గీతం
థామస్ బేలీ (Thomas Haynes Bayly) 1833లో రచించి సంగీత రచన చేసిన గీతం లాంగ్ లాంగ్ ఎగో (Long Long Ago) స్ఫూర్తితో రచించిన గీతం ఇది. అమెరికన్ జానపదంలో ఎంతో ప్రసిద్ధమైన ఈ పాట మార్టీ రాబిన్స్ పాడిన వీడియో చూడండి. ఇదే పాట సత్యజిత్ రాయ్ ఘరేబైరే చిత్రంలో కూడా 4-5 నిమిషాల నిడివి మధ్య కనిపిస్తుంది.
గానం: టి. సుబ్రహ్మణ్యం
రచన: కనకప్రసాద్
సంగీతం, వయొలిన్: మైఖేల్ మఖల్
సాహిత్యం
నీ తొలి తలపుల జాడలలో
మాయని వలపుల చాయలివి
ఏ నడలో ఏ ఎడలో!
తీయని ఆ కధలేవి ప్రియా?
నీ ఒడిలో నిరులో!
నీ కల నవ్వులు మరల విని
ఆ నెఱి బాసల మీఱవని
ఆరని కూరిమి నేరమనీ
బేలవనీ దిగులో!
పచ్చిక దారుల జ్ఞాపకమా?
చెక్కుల మక్కువ చక్కెరలు
ఏ సుధలో ఏ వ్యధలో!
కల్లరి మబ్బుల కావిరుల
ఏ కలలో కల్లలో!
గడచిన రోజులు గాలములా?
మరచిన మాటలు జాలములా?
కలతై మిగిలెను నీ తలపు!
వెర్రి సుమా వలపు.
చారలు కట్టిన పాటలివి
జాలికి రాలే పుప్పొడులు
ఏ మరులో ఏ ఇరులో!
నీ కొస చూపుల సైగలకే
ఈ తెరలా మరలా!
ఇన్నాళ్ళూ ఏ దూరానో
ఉన్నావనుకొని ఊరుకొనీ
ఎన్నటిదీ కన్నీరు ప్రియా!
వెన్న సుమా మనసు.
పరిచయం
మైఖెల్ మఖల్ (Michael Makhal) తెలుగు, బెంగాలీ చలన చిత్ర రంగాల్లో సంగీత సహ దర్శకుని గాను, వయొలిన్ వాద్యకారుని గాను పనిచేస్తున్నారు. ఆయన లండన్ ABRSM నుండి, ప్రముఖ పాశ్చాత్య సంగీతకారుడు, తన తండ్రి ఆనంత మఖల్ నుండీ పాశ్చాత్య సంగీతం, భారతీయ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. మైఖెల్ Delhi Symphony Orchestra వంటి ప్రసిద్ధ సంగీత కళా సంస్థలతో భారతదేశంలో, విదేశాల్లోను కచేరీల్లో పాల్గొన్నారు. యోషికాజూ ఫూకుమురా (Maestro Yoshikazu Fukumura) వంటి ప్రసిద్ధ విద్వాంసులతో కలిసి పనిచేసేరు. ప్రస్తుతం హైదరాబాదులో సంగీతం బోధిస్తూనే, చలనచిత్రాలకు సంగీత దర్శకునిగాను, వాద్యకారునిగాను పనిచేస్తున్నారు. ఏభైకి పైగా తెలుగు చలనచిత్రాలకు ఆయన సంగీత సహకారం అందించేరు. ఆర్పీ పట్నాయక్, కీరవాణి, కోటి, మణిశర్మ వంటి ప్రసిద్ధ సంగీత దర్శకులతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన సంగీతం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. టి. సుబ్రహ్మణ్యం ఔత్సాహిక సంగీత విద్యార్ధి, గాయకుడు.