నన్ను ఎవరో చదివారు

ఈ రోజు
నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
ఏమి స్ఫురించిందో
పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయారు

నన్ను ఎవరో చదివారు
విద్యాబుద్దులు నేర్పిన గురువుల
చిత్రపటాలను ఎవరో తడిమి చూశారు
ఆ మూల గదిలో పడవేసినవాటిని
మళ్ళీ గోడలకు తగిలించారు

నా నడకకు సత్తువ నిచ్చే ఎముకలు కీళ్ళను
ఎవరో స్పృశించారు
నడకతీరును గమనించి
ఎవరికివారు ఊహా చిత్రాలను గీస్తుంటే
నా మేథో సంపత్తికి గర్వంతో తల ఎగరవేశాను

కళ్ళకు కనపడని గుండె కవాటాల మూలల్లో
ఎక్కడో దాగిన
గురువుల కంఠస్వరాన్ని వినిపించారు
వారి స్వరాల భుజాలపై నే వూరేగుతున్నాను

హృదయపు పలకపై చెక్కిన అక్షరాలు
ఎన్నడూ నే గమనించకున్నా
శిలా శాసనాలై జీవితాన్ని నడిపిస్తున్నాయి
సముద్రాల ఆవలితీరాలను ముడివేస్తున్నాయి

నేను చేసిందేమిటని తిరిగి చూశాను
ఎంత వెదకినా నాదంటూ ఏమీ లేదక్కడ
నీవు చదవటం కోసం పుస్తకాన్ని తెరిచి వుంచానంతే

ఈ రోజు
నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
నా గురువులను చదివారు