గృహకల్ప

ఇది ఏదీ నిమానుగా ఉండదు
     ఆ నిట్రాటలు కొంచెం వంకర
దూలాలన్నీ మొదలే పచ్చివి
     నీ శేనానికి ఇవి లొంగవు
ఈ కమ్ములు సరిగా వంగవు.
     ఏనాడో బిర్రున బిగిసిన గడియల్లోనికి
ఈ దండెలు, గొళ్ళేలేవీ అమరవు.
     అంచులు కొంచెం తేడాలేమో
ఈ అరలకి అరమరికలు ఎక్కువ,
     ఇవి ఏ గాడీలోనూ దూరవు.
వీటిని సరిచేసేందుకు
     నువ్వేమీ బ్రెమ్మానివి కావు.
కానీ అక్కడో కొయ్యా ఇక్కడో కంపా చూసి
     ఈ ఇంటికి కప్పూ పెంకూ నేసిందైతే నువ్వు.
అక్కడి ఇటికా ఇక్కడి బెడ్డా తెచ్చి
     గోడల సున్నం నీ జబ్బలకెత్తుకు మోసి
నీకొచ్చినకాడికి నువ్వే రామా
     ఈ కొంపని నిలబెట్టేవు.
ఇది అంత:పుర హర్మ్యం ఏమీ కాదు.
     అంతెందుకు గాలీ వానా వొస్తే
ఉంటుందని హామీ ఏమీ లేదు –
     కాని ఇది నీ ఇల్లు.
చిత చిత చినుకులు మొదలైనా
     ఇక్కడ్నుంచీ కదలవు.
ఇటు దగ్గిరసా దీన్నొదలవు, ఇది
     నీ స్వప్నం మీ మేడ.
అవి ఊగే రాటలు ఇవి
     పెచ్చులు రాలే గోడలు ఐనా
ఈ చిల్లుల కప్పులు నేయను
     గల్లున రాలే పెంకులు తీయను
ఆ శిలువని ఈ బురుజుల కెత్తను
     ఏదీ ఇటు నీ చేయీ, అను.
ఈ నిట్రాటకి చిన్నది దన్ను,
     ఆ ఒరిగే గోడకి ఒక ఆను, అను.
ఈ ఊగే ఇంటికి ఇటు అటు
     ఒక నువ్వు,
ఒక తను.

(స్ఫూర్తి, ప్రేరణ: ఆలెన్ డగన్ (Alan Dugan) వ్రాసిన Love Song: I and Thou)