ఒక నేను, కొన్ని నువ్వులు

“ఎందుకిట్లా నా వెంటపడుతున్నావు?”

“నీకు నిజంగా తెలియదా? నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు.”

“నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?”

“అవును, ఇంకా నమ్మవా?”

“మరి నాకోసం ఏమయినా చేస్తావా?”

“తప్పకుండా! అడిగి చూడు.”

“ఏదయినా?”

“నా ప్రాణమయినా ఇస్తాను. నా నెత్తుటితో రాసిన ఉత్తరం చదివి కూడా అంత అపనమ్మకమా? నీకోసం ఏదయినా చేస్తాను.”

“అయితే నన్ను ఇకపై ప్రేమించకుండా ఉండగలవా? నా చుట్టూ తిరగడం ఆపుతావా? ఇక ఎప్పటికీ నీ మొహం నాకు చూపించకుండా ఉండగలవా?”


నువ్వీ రోజు నాకు నచ్చలేదు. ఇంకెప్పుడూ ఇట్లా రావద్దు. అట్లా చేయొద్దు. దాని గురించి తల్చుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నప్పటికీ.


నువు నా చుట్టూ నా చూపు కోసం, నవ్వు కోసం తిరగడమే గుర్తుంది కానీ నేను నీ చుట్టూ తిరగడం ఎప్పుడు మొదలయిందో గుర్తు రావడం లేదు. మనం రహస్యంగా కలుసుకోవడానికి ప్లాన్స్ వేసుకోవడమూ, ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురు చూడటమూ గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు మనిద్దరమూ కూచుని చెప్పుకున్న కబుర్లు గుర్తు చేసుకుంటాను. మళ్ళీ అనుమానం, అవన్నీ మనం నిజంగా చెప్పుకున్న కబుర్లా, కేవలం నా ఊహలేనా అని. అప్పటి నీమొహం గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తాను. నన్ను చూస్తున్న నీ కళ్ళూ, నాతో మాట్లాడుతున్న నీ పెదాలూ, నా స్పర్శ కోసం సాచిన నీ చేతులూ ఏవీ ఊహకు అందవు. అప్పుడు నేను ఏడుస్తాను.


ఇవాళ నా ప్రేమంతా చూపించాలనుకున్నా నీ పైన. నువు లోపలికి రాగానే ఒక్కసారిగా మీదపడి కౌగిలించుకున్నాను. కానీ నువు భయపడిపోయావు. ఎందుకని? ఎవరినో చూచినట్టు ఎందుకు అట్లా బెదిరిపోయావు? నన్ను గుర్తు పట్టలేదా? నా ప్రేమను కూడా?


ఇట్లా అయితే ఎట్లా? రోజుకో రకంగా వస్తే ఎట్లా చావను? ఇంకెవరన్నా అయితే గుర్తుపట్టకనే పోదురు! అసలు ఇన్ని వేషాలు ఎట్లా వేయగలుగుతున్నావు? పైగా ఎప్పుడూ ఇట్లాగే ఉన్నానని బుకాయింపులు! రోజూ చెప్పేదే నీకు మళ్ళీ చెప్పాలి. అన్నీ మర్చిపోయావా? నువ్వెంతగా నా వెంట పడి మాయ చేశావో, మనమెంతగా ప్రేమించుకున్నామో, ఇంట్లో చెప్పకుండా అర్థరాత్రి రైలెక్కి ఎట్లా వచ్చేశామో… నువ్వేమీ చెప్పవు. రాత్రంతా నాతో ఉండకుండా వెళ్ళిపోతావు రేపొస్తానని. అది నాకు నచ్చకపోయినా బుద్ధిగా తలూపుతాను నవ్వుతూ. ఏడ్చి వెళ్ళొద్దని బ్రతిమలాడితే మళ్ళీ విసుక్కుంటావు. నీకుత్తినే ఎందుకు కోపం తెప్పించడం?


నువ్వొస్తావని అద్దం ముందు కూచుని అలంకరించుకుంటూ ఉంటాను. వీళ్ళంతా నన్ను చూసి ఎందుకు నవ్వుకుంటారు? “ఆ తిక్కలది..” అనుకుంటూ గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. నేను ఎప్పుడో తప్ప పట్టించుకోను. మేడం వాళ్ళను కసురుతుంది నా జోలికి రావద్దని.


నువ్వెందుకని మునుపటిలా మాట్లాడవు? ఎన్ని కబుర్లు చెప్పేవాడివి! దొంగతనంగా కలుసుకున్నప్పుడల్లా ఎంత అల్లరి చేసేవాడివి! ఒకరోజు నా పెదాలు బావున్నాయని, మరో రోజు నా నవ్వు బావుందనీ… ఇప్పుడేం గుర్తు చేయబోయినా కసురుకుంటావు. నీకు ఎప్పుడూ అదే గొడవ, అందుకోసమే వచ్చినట్టు. ఒక పని అయిపోయినట్లు వెళ్ళిపోవడం. ఒక్కోసారి ఏడుపొస్తుంది కానీ ఏడవను. ఏడిస్తే మళ్ళీ నువ్వు రావని భయం.


నేను నీ ప్రేమను శంకించడం లేదు. నా నుంచి దూరంగా ఉండలేవు కదా ఒక్క రాత్రి కూడా! నాకర్థం కానిదల్లా నీ అసలు మొహంతో నా ఎదుటికెందుకు రావడం లేదా అని. దాని కోసమే మనాది పుడుతుంది అప్పుడప్పుడూ. ఏదో చందమామ కథలో శాపం తగిలిన రాకుమారుడిలా ఇన్ని రకాల పేర్లతో, మొహాలతో, శరీరాలతో, ఇన్ని వింత వేషాలలోకి ఎట్లా మారిపోగలుగుతున్నావా అని. ఈ రోజు ఏం కాబోతున్నావు? ఎట్లా రాబోతున్నావు? అలంకరించుకుంటున్నంతసేపూ అదే ధ్యాస. కుతూహలంగానూ, సరదాగానూ ఉంటుంది.


నన్నిక్కడ వదిలేసి ఇన్ని రోజులకా వచ్చేది! నిన్ను చూచి నేను అసలు గుర్తు పట్టలేదు. ఎంతగా మారిపోయావు! పొట్టిగా,తెల్లగా అయ్యావు. మొహం కోలగా అయింది. మీసాలూ గడ్డాలూ పెంచావు. పెదాలు పల్చగా అయ్యాయి. ముక్కుమీద పుట్టుమచ్చ మాయమయింది. పోలికలే పూర్తిగా మారిపోయాయి. నీ వొంటివాసన కూడా తేడాగా ఉంది. ఎవరిలాగానో ఉన్నావు ఏదో పరకాయప్రవేశం చేసినట్టు. నువ్వు నన్ను తాకిందాకా తెలియలేదు. నువ్వు మాత్రమే అంత కోరికతో తాకగలవు నన్ను.


నన్ను గుర్తు పట్టనట్టు ఎందుకు నటిస్తున్నావు? అందుకే నిన్ను ఆట పట్టించాలని నేనూ గుర్తు పట్టనట్టు నటించానివాళ. అయినా నువు పట్టించుకోలేదు. కోపమొచ్చిందా? ఇప్పుడైనా తిక్క కుదిరిందా? ఇట్లా ఎన్నాళ్ళు నాటకాలాడతావో నేనూ చూస్తా!


ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్ళావు? ఎప్పుడొస్తావు? నీకేమన్నా కోపం తెప్పించానా? వీళ్ళు నన్ను బయటికి పోనివ్వరు. నువ్వే వస్తావని చెప్తారు. నిన్ను వెతకాలన్నా నాకీ ఊరు తెలీదు. నువ్వు నాకు బహుమతిగా ఇచ్చిన వస్తువులన్నీ పెట్టెలోంచి తీసి ఎదురుగా పెట్టుకుని కూచున్నానివాళంతా. ఒక్కోటీ పట్టుకుని అది నువ్వు నాకిచ్చిన సందర్భాన్ని తలుచుకున్నాను. అప్పుడు నువ్వు చూపించిన ప్రేమనీ. ఎంత సంబరంగా అనిపించిందో!


మేడం మంచిది. నేనెప్పుడూ చూడని అమ్మను గుర్తుకు తెస్తుంది. ఏవేవో కబుర్లు చెప్తుంది. ప్రేమగా అన్నం తినిపిస్తుంది. ఆమె లేకపోతే ఇక్కడ ఉండే దాన్ని కాదు. తిరిగి వెళితే నాన్న ఇంట్లోకి రానివ్వడనో, చంపేస్తాడనో భయమున్నప్పటికీ వెళ్ళిపోయేదాన్నే.


“నన్నెప్పటికీ ఇలాగే ప్రేమిస్తావా?”

“సందేహమా? తప్పకుండా!”

“నా అందాన్ని చూసి కదూ!”

“కాదు. నీ అందమైన మనసు చూసి!”

“మరెప్పుడూ నా అందాన్నే పొగుడుతావేం? రేపేదన్నా జబ్బు చేసి నిజంగానే చందమామకిమల్లే నా మొహం నిండా మచ్చలు పడ్డాయనుకో! అప్పటికీ ప్రేమిస్తావా?”

“అవును.”

“యాక్సిడెంట్లో ఒక కాలు విరిగిందనుకో! అప్పుడు?”

“అయినా ప్రేమిస్తూనే ఉంటాను.”

“మరి నా కళ్ళు పోయాయనుకో? అప్పటికీనా?”

“అవును, అప్పటికీ!”

“ఈ మల్లెపూల వాసన బదులు ఏదో కంపు కొడుతూ ఉన్నాననుకో! అప్పుడూ?”

“చెప్పాగా!”

“ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వేరే అమ్మాయిలా మారిపోయాననుకో?”

“అయినా నువ్వూ, నీ మనసూ మారవు గదా! అప్పటికీ ప్రేమిస్తాను.”

“సరే, నేనూ మారిపోయాననుకో! నా రుచులూ, ఇష్టాలూ మారిపోయాయనుకో! నిన్ను ప్రేమించడం లేదనుకో!”

“అయినా ప్రేమిస్తాను.”

“నిన్ను తిట్టి పోశాననుకో, అసలు తెలియనట్టు పట్టించుకోలేదనుకో, నా మూలంగా నీకు సుఖమూ సంతోషమూ ఏదీ కలగడం లేదనుకో, ఇంకా అపరిచితురాలి లాగా రకరకాలుగా పిచ్చిదానిలా ప్రవర్తించేననుకో!”

“అయినా సరే!”

“నిజంగా? అంటే నేను నేను కాకపోయినా ప్రేమిస్తావా? మరి నాబదులు ఇంకెవరినన్నా ప్రేమించొచ్చుగదా?”


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...