చిత్రం – ‘బాపు’రే విచిత్రం!

ముగ్గుల్ని బొమ్మల్లో వేసి వాటిని పాపులర్ చేసిన చిత్రకారుడు మాత్రం బాపునే! ముఖ్యంగా వంకీ చుక్కల ముగ్గులు! అవి ఎంతగా ప్రసిద్ధి చెందాయంటే ఏ బొమ్మలోనయినా ముగ్గు కనిపిస్తే ఇది బాపు బొమ్మేనన్నంతగా! ఇది మాత్రం ఖచ్చితంగా బాపు మార్కు! మిగతా చిత్రకారులెవరూ ఈ నేపథ్యాన్ని వాడుకోవడానికి సాహసించినట్లుగా కనిపించదు. పల్లెటూరి వాతావరణాన్నీ, స్త్రీల అలవాట్లు, ముఖ్యంగా నడక, పొందిక, తీరు తెన్నులూ ఇవన్నీ బాపు చిత్రాకరించినట్లుగా ఎవరూ చెయ్యలేదు. ఈ విషయంలో ఆయనకి ఆయనే సాటి.

తెలుగు సాహిత్యానికి అట్ట వేసిన ఘనుడు: బాపు ప్రత్యేక లక్షణం ఏవిటంటే సందర్భోచితంగా బొమ్మ వేయడం. ఈ సందర్భానికి ఇంతకన్నా గొప్పగా ఎవరూ వేయలేరన్నట్లు వ్యాఖ్యా చిత్రాలు వుండేవి. దాంతో ప్రతీ రచయిత తమ తమ పుస్తకాలకి బాపు బొమ్మ వేయడం ఒక స్పెషల్ స్టేటస్‌గా బావించేవారు. ‘బాపు ముఖచిత్రంతో’ అని ప్రచారం చేసుకున్న పుస్తక ప్రకటనలూ మనమందరం చూశాం!

పుస్తకాలకి ముఖచిత్రాలు వెయ్యడంలో బాపు సృజన కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. అవసరాల రామకృష్ణా రావుగారి ‘గణిత విశారద’ పుస్తకం ముఖచిత్రం పరిశీలించండి. యువరాణి సింహాసనం వెనుక భాగాన్ని చూస్తే 1 నుండి 9 వరకూ అంకెలు స్పష్టంగా చూడచ్చు. గణిత విశారద పేరుకి తగిన బొమ్మ అది. ఈ బాపు బొమ్మల మత్తు పత్రికల వారికి ఎంతగా అంటిందంటే మిగతా ఆర్టిస్టులనీ ఈ తరహాలోనే బొమ్మలు వేయమని పోరే దాకా. చాలమంది చిత్రకారులూ ఈయన వేసిన పద్ధతిలోనే పుస్తకాలకి వ్యాఖ్యా చిత్రాలు వేయడం గమనించగలం.

మొదట్లో బాపు వేసిన చిత్రాలు అంటే 1980కి ముందువి, పరిశీలిస్తే కొన్ని ఎంతో గొప్పగానూ, మరికొన్ని మామూలుగానూ కనిపిస్తాయి. రాను రానూ, జాగాని వాడుకోవడంలో పట్టు బాగా కనిపిస్తుంది. అదే కాదు. బొమ్మ ఎంత వరకూ అవసరమో అంతే వేయడం. అంతకు పూర్వం వేసిన చాలా చిత్రాల్లో ఈ పొందిక బలంగా అమిరినట్లుండదు. ఈ క్రింది చిత్రాలు చూడండి. బొమ్మ ఎంత అవసరమో అంతే ఉంది. బొమ్మ చూడగానే అది ఏ సందర్భమో పసి పిల్లాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది.

బొమ్మలు వేయడంలో జాగా వాడుకోవడంలో బాపు చతురత గురించి పరిశీలించాం. రానూ రానూ అంటే 1985 దాటాక బొమ్మల్లో, ‘జాగాని వదిలేయడం’ మరింతగా కనిపిస్తుంది. ఈ జాగా వదిలేయడాన్నే చిత్రకళ పాఠ్యాంశంలో ‘నెగిటివ్ స్పేస్’ వాడుకోవడం అంటారు. ఈ నెగిటివ్ స్పేస్ వాడుకోవడం అన్నది ఒక ప్రత్యేక కళ. ఒక సందర్భాన్నీ, సన్నివేశాన్నీ ఈ నెగిటివ్ స్పేస్ టెక్నిక్‌తో మరింత అందంగా అర్థవంతంగా బొమ్మ గీయచ్చు. ఈ టెక్నిక్‌తో వేసిన బొమ్మలు కనికట్టు విద్యలా కళ్ళను కట్టిపడేస్తాయి. ఎక్కువ జాగా వదిలేసి చిన్న బొమ్మనే మరింత అర్థవంతంగా, అందంగా వేయడం కనిపిస్తుంది.

దశావతార చిత్రాలు, తిరుప్పావైకి వేసిన చిత్రాలు, అమ్మ పేరుతో వేసిన చిత్రాలు వీటికి ఉదాహరణ. చాలామంది చిత్రకారులు ఫెయిల్ అయ్యేది ఇక్కడే! ముఖ్యంగా వ్యాఖ్యా చిత్రకారులు. ఎంత ఎక్కువ జాగా వదిలిస్తే అంత అందంగా వేయ్యచ్చు. ముఖ్యంగా దృష్టికోణం టెక్నిక్‌తో వేసే చిత్రాలకి ఈ పద్ధతి వన్నె తెస్తుంది. ఈ పద్ధతిలో ఎన్నో పుస్తకాలకి బాపు ముఖ చిత్రాలు వేశారు. ఎందుకంటే కథల పుస్తకాలూ, నవలలూ వాటి నిడివి వారపత్రికల కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ జాగా వదిలేసి బొమ్మలు వేయడం వలన కొత్త అందాలు కనిపించేవి.

మొదట్లో పుస్తకాలకి బొమ్మలు వేసిన తీరుకీ, 80ల తరువాత వేసిన బొమ్మలకీ ఈ టెక్నిక్ వలనే చాలా తేడా కనిపిస్తుంది.

బాపు బొమ్మలేసిన పుస్తకాలు ఎప్పటికప్పుడు కొత్తగా వైవిధ్యంతో ఉంటాయి. చాలామంది ఆర్టిస్టులు పుస్తకాలకీ, కథలకీ బొమ్మలు వేసేటప్పుడు అవి చదవడం వంటివి శ్రద్ధగా చెయ్యరు. బాపు ఆ కోవకి చెందరని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే కథకి వేసిన బొమ్మలు కథని ఇంకో మెట్టు పైన కూర్చోపెట్టేలా ఉంటాయి. కథ చదివాక – బొమ్మ ఎంత అర్థవంతంగా ఉందీ? అని పాఠకుడు అనుకోక మానడు. అందుకే బాపు మామూలు చిత్రకారుడు కాదు; మేధోచిత్రకారుడు.

ఎంతోమంది రచయితల పుస్తకాలకి, అడగడం మహాపాపం అన్నట్లుగా, బాపు బొమ్మలు గీసిచ్చారు. చాలాసార్లు పారితోషికం కూడా తీసుకోకుండా ఉత్తినే వేసిచ్చిన సందర్భాలున్నాయి. ఈ అనుభవం నాకూ వుంది. త్యాగరాజు మీద నేను రాసిన వ్యాసాలు పుస్తకంగా వేసుకుంటాను, మీరు బొమ్మ గీసివ్వగలరా అని అడిగితే సరే నన్నారు. సాధారణంగా త్యాగరాజు బొమ్మంటే చేతిలో తంబూరా, తలకి హరిదాసు తలపాగా, వెనుక ఓ సీతారాములు ఆశీర్వదిస్తున్నట్లుగా చాలా చిత్రాలు వచ్చాయి.

బాపు కూడా ఇదే తీరులో చాలా బొమ్మలు వేశారు. బొమ్మ వేసిస్తాననగానే చాలా సంతోషించాను. కానీ నాకు వేరే రకంగా కావాలని అడిగాను. ఏవిటో చెప్పమన్నారు. త్యాగరాజుకి హరిదాసు వేషం ఉండకూడదు. త్యాగరాజు పంచరత్న కీర్తనలు ప్రసిద్ధి కనుక అవి స్ఫురణకి వచ్చేలా ఉండాలి. రాముడి చిత్రం లేకుండా ఆయన రామభక్తుడని చూపించగలగాలి. ఆఖరిది అంత పట్టింపు లేదని చెప్పాను. మొదటి రెండూ మాత్రం ఉండాలని అన్నాను. మర్నాటికల్లా నాకు బొమ్మ తయారయిపోయింది. నేనూహించిన దానికి వెయ్యి రెట్లు గొప్పగా ఆ ముఖ చిత్రం వేశారు. చూడండి మీకే తెలుస్తుంది.

ఇలా తన సృజనకి మెరుగైన ఆలోచన జోడించడం వలనే ఆయన చిత్రాలు అందరికీ నచ్చాయి. ఎంతో మంది పుస్తకాలకి బాపు సృజన వన్నె తెచ్చి పెట్టింది.

రంగుల పొందిక: ఈ వ్యాసం మొదట్లో బొమ్మల లక్షణాలు చెబుతూ, రంగుల పొందిక గురించి కావాలనే వదిలేశాను. రంగుల పొందిక అవసరం తైల వర్ణచిత్రాల్లో ఉన్నంతగా వ్యాఖ్యా చిత్రాల్లో కనిపించదు. రంగుల విలువ ప్రాముఖ్యత, అందమూ తైల వర్ణచిత్రాల్లోనే బాగా తెలుస్తాయి. దానిక్కారణం కూడా లేకపోలేదు. ఎక్కడ ఏ రంగు విలువ (దీన్నే color value అంటారు) సరిపడ్డా ఎంత ఉందో తైలవర్ణ చిత్రాల్లోనే స్పష్టంగా ఉంటుంది. ఏదైనా తైలవర్ణ చిత్రాలు పరిశీలించేటప్పుడయినా, విమర్శించేటప్పుడయినా చిత్రలేఖన విమర్శకులు వీటి గురించే ఎక్కువగా చెబుతారు. వాటిని బట్టే తైల వర్ణచిత్రం విలువ కూడా కడుతూ ఉంటారు. వ్యాఖ్యా చిత్రాలకొచ్చేసరికి ఇది ఉండదు. కారణం వాటికి సందర్భం, సన్నివేశం ముఖ్యం! అవి కొట్టచ్చినట్లు కనిపించకపోతే ఎన్ని రంగులద్దినా ఒకటే!

బాపు రంగుల్లో బొమ్మలు వేశారు కానీ, అవి ఆయన గీత ఉన్నంత స్థాయిలో లేదు. బాపు తైల వర్ణచిత్రాలు వేసినట్లు కనిపించదు. నేను ఇదే విషయం ఆయన్ని అడిగినప్పుడు తను మొదట్లో ప్రయత్నించాననీ, కానీ అందులో పట్టు దొరకలేదని ఏ మాత్రం భేషజం లేకుండానే చెప్పారు. అందువల్లనే ఆయన ఎక్కువగా వాటర్ కలర్స్ వేయడం కనిపిస్తుంది. బాపు బొమ్మల్లో ఎక్కువగా పదేపదే ఒకే తరహా రంగులు కనిపిస్తాయి. అందువల్ల కొన్ని బొమ్మలు ఎంతో అర్థవంతంగానూ, గీతలు అందంగానూ ఉన్నా బొమ్మ కొట్టవచ్చినట్లు కనిపించదు. కొన్ని బొమ్మలకయితే రెండు మూడు రంగులు దాటి లేవు. ఉదాహరణకి ఈ బొమ్మలే చూడండి.

ఒకటి, రామలక్షమణులు, సీత, హనుమంతుడు ఉన్నది. రాముడి శరీరం రంగూ, లక్ష్మణుడి పంచ రంగూ ఒకటే! అలాగే సీత చీర రంగూ, హనుమంతుడి పంచె రంగూ కూడా ఒకటే! ఈ రంగులు ఉండకూడదని కాదు. చిన్న బొమ్మ వేసేటప్పుడు బొమ్మలో ఉన్న వివిధ అంశాలకీ రంగులు చాలా స్పష్టత ఇస్తాయి. గీత ఎంతో అద్భుతంగా ఉంది. రంగుల దగ్గరకొచ్చేసరికి సర్దిపెట్టుకోవాలి.

అలాగే కృష్ణా, రాధల చిత్రం కూడా. ఈ మొత్తం బొమ్మలో గులాబీ రంగు బొమ్మని పేలవంగా తయారు చేసింది. కాస్త రంగుల వైవిధ్యం చూపిస్తే ఎంత బావుండేది! మూడో చిత్రం రామ పట్టాభిషేకం అయితే అంతా ఎరుపు రంగూ, లేదా దానికి దగ్గర రంగులే! నేను ఉదాహరణకి మాత్రమే కొన్ని తీసుకున్నాను. పైన చెప్పినవి చెడిపోయాయి కనుక మిగతావి అంతే అని కాదు. నూటికి నూరు మార్కులొచ్చే చోట ఒకటి రెండు తగ్గినా తగ్గినట్లే కదా? ఆయన వేసిన ఎన్నో వందల చిత్రాలని పరిశీలించాకే నాకీ అభిప్రాయం కలిగింది. అందుకే వడ్డాది పాపయ్య బొమ్మలకీ, బాపూ బొమ్మకీ తేడా స్పష్టంగా చెప్పగలం.

వడ్డాది పాపయ్య చిత్రాలకి రంగులే ఎక్కువ కళ తీసుకొచ్చాయి. రంగుల విలువ (color value) స్పష్టంగా వాడుకోవడం వలన అదే కోవకి చెందిన రంగయినా స్పష్టంగా తేడా తెలుస్తుంది. ఇంకొకటేమిటంటే ఖచ్చితమైన రంగు విలువ చిత్రానికి లోతు, గంభీరత తీసుకొస్తుంది. వస్తు పరిమాణం వచ్చి బొమ్మలు మరింత అందంగా ఉంటాయి. ఆయిల్ పెయింటింగ్స్‌కి వన్నె తెచ్చేవి ఈ రంగుల విలువలే! వడ్డాది పాపయ్య చిత్రాలకి అందం తెచ్చిన అంశం ఇదే!

ఎన్నో వందల బాపూ చిత్రాలు చూశాక ఆయన వైవిధ్యంతో వేసిన కొన్ని చిత్రాలు ఇవి నా దృష్టిలో ఇప్పటికీ గొప్పవే! ఇందులో కొన్ని తెలుపు-నలుపు చిత్రాలున్నాయి.

ముఖ్యంగా నలుపు తెలుపు చిత్రాలు గమనిస్తే ఒక వ్యక్తి మొహంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారో లెక్కపెట్టగలరా? అలాగే ఇంకో వ్యక్తి నుదుటున ఒక ఆడామగా ఉన్నారు. ఆ బొమ్మనే జాగ్రత్తగా పరిశీలించండి. ఒక కోణంలో పులి తలలా కూడా ఉంటుంది.

నైట్ క్లబ్ చిత్రంలో పాళీ ఉన్న కలాన్ని జాగ్రత్తగా చూస్తే అందులో కొంతమంది స్త్రీలు కనిపిస్తారు, వివిధ భంగిమల్లో! ఇవి కథలకి వేసిన చిత్రాలయినా ఇందులో సృజనా, ఆ కథలకి సంబంధించిన నేపథ్యమూ కనిపిస్తాయి. బాపూ బొమ్మ కథని ఇంకో మెట్టుపైకి ఎక్కిస్తుందీ అనడానికి కారణం ఇదే!

నా వరకూ బాపూ బొమ్మ అందం ఆయన గీత. అది ఆయనకొక్కడికే సొంతం! అందుకేనేమో ఆరుద్ర

కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయల-లూపు
ఓ కూనలమ్మా!!

అని ముచ్చటగా చెప్పేశాడు. కాదనే సాహసం ఏ తెలుగువాడికి ఉంటుంది చెప్పండి?

(ఆగస్టు 31, బాపూ వర్ధంతి. ఆయన స్మృతికి నివాళి.)