమేడం ఇంక నెక్చర్లకి దిగిపోతాదిరా స్వామిసరణం! పనివాల్లకి రోజుకి నూటనలపై చొప్పున నెలకెంతొస్తాదొ, ఆడోలకి రోజుకి నూటాపది చొప్పున ఇంతలెక్కనిచ్చెత్తె నెలకి నలుగురు మడుసులికి ‘బియ్యాలెంత? కూరెంత? పాలెన్నీసి తాగీయాల? కోడిగుడ్లెన్నీసి తినీయాల’నీసి కొసినీలేసెస్తాది దయగల్తల్లి. ఇచ్చునాకొడుకూ బేకుడూ ఆలింట్లో పాలే కొన్రమ్మంటే ఆమాటే ఇనపణ్ణుట్టిగె చెవిటి మారాణీ “పాలు సంపూర్నా ఆహారమఱ్ఱా! రోజుకీ ఒక్కసుట్టైనా కంపల్సరీగ పాల్తాగితే… మీ పెదిమల చివర తెల్లగా ఉన్నాయి చూసేరా, అలాగవ్వకుండ అంకిత్ బాబోల్లాగ గులాబీ రంగులోనుంతాయఱ్ఱా మీ పెదాలు!” అంటాదింక మహాత్మురాలు. ఆలయ్యకి తాగీసి పడిపోనాలకే సానదు ఆడి జీతము! ఈలకి ప్రాలు, ప్రండ్లు, గ్రుడ్లు యెక్కణ్ణించి తెచ్చీమంటావనీసి గెట్టిగడిగీవోల్లేక. పన్నాకొళ్ళందరు ఒక్కలంటొక్కలు యేటీ అనకుంట సెడ్డు టాపులికేసి సూసుకోని సిగ్గుసిగ్గుగా నవ్వుతన్నారు. మీఁవందరఁవు బీదవాల్ల పిల్లలమనీసి, మాకు సదువులు చెప్పించీసి జీతగాలకింద చేయిస్సి ఎవులకాలమీద వాల్లమూ టకామన్నిలబడపోవాలనిస్సి ఆడోలకీ మొగాలకీ ఇద్దఱకి సమానముగ నూట్నలపియ్యీసి కరుకులు రోజూ ఇచ్చీయాలనిసి, ఆ కరుకులెట్టీసి మీమందరఁవు రోజువిడిసి రోజైనా పౌష్టికాహారంవు డబల బొక్కియ్యాలనీసి, మేడం నడుములమీద సేతులేసుకోని చార్ట్రుమీద గాందీజి మీద కర్రేసి కొట్టుకుంతంది దర్మతల్లి! నాకు గుండీలంట ఎండ కాలిపోతందంటె నాదా తప్పు? ‘మీము బీదవోల్లం కాదు మేడాంగారండి! మాకు ఉల్లిబద్ర లోన ఎకరాఁవున్నర పొలాలున్నాయి మేడంగారండి!! గర్భఁవు పూడిపోయి సెరువెండిపోబట్టి నీల్లేక మా అయ్యోలకి నెక్క సద్దుబాటయ్యింది కాదనీసి ఈఊరొచ్చీసీఁవు మేడాలమ్మా!’ అందుఁవా అన్నోటిదాకొచ్చీసింది. మేడం గాందీగారిమీదున్న కర్రకి తీసిటుతిప్పీసి నాదుక్కే చూపించి “ఏంట్రా కొండబాబూ? రోబో టికట్ట ఒక్కొక్కలకీ ఎయిటీ అయితే మనం ఎంతమందిమున్నామురా? మనందరికి కలిపీసి ఎంతవుతుందిరా?” అంటంది. పెట్టించెయ్యికి తిడతామా? నీను బుజాలు గజాల్చేస్సుకోన్నిలబడపొయి ‘యెస్ మేడం’ అనిసేను ఆదికిముందు. మేడం టికట కట్టీసి రోబోకెల్దామంటె మరి సిలకట్టెగ్గట్టీనా అర్జింటుగాని?
“యెస్ మేడం గారండి! మనము యెనమండుగురు విధ్యార్ధులము కొరకు రోబో టికట్ల కొరకు వొక్కొక్క టికట్ట ఎనపై రూపాయలు చొప్పున …. ఇచ్చూకి, రాజేష్ కి అరటికట్ట చొప్పున మొత్తము ఎనిమిదిమంది విధ్యార్ధులము మేడం..” అనీసింక హరికద. మేడం చేతులు కట్టీసుకోని, పేంబెత్తం నాకాసే చూపించుకోని చిద్విలాసంగా నవ్వుకోని ‘ఊఁ కానీ కానీరా …. నెక్కచెప్పురా పుడింగి?!’ అన్నట్టగ సూస్తంటె, పన్నాకొళ్ళందరు ‘ఈడీ లెక్కేదో బేగి కట్టిస్తే రోబోకెల్దుఁవా?’ అన్నట్టుగు నాదుక్కే సూడ్డాలు! నీను ఏటయితే అదే అయ్యింది మార్చీ పోతె సెక్టెంబరున్నాది గాదా అనీసి “ఎనిమిది మంది విధ్యార్ధులకు ఎనపై ఎనిమిదుల ఎనపయ్యెనిమిదీ స్తానేముందున ఒకటీ ..” అనీసి గునకారాలు బాగారాలు ఎత్తుకున్నట్టుగ దొంగేక్సన్ చేస్తన్నాను. రోబోకి లెగదిసేననీసైన కనికారము లేకుంట నాగలష్మీ పెద్ద సావుకారమ్మనాగ చేతులెత్తీసింది. కుమారీ దానికి సపోర్టుకింద నెగిసి “వాడికి మేక్స్ సమింగా రాదు మేడం ! పల్లబండీవోడికి హండ్రడ్ రుపీస్ ఎగష్ట్రా ఇచ్చీసి విల్లా నెంబర ట్వంటీటూ మేడం వాల్చేత తిట్లు కాసేడు మేడం!” అని నా పెద్దరికం కుమ్మర బజార్లోన నిలబెట్టెస్తె పన్నాకొళ్ళందరు ‘ఈ’ అనీసి ఇకిలిస్తంటె. మేడం కర్ర నాకాణ్ణించి నాగలష్మీ మీదకి తిప్పీసి గన్నులాగ దానిమీద పెట్టీసి “ఊఁ చెప్పు నాగలష్మీ? టోటల్ ఎంత?” అన్నాది. మానాగక్కయ్య పల్లికిలించుకోని నిలబడపోయి “ఎనిమిది మంది పనివాల్లమమ్మ మయింద్రతోను కలుపుకోని. ఒక్కొక్కరికి ఎనపయి సొప్పున ఎనిందీ ఎనిముదుల అరవైనాలుగమ్మ. పదులు స్థానమునందు సున్న యెట్టెస్తమ్మ మొత్తము టోటల ఆరువొందల నలపయ్యమ్మ!” అన్నాది. వల్లీమేడం బేగునోనుండి వెయ్యనోటు తీస్సి దానికి వజ్రకిరీటంనాగ నెత్తిమీదాడించి “మరి దీక్షూ రాజేష్ చిన్నిపిల్లలు కదవే! వాళ్ళకి ఆఫ్ టికట కదా? కానీ మహిందర్ కి ఫుల్! సో… మొత్తం సిక్స్ ఫాటీ … అంటే ఆరువందల నలభయ్యి? ఊఁ? గుడ్..?” అనీసి మూతి, కళ్ళు, బుర్రకాయ ఇటీపటీపు తిప్పుకోని ఆ వెయ్యినోటు నాగలష్మీ చేతులెట్టుకోని సెడ్డు గుమ్మం దిగిపోతంది. గుంట్నాకొళ్ళందరము రోబోకి లడీ అయిపోయి బిలబిల్లాడి దిగిపోతంటె మహిందర గేటు పెట్టిసి లైను కట్టించీసి “వన్ బై వన్… వన్ బై వన్!” అంటన్నాడు. ఆడు నరజన్మెత్తేక ఓ మాటైన మాటాడి ఓ పలుకైన పలకటము ఇదే మొదాటసుట్టు!