ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం

మన లలితగీతాలూ, సినిమాపాటలూ ఎక్కువగా శాస్త్రీయరాగాలపై ఆధారపడతాయి. వాటిలో చెవికింపుగా ఉండి ఆకట్టుకునేవి చాలానే ఉన్నాయి. అందులో ఖమాజ్ రాగం ఒకటి. దీన్ని హిందూస్తానీలో ఖమాచ్ అనీ, కర్నాటకంలో కమాస్ అనీ కూడా వ్యవహరిస్తారు. పేరులోనే కాక స్వభావంలో కూడా రెండు శైలుల్లోనూ ఈ రాగం దాదాపుగా ఒకేలా వినిపిస్తుంది. ఈ రాగానికి ఉదాహరణలు వింటే దీన్ని గుర్తుపట్టడం నెమ్మదిగా అలవాటవుతుంది.

ఈ రాగానికి ఆరోహణ, అవరోహణ ఇలా ఉంటాయి.

హిందూస్తానీలో ఆరోహణ స గ2 మ1 ప ధ2 ని1 స ని2 స. అవరోహణ స ని1 ధ2 ప మ1 గ2 రి2 స. ముఖ్యంగా వినబడే ప్రయోగం గ2 మ1 ని1 ధ2 మ1 ప ధ2 మ1 గ2 రి2 స.

కర్నాటకంలో ఆరోహణ: స మ1 గ2 మ1 ప ధ2 ని1 స. అవరోహణ: స ని1 ధ2 ప మ1 గ2 రి2 స. ముఖ్యంగా వినబడే ప్రయోగం ప ధ2 ని2 స ని1 ధ2.

హిందూస్తానీ ఖమాజ్ రాగం ఖమాజ్ ఠాఠ్‌లో జన్యం. కర్నాటకం కమాస్ హరికాంభోజి మేళకర్తలో జన్యం. ఈ జనకరాగాల ఆరోహణ, అవరోహణలు ఒకలాంటివే: స గ2 మ1 ప ధ2 ని1 స.

హిందూస్తానీలో ఆరోహణలో ని2 (కాకలి నిషాదం) కాస్త బలంగా వినిపిస్తుంది. రెండు పద్ధతుల్లోనూ శాస్త్రీయరచనలూ, జావళీలూ, ఠుమ్రీలూ కూడా ఉన్నాయి. ఈ రాగానికి కాస్త రొమాంటిక్ పోకడలుండడమే అందుకు కారణం.


మైసూర్ వాసుదేవాచార్

తెలుగువాళ్ళకి దేన్ని ‘ఎక్కించా’లన్నా సినిమాలే శరణ్యం కనక శంకరాభరణం సినిమాలోని పాటలవల్ల శాస్త్రీయసంగీతానికి కొంత గ్లామర్ అబ్బింది. తద్వారా బ్రోచేవారెవరురా అనే కీర్తన కమాస్ రాగం లోనిదని చాలామందికి తెలిసింది. ప్రసిద్ధ వాగ్గేయకారుడు మైసూర్ వాసుదేవాచార్ (1865-1961) రచించి, స్వరపరిచిన ఈ కీర్తనకు ప్రోగ్రాముల్లో అనౌన్స్‌మెంట్ ‘రచన వేటూరి, సంగీతం మహాదేవన్’ అని చెప్పిన సందర్భాలు నేను చూశాను. అలాగే విప్రనారాయణ సా విరహే రికార్డు మీద రచన సముద్రాల అని ఉండేది.

ఈ రాగానికి ఉన్న శాస్త్రీయస్వరూపానికి కొన్ని ఉదాహరణలు వినవచ్చు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాడిన ఒక కర్నాటక రచన వినండి. అలాగే సీతాపతే అనే త్యాగరాజకీర్తన మదురై మణి అయ్యర్ గానంచేశాడు. బాలమురళీకృష్ణ చేసిన రాగాలాపన, పక్కవాద్యాలేవీ లేకుండా వినిపించిన సుజనజీవనా అనే త్యాగరాజకీర్తన కూడా బావుంటాయి. ఈమని శంకరశాస్త్రి వీణమీద వినిపించిన బ్రోచేవారెవరురా మనం విని ఆనందించవచ్చు.


ఈమని శంకరశాస్త్రి

చిట్టిబాబు వీణమీద వాయించిన జావళీ కూడా కమాస్ రాగమే. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో మాయూరం విశ్వనాథశాస్త్రి అనే ఆయన కమాస్ రాగంలో రచించిన జయతి జయతి భారతమాతా అనే దేశభక్తి గీతాన్ని పెద్ద విద్వాంసులందరూ పాడుతూఉండేవారు. దాన్ని జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం (1910-65) పాడిన తీరు వింటే కర్నాటకసంగీతంలో ఈ రాగం ఎలా వినిపిస్తుందో అర్థమవుతుంది. మహాత్మాగాంధీకి ఇష్టమైన నర్‌సింహ్ మెహతా రాసిన గుజరాతీ గీతం వైష్ణవజనతో కూడా ఈ రాగమే. ఈ రాగం హిందూస్తానీలో ఎలా వినిపిస్తుందో తెలియాలంటే ఈ స్వరమాలిక పాఠం బాగా పని కొస్తుంది. గాత్రంద్వారా ఈ రాగం సాధన చెయ్యదలుచుకున్న పాఠకులు దీన్ని ఉపయోగించుకోవచ్చు.

హిందూస్తానీలో ఖయాల్ మాత్రమే కాక ఠుమ్రీలవంటి ఉపశాస్త్రీయసంగీతానికి ఖమాజ్ తరుచుగా ఉపయోగిస్తారు. రవిశంకర్ (సితార్), అలీఅక్బర్ ఖాన్ (సరోద్) మీద వినిపించిన జుగల్‌బందీ ఈ రాగమే. ఈ రాగ్.ఎఫెం సైట్‌లో ఖమాజ్ రాగం మీద క్లిక్ చేసి వినవచ్చు.

సంతూర్ వాద్యంమీద ఈ రాగాన్ని శివకుమార్‌శర్మ ఇలా వినిపిస్తాడు. ఇదే రాగాన్ని సితార్‌ మీద నిఖిల్‌ బెనర్జీ వాయించగా, జాకిర్ హుసేన్ తబలా సహకారం అందించాడు. ఇందులో తరవాతి దశలో ఇతర రాగాలు రాగమాలిక రూపంలో వినిపిస్తాయి.


బర్కతలీ ఖాన్ (ఎడమ చివర)
(బడే గులాం మధ్యలో)

బడేగులాం అలీఖాన్ తమ్ముడు బర్కతలీ ఖాన్‌ కూడా గొప్ప ఠుమ్రీ గాయకుడేగాని ఎక్కువగా అన్నగారి పక్కన హార్మోనియం వాయించేవాడు (1905-65). పాకిస్తాన్‌లో స్థిరపడిన ఆయన గాత్రంలో హార్మోనియం పోకడలు ప్రస్ఫుటంగా వినిపిస్తాయి. ఆయన శిష్యుల్లో బడేగులాం కుమారుడు మునవ్వర్ అలీ, ప్రముఖ గజల్ గాయని బేగంఅఖ్తర్, గాయకుడు గులామలీ తదితరులున్నారు. ఆయన పాడిన ఖమాజ్ ఠుమ్రీ జాఓ కదర్ నాహీఁ బోలో ఎంత అందంగా ఉంటుందో వినండి. ఈ ఠుమ్రీని ఆయన హైదరాబాద్ నవాబ్ జాహిర్ యార్ జంగ్ సంస్థానంలో పాడాడట. ఖమాజ్ రాగాన్ని జానపదశైలిలో బిస్మిల్లాఖాన్ (షహనాయీ), విలాయత్‌ఖాన్ (సితార్) వాయించిన పద్ధతి వినండి. అలాగే విలాయత్‌ఖాన్ ఖమాజ్ రాగాన్ని మధ్యమం మీద నిలిపి వాయించిన గత్ వినండి.


అన్నపూర్ణాదేవి

కొన్ని సందర్భాల్లో దీన్ని మాంఝ్ ఖమాజ్ అని అంటారు. ఈ గత్ ఆధారంగా నౌషాద్ గంగాజమునా సినిమాలో ఆశాభోంస్లే చేత ఒక పాట పాడించాడు. మాంఝ్ ఖమాజ్ రాగం అన్నపూర్ణ సితార్‌ మీద వాయించిన శైలి వినండి. ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ కుమార్తెగా, అలీ అక్బర్‌ఖాన్ చెల్లెలుగా, రవిశంకర్ భార్యగా ఈమెకు గుర్తింపు ఉంది. 1926లో జన్మించిన ఈ అసామాన్య కళాకారిణి శిష్యులలో ప్రముఖ వేణువిద్వాంసుడు చౌరాసియా ఒకడు. భర్తతో మనస్పర్ధల కారణంగా ఈవిడ కళారంగంనుంచే పూర్తిగా నిష్క్రమించడం మన దురదృష్టమే.

హిందీ సినీగీతాల్లో ఖమాజ్ ఉపయోగం చాలాసార్లు జరిగింది. కొన్నిటిలో దీన్ని ‘ఉద్దేశ పూర్వకంగా’ ప్రయోగించారు. ఉదాహరణకు ఎస్.డి.బర్మన్ అభిమాన్ యుగళగీతంలోనూ , ఆర్.డి.బర్మన్ అమర్‌ప్రేమ్‌ రెండు పాటల లోనూ ఇలా చేశారు. అలాగే బుడ్ఢామిల్‌గయాలో మన్నాడే పాట కూడా ఆర్.డి.బర్మన్‌దే.

రాగపు శాస్త్రీయలక్షణాలను కొట్టవచ్చినట్టుగా ఉపయోగించకుండా అందమైన ట్యూన్లు చేసినప్పుడే సంగీతదర్శకుడి ప్రతిభ బాగా తెలుస్తుంది. అటువంటి పాటల్లో రాజ్‌హఠ్ సినిమాలో లతా చేత శంకర్ జైకిషన్ పాడించినదీ, పరఖ్ సినిమాలో సలిల్ చౌదరీ పాడించినదీ, ఆర్‌తీలో రోషన్ చేసిన తేరేబిన్ సాజన్, అబ్ క్యా మిసాల్ దూఁ అనే పాటలూ గుర్తుకొస్తాయి.

షరారత్ అనే సినిమాలో కిశోర్‌కుమార్ రెండు పాత్రలు ధరించాడు. తమాషా ఏమిటంటే రెండో పాత్రకు రఫీచేత ప్లేబాక్ పాడించారు. ఆ పాట కూడా ఖమాజ్ రాగమే. శాస్త్రీయరాగాలను అంతగా లక్ష్యపెట్టని ఓ.పి.నయ్యర్ కశ్మీర్‌కీ కలీ సినిమాకి ఖమాజ్ ఆధారంగా చేసిన పాట ప్రజాదరణ పొందింది.

ఇక చివరకు మనకందరికీ పరిచితమైన తెలుగు సినిమాల మాటకొస్తే ఖమాస్ రాగాన్ని ఎక్కువగా వాడినది ఎస్. రాజేశ్వరరావేనని తెలుస్తుంది. ఆయన ఒకటి రెండు తప్ప సామాన్యంగా హిందూస్తానీ పోకడలనే ఆదరించాడని పై ఉదాహరణలు గమనించినవారికి అర్థమవుతుంది. కాస్త కర్నాటక పద్ధతిలో చేసినవి రెండూ భానుమతి మల్లీశ్వరిలోనూ, విప్రనారాయణలోనూ పాడినవి. మిస్సమ్మలో ఆయన స్వరపరిచిన తెలుసుకొనవె చెల్లీ కర్నాటకశైలిలో వినపడదు. డా. చక్రవర్తిలోని రెండు పాటలు (పాడమని నన్నడగ) అదే రాగం. చిట్టిబాబు వీణ ఇందులోని అదనపు ఆకర్షణ. కులగోత్రాలు సినిమాలో శకుంతల సీన్‌ కోసం ఆయన చేసిన మొదటి గీతం ఖమాచ్, తిలంగ్ రాగాల కాంబినేషన్.

ఘంటసాల సంగీతం సమకూర్చిన కుంతీకుమారి రూపకంలో మొట్టమొదటి పద్యం ఈ రాగమే. పెండ్యాల చేసిన ఓ చెలీ కోపమా ఖమాస్ రాగమే. సత్యం స్వరపరిచిన అందమె ఆనందం సినిమాలోని మధుమాసవేళలో కూడా ఇదే రాగం.

మొత్తంమీద ఈ రాగంలో కొంత రొమాన్స్, కొంత లాలింపూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇందులోని రచనలు శాస్త్రీయమైనా, కాకపోయినా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఆడియోలు మీ రాగపరిచయానికి ఏ మాత్రం ఉపకరించినా సంతోషమే.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...