మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’

ముక్కు తిమ్మనగారి ‘పారిజాతాపహరణము’; అల్లసాని వారి ‘మనుచరిత్రము’; శ్రీకృష్ణదేవరాయ విరచితమైన ‘ఆముక్తమాల్యద’; తెనాలి రామకృష్ణుఁని ‘పాండురంగ మాహాత్మ్యము’; రామరాజభూషణుని ‘వసుచరిత్రము’ – ఈ ఐదు గ్రంథాల్నీ తెలుగులో పంచమహాకావ్యాలుగా పండితులు నిర్ధారించారు. ఈ ఐదు గ్రంథాల్నీ క్షుణ్ణంగా పారాయణం చేసి అర్థం చేసుకొంటే తెలుగు భాష సంపూర్ణంగా వచ్చేస్తుంది అని పెద్దల ఉవాచ.

తెనాలి రామకృష్ణుఁడి అసలు పేరు గార్లపాటి రామలింగయ్య అని అంటారు. జననం క్రీ.శ. పదహారో శతాబ్దం తొలిరోజుల్లో. ఊరు తెనాలి. గుంటురు జిల్లా, తెనాలి సమీపంలోని గార్లపాడు వీరి పూర్వీకుల నివాసం. ఎప్పుడో వచ్చి తెనాలిలో స్థిరపడ్డారు. ప్రథమశాఖ నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని తల్లి లక్కమాంబ, తండ్రి రామయ్య.

ఈయన తొలిదశలో శైవుడు. గురువు పాలగుమ్మి ఏలేశ్వరుడు. అతి పిన్న వయసులోనే సంస్కృతాంధ్ర కావ్యాలూ, నాటకాలూ చదివి, అలంకారాలూ, వ్యాకరణం, ఛందస్సు, ఆశుకవిత్వంలో నిష్ణాతుడయ్యాడు. అప్పట్లోనే అతనికి ‘కుమారభారతి’ బిరుదు కూడా వుండేది. శివకవిగా ఉధ్భటారాధ్య చరిత్రము అనే శైవకావ్యాన్ని వ్రాశాడు.

రామలింగకవి, వైఖాసన సాంప్రదాయ వైష్ణవమతావలంబియై, రామకృష్ణుఁడిగా అవతరించాడు. అతనికి వైష్ణవ దీక్షనొసగిన గురువు శ్రీ భట్టరు చిక్కాచార్యులవారు. తరువాత ‘కందర్పకేతు విలాసం’, ‘హరిలీలా విలాసం’ మొదలైన కావ్యాలు వ్రాశాడు. ప్రౌఢకవిగా పాండురంగమాహాత్మ్యం అనే బృహత్కావ్యాన్ని, అవసానదశలో శ్రీ ఘటికా చలమాహాత్మ్యము అనే మహాకావ్యాన్నీ రచించాడు. ఈ ఆఖరి గ్రంధానికి అవతారిక వ్రాయకుండానే – అంటే దాన్ని ఎవరికీ అంకితమివ్వకుండానే – 95 ఏళ్ళ సుదీర్ఘ జీవన యానం తరువాత, పరమ పద సోపానాన్నధిరోహించాడు. ఆయన్ని తీసుకెళ్ళడానికి పరమశివుని ప్రమధగణాలూ, శ్రీమహావిష్ణువు యొక్క దూతలూ చెరో దివ్య విమానాన్నీ తీసుకువచ్చి వాదులాడుకొని ఉంటారేమో!

ఈ మహాకవి రచనలలో మూడు గ్రంథాలు మాత్రమే ఇప్పుడు లభ్యాలు. అవి – ఉద్భటారాధ్యచరిత్రము, పాండురంగ మాహాత్మ్యము, ఘటికాచల మాహాత్మ్యము. మన తెలుఁగు పంచమహాకావ్యాల్లో ఒకటిగా పరిగణించబడిన పాండురంగ మాహాత్మ్యము అనే మహాకావ్యాన్ని తెనాలి రామకృష్ణకవీంద్రుడు విరూరి వేదాద్రి మంత్రికి అంకితమిచ్చి అతడిని అమరుణ్ణి చేశాడు. ఈ వేదాద్రి మంత్రి పొత్తపినాటి చోడ ప్రభువైన పెద్ద సంగభూపాలుని వద్ద వ్రాయసకాడు.

ఈ చిగురాకు నీప్రసవ మీపువుఁ దేనియ యెంత యొప్పెడిన్
జూచితిరే యటంచుఁ దనచుట్టు శుకాదులుఁ గొల్వగాఁ గప
ర్థాంచిత చంద్ర గాంగజలమైన శివాహ్వయకల్పశాఖ వే
దాచల మంత్రికీర్తి కలశాబ్ధిని వెన్నెలమాడ్కిఁ జూచుతన్

శివుడు తన కృతిభర్తను పాలించు గాక యన్న యాశీర్వచనము. శివుడు కల్పవృక్షము. శుకమహర్షి మొదలైనవారీ కల్పవృక్షాన్ని ఆశ్రయించి ఉన్నారు. శివుని జుత్తు – జడముడి – చివురాకు. చంద్రుడు పువ్వు. గంగ తేనియ.

ఉదయం బస్త నగంబు సేతువు హిమవ్యూహంబునం జుట్టి రా
విదితంబైన మహిన్ మహాంధ్ర కవితా విద్యానల ప్రౌఢి నీ
కెదురేరీ? సరసార్థ బోధఘటనాహేల పరిష్కార శా
రద నీరూపము రామకృష్ణకవిచంద్రా! సాంద్ర కీర్తీశ్వరా!

తూర్పు కొండలు, పడమటి కొండలు, దక్షిణ సముద్రము, ఉత్తరాన హిమాలయ పర్వతం – ఈ నాలుగు ఎల్లల మధ్య గల యావద్భారతదేశంలో మహాంధ్ర కవితా విద్యలో, ఓ రామకృష్ణకవీంద్రా, నీ అంతటి మహాకవి వేరొకరు ఎవరు? ఎవరూ లేరు. సరసమైన అర్థబోధ ఘటించెడి ఒయ్యారపు నగలు గల సరస్వతీ దేవి నీ రూపము! అని విరూరి వేదాద్రి మంత్రి అన్నాడని పాండురంగమాహత్మ్యము అవతారికలో రామకృష్ణకవీంద్రుడు చెప్పుకున్నాడు. కృతి స్వీకరించే సందర్భంలో వేదాద్రి మంత్రి మహాకవికి తాంబూలం ఇచ్చాడు. కవి ఆ తాంబూలాన్ని ఈ రమణీయమైన పద్యంలో వర్ణిస్తున్నాడు.

పలుకుం దొయ్యలి మోవి కాంతి కెనయౌ బాగాలు నయ్యింతి చె
క్కులఁ బోలుం దెలనాకులయ్యువిద పల్కుల్వంటి కప్రంపుఁ బ
ల్కులతోఁ గూడిన వీడియంబొసఁగు నాకుం బద్మనాభార్చనా
కలనా పావన హస్తకంకణ ఝణత్కారంబు తోరంబుగన్

సరస్వతీదేవి (పలుకుల తొయ్యలి) పెదవుల (మోవి) కాంతికి సమానమైన (ఎనయౌ) పోకచెక్కలు (బాగాలు); [మౌళి కాంతి కెనయౌ – అనే పాఠాంతరం కూడా ఉంది. సర్వశుక్లాం సరస్వతీ అన్నారు; ఆవిడ ఆపాదమస్తకం తెలుపేనట!] ఆ ఇంతి చెక్కులను పోలే పండుతమలపాకులు (తెలనాకులు); [తమలపాకుల్లో కవటాకులెంత భోగమో పండుటాకులు అంతకంటే భోగమట] ఆమె పలుకులవంటి పచ్చకర్పురపు పలుకులతో కూడిన తాంబూలాన్ని ఇచ్చాడట. ఏ చేతులతో అయితే పద్మనాభస్వామిని నిత్యం అర్చిస్తాడో ఆ చేతులతో – కంకణాలు ఝణఝణ ధ్వనులు చేస్తున్న ఆ హస్తాలతో ఈయనకి తాంబూలం అందించాడట.

పాండురంగ మాహాత్మ్యము – కథా సంగ్రహం

అల్లసానివారి అల్లికజిగిబిగి
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు
పాండురంగవిజయు పద గుంఫనంబును
– అన్నారు పండితులు. కాబట్టి, పాండురంగమాహాత్మ్యం కథాసంగ్రహాన్నీ, మచ్చుకు కొన్ని పద్యరత్నాల్నీ జ్ఞాపకం చేసుకుందాం.

కథారంభంలో శౌనకాది మహామునులు సూతమహర్షిని క్షేత్రము, వేల్పు, తీర్థము – ఈ మూడూ సమాన ప్రాధాన్యములుగా కలిగిన క్షేత్రమును గూర్చి తెలుపమని అడుగుతారు. అప్పుడు సూతుడు “ఈ కథను నేను కృష్ణద్వైపాయనుడు చెప్పగా విన్నాను. దాన్ని విన్నది విన్నట్టుగా మీకు వివరిస్తాను, వినండి,” అంటూ ప్రారంభిస్తాడు.

ముందుగా కాశీపుర వర్ణనతో కథ ప్రారంభమౌతుంది.

శీతాహార్య సుతాళినీ వికచ రాజీవంబు విశ్వేశ్వర
జ్యోతిర్లింగ విశుధ్ధ రత్నఖని మోక్షోపాయ దుగ్ధాబ్ధి వే
లాతీరావని దుంఠి నామక గజాలానంబు గంగామృత
స్రోతోనిస్సృతి చంద్రగోళ మన మించుం గాశి శ్రీరాశియై

కాశీపురము “శీతాహార్య సుతాళినీ వికచ రాజీవ”మట. శీతాహార్యుడు అంటే మంచునే భూషణముగా ధరించిన వాడు – హిమవంతుడు. అతడి సుత – పార్వతీ దేవి అనే ఆడు తుమ్మెద (అళిని) కోసం, వికసించిన తామరపువ్వట (వికచ రాజీవంబు) కాశీ. ఆ నగరం విశ్వేశ్వర జ్యోతిర్లింగమనే విశుధ్ధమైన రత్నం లభించే గనియట. మోక్షసాధనమగు పాలసముద్రానికి కాశీ ఒడ్డట; కాశికాపురి “దుంఠి నామక గజాలానంబు” – దుంఠి అనే పేరుగల గజమునకు (వినాయకునకు) ఆలానము (ఏనుగును బంధించే స్తంభం). ఇంకా కాశీపురి గంగయనే అమృత ప్రవాహం స్రవించే చంద్రగోళమట. ఇంతటి వైభవంతో కాశీ భాగ్యనిలయమై (శ్రీరాశి) ప్రకాశిస్తున్నదట.