“కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్,” అన్నాడో సినీకవి. అయితే, అనేక మానవ సమాజాల్లో కుడిచెయ్యిని మంగళప్రదమైనది గానూ, ఎడమచెయ్యిని అమంగళకరమైనదిగా భావించడం కనిపిస్తుంది. ఎన్నో ఇండో-యూరోపియన్ భాషలలో కుడిచేయి అంటే దక్షిణహస్తం అని, దక్ష- అంటే నేర్పుగల (dexterous), బలం కలిగిన- చెయ్యి అన్న అర్థాలున్నాయి. లాటిన్ భాషలో ఎడమ అన్న అర్థంలో వాడే పదం sinister. అదే పదానికి వక్రమైన-, చెడ్డ, దుష్ట- అన్న అర్థాలున్నాయి.
Category Archive: వ్యాసాలు
అయినా నిరీక్షించడమంటే ఏమిటో మనకు తెలియనిది కాదు. దేనికోసం ఎవరెవరం ఎదురుచూస్తున్నామో అదే వచ్చేస్తే మనమంతా తప్పకుండా భంగపడేవాళ్ళం. అది ఆదర్శరాజ్య మైనా, కమ్యూనిస్టు సమాజమైనా, సాంస్కృతిక విప్లవమైనా సరే. అయినప్పటికీ, ‘నిరీక్షించువారు ధన్యులు. వారికన్నియును నొసగబడును,’ అని చెపుతూనే ఉంది. కొత్తదో, పాతదో ఓ నిబంధన గ్రంథం.
తెలుగు సాహిత్యపు ఛందోగగనములో మిక్కిలి ప్రకాశవంతముగా మెరిసే మినుగుతార కందపద్యము. ఒక చిన్న పద్యములో అనేకానేక భావములను సంతరించుకొనే శక్తి సామర్థ్యములు గలిగిన పద్యము కందపద్యము. ఇట్టి కంద పద్యపు పుట్టు పూర్వోత్తరాలను, అందచందాలను, భూతభవిష్యత్తులను నా శక్తి మేరకు ఈ రెండు వ్యాసములలో తెలిపినాను.
అనుకరణకి గమ్యం తెలుగు అనుకున్నప్పుడు ఏ తెలుగు అనే ప్రశ్న వస్తుంది? ఈ వ్యాసం నిర్మించుకున్న పరిధిలో మన గమ్యం శిష్టవ్యవహారికం – అనగా, ఈ రోజుల్లో వార్తాపత్రికలలోను, అంతర్జాలపత్రికలలోను, కథలలోను, తరచుగా కనిపించే వ్యవహార శైలి భాష. ఈ రకం భాష ముద్రణా మాధ్యమంలో కనిపిస్తోంది కాని టెలివిజన్ కార్యక్రమాల్లో ‘లంగరమ్మలు, లంగరయ్యలు’ మాట్లాడే భాషలో వినిపించటం లేదు.
నాకు వెండీ డానిగర్ పుస్తకంలో హిందువులను అవమానపరిచే అంశాలు గాని, హిందూ మతాన్ని పనిగట్టుకొని కించపరిచే ఉద్దేశం గాని ఏ కోశానా కనిపించలేదు. ప్రతి పేజీలోను ఒక పరిశోధకురాలు తాను ఎన్నుకున్న అంశంపై అన్నీ దృక్కోణాలను విశ్లేషించడానికి, అన్నీ ప్రత్యామ్నాయ కథనాలను వీలైనంతగా చర్చించడానికి పడే తాపత్రయమే కనబడింది.
క్షేమేంద్రుని కలావిలాసానికి తెలుగు కళావిలాసము నిజంగా అనువాదం అవునా? కాదా? అన్నది ప్రధాన సమస్య. పై ఉదాహరణలో మానవల్లి వారు ఏయే గ్రంథాలలో ఈ కళావిలాసములోని పద్యాలు ఉదాహరింపబడి ఉన్నాయని సూచించారో – ఆ గ్రంథాల పూర్వాపరచరిత్ర తెలిస్తే కాని ఈ సమస్య స్వరూపం, అందుకు పరిష్కారం అర్థం కావు.
సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే సంస్కృతప్రాకృతములలో, సుమారు 1300 సంవత్సరాలకు ముందు కన్నడములో, సుమారు 1100 సంవత్సరాలకు ముందు తెలుగులో కంద పద్యములు ఉండినవి, ఆంధ్ర మహాభారతములో మూడింట ఒక పద్యము కంద పద్యమే. అందుకే కంద పద్యమును అందముగా వ్రాయని, వ్రాయరాని, వ్రాయలేని వాడు కవి కానేరడు అంటారు.
సూర్యకాంతిలో గాని, ఇంద్రధనస్సులో గాని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టిన ఏడు రంగుల గురించి ఈ శ్లోకం వివరిస్తుందంటే నమ్మశక్యం కాదు. నిజానికి, ఋగ్వేద కాలం నాటికే ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు ఏడు వేర్వేరు పేర్లుండేవని చెప్పగలిగే శ్లోకం ఏదీ మనకు ఋగ్వేదంలో కనిపించదు.
ఏల్చూరి మురళీధరరావుగారు నవంబర్ 2013 ఈమాటలో ప్రచురించిన ‘కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన అన్న వ్యాసం ద్వారా కుమారసంభవం కావ్యం రాసిన కవి నిజంగా ఎవరు? అతని కాలం ఏది? అనే వాదనను మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇలాంటి కాల, కర్తృనిర్ణయాలపైన నా ఆక్షేపణలను ఈ వ్యాసంలో వివరిస్తాను.
డా. ఏల్చూరి మురళీధరరావు నవంబరు 2013 ఈమాటలో వ్రాసిన ‘కుమారసంభవంలో … ‘ అన్న వ్యాసానికి ప్రతిగా నా ఈ వ్యాసంలో నన్నెచోడుడు ప్రబంధయుగము తఱువాతవాడు కాదని, కవిజనాశ్రయ ఛందోగ్రంథమునకు ముందే కుమారసంభవమును వ్రాసినాడని వివరిస్తున్నాను.
ఆభారతకుమారులు రాజ్యములను స్థాపించుటయే కాక హిందూ విజ్ఞానమును, మతమును ప్రజలలో ప్రతిష్ఠించి, మహానిర్మాణములను భారతీయశైలిని నిర్మించి, తమ మాతృభూమియొక్క ఖ్యాతిని వ్యాపింపజేసి, నిజమగు భారతపుత్రులుగ నుండిరి.
కర్ణాటక సంగీతజ్ఞులకి వెస్ట్రన్ మ్యూజిక్ పరిచయం 1800 కాలంలోనే ప్రారంభమయ్యింది. ఇంగ్లీషు బ్యాండు చాలామంది సంగీత కారులకి పరిచయం ఉంది. ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ ఇంగ్లీషు బ్యాండ్ ప్రభావంతో కొన్ని పాటలు కట్టారు.
శ-, ష-, స- అక్షరాలు మూడు ప్రత్యేక వర్ణాలుగా పలు భారతీయ భాషలలో కనిపించినా, ఈ అక్షరాల ఉచ్చారణ విషయంలో అన్ని భాషలవారిలోనూ కొంత అయోమయం కనిపిస్తుంది. సంస్కృత భాష ఆధారంగా తయారైన వివిధ వర్ణమాలలలో వీటిని మూడు ప్రత్యేక అక్షరాలుగా పేర్కొన్నా, ఇవి మూడు విభిన్న ధ్వనులుగా ఏ దేశభాషలోనూ స్థిరత్వం పొందలేదు.
క్రీస్తు పూర్వమే తమిళంలో సాహిత్యం ఉందనటానికి శాసనాధారం కాని, ఇతర చారిత్రక ఆధారాలు కాని లేవు. తమిళ బ్రాహ్మిని గురించి ఐరావతం మహాదేవన్ కాని, భద్రిరాజు కృష్ణమూర్తి కాని చెప్పే విషయాలను అంగీకరించడం కష్టం.
మీనాక్షిసుందరం మత పరమైన ఆచారాలనూ సంప్రదాయాలనూ పాటించకపోయినప్పటికీ వాటి సారాన్ని చదివి తెలుసుకున్న వ్యక్తి. ఆయనతో ఆపెన్ హైమర్, హెర్మన్ వైల్ భారతీయ తత్త్వ విషయాలను ఆయనతో చర్చించే వారు. ఆపెన్ హైమర్ అమెరికా ఆటం బాంబ్ ప్రాజెక్టుకు నాయకుడు. మొట్ట మొదటి సారిగా విస్ఫోటనం జరిగినప్పుడు ఆ కాంతిని చూసి భగవద్గీత పదకొండవ అధ్యాయం లోని ‘వేయి సూర్యుల కాంతి’ శ్లోకాన్ని చదివిన వాడు.
కుమారసంభవ పద్యాన్ని అనుసరింపబోయి తన భావనాశక్తి లోపాన్ని వెలిపెట్టుకొన్న ఛాయోపజీవిగా తెనాలి రామలింగకవిని ఆక్షేపించే తొందరపాటులో రామకృష్ణకవి ఈ పద్యానికి మూలమైన శ్లోకం ఒకటున్నదనే సత్యాన్ని ఊహింపలేకపోయారు. కుమారసంభవం లోని పద్యాలను ఎంతోమంది తెలుగు కవులు అనుకరించారని ఆయన చూపిన పద్యాలన్నీ ఈ విధమైన మౌలికతాపరీక్షకు గుఱి కాగలవని కూడా ఆయన ఊహించి ఉండరు.
తెలుగుని మన పిల్లల మనస్సుల్లో నిలబెట్టమని ఆడిగేది ఎందుకూ అంటే మీ స్వార్థం కోసం అడుగుతున్నాను. ప్రజాస్వామిక దేశాలలో అధికసంఖ్యాకుల కన్నా సంస్థాగతంగా కూడి ఉన్న తక్కువమందికి ఎక్కువ బలముంటుంది. ఈ సంగతి సాధారణంగా తెలీదు మనకి. మనం organized minority గా అవగలమా?
బ్రౌన్తో చాలా సమస్యలు ఉన్నాయి. మనకి పొగడ్తలు వ్యక్తి గౌరవాలే ప్రధానమయి సవిమర్శకంగా ఎవరి పనినీ అంచనా వేసే అలవాటు ఇప్పటికీ ఏర్పడలేదు. క్లుప్తంగా చెప్పాలంటే అతన్ని ఇప్పటికి సవిమర్శకంగా ఎవరూ చూడలేదు. అతనికి తెలుగు గొప్పగా వచ్చని, అతను ఇంద్రుడని చంద్రుడని పొగుడుతాం.