ఆగవే రజనీ! విభావరి!

పల్లవి:
ఆగవే రజనీ! విభావరి!
అనుపల్లవి:
సోగ కన్నుల సొగసు కాడు
సఖుడు రానే లేదు
ఆగవే రజనీ! విభావరి!
చరణం:
మసక మసకల సంజ కొసల
పొదల మాటున పెదవులద్ది
నడిమి రేయికి నదీ తటికి
వత్తుననెనే వ్రజకిశోరుడు
కదిలి పోదువె! వదిలి పోదువె!
నెచ్చెలివి గద విడిచి పోదువె
ఆగవే రజనీ! విభావరి!
చరణం:
నంద నందను డందగాడు
యెంతో జాలి గుండె వాడు
దారిలో ఏ దీనురాలినొ
ఆదుకొనుటలో ఆలస్య మాయెనొ
ఏమి చేతును ఎదురు చూతును
గడియ గడియగ గడిచి పోదువు
గడుసు దానివి ఆగవే
ఆగవే రజనీ! విభావరి!
చరణం:
విరిసిన వెన్నెలలో నడిచి
ముసిరిన చిరు చెమటలలో తడిసి
మోము నగవుతో మోహనుడు
నను జేరగనే
రాగ మాలికనై అతని ఎద నే జేరగనే
పులకరింతల పూల వల్లరిలొ చుట్టి
మము జలదరింతల
రాస ఝరిలో నెట్టి పోదువు
ఆగవే రజనీ! విభావరి!
చరణం:
రాకా శశి వదనవే
నీలాకాశ చికురవే
తళుకు తళుకుల తారలంచు
చీర గట్టిన సింగారివే
అందరికి తెలుసునే
నీ అందము
నా అందమో
ఒక బృందా విహారికే
ఆగవే రజనీ! విభావరి!

ఆగవే రజనీ! విభావరి!
సోగ కన్నుల సొగసు కాడు
స్వామి రానే లేదు