రంగనాధునివా రాతిబొమ్మవా

రంగనాధునివా రాతిబొమ్మవా

రాగం: రేవగుప్తి
తాళం: ఆది

స్వర రచన, సంగీతం, గానం: పేరి పద్మావతి
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్

సాహిత్యం

ప్రార్ధన:
జీర్ణ మందిర విషుప్త నటమ్ చిద్వాయకమ్ మౌని నాయకమ్
పరిహృత నిందా స్తుతి వాక్సాయకమ్ రంగనాయకమ్
నవనీత శీత కరుణా ఛ్ఛవి కృత్య మనో హర హరీ
అవనత శిరసా వందే కవి తార్కిక కేసరీ.
పల్లవి:
రంగనాధునివా రాతిబొమ్మవా?
మన్ననలెరుగని నంగనాచివా?!
అనుపల్లవి:
అభయహస్తమా అంకిలి చలమా
ఉభయ భ్రష్టమై పొమ్మని శలవా?
ఆడికోలు ఆనవు వేడుకోలు వినవూ
ఆలకింప చెముడా నీ ఊడిగములింతా?      |రంగ|
చరణం:
యోగపు నిదురా దాఁగిలి నటనా
ఆగమ ఘోషమా ఆగమాగమా?
పాముపై పడకా గారఁడీని కఱుదా
సోమరికి సొమ్ములిడి స్వామియని బిఱుదా?      |రంగ|
చరణం:
ఉయ్యాల సేవలా ఊగులాట వగలా
అయ్య! ఇది అనంత శయనమని ఎగపా?
ఊరేగి పూజలా ఊర్పోక చిన్నెలా
ఎవ్వరికి పొలుచునీ అడవీఁగు వెన్నెల?      |రంగ|
చరణం:
రంగధామమా అంగడింటి కొలువా
పంగనామములన్న ఆ పరమార్ధమిట్టిదా?
పరిపూర్ణ నిద్రా దొరతనపు కులుకా
అఱచి కొఱలాడితే కఱకు శిల పలుకునా?      |రంగ|

(ఈ గీతానికి స్వర రచన కావలసినవారు ఈమాట సంపాదకుల ద్వారా మమ్మల్ని సంప్రదించమని మనవి.)


For Dr. బందా రామారావుగారు