12
తర్కానికి ప్రాతిపదిక అనుభవం. మనుషులందరం ప్రాధమికంగా నేర్చుకొని, ఉపయోగించుకునే తర్కానికి ప్రాతిపదిక లౌకికమైన జీవితానుభవం. ఈ జీవితానుభవం మనందరికీ అన్ని పార్శ్వాల్లోనూ ఒక్కలాగే ఉండదు. ఇంద్రియాలతో పరిశీలించి, ఆకళింపు చేసుకొనే భౌతిక ప్రపంచం, ప్రకృతి – వీటి అనుభవం మనందరికీ దాదాపు సమానంగానే ఉంది. రాయి గాల్లోకి విసిరితే కింద పడుతుందనీ, ముల్లు గుచ్చుకుంటే నొప్పెడుతుందనీ, మందార పువ్వు ఎర్రగా ఉంటుందనీ ఇలాంటి అనుభవాలు ఇంద్రియాలు సరిగా పనిచేసే మనుషులందరికీ ఒక్కలాగే ఉంటాయి. కాని జంతులోకపు ప్రవర్తనల్ని మనం పరిశీలించి, అవగాహన చేసుకొనే అనుభవం ఇంతకంటే వివిధంగాను, జటిలంగానూ ఉంటుంది. ఏదైనా ఒక జంతువుది, మనిషిది చిన్నపాటి ప్రవర్తన – నడక, పరుగు, కేక ఇలాంటివి – మనలో ఒక్కొక్కర్నీ ఒక్కోలా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు పిల్లులు ఇంటికప్పుల మీద భీకరంగా అరుచుకుంటూ రక్కుకుంటూ పరిగెడుతుంటే దాన్ని చూస్తున్నవాళ్ళు ఒకళ్ళు ఆకలి వలన అని, ఇంకొకరు కామం వలన అనీ, మరొకరు జాగా కోసం జట్టీలనీ అర్ధం చేసుకుంటారు. ఒకే మనిషి ప్రవర్తన ఒకరికి ముచ్చటగా ఉంటే, ఇంకొకరికి వెగటుగా ఉంటుంది. చివరిగా, అంతరంగాన్ని పరిశీలించి, అవగాహన చేసుకొనే అనుభవాల్లో చెప్పనలవి కానంత వైవిధ్యం ఉంది. అంటే, ప్రకృతిని గురించిన తర్క చర్చలో అభిప్రాయ బేధాలకు, సిద్ధాంతాల్లో వైవిధ్యాలకూ ఆస్కారం కొద్దిగా ఉంటే, ఇలాంటి వైవిధ్యం ప్రవర్తనల విషయంలో మరింత ఎక్కువగాను, అంతరంగం విషయంలో మరీ ఊహకు అందనంత ఎక్కువగానూ ఉన్నాది. దీనికి కారణం వ్యక్తిత్వాల్లో – అంటే మనోవైజ్ఞానికులు, దార్శనికులు self అని, సామాన్యంగా mind అనీ వ్యవహరించే దాన్లోని వైవిధ్యం, సంక్లిష్టత. ఈ కారణం వలన మనస్తత్వ శాస్త్రం, తత్వ శాస్త్రం, Cognitive Science వంటివి అంతరంగం ప్రధానంగా నెరపే చర్చల్లోన అభిప్రాయాల్లో కుడా వైవిధ్యానికీ, బేధాలకూ ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇది ఇదివరకు అనుకున్న సిద్ధాంత సూత్రాలను, లక్షణాలనూ – అంటే Norms and Principlesను నిర్మించుకోవడానికి అడ్డం వస్తుంది. కాని ఇది అధిగమించలేని ఇబ్బంది అయితే కాదు. ఎలాగంటే ఆసక్తి, శక్తి ఉన్నవాళ్ళు పట్టుదలగా ఆలోచించి, చదివి, అర్ధం చేసుకొని, చర్చించి చూడగా వాళ్ళకే ఆశ్చర్యకరంగా అనేకుల వివేచన ఒకే రకమైన నిర్ధారణలకు దారితియ్యటం కూడా ఉంది. అంటే, ఇదివరకు చెప్పుకున్నట్లు విశాలమైన మైదానాల్లో పర్వతాల్లాగా ఈ Norms అనేవి అధికులకు అంగీకారయోగ్యంగా గోచరించటమూ, చివరికి వాటిని ‘సత్యాలు’ అని అంగీకరించటమూ ఇలాంటి మానవీయశాస్త్రాల్లోన సంప్రదాయంగా ఉంది. ఇంత సాధించినా సరే ఈ రంగాల్లోన సాధారణీకరణను (Generalization) ప్రతిపాదించదానికి అడ్డంకిగా ఈ సంక్లిష్టతా, వైవిధ్యమూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. దీనితో మానవీయ శాస్త్రజ్ఞులు మౌలికంగా ఎలా సమాధాన పడతారంటే తాము నిర్మించుకున్న సిద్ధాంత భూమిక మొదట తమకు, తమ అనుయాయులకూ వ్యక్తిగతంగా, అంతరాంతరాల్లోన సంతృప్తికరంగా ఉందా, లేదా అని తరచి చూసుకొని. ఇది చివరికి సాపేక్షం – అంటే subjective. ఉదాహరణకు ఫ్రాయిడ్ (Sigmund Freud), యుంగ్ (Carl Jung), వాళ్ళ అనుయాయులూ భిన్న దృక్పధాలతో నిర్మించిన సిద్ధాంత సంచయాలతో చివరికి ఇలాగే Which school is more satisfying to me? అని వివేచన చేసుకుని సమాధానపడే సంప్రదాయం ఉంది. అయితే – ఇదివరకు బిపిన్ (Bipin Indurkhya) సూచించినట్లుగా Diverse opinions are possible, but not every point of view is admissible. ఈ జల్లెడ అంటే Filterను నిర్దేశించేది తర్కం. తర్కానికి ప్రాతిపదిక అనుభవం. సృజన తర్కానికి ప్రాతిపదిక సృజనానుభవం.
తర్కపు నిర్వహణకు మౌలికమైన పనిముట్టు వాదం; దీన్ని వాదన అని తగువు అనే అర్ధంలో కాకుండా Argument అనే అర్ధంలో తీసుకోవాలి. ఈ వాదం కొన్ని నమ్మకాల్ని, నిర్ధారణలను సమర్ధించటం కోసం హేతువులను ఆధారంగా నిర్వహించే చర్చ. (A unit of discourse in which beliefs are supported by reasons.) ప్రతీ వాదానికీ రెండు అంశాలు అవసరం: ప్రమాణం (Premise), నిర్ధారణ (Conclusion). ఏదైనా విషయాన్ని గురించిన నిర్ధారణల సంచయం, అవి నిరూపితమైన పిమ్మట ఒక సిద్ధాంతం (Theory) అవుతుంది. లోక వ్యవహారాన్ని గురించి, లౌకికమైన జీవితాన్ని గురించీ మనం సాధారణంగా అంగీకరించే సిద్ధాంత సముచ్చయాన్నే సబబు అంటే Common sense అని, సహృదయత అంటే Good sense అనీ వ్యవహరిస్తున్నాము. ఇది ఎక్కువగా ప్రకృతికి, ప్రవర్తనకూ సంబంధించిన సిద్ధాంతాల సంచయం. సాధారణ జీవితంలో ఇంచుమించు అన్ని విషయాల్లోనూ ఇలాంటి నిర్ధారణలు మనం అనివార్యంగా చేసుకొనేవే. ఉదాహరణకు రాయి విసిరితే దెబ్బ తగుల్తుంది. చీకట్లో కళ్ళు కనిపించవు. ఇలాటి సిద్ధాంతాలు అందరూ సకృత్తుగా అంగీకరించేవి. ఇవి కాకుండా అన్నం తినాలా, చపాతీలు తినాలా? పొద్దున్న ఎన్నింటికి లేవాలి? తెల్ల కాయితాలు బావుంటాయా, రూళ్ళ కాయితాలు బావుంటాయా? ఇలా ప్రతి చిన్న విషయంలోనూ అప్రయత్నంగానైనా సరే ఋజువుల్ని పరిశీలించి ఏది సబబో నిర్ణయించుకుంటున్నాము. ఇలాంటి వ్యక్తిగతమైన నిర్ణయాల్ని ఎవరికి వాళ్ళం వివేచించి సిద్ధాంతం చేసుకుంటాము. ఇలాగే సృజన అనుభవాన్ని గురించిన నిర్ధారణలను కూడా మౌలికంగా, ప్రధమంగా సృజనశీలి తన స్వంత అనుభవం ప్రాతిపదికగా పరిశీలించి, వివేచన చేసి నిర్మించుకోవలసి ఉంటుంది. ఇంకొకరు ఇదివరకు చెప్పింది యదాతధంగా మన అనుభవానికి పనికిరాదు. చిన్నవి, పెద్దవీ అని తేడా లేకుండా ఆంతరంగికమైన, వ్యక్తిగతమైన అనుభవానికి సంబంధించిన విషయాలన్నిటికీ ఈ పరిమితి, జాగ్రత్త వర్తిస్తాయి. తిండి, దుస్తులు, వృత్తి, వినోదం, స్నేహం, పెళ్ళి వంటి వందలాది జీవితానుభవాల్లో మనం తీసుకునే నిర్ణయాల్లో, ఎవరివి ఎన్ని సలహాలు, సూచనలు, సిఫారసులు తీసుకున్నా చివరికి నిర్ణయమైతే మనది; చాలా వ్యక్తిగతమైనది. ఈ అన్నిటికీ మనదైన ‘లక్షణ సిద్ధాంతాన్ని’ మనమే స్వయంగా నిర్మించుకున్నంటే తప్ప సంతృప్తి లేదు.
ఈ లక్షణ సిద్ధాంతాల్ని ఏ చిన్న విషయంలోనైనా సరే, ఇంకెవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ అవగాహన, అనుభవం ప్రాతిపదికగా ఎంత స్థిరంగా, బలంగా ప్రతిపాదించినప్పటికీ, అది మనదైన అనుభవంతో గీటు రాసుకోకుండా అంగీకరించినా, తిరస్కరించినా కూడా చివరికి అసంతృప్తికరంగా ఉంటాయి. అంటే – They do not satisfy. గుండుగొమ్ములనుమానం అలాగే ఉండిపోతుంది. ఉవాచలు, సిఫారసులూ దీన్ని పూర్తిగా, నిస్సంశయంగా నివృత్తి చెయ్యలేవు. అవి మంట చల్లార్చటానికి మరింత చమురు పోసినట్టు సంశయాన్ని ఎగసనదోస్తాయి. సాధారణంగా సాహితీ చర్చలు ఇందుకే భగ్గున మండి అసంతృప్తికరంగానో, లేకుంటే నొప్పింపక తానొవ్వక మన్ననగా, మర్యాదగానో ముగుస్తాయి. ఎందుకంటే మీ అనుభవం ప్రాతిపదికగా నిర్మించుకున్న అవగాహన నాకు ఎంత ప్రయత్నం చేసినా ఆ అనుభవాన్ని కలిగించలేదు. మరి మీ అనుభవం నాదెలా కాగలుగుతుంది? మీ ఉవాచను నేనూ, నా ఉవాచను మీరూ ఎలా ఒప్పుకుంటాము? ఇది తత్వశాస్త్రం లోన చాల పాత ప్రశ్న. దీన్ని వాళ్ళు సాధారణ అనుభవంలో మనం సునాయాసంగా ఒప్పుకొనే ‘చిన్న చిన్న’ విషయాలకు కూడా వర్తింపచేసుకుంటారు. ఉదాహరణకు, ఎదుట వేరే మనుషులు ఉన్నారనీ, వాళ్ళకొక మనసు (mind) ఉందనీ నాకు ఎలా రూఢి అవుతుంది? ఏ ప్రాతిపదికన, ఏ ప్రమాణాల్ని చూపించి నేనూ, ఇతరులూ ఉన్నామని నిర్ధారించుకుంటాను? ఇలాంటివి తత్వశాస్త్రం లోన ఇంకా నిర్ధారణ కానివి – అంటే unsettled ప్రశ్నలు. ఇదివరకు చెప్పిన వైజ్ఞానికుడు కరూథర్స్ (Peter Carruthers) వంటివాళ్ళ ఆసక్తి Philosophy of Mind అని వ్యవహరించే ఇలాంటి వివేచన. దీన్ని వాళ్ళు నిర్వహించే పద్ధతి ఆదికి ముందే Assertions అంటే నిర్ధారణలు, సిఫారసులతో ప్రారంభించకుండా, ముందు విస్తారంగా చర్చిస్తున్న విషయం స్వరూపాన్ని, స్వభావాన్నీ విశదం చేసే ప్రమాణాలు, ఋజువులు (Facts, Premisses), ఆలోచనలూ అన్నింటినీ ఒక్కొక్కటీ పరిశీలిస్తూ, ఎత్తి చూపించి తాము ప్రతిపాదించే సిద్ధాంతానికి అన్వయం చేస్తూ కడపటి నిర్ధారణలను కొంత సంశయంతోనే అప్పటికి పాఠకుని వివేచనకు విడిచిపుచ్చటం. కొత్తగా ఋజువులు దొరికినప్పుడూ, ఆలోచనలు తట్టినప్పుడూ మళ్ళీ ఇంకొకసారి అవే ప్రశ్నలను పరామర్శించటం, ఇలాగ.
కాల్పనిక సృజన అనుభవం, అంటే appreciationకు సంశయం ఉపకరిస్తుంది. ఈ రంగంలో చిన్నప్పట్నుండీ మనను వేలాదిగా ఉవాచలు, అంటే Assertions చుట్టుముట్టి మన అవగాహనను తీవ్రంగా ప్రభావితం చేసినవి ఉన్నాయి. ఇలాంటి ప్రతిపాదనలను నిశితంగా, సంశయాత్మకంగా పరిశీలించకుండానే ఒప్పుకోవడమో, తిరస్కరించడమో చేస్తే లోన అసంతృప్తి అలాగే ఉండిపోతుంది. నా అనుభవంలో వెనుదిరిగి చూసుకుంటే సాహిత్యం పేరిట నేను చిన్నప్పట్నించీ నేర్చుకుని, జీర్ణం చేసుకున్న అవగాహన చాల వరకు ఇలాంటి పరీక్షించుకోని (unexamined) నిర్ధారణల మీద కట్టుకున్నదేమోనని తోస్తుంది. త్రిపురను చూసి చూసీ, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి మొండితనం చూసీ ఈ అనుమానం మరింత బలపడుతుంది. అనుమానం అంటే ఎవరికీ అవమానం కాదు, అగౌరవం కాదు. అందుకు భిన్నంగా ఎవరైనా చెప్పిందీ, రాసిందీ ఆసక్తి ఉంటే గనక శ్రద్ధగా పరీక్ష చెయ్యటం, అనుభవం చేసుకోవటమే ఆ చెప్పిన, రాసిన మాటలకు, సృజనకూ నిజమైన గౌరవం. ఇలాంటి సంశయమే యధాలాపంగా వాడుకలో ఉన్న ‘శాస్త్రీయ దృక్పధం’ అనే వైఖరికి ప్రాతిపదిక. చిన్న పిల్లలు పెద్దవాళ్ళను చూసి, విద్యార్ధులు గురువుల్ని చూసీ నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఆలోచిస్తున్నారో, మాట్లాడుతున్నారో చూసి ఆ రకంగా పిల్లలూ ఆలోచించటం, మాట్లాడటం, ప్రవర్తించటం నేర్చుకుంటారు. దీన్ని Observational Learning అన్నారు.
మన సంస్కృతిలోన గురువు అంటే, గురుస్థానమంటే, గురువు చెప్పిన మాటలంటే అసంకల్పితంగా, అనాలోచితంగా గౌరవాన్నీ, అంగీకారాన్నీ ప్రకటించే పద్ధతి నరనరాల్లోనూ జీర్ణమైపోయి ఉంది. ప్రశ్నించడం, సంశయాన్ని ప్రకటించి అది నివృత్తి అయ్యేదాకా వివేచన కొనసాగించడం గురువు, సహపాఠి గౌరవానికి భంగం అనే మొహమాటంతో మిన్నకుండటం ప్రాచ్య సంస్కృతుల్లో అలవాటైన మర్యాద. మన సంస్కృతిలో, వ్యక్తిత్వాల్లో ఇలాంటి అలవాట్లని గురించి ఇటీవలి కాలంలో సుధీర్ కాకర్ (Sudhir Kakar) విపులంగా వివరిస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళవుతూ తమ జీవితం, వృత్తి, పెళ్ళి, మతం వంటి విషయాల్లోనూ, ఆసక్తి ఉన్నవాళ్ళకు కళ, సృజన వంటి విషయాల్లోన ఇలాంటి మర్యాద అనాలోచితమైన అనుకరణగా, ఒప్పుకోలుగా పతనమౌతుంది. దీన్ని Monkey See, Monkey Do! అన్నారు. అన్ని సంస్కృతుల్లోనూ పిల్లలు ఇలాగే నేర్చుకుంటారు. కాని సదసత్సంశయం (skepticism) పెద్దల యెడల అపచారంగా పరిగణింపబడని సంస్కృతుల్లో పిల్లలు శిక్షణలోని ఇలాంటి పరిమితుల్ని ప్రశ్నించి, అవసరమైతే ధిక్కరించి తమవైన సిద్ధాంతాల్నీ, స్థిరమైన అభిరుచినీ నిర్మించుకోగలుగుతున్నారు. ఈ వెసులుబాటు లేని సంస్కృతిలోన ఆసక్తి, గడుసుతనం, మాటకారితనం ఉంటే సృజనశీలి ముందుగా ఎలాగోలాగ జబర్దస్తీ చేసుకుని గురువుగా, మహాకవిగా, ఒకానొక గొప్ప మానవీయ సాహితీ మేధావిగా అవతరించగలిగితే, అక్కణ్ణించి అతన్ని కధ, కవిత, పాట, నవల, పద్యం, నాటకం, విమర్శ, భాష, వచనం అని ఇలా ఏ విచక్షణా అక్కర్లేకుండా క్రమంగా అన్ని సారస్వత ప్రక్రియలకూ ధర్మకర్త అయిన పెద్ద మేష్టారుగా ప్రతిష్టించి పూజించే అలవాటు ఉంది. బాలరామానుజన్ గురుత్వ కాంక్షకు సంస్కృతి తోవచూపిస్తుంది, దోహదం చేస్తుంది.
సృజన అనుభవం విషయంలో అంగీకారం, సామరస్యం పూజనమూ కాకుండా, తిరస్కారమూ, హేళనా, తల బిరుసూ కాకుండా సంశయము, వెదుకులాట ప్రధానమైన మనఃస్థితి లేదా వైఖరి (Attitude) ఒకటి ఉంది. దీనికి ప్రాతిపదిక అటు నిర్వేదం, అనాసక్తీ, అనిశ్చిత స్థితీ, అనాలోచితమైన వ్యతిరేక భావన – అంటే Cynicism ఇవేమీ కావు; ఇటు సామరస్యం, సుహృద్భావం, పెద్దవారి యెడల భక్తీ, ఉదారవాదమూ – ఇవీ కావు. దీని గమ్యం మూల్యాంకనం, నింద, స్తుతి, అనాసక్తి – వీటన్నిటికీ ఎడంగా అనిర్ణేయకమైన వెదుకులాటతో కూడిన విచికిత్స. ఇలాంటి వివేచన ‘జవాబులు’ అయితే ఇయ్యలేదేమో గాని సమాధానం, అంటే శాంతికి తోవ చూపించగలదు. డెరిడా (Jacques Derrida) సూచించిన పద్ధతులకు ఇలాంటి సంశయం ప్రాతిపదికగా సాధించుకున్న అనిర్ణేయత ముఖ్యం. సారస్వత చర్చలో త్రిపుర వైఖరి కూడా ఇదే. (“These are all possibilities.”) ఆయన్ని చూసి చూసి నేను అనుకున్నదేమంటే ఇదివరకు ఏకరువు పెట్టిన దోషాలు – దుడుకుతనం, గీర, బుకాయింపు, దబాయింపు, పెద్దమనిషి తరహా, అసహనం, కోపం వంటి వాటిని తరచి చూసుకోడానికి ఇలాంటి అనిర్ణయాత్మకమైన వైఖరి, వెదుకులాట ఉపయోగపడతాయి. చర్చ చేసేవాళ్ళు ఇలాంటి పరిణతిని సాధించుకొని ఉన్నవాళ్ళయితే వాళ్ళ సమక్షంలో సారస్వత వాతావరణం అనిర్వచనీయము, అనుభవైక వేద్యమైన స్వస్థతతో, వివేకంతో ఉంటాయి. బెకెట్ (Samuel Beckett) దగ్గర ఇలాగుండేదట. త్రిపుర దగ్గర ఇలాగుంటుంది. నామిని ఇలాంటి వివేకాన్నే అసంకల్పితంగా, అంటే instinctiveగా ఆయనకు తప్పనిసరి అయిన ప్రతీ సందర్భంలోనూ గురి తప్పకుండా ప్రకటించుకుంటున్నారు.
లక్షణమని, సిద్ధాంతమని అంటే అవి ఏవో పెద్ద మాటల్లా ఉంటాయి గాని, వాస్తవానికి ఈ పని కనీసం పాఠకులమైన ప్రతి ఒక్కరం అనివార్యంగా చేస్తూనే ఉన్నాము. ఇతరులు నిర్మించిన లక్షణ సిద్ధాంతాల్ని కూడా ఎవరి అనుభవంతో వాళ్ళం గీటు రాసి చూసుకోవలసిందే. ఇలా చేసే ప్రయత్నంలో పాత కాలపు లక్షణ సిద్ధాంతాల కాల దోషం అడుగడుగునా స్ఫురిస్తూ ఇబ్బంది పెడుతుంది. ఉదాహరణకు ధ్వని, వక్రోక్తి వంటి లక్షణాలను అష్టవిధ నాయికల ప్రణయానుభవాలకూ, నవరస భరితమైన అనుభూతులకూ అన్వయిస్తూ చేసే చర్చ ఇప్పటి సృజనకు కొంత నప్పీ, కొంత నప్పకా అసంతృప్తిగా ఉంటుంది. కొత్త కాలపు కధల వంటి సృజనలకు పాత లక్షణ సిద్ధాంతాల్ని యదాతధంగా అన్వయం చేసే ప్రయత్నాలు ఏమంత పొసగవు. ఇంగ్లీష్‌లో రస చర్చ, సిద్ధాంతం చేసేవాళ్ళు (aesthetes) Does it satisfy me first? అనే ఈ ప్రశ్నను ఒక దిక్సూచిలా వాడుకుంటారు. కవి, పాఠకుడు, సంపాదకుడు, విమర్శకుడు వీళ్ళందరూ ముందుగా పాఠకులు కాబట్టి, సృజనను చదవటం (Reading) అనే ప్రక్రియను గురించిన తమ ‘సిద్ధాంతం’ ఏమిటో ప్రతి ఒక్కరం తప్పనిసరిగా నిర్మించుకుంటున్నాము. ఈ నిర్మాణం మన వ్యక్తిగతమైన సారస్వత సిద్ధాంతానికి ముఖ్యమైనది; దీన్ని ఇతరులు – అంటే మిగిలిన కవులు, విమర్శకులు పరిశీలించాలనీ, ఒప్పుకోవాలనీ ఆశించి, చర్చకు తీసుకొచ్చే ముందుగా అది ఏమిటో మనకంటూ స్పష్టమైన, సంతృప్తికరమైన అవగాహన ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇలాంటి స్పష్టత కోసం అనుభవం – అంటే Cognitive experience ప్రాతిపదికగా చేసే వివేచన ఉపయోగపడుతుంది.
తర్కం ఏ రంగంలోనైనా కష్టమే. లోక సబువైన నిర్ణయాల్లోనే చాల వైవిధ్యానికీ, గందరగోళానికీ ఆస్కారం ఉందే అని తార్కికుల మీమాంస. మన పద్ధతిలోన తర్క మీమాంసకి న్యాయ, వైశేషికాలని పేరు. మన తార్కికులు వితండము, జల్పము, వాదకధ అని తర్క వాదనని మూడు రకాలుగా ప్రతిపాదించేరు. వితండమంటే ప్రతివాదిని ఏదో ఒకలాగ, వెక్కిరింత, తిట్లతో సహా ఎలాంటి పద్ధతుల్నైనా వాడుకొని ఓడించి, నోరు మూయించే పద్ధతి. జల్పమంటే వాది, ప్రతివాది ఇద్దరూ తర్కబద్ధమైన పద్ధతుల్ని, మర్యాదల్నీ పాటిస్తున్నప్పటికీ వాళ్ళ ఆంతరంగికమైన సంకల్పం (Agenda) సత్యాన్వేషణ కాదు. ఎదుటివాళ్ళది ‘తప్పు తోవ’, తమదే ఒప్పు అని ముందుగానే నిశ్చయించుకొని, తమ ప్రజ్ఞంతా ఒడ్డి వాళ్ళ వాదాన్ని పూర్వ పక్షం చెయ్యటమే ఇద్దరి సంకల్పమూను. వీళ్ళ చర్చను పరికించి చూసి ఇరు వైపుల వాదాల్లోని లోపాలు, పరిమితులూ ఏమిటో ఒక అవగాహనకు రావటానికి ఉపయోగిస్తాయి. ఏ మర్యాదనూ అతిక్రమించకుండానే లౌకికంగా జయించుకుని రావడానికి ముఖ్యంగా జల్పం ఉపయోగపడుతుంది. ఈ రెంటికీ ఎడంగా వాదకధ వాదీ ప్రతివాదీ ఇద్దరూ కేవలం సత్యాన్వేషణ కోసమే తర్కబద్ధంగా నిర్వహించే వాదం. ఇలాంటి చర్చకు సదసత్సంశయం, వెదుకులాట సబబైన ప్రాతిపదికలు అవుతాయి. అంతరంగాన్ని వస్తువుగా స్వీకరించి చెయ్యవలసినవి – రస చర్చ, తత్వ చర్చ వంటివాటిలో ‘సత్యం’ అంత సుళువుగా అందివచ్చేది కాదని మన పాతకాలపు తార్కికులు గ్రహించుకున్నారు. మాస్లో (Abraham Maslow) ప్రతిపాదించిన అవసరాల్లోనివి కడపటి రెండు – సృజన, తత్వ జిజ్ఞాస – ఈ రెండూ సబ్రహ్మచారులు, అంటే ‘కజిన్స్’ అనీ, ఈ రెండింటిలో తాత్విక సత్యాన్ని గురించిన వేదాంత చర్చకు వాదకధ బొత్తిగా పనికిరాదనీ వాళ్ళు తీర్మానించేరు. చివరికి తాత్వికము, దార్శనికమైన సత్యాలు కేవలం అనుభవైకవేద్యములనీ, వాటిని నిర్ధారించటానికి అంతిమంగా వాదకధ కూడా అనువైనది కాదని ప్రతిపాదిస్తూనే, చర్చను మాత్రం ప్రోత్సహించి దార్శనిక చర్చకు పద్ధతుల్ని ప్రతిపాదించేరు. కేవలం అనుభవైకవేద్యమైన విషయాల్ని చర్చించీ ఏం ప్రయోజనమని అడిగితే అలాంటి చర్చ అనుభవాన్ని కల్గించడానికి కాదని, సూచించటానికనీ చెప్పుకొచ్చేరు.
పాశ్చాత్యుల్లో పదిహేడవ శతాబ్దపు వైజ్ఞానికుడు డెస్కార్త్ (Rene Descartes) తర్క చర్చలోని ఇబ్బందుల్నీ, లోతు పాతుల్ని గురించి Discourse on the Method అని ప్రచురించేడు. లోక వ్యవహారాల్లో రక రకాల అభిప్రాయ బేధాలకి కారణం తర్కించే పద్ధతుల్లో, వైఖరుల్లో అపోహలని ప్రతిపాదించేడు. “The important thing is to rightly apply our mind to what we are doing.” అని. ఈ తర్క పద్ధతికి నాలుగు సూత్రాల్ని ప్రతిపాదించేడు. అవి: 1. మనకి నిజమేనని, సబబు అని స్వయంగా, బలంగా తోస్తేనే తప్ప ఇతరులు చెప్పే మాటల్ని, చేసే సిద్ధాంతాన్నీ ఏ ఇతర కారణాల వలనో తొందరపడో, మొహమాటపడో ఒప్పుకోకూడదు; 2. జటిలం, సంక్లిష్టమని తోచే విషయాల్ని చిన్న చిన్న అంశాలుగా విడగొట్టుకొని వివేచన చేస్తూ మొత్త విషయాన్ని అవగాహన చేసుకోవాలి; 3. సరళంగా అర్ధమయ్యేవాటిని ముందుగా స్వీకరించి అర్ధం చేసుకుని, ఆ పిమ్మట అంతకంటె కష్టమైనవి పరిశీలించాలి; 4. ఒక చర్చకు సంబంధించిన అన్ని విషయాల్నీ సంపూర్ణంగా, కూలంకషంగా పరిశీలించి, ఏదీ విడిచిపెట్టలేదని నిర్ధారించుకున్నాక గాని ఆ విషయాన్ని గురించి నిర్ధారణలకు రాకూడదు. ఆయన ఈ సూత్రాల ప్రాతిపదికన నిర్వహించే వివేచనను The Method అన్నాడు. పరిశీలించి చూస్తే ఇవి నాలుగూ చాలా ఉపయోగపడే సూత్రాలని బోధపడుతుంది. ఈ నాలుగు సూత్రాలనూ మన్నిస్తూ ఇక్కడ లేవనెత్తిన మూడు ప్రశ్నలనూ పరామర్శించినట్లయితే పనికొస్తుంది.
కాల్పనిక సృజన అనుభవం, అంటే ఇక్కడ సృజన అనుభవం అంటూ వస్తున్నది మౌలికంగా ఆంతరంగికమైనది. అంచేతనే కవి వ్యక్తిత్వం, పాఠకుని వ్యక్తిత్వం కలిసీ, విడి విడిగానూ సృజన ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. దీనికి తోడుగా కవి, పాఠకుడూ బతుకుతున్న సమాజపు సాంస్కృతిక, రాజకీయ వ్యవస్థల ఆవరణం కూడా సృజన వ్యాసంగాన్ని ప్రభావితం చేస్తాయి. అందువలన, సృజన స్వరూపాన్ని అర్ధం చేసుకోవాలంటే ఈ మూడింటినీ – కవి మనసు, పాఠకుని మనసు, వాళ్ళు బతుకుతున్న సమాజపు సాంస్కృతిక, రాజకీయ ఆవరణం – ఈ మూడింటినీ అర్ధం చేసుకోవాలి. ఇంగ్లిష్‌లో నేటి కాలపు రస సిద్ధాంతులు ఇలాంటి పద్ధతుల్ని ఉపయోగించుకొని లక్షణ చర్చను నిర్వహిస్తున్నారు. వ్యక్తిత్వం (self) లోని వైవిధ్యానికి కారణాలను ఇప్పటి మటుక్కి స్థూలంగానైతే ప్రకృతి, సంస్కృతి (Nature, Nurture) అని అర్ధం చేసుకోవచ్చు గాని, కళ, కాల్పనిక సృజన అనుభవాన్ని గురించిన వివేచన కోసం ఈ self స్వరూపాన్ని, స్వభావాలనూ కూలంకషంగా పరామర్శించవలసి ఉంటుంది. ఆధునికులైన లక్షణకారులు, దార్శనికులు కూడా సృజన తత్వపు వివేచనకు వ్యక్తిత్వాన్ని గురించిన అవగాహన తప్పనిసరి అని నిర్ధారిస్తున్నారు. ఇదివరకు Cognitive Science అన్నది selfను గురించిన ఈ అవగాహనను చర్చలో విస్తారంగా వాడుకుంటుంది.
వ్యక్తిత్వాల్లో, సామాజిక ఆవరణంలో బేధాలు సృజన అనుభవాన్ని ఎంతో బలంగా ప్రభావితం చేస్తాయన్న ప్రతిపాదనకు నాందిగా ఒక దృష్టాంతం. నది ఒడ్డున ఇసకలో ఒక నాలుగు రాళ్ళు పడున్నాయి. ఒకతన్ని కుక్కలు తరుముతూ వెంటపెడుతున్నాయి. అతను చప్పున ఆ రాళ్ళని అందుకుని కుక్కల మీదికి విసురుతూ తప్పించుకుంటాడు. ఇంకొకతను శివ భక్తుడు. ఆ రాళ్ళని చూసి పరవశించిపోయి ‘పరమేశ్వరా!’ అని దండాలు పెడతాడు. ఇంకొకతను రంగురాళ్ళ వ్యాపారి. ఒక్కోరాయినీ పరిశీలిస్తూ తన వ్యాపారానికి ఏవి ఎక్కువ పనికొస్తాయోనని లెక్క చూసుకుంటాడు. మరొకడు ఖనిజ శాస్త్రజ్ఞుడు. తను ఇదివరకు చదువుకున్న ఖనిజ శాస్త్రం నుండి రాళ్ళ లక్షణాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క రాయీ అది ఏ జాతికి చెందిందో పరిశీలిస్తాడు. ఇంకొకడు కళాకారుడు, దృశ్య శిల్పి. ఇతను ఆ రాళ్ళు ఇసకలో అమరి ఉన్న పద్ధతిని చూసి జాపనీస్ రాక్ గార్డెన్‌ను జ్ఞప్తికి తెచ్చుకొని మురిసిపోతాడు. అవే రాళ్ళని తమ పూర్వ జ్ఞానం, తమ వ్యక్తిత్వం, పరిస్థితుల ప్రాబల్యం వలన ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా ‘రూపించుకున్నారు’. అంటే ఒకే వస్తువు వాళ్ళ అంతరంగంలో నిర్మించుకున్న రూపకం (Metaphor) బేధం వలన కుక్కల్ని కొట్టే ఆయుధంగా, భగవత్స్వరూపంగా, వ్యాపార వస్తువుగా, పరిశోధనా వస్తువుగా, కళా వస్తువుగా ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా గోచరిస్తున్నాది. దీన్లో పరిస్థితులు – అంటే సామాజిక, రాజకీయ అవసరాల ప్రభావం అనేదానికి ఉదాహరణగా – కుక్కలు గనక వెంట తరుముతుంటే మాత్రం పై ఐదుగురిలో ఏ ఒక్కరూ కూడా, తనొక కళాకారుణ్ణనీ, శాస్త్రజ్ఞుణ్ణనీ, వ్యాపారిననీ, భక్తుడిననీ ఇలా స్పృహ లేకుండా, ముందు రాళ్ళు ఏరుకుని కుక్కల్ని తరిమికొట్టే పనిలోనే పడతారు: భద్రత అందరికీ మౌలికమైన అవసరం కాబట్టి. కాల్పనిక సృజన స్వరూపాన్నీ, దాన్ని వివరించే ఇదివరకటి లక్షణ సిద్ధాంతాలనూ అర్ధం చేసుకోడానికి రూపకం, ఉపమ వంటి సాదృశ రూపాల్నీ, వాటిని స్వీకరించటంపై వ్యక్తిత్వం, సామాజిక పరిస్థితులూ చూపే ప్రభావాన్నీ అర్ధం చేసుకుంటే పనికొస్తుంది.
రూపకమే కాకుండా, సృజనకు మౌలికమైన మానసిక వ్యవస్థలు – స్ఫురణ, లయ, నర్తన, ఔద్వేగిక స్థితి వంటివి ఉన్నాయి. శరీర విజ్ఞానాన్ని చదువుకోడానికి శరీరాన్ని నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ, జీర్ణ మండల వ్యవస్థ ఇలా అనేక వ్యవస్థలుగా (Systems) ముందు అర్ధం చేసుకుని, ఆ పైన ఈ అన్నీ కలసి శరీరాన్ని నడిపే పద్ధతిని అర్ధం చేసుకుంటారు. అలాగే వాహనాలు నడిచే పద్ధతిని Transmission, Cooling, Steering, Suspension ఇలా అనేక వ్యవస్థల్ని పరిశీలిస్తూ అవగతం చేసుకుంటారు. అలాగే కాల్పనిక సృజన శరీరాన్ని పైన చెప్పిన మానసిక వ్యవస్థల వంటివి ఎన్నింటినో గుర్తించి, వాటి స్వరూపాన్నీ, స్వభావాన్నీ, కావ్య శరీరంలో వాటి పాత్రలనూ ఒక్కొక్కటీ విడి విడిగా పరిశీలించి, ఆ పైన అవన్నీ కలసి కావ్యపు ఆత్మను – అంటే The Gestalt of a Poem అనే దాన్ని నిర్మించడంలో ఎలా సఫలమౌతున్నాయో, లేదూ విఫలమౌతున్నాయో ప్రతి ఒక్క కవితనూ, కధనూ పరీక్ష చేసి మనందరం మనకు మనంగా నిర్ధారణ చేసుకొనే అవకాశం ఉంది. కావ్య వ్యవస్థల అవగాహన కేవలం లక్షణ చర్చకే కాదు, సారస్వతంలో స్త్రీవాదం, దళిత వాదం, మార్క్సిజం, ప్రాంతీయవాదం వంటి ఎన్నెన్నో రకాల అవగాహనల ఆవశ్యకతను, వాటి పాత్రను, పరిమితుల్నీ అవగతం చేసుకోడానికీ, వాటి అభివ్యక్తిని సృజనాత్మకంగా నిర్వహించుకొనే వీలుగా తమవైన లక్షణ సిద్ధాంతాల్ని నిర్మించుకొనే తోవలను వెదుక్కోడానికి కూడా తప్పనిసరిగా అవసరం అవుతుంది. నాలుక, రుచీ పనిచేసే పనిని అర్ధం చేసుకోవడం అనే పనికీ, పంజాబీ, ఆంధ్ర, తమిళ్, మళయాళీ ఇలాంటి రకరకాల వంట పద్ధతులకూ పరస్పరం ఎలాంటి సంఘర్షణా లేదు కదా! అలాగే సృజన వ్యవస్థ అవగాహనకూ దాన్ని అనువర్తించి – అంటే apply చేసుకొని నెరపే రక రకాల ప్రక్రియలకూ మధ్య సంఘర్షణ అక్కర్లేదు.
13
ప్రాచ్య, పాశ్చాత్య సంప్రదాయాల్లో సాధారణమైన, ఋజువైన తర్కానికి బద్ధం కాలేని అనుభవాలు ఉంటాయన్న అంగీకారం ఉంది. కళ, సృజనల అనుభవం ఇలాంటి అనుభవాల్లో కేవలం ఒక్కటి మాత్రమే. సాధారణంగా మనుషులందరికీ పరిచితమైనవి వాత్సల్యం, ప్రేమ, మోహం వంటివి కూడా ఈ కోవలోకే వస్తాయి. నేను ఈ మధ్య ఒక స్నేహితుల ఇంటికి వెళ్ళేను. వాళ్ళకి రెండేళ్ళ బాబు. వాడు నాన్న ఎత్తుకొని తిప్పుతుంటే, ముద్దు ముద్దుగా చాలా కబుర్లు చెప్తున్నాడు వాడి భాషలోన. అది ముచ్చటగా ఉంది గాని ఒక్క ముక్కా నాకు అర్ధం కావటం లేదు. కాని ఆ చిలక పలుకులు విని వాళ్ళ అమ్మ, నాన్న చాలా సంబరం పడుతూ వాడికి బదులిస్తున్నారు – ఇలాగ:
బాబు: దుఆ. దుఆ దుఆ …!
నాన్న: దుఆ వా?
బాబు: ఊం! దుఆ…! అచ్చీచేలు…!!
నాన్న: ధృవా ఒచ్చీసేడా? ఏడీ ..? ఎక్కడున్నాడు?
బాబు: అక్కున్నాలు!
నిజానికి ధృవ అక్కడ లేడు. వాడు ఉట్టుట్టికే ఇగటాలాడుతున్నాడు. ఆ బాబు కల్పనకు తనదైన తర్కం ఉంది. అది వాడి రెండేళ్ళ జీవితానుభవం లోంచి వచ్చింది. వాళ్ళమ్మ, నాన్న ఆ అనుభవాలు పంచుకున్నారు. వాళ్ళకి వాడి కల్పనంతా పరిచితంగాను, చాల సంబరంగానూ ఉన్నాది. అది చూసి చూసి నెమ్మదిగా నాకూ వాళ్ళ కల్పన అర్ధం కాసాగింది. ఆ తరవాత వారం ఒక విమానంలో నా పక్కన ఒక రెండేళ్ళ పాప, వాళ్ళమ్మ కూర్చున్నారు. వాళ్ళు Irish వాళ్ళు. అందరం బండి దిగుతుంటే ఆ పాప అంటున్నాది:
పాప: దుఆ. దుఆ దుఆ …!
అమ్మ: (సంబరంగా) Yes Sweetie! Du ..A…! Daddy is at the Du .. A!
వీళ్ళ భాషలో దుఆ అంటే Door. విమానం గుమ్మం దిగితే వాళ్ళ నాన్న ఉన్నాడు అని ఆ పాప కేరింతలు కొడుతోంది. ఈ పాప, బాబు ఇద్దరూ ఒకే మాటను వాడినా, వాళ్ళ భాషలకు, తర్కానికీ ప్రాతిపదిక వాళ్ళవే వ్యక్తిగతము, ఆంతరంగికమైన జీవితానుభవాలు. నాబోటివాడికి అవి అర్ధం చేసుకోవాలన్న ఆసక్తి ఉంటే వాళ్ళ భాషతో ప్రారంభిస్తే నిరాశ కలుగుతుంది. కోపం కూడా వస్తుంది. ‘దుఆ దుఆ ఏంటి అర్ధం పర్ధం లేకుండా?’ అని. ఇందుకు భిన్నంగా, ఈ మొత్తం చర్చలోన భాష కేవలం సంకేతప్రాయంగా ఉందనీ, ఈ పాప, ఆ బాబు, వాళ్ళ అమ్మా నాన్నలు ఆ చిలక పలుకులు గంటల తరబడి వింటూ కూడా అవి మాటల కంటె చాల గహనము, విస్తారము, వాత్సల్యపూరితమైన అనుభవానికి కేవలం సూచనలు మాత్రమని అర్ధం చేసుకున్నారనీ ఒప్పుకోగలిగితే వాళ్ళ సంబరంలో నేను కూడా పాలుపంచుకోగలను.
ఈ చిలక పలుకులు పలుకుతున్న వాళ్ళు మరీ పసిపిల్లలు. పైన వ్యక్తిత్వం (self) అని చెప్పుకున్నది మనందరికీ ఈ పాప, బాబుల్లాగే పసి మనస్సుగా ప్రారభమయ్యి జాంతవ, సాంస్కృతిక, రాజకీయపరమైన రక రకాల అనుభవాలు, శిక్షణ (Learning) వలన విశాలమై, మన వ్యక్తిత్వాన్ని – అంటే Adult personalityని నిర్దేశిస్తుంది. ఇదివరకే చెప్పుకున్నట్టు సృజన అనుభవం జీవితానుభవం లాగే ముందుగా జాంతవమైనది, ఆ పైన సాంస్కృతికమైన అనుభవం. రాజకీయం, ఆర్ధిక వాస్తవాలు అప్పటి – అంటే కవి, పాఠకుల సమకాలీన సంస్కృతిలోన భాగాలు. అంచేత, సృజనను అర్ధం చేసుకోవాలంటే ఈ చెప్పిన వ్యవస్థలన్నింటినీ ఈ క్రమంలో అర్ధం చేసుకోవాలి. దీన్ని ముందుగా, మౌలికంగా ఆంతరంగికమైన స్ఫురణ అనుభవపు మూలాలతో – అంటే Cognitive Fundamentalsతో ప్రారంభించాలి. సృజన అనుభవానికి రూపకం ఇలాంటి మౌలికమైన ప్రాతిపదిక. ఉదాహరణకు వంటల్లో, భోజనాల్లో రక రకాల పద్ధతులు, సిద్ధాంతాలున్నాయి. కొన్ని సంస్కృతుల్లో లొట్టలు వేసుకుంటూ తినే వంటలు ఇంకొన్ని సంస్కృతుల వాళ్ళకి వెగటుగా ఉంటాయి. కాని అందరు భోంచేసేదీ, రుచిని అనుభవించేది ఒక్కలాంటి నాలుకతోనే. ఒక సంస్కృతిలో నిషిద్ధం, అసహ్యమైన పదార్ధాలు – కుక్క మాంసం, పిల్లి మాంసం వంటివి, ఇంకొక సంస్కృతిలో కమ్మని పిండివంటలకి ముడి సరుకులు అవుతున్నాయి. ఎంచేత? వండేవాడి జిహ్వ, తినేవాడి జిహ్వ – ఈ రెండూ మనుషులందరికీ ఒక్కటే నాలుక. చారిత్రకము, నైసర్గికమైన కారణాలవలన ఒక్కో సంస్కృతీ కొన్ని రకాల దినుసుల్ని స్వీకరించి వంటలని, భోజనాన్నీ నిర్ణయించుకున్నాయి. కాని ఈ అన్నిరకాల భోజనాల ఆస్వాదన మౌలికంగా నాలుగైదు రుచులమీదనే ఆధారపడి ఉంది. జీవ శాస్త్రజ్ఞులు నాలుక గ్రహించగలిగే రుచులు నాలుగు రకాలేనని నిర్ధారించేరు; ఇవి తీపి, పులుపు, ఉప్పన, చేదు. ఇటీవల వీటికి కమ్మదనం (Umami) అని ఇంకొకటి జతచేసి మౌలికమైన రుచులు ఐదు అన్నారు. కారం (వఱ్ఱ) మౌలికమైన రుచుల్లోకి రాదు; అదొక ఉపరుచి (Flavor). అలాగే చిత్ర విచిత్రమైన దృశ్య ప్రపంచాన్నీ, దృశ్య ప్రధానమైన కళలన్నిట్నీ మనిషి కన్ను కేవలం మూడు రంగులే ప్రాతిపదికలుగా అనుభవిస్తున్నాది.
కాల్పనిక సృజన అనుభవానికి కూడా ఇలాంటి మౌలికమైన ఉపకరణాల వ్యవస్థ ఒకటి ఉంది. వీటిలో కావ్య శరీరానికి మొదటిది, ముఖ్యమైనదీ రూపకం (Metaphor), కావ్యాత్మకు మౌలికమైనది ఔద్వేగిక ఆవరణం లేదా స్థితి (Emotional climate or Mood). ఇవి కాక మిగిలిన వ్యవస్థలు అనేకం ఉన్నాయి కాని సృజన పనిచేసే పద్ధతికి – అంటే Mechanicsకు ప్రాణప్రదమైనవి ఈ రెండూ. కాల్పనిక సృజన అనుభవంలో రూపకపు స్వరూపాన్నీ, వివిధ రూపాల్నీ విడమర్చిచి చెప్తూ బిపిన్, ఇతరులూ చేసిన వివేచన ఇంగ్లీష్‌లో ఉంది.
ఇవి వివరించే ముందు మళ్ళీ ఒకసారి కొన్ని జాగ్రత్తలు చెప్పుకోవాలని ఉంది. ఇక్కడ నాణ్యమైనవని నేను ఎత్తిరాస్తూ వస్తున్న సృజనకారుల ఉదాహరణలు కేవలం నా అభిరుచిని మాత్రం సూచిస్తున్నాయి. ఇవి తమకు కూడా నచ్చే రచనలేనని ఇంకెవరైనా ఆమోదించేసే ముందు రెండు అవసరమౌతాయి. ఒకటి: అలా అనుకుంటున్నవాళ్ళు ఆసక్తి ఉన్నట్టయితేనే స్వయంగా ఆ కధల్ని, కవితనీ చదివి, మళ్ళీ చదివి తమ అనుభవాన్ని నేను ప్రకటించినదానితో పోల్చి చూసుకోవచ్చు. రెండు: ముందుగా మంచివని అంటున్నవాడు – అంటే కనక ప్రసాద్ – అవి ఎందుకు, ఏ కారణాల వలన నచ్చుకుంటున్నాడో వివరంగా చెప్పితీరాలి; ఆసక్తి ఉంటే. ఈ రెండో పని చెయ్యటానికి ముందు నాదైన లక్షణ సిద్ధాంతాన్ని ఒకటి నిర్మించి, ప్రకటించుకోవాలి. ఈ పని ముందు పూర్తికానిదే నాకు ఫలానావి నచ్చేయీ నచ్చలేదూ అని నిర్ధారించడానికి ఏ ప్రాతిపదికా సంతృప్తికరంగా ఉండదు. ఇలాంటి సిద్ధాంతం ఒకటి కట్టడమంటూ అయితే అది నా ఒక్కడికే కాదు, సృజనను అనుభవించే వాళ్ళందరి అనుభవానికీ వర్తిస్తుంది. అంటే – అభిరుచి వ్యక్తిగతమైనది; ఇందుకు భిన్నంగా లక్షణ సిద్ధాంతం అది చేసిన కాలంలో మాత్రం సార్వజనీనమైనది. దురదృష్టవశాత్తు అది సర్వకాలీనమైనది కాలేదు. ఎందుకంటే ప్రవర్తన, అంతరంగం, సామాజిక పరిస్థితులూ – ఇలా సృజన అనుభవాన్ని ప్రభావితం చేసేవన్నీ కాలంతో, తరాలు మారేకొద్దీ మారిపోయి కొత్తవి పనిముట్లు అందుబాటులోకొస్తాయి. అందుకే ప్రతీ తరం తమ లక్షణ సిద్ధాంతాన్ని మళ్ళీ ఎత్తిరాసుకోవాలి. వ్యక్తిగతమైన అభిరుచిని ప్రకటించడాన్ని గురించి లక్షణకారులు ఇంకా ఏమంటారంటే ‘ప్రశస్తమైనవని చెప్పినవాటికి భిన్నంగా నేను ఎత్తి చూపని కవితలు, కధలూ కూడా ఎన్నో ఉంటాయి. నేను కనీసం వాటిలో ఆసక్తికరమని నాకు అనిపించే వాటినైనా తప్పకుండా పరామర్శించి, అవి ఎందుకు, ఎక్కడెక్కడ, ఏ కారణాలవలన నాకు నచ్చలేదో కూడా వివరించవలసి ఉంటుంది’ అని. ఈ పని విస్తారంగా చెయ్యటం విమర్శకుల పని. ఉదాహరణల కోసం తప్ప, అంతకు మించి విమర్శ మీద నాకు ఆసక్తి లేదు. అయిష్టం. నా మనస్తత్వం తీరు ఇలాగ.
<ఇంకా ఉంది>