ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు

శ్రీశ్రీ ఆనందార్ణవ గేయములు

మహాప్రస్థానములో 14 మాత్రలపైన ఆధారపడిన ఛందస్సును ఉపయోగించిన ఐదు గేయములు – అద్వైతం (38 పంక్తులు), ఋక్కులు (13), దేశచరిత్ర (96 పంక్తులు), నవకవిత (28 పంక్తులు), పేదలు (20 పంక్తులు), అనగా మొత్తము 195 పంక్తులు. ఇందులో ఋక్కులులోని తొమ్మిదవ పంక్తిలో (ఔనౌను శిల్ప మనర్ఘం) 13 మాత్రలు, ఋక్కులులోని 14వ పంక్తిలో (వాక్కుంటే వ్రాసీ) 10 మాత్రలు, దేశచరిత్రలోని తొమ్మిదవ పంక్తిలో (భీబత్స రస ప్రధానం) 12 మాత్రలు మాత్రమే ఉన్నాయి. ఇది ముద్రణలోని దోషమో లేక శ్రీశ్రీ కావాలనే అలా వ్రాశాడో మనకు తెలియదు. వాటిని తొలగిస్తే లభించిన పంక్తులు 192. ఈ 192 పంక్తులలో 78 విధములైన 14 మాత్రల ఛందస్సులు మనకు కనబడుతాయి. పంక్తుల సంఖ్యలతో ఈ ఐదు గేయములు, ప్రతి యొక్క పంక్తి ఛందస్సు మొదటి అనుబంధములో ఇవ్వబడినవి. 78 స్వతంత్ర ఛందస్సులు రెండవ అనుబంధములో ఇవ్వబడినవి. ఇందులో ప్రతి ఛందస్సు ఏ గేయములో, ఏ పంక్తిలో వస్తుందో అనే విషయమును కూడ తెలియబఱచినాను. ఆ వృత్తములు ఎన్నిమారులు వాడబడినవో అన్న సంఖ్య చతురస్ర కుండలీకరణములలో చూపబడినవి. ఈ 78 వృత్తములలో ఏయే వృత్తములు వేళంకర్ సంకలనము జయదామన్[3], దుఃఖభంజనకవి వ్రాసిన వాగ్వల్లభ[4] గ్రంథములలో ఉన్నవో వాటిని ఎఱ్ఱని రంగుతో చూపినాను, అవి 22. వృత్తములోని మొదటి ఆఱు మాత్రలు, తఱువాతి ఎనిమిది మాత్రలు కూడ చూపబడినవి. ఈ ఎనిమిది మాత్రలు రెండు చతుర్మాత్రలు కాని పక్షములో అట్టి అష్టమాత్రను క్రింద ఒక అడ్డగీతతో చూపియున్నాను. రెండు అర్ధ భాగములలో పాదము లగారంభమయితే (అనగా ఎదురు నడకను కలిగి ఉన్నట్లయితే) దానిని కూడ ఎఱ్ఱ రంగుతో చూపియున్నాను. ఈ 78 వృత్తములకు ఉదాహరణములను మూడవ అనుబంధములో ఇవ్వబడినవి.

ఈ 78 వృత్తముల కొన్ని వివరములను క్రింద ఇస్తున్నాను –

పాదమునకు 7 అక్షరములు – ఉష్ణిక్కు ఛందము – సర్వగురువృత్తము – 1
పాదమునకు 8 అక్షరములు – అనుష్టుప్పు ఛందము – 6 గు, 2 ల – 7
పాదమునకు 9 అక్షరములు – బృహతి ఛందము – 5 గు, 4 ల – 24
పాదమునకు 10 అక్షరములు – పంక్తి ఛందము – 4 గు, 6 ల – 23
పాదమునకు 11 అక్షరములు – త్రిష్టుప్పు ఛందము – 3 గు, 8 ల – 17
పాదమునకు 12 అక్షరములు – జగతి ఛందము – 2 గు, 10 ల – 5
పాదమునకు 14 అక్షరములు – శక్వరి ఛందము – సర్వలఘు వృత్తము – 1

ఛందోగ్రంథములలో వివరించబడినవి – 22
నేను కల్పించినవి – 56

పూర్వార్ధములో ఎదురు నడకతో ఉండే వృత్తములు – 12
ఉత్తరార్ధములో ఎదురు నడకతో ఉండే వృత్తములు – 12
రెండు అర్ధములలో ఎదురు నడకతో ఉండే వృత్తములు – 4
లఘ్వంతమైన వృత్తములు – 33
ఉత్తరార్ధములో రెండు చతుర్మాత్రలు లేక ఒక అష్టమాత్ర కలిగిన వృత్తములు – 10 (ఎదురు నడక 2)

ఒక్క పంక్తిలో మాత్రమే వాడిన వృత్తముల సంఖ్య – 43
పది, పదికన్న ఎక్కువ పంక్తులలో వాడిన వృత్తములు – 4 (శిప్రా, శృంగి, నాయికా, ఉదితము)

6, 4, 4 మాత్రలతో 325 వృత్తములు సాధ్యము. అందులో 68 వృత్తముల మూసలను శ్రీశ్రీ ఈ ఐదు గేయములలో వాడెను. 6, 8 మాత్రలతో 432 వృత్తములు సాధ్యము, అందులో 10 వృత్తముల మూసలు ఈ గేయములలో ఉన్నవి.

ఇంతకు ముందే చెప్పినట్లు, తెలుగు ఛందస్సులో యతి లేక వడి అంటే అక్షరసామ్యము, అనగా యతి స్థానము వద్ద గల అక్షరమునకు పాదాదిలో ఉన్న అక్షరమునకు లాక్షణికులు నిర్ణయించిన రీతిలో పొత్తు కుదరవలెను. కాని సంస్కృతములో యతి అన్నది పదముల విఱుపు, అనగా యతి స్థానము వద్ద ముందు పదము విఱుగవలెను, లేక యతి స్థానము వద్ద సంధి జరుగవలెను. పాదాంతములో కూడ సామాన్యముగా పదము అంతము కావలెను. ఇట్టి యతిని పదచ్ఛేదయతి అంటారు. శ్రీశ్రీ తప్పని సరిగా ఇట్టి యతిని పాటించెను, ఉదా. కావాలోయ్ | నవకవనానికి | కాని పాదమునందలి ఉత్తరార్ధములోని రెండు చతుర్మాత్రల మధ్య ఈ విఱుపు ఎల్లప్పుడు లేదు, ఉదా.

పదముల విఱుపు ఉన్న పాదము: అ-03 అనురాగపు | టంచులు | చూస్తాం
పదముల విఱుపు లేని పాదము: అ-05 నీ కంకణ | నిక్వాణంలో

అన్ని ఛందస్సులతో ఒక గేయము

పై ఐదు గేయములలో శ్రీశ్రీ ఉపయోగించిన 78 ఛందస్సులతో ఒక గేయమును క్రింద వ్రాసియున్నాను. ఇందులో వరుసగా రెండవ అనుబంధములోని ఆయా సంఖ్యలు గల ఛందస్సులు వాడబడినవి. ఇందులో పదచ్ఛేదయతి, పాదాంతయతి, వీటితో అక్షరసామ్యయతిని లేక వడిని కూడ ఉపయోగించినాను. ఇది వ్యావహారిక భాషలో వ్రాయబడినది. ఇది ఒక ఉదాహరణము మాత్రమే –

ఆనందార్ణవము

01. ఏముందో – ఈ లోకంలో
02. కానుకగా – కష్టాలన్నీ
03. ఏదేవుడు – ఇచ్చాడిట్లా
04. కష్టాలే – కథలయ్యాయా
05. శూలాలే – సుఖమ్ము లౌనా
06. ముళ్ళే స-మ్మోదము లౌనా
07. కన్నీళ్ళే – కామితార్థమా
08. కన్నీళ్ళే – కావ్య మ్మగునా
09. తిమిరములో – దివ్వెల్ లేవా
10. సమరమ్మున – శాంతుల్ రావా
11. పరాజయము – పాపమ్మౌనా
12. ఏ సుధలకు – ఈ ఆరాటం
13. ఎవరిస్తా – రిట పీయూషం
14. గళమ్ములో – కమనీయమ్మై
15. వెతలన్నీ – విలాసమౌనా
16. విరించితో – వివాదమేనా
17. వేదనతో – విచారమేనా
18. నేత్రమ్ముల – నిరాశలేనా
19. శ్రమజీవీ – చాకిరి చాలోయ్
20. ఎవ్వరికో – యీ జతనమ్ముల్
21. వారందఱి – బానిస నీవా
22. వారించే – ప్రజ లిల లేరా
23. ఇక వద్దీ – యెద్దు జీవితం
24. సఖ్యముతో – సంతసమ్ముతో
25. సౌఖ్యమ్ముగ – సాహసమ్ముతో
26. ఉండాలోయ్ – యొకటై యవనిన్
27. నవ జీవం- నాలో పారగ
28. నవప్రభల్ – నాలో నాడగ
29. దేవునికే – దీటై క్రొత్తగ
30. చిత్రమ్మును – సృష్టించా లిక
31. ఆనాడే – యగుగా భూమికి
32. సత్యమ్మై – జన్మ దినమ్ముగ
33. నవ లోకపు – నవ నాదమ్ముల్
34. వికాసముల – విలసద్రాగం
35. కలహంసల – కళావిలాసం
36. అమరముగా – నామని గీతం
37. కుసుమమ్ముల – కోమల నృత్యం
38. ప్రభాతముల – రాగపు కాంతుల్
39. వెన్నెల తెర – వేసిన మాయల్
40. వరవీణ – స్వరముల సొంపుల్
41. హరుసముతో – హాయి నీయగా
42. మనమందున – మౌనరాగమౌ
43. నవమగు నీ – నాదమ్ములకై
44. కూరిమితో – కోరిక లలలై
45. నవసృష్టికి – నాందీవాక్యము
46. పల్కించుము – వరమై భూమికి
47. రాగములో – రసప్రవాహము
48. వేగమ్మున – విలాస మిచ్చును
49. నవగీతం – నాకపు నాదము
50. ప్రభాతమో – రాత్రియొ యెప్పుడు
51. కాంతులతో – క్షాంతియు నిండును
52. లోకమ్మున – లోటులు లేవిక
53. యుద్ధ మ్మీ – యుగమున రాదిక
54. శస్త్రమ్ములు – క్షయించంగ నిల
55. సామమ్మే – సంతస మగు నిక
56. కష్టము లిక – కరువగు గాదా
57. కల నిజమగు – కంటి ముందుగా
58. గతమ్ము లొక – కథగా నగుగా
59. భువనములో – ముదమ్ము లెదురౌ
60. ప్రజలందఱు – రమించి మనగా
61. మతాల పగ – మాయము లగుగా
62. ఆనందము – లలరుగ విరులై
63. కలలన్నిటి – కనులం జూడగ
64. మానసమున – మధువే పారును
65. నవజీవన – నవోదయమ్మగు
66. ధ్వనించు గద – ధరాతలమ్మున
67. పాటలు పలు – వరమ్ములై యిక
68. నవనాదము – నాట్యము సేయును
69. నవ మార్గం – నగుచును బిల్చును
70. వసంతములు – ప్రమోదమ్ములగు
71. మురియున్గా – పుడమి పచ్చగను
72. ఆకాశపు – టవధుల్ సులభము
73. ప్రపంచమున – పలుపలు హక్కులు
74. సమాన మిక – జను లెల్లరికిని
75. మరో జగతి – మహా రుచిరములు
76. కనువిందై – కనబడుగద నిక
77. అనంతమౌ – హరుసపు తరగలు
78. గలగలమని – కడు వడి పరుగిడు