సినిమా పాటల్లో శివరంజని రాగం
- ఆకాశదేశాన ఆషాఢ మాసాన (మేఘసందేశం)
- శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా (లవకుశ)
- వగల రాణివి నీవే (బందిపోటు)
- నీ చెంతే ఒక చంచిత ఉంటే (స్వరాభిషేకం)
- శివరంజని నవరాగిణి (తూర్పు-పడమర)
- పాలించర రంగా పరిపాలించర రంగా (విప్రనారాయణ)
- అభినవ తారవో (శివరంజని, ఈ పాట రాగమాలిక)
- అబ్బనీ తియ్యనీ దెబ్బ (జగదేకవీరుడు – అతిలోకసుందరి)
- ఓ ప్రియా ప్రియా (గీతాంజలి)
- మేరే నైనా సావన్ (మెహ్‌బూబా)
- జానే కహా గయే (మేరా నాం జోకర్)
- బహారోం ఫూల్ బర్సావో (సూరజ్)
- తెరే మెరే బీచ్‌మే కైసా ఎ బంధన్ (ఎక్ దూజే కే లియే)
హిందీ సినిమా పాటల్లో:
శివరంజని రాగానికి ఒక ప్రత్యేకత ఉంది. శాస్త్రీయ సంగీతంతో ఏమాత్రం పరిచయం లేనివారు కూడా కొంచెం సులభంగా గుర్తు పట్టగలిగే రాగం శివరంజని. ఈమాట లో రాగలహరి శీర్షికలో మొట్టమొదటగా పరిచయం చేసిన మోహన రాగానికి శివరంజని రాగానికి స్వరపరంగా చాలా పోలికలు ఉన్నాయి! మోహన రాగంలో తీవ్ర గాంధారానికి బదులుగా కోమల (సాధారణ) గాంధారం వాడితే అది శివరంజని రాగం అవుతుంది. మోహన రాగం లాగా శివరంజని రాగం కూడా ఔడవ రాగం; అంటే, ఆరోహణలోనూ, అవరోహణలోనూ ఐదు స్వరాలు మాత్రమే ఉపయోగించే రాగం. శివరంజని రాగంలో నిషిద్ధ స్వరాలైన మధ్యమం, నిషాధం స్వరాలు వాడినట్లైతే అది మిశ్ర-శివరంజని రాగం అవుతుంది.
కరుణ, విషాద రసాలని బాగా పోషించగల శివరంజని రాగం ప్రాచుర్యంలోకి వచ్చింది గత డెబ్భై సంవత్సరాలలోనే! కర్నాటక సంగీతంలో శివరంజని అన్న రాగం ఉన్నా, ఇక్కడ మనం చెప్పుకుంటున్న లలిత సంగీతంలో (సినిమా పాటలతో సహా) విరివిగా ఉపయోగించే ఐదు స్వరాల హిందూస్తానీ శివరంజని రాగానికి, కర్నాటక సంగీతంలో ఏడు స్వరాలు ఉన్న శివరంజని రాగానికి ఎటువంటి సంబంధము, పోలికలు లేవు. ఈ వ్యాసంలో శివరంజని రాగం అంటే, హిందూస్తానీ రాగం అనే గమనించగలరు!
ఈనాడు బహుళ ప్రచారంలో ఉన్న శివరంజని రాగానికి మూలం హిందూస్తానీ సంగీతంలో కాఫీ ఠఠ్ (కర్నాటక సంగీతంలో ఖరహరప్రియ జన్యం.)
చిత్రమైన విషయం ఏమిటంటే, శివరంజని రాగం 1940వ దశాబ్దం నుంచే ప్రాచుర్యం లోకి వచ్చిందట[1]. ఈ రాగం పాడటానికి, వినటానికి రాత్రి మంచి సమయం. ఈ రాగం శోకరసాన్ని బాగా పోషిస్తుంది. సంగీతంలో మహా విద్వాంసులైనవారికి కూడా, మోహన రాగంలోని తీవ్ర (అంతర) గాంధారానికి బదులుగా కోమల (సాధారణ) గాంధారాన్ని వాడటం వల్ల ఏర్పడే శివరంజని రాగఛ్చాయలో కనిపించే అనూహ్యమైన మార్పు ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే!
శివరంజని రాగంలో స్వరస్థానాలు
పైన చెప్పినట్టు ఆరోహణ – అవరోహణ, రెంటిలోనూ ఐదు స్వరాలు ఉన్న రాగం శివరంజని.
స, రి2, గ1, ప, ద2 స్వరాలు శివరంజనిలో వాడతారు. హిందూస్తానీ సంగీతంలో, రాగ లక్షణాన్ని వివరించటానికి ఒక పద్ధతి ఉపయోగిస్తారు. ఈ సంగీతంలో పత్రి రాగంలోనూ రెండు స్వరాలను అతి ముఖ్యమైన స్వరాలుగా గుర్తిస్తారు. మొదటి ముఖ్యమైన స్వరాన్ని వాది అని, రెండవ ముఖ్యమైన స్వరాన్ని సంవాది అని పిలుస్తారు. ఈ రకంగా రాగాన్ని వివరించే పద్ధతి హిందూస్తానీ సంగీతానికే పరిమితం. మన కర్నాటక సంగీతంలో ఈ రకంగా రాగానికి వివరణ ఇవ్వరు. శివరంజని రాగంలో వాది స్వరం ప, సంవాది స్వరం స.
ఈ రాగానికి ఆరోహణ, అవరోహణ ఈ విధంగా ఉంటాయి.
ఆరోహణ: స రి గ ప – ధ – స (పై షడ్జమం)
అవరోహణ: స (పై షడ్జమం) ధ ప – గ s – రి స s
పకడ్ స్వరాలు ఈ విధంగా ఉంటాయి.
గ ప ధ స (పై షడ్జమం) – ధ ప – గ s రి – స
ఇక్కడ ఇచ్చిన బొమ్మలో కీబోర్డ్ పైన శివరంజని రాగం స్వరాలు ఎలా పలికించాలో తెలుపుతాయి. బొమ్మలో ఇచ్చిన తెల్ల మెట్లు, నల్ల మెట్లు జాగ్రత్తగా గమనించండి. ఈ మెట్ల వరసలు – తెల్ల మెట్టు, నల్ల మెట్టు, తెల్ల మెట్టు, నల్ల మెట్టు, తెల్ల మెట్టు, తెల్ల మెట్టు ఇలా ఉన్న మెట్ల వరసని మీ కీబోర్డ్ మీద సరిగా గుర్తించండి. ఈ వరుసలో మొదటి తెల్ల మెట్టుని స- స్వరంగా తీసుకోండి. బొమ్మలో చెప్పినట్టు ఈ తెల్ల మెట్టు C స్కేల్‌ని సూచిస్తుంది. అంటే, మన భారతీయ సంగీతంలో ఒకటో శ్రుతి అన్న మాట. ఒక సారి స- స్వరాన్ని నిర్ధారించిన తరవాత, బొమ్మలో చూపినట్లు రి, గ, ప, ధ స్వరాలను గుర్తించి వాటిని పలికిస్తే శివరంజని రాగం గుర్తించినట్టే లెక్క. బొమ్మలో చూపిన G2 నేను ఈ వ్యాసంలో చెప్పిన గ1 – ఈ రెండూ ఒకటే! సంగీతం ఉత్సాహంగా నేర్చుకొనే వారిని ప్రోత్సహించటం కోసం మాత్రమే ఈ వివరాలు ఇక్కడ ఇస్తున్నా!
సంగీతంలో స్వరాలు – కీబోర్డ్‌పై పలికించే విధం
చాలా మంది ఔత్సాహికులు అప్పుడప్పుడే సంగీతం నేర్చుకుంటూ, తాము నేర్చుకున్న స్వరాలను కీబోర్డ్ లేదా హార్మోనియం మీద పలికించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు! వారికి సహాయపడటానికి ఇక్కడ చెప్పే నాలుగు మాటలు ఉపయోగపడతాయి. ఇక్కడ ఇచ్చిన ఇచ్చిన కీబోర్డ్ బొమ్మలో పూర్తిగా కీబోర్డ్ మెట్లు, వాటికి సంధానమయ్యే స్వరాలు కనపడతాయి.
కీబోర్డ్ కింద వరసలో నల్ల అక్షరాలు – S R G m P D N మధ్య స్థాయిలో స్వరాలను సూచిస్తాయి. ఇందులో S అన్నది స- స్వరంగా ఒకటి శ్రుతిలో మొదలవుతుంది. ఈ స్వర సముదాయానికి ఎడమగా ‘S ‘R ‘G ‘m ‘P ‘D ‘N కనపడేది మంద్రస్థాయిని, కుడి వైపుగా కనపడే S’ R’ G’ m’ P’ D’ N’ స్వరసముదాయం తారాస్థాయిని సూచిస్తాయి. కీబోర్డ్ పైన నల్ల అక్షరాలు r g M d n అక్షరాలు మధ్య స్థాయిలో కోమల స్వరాలను (మా- స్వరం మాత్రం తీవ్ర స్వరం) సూచిస్తాయి.
ఈ విధమైన స్వరాలను వాడితే, శివరంజని రాగం S R g P D స్వరాలతో పలికించ వచ్చునన్న మాట!
ఈ కీబోర్డ్ మెట్లని అన్నీ వరుసగా వాయిస్తే – స, రి1, రి2, గ1, గ2, మ1, మ2, ప, ధ1, ధ2, ని1, ని2, స (పై షడ్జమం) పలుకుతాయి.
సినిమా పాటల్లో శివరంజని రాగం
పసుపులేటి రమేష్ నాయుడు శివరంజని రాగంలో స్వరపరచిన మూడు పాటలు ఇక్కడ చెప్పుకోటం అవసరం. తూర్పు – పడమర అన్న సినిమాలో, శివరంజనీ, నవ రాగిణీ… అన్న పాట చాలా చక్కగా ఈ రాగంలో రమేష్ నాయుడు బాణీ కట్టగా, ఎస్. పి. బాలు పాడారు. సాహిత్యం సినారె. ఈ పాటలో సంగీత-సాహిత్యాల మేలు కలయిక రసికులను ఆకట్టుకుంటుంది. అంత అద్భుతంగాను బాలు పాడారు. శివరంజని రాగ లక్షణం తెలియాలంటే ఈ పాట ఎక్కువ సార్లు వినండి. శివరంజని సినిమా కోసం రమేష్ నాయుడు రాగమాలికగా బాణీ కట్టిన పాట, అభినవ తారవో… పాట మొదటి చరణం శివరంజని రాగంలో కట్టగా బాలూ పాడారు. ఈ రాగమాలికలో సరస్వతి, కల్యాణి వంటి ఇతర రాగాలను ఒక్కో చరణానికి ఎన్నుకున్నారు రమేష్ నాయుడు. ఇది కూడా ఒక మంచి పాటే!
ఐతే, మేఘసందేశం సినిమా కోసం రమేష్ నాయుడు బాణీ కట్టి జేసుదాస్ చేత పాడించిన ఆకాశ దేశాన అన్న పాట గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి. జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఈ పాటకి సాహిత్యాన్ని ఇచ్చిన వేటూరి సుందరరామమూర్తిగారు స్వయంగా, 2000 సంవత్సరంలో తానా ప్రాంతీయ సభలకు డాలస్ వచ్చినప్పుడు చెప్పిన మాటలివి. ఈ పాట రికార్డింగ్ సందర్భంగా వేటూరి స్టూడియోకి వెళ్ళటం, అక్కడ కనపడ్డ అతి తక్కువ ఆర్కెష్ట్రా గురించి చెపుతూ అన్న మాటలివి. “సాధారణంగా, పాట రికార్డ్ చేస్తున్నప్పుడు దాదాపు 100 మందికి పైగా ఉన్న వాయిద్యకారులతో సంగీత దర్శకుడు మంచి బాణీలను ఇవ్వటం మనం చూస్తాం. ఆ రోజు, స్టూడియోలో రెండు మూడు వయొలిన్‌లు, మూడు నాలుగు వీణలు, రెండు తబలా సెట్లు ఇలా ఒక 20 మందికి మించని ఆర్కెస్ట్రా కనపడింది. ఇంత తక్కువ వాయిద్య కారులతో ఎలాంటి సంగీత సృష్టి చేస్తారో రమేష్ నాయుడు అని వేచి ఉన్నా! పాట మొదలవుతూనే వచ్చే సంగీతం, ఏసుదాసు గొంతులో నేను రాసిన సాహిత్యం ఎలా ఒదిగిపోయాయంటే, సంగీత సాహిత్యాలకి చక్కని మేళవింపు గల పాట సృష్టి నా కళ్ళ ముందు జరిగింది. అంత తక్కువ మంది వాయిద్యకారులతో అంత చక్కని బాణీ ఇవ్వగల రమేష్ నాయుడుగారి సామర్ధ్యం ఆ రోజు చూశాను!”
దక్షిణ చలన చిత్ర రంగంలోకి ప్రవేశించి, సంచలనం సృష్టించిన అతి కొద్ది మంది సంగీత దర్శకుల్లో ఇళయరాజా వంటి వారు అరుదుగా కనిపిస్తారు. జగదేక వీరుడు-అతిలోక సుందరి సినిమా కోసం ఇళయరాజా బాణీ కట్టిన అబ్బనీ తియ్యనీ దెబ్బ… అన్న పాట చాలా ప్రజాదరణ పొందింది. శివరంజని రాగంలో బాణీ, వేటూరి సాహిత్యం, ఈ పాట బాలు, జానకి పాడారు. కరుణ, విషాద రసాలని పోషించే శివరంజని రాగాన్ని తీసుకొని ప్రణయ గీతంగా మలచటం, ఇళయరాజా అద్భుత సృష్టి. పాటకి సరిపడా నటించిన శ్రీదేవి, చిరంజీవిల నటన కూడా ఈ పాట విజయానికి ఎంతో తోడ్పడింది.
శివరంజని రాగాన్ని పాటల బాణీలకి వాడుకున్న సంగీత కర్తలు అందరూ ‘దోపిడీ’ చేసిన గమ్మత్తు ఒకటి ఉంది. ఈ రాగంలో కోమల గాంధారం ఉపయోగిస్తారు అని పైన చెప్పుకున్నాం కదా! అలా కోమల గాంధారం వాడుతూ అక్కడ నుంచి గమ్మత్తుగా తీవ్ర గాంధారంలోకి రావటం (రావటం అనటం కన్నా జారటం అంటే బాగుంటుంది) ఒక వింతైన అందాన్ని ఇస్తుంది. పైన చెప్పిన పాట – అబ్బనీ తియ్యనీ దెబ్బ, పాటలో కోమల గాంధారం నుంచి తీవ్ర గాంధారం లోకి ‘జారటం’ అన్న ప్రయోగం జరిగింది. అది ఎక్కడ, ఎలా జరిగిందో ( కాదంటూనే కలబడు… అది లేదంటూనే ముడిపడు…; నిన్నే నావి పెదవులు… అవి నేడైనాయి మధువులు…) ఏదైనా ఒక వాయిద్యం వాయించగలిగిన వారు ప్రయత్నిస్తే అర్ధం అవుతుంది.
1970 సంవత్సరంలో వచ్చిన హిందీ సినిమా, మేరా నామ్ జోకర్ కోసం ముఖేష్ పాడిన, జానే కహా గయే ఓ దిన్… అన్న పాటలో కూడా పక్కపక్కనే ఉపయోగించే ఈ రెండు గాంధర్వాల కలయిక కనపడుతుంది. నేను ఈ వ్యాసంలో ఉదాహరించిన పాటలన్నిటిలోకి ఈ మధ్యనే (2004 సంవత్సరంలో) వచ్చిన స్వరాభిషేకం అన్న సినిమాలో, నీ చెంతే ఒక చెంచిత ఉంటే… యుగళ గీతం కుడా ఈ శివరంజని రాగం కోవకి చెందినదే! ఈ పాట పూర్తిగా విన్నట్టయితే, పాట చివరగా గాయకి చిత్ర శివరంజని స్వరాలతో (మ, ని, స్వర ప్రయోగాలు కూడా కలిశాయి) – సారీగప, సారీగప, పాదపదా సదా దపపా, పాదసా పాదాగారిస, ‘రీసానిదపమగరిసా రిగమదపా – ముగిస్తుంది. ఈ సినిమాకి సంగీతం ఇచ్చింది విద్యాసాగర్. నాకు గుర్తు ఉన్నంతలో, ఈ పాట శివరంజని రాగంలో బాగా బాణీ కట్టిన చివరి తెలుగు సినిమా పాట అనిపిస్తోంది.
సాలూరు రాజేశ్వరరావు బాణీ గురించి ముచ్చటించకుండా ఈ వ్యాసం పూర్తి చేస్తే ఇది అసంపూర్ణ వ్యాసం అవుతుంది. విప్రనారాయణ సినిమా కోసం ఎ. ఎం. రాజాతో పాడించిన, పాలించర రంగా… అన్న పాట శివరంజని రాగంలోనే బాణీ కట్టబడింది. శివరంజని రాగం అద్భుతంగా పోషించగల ప్రధాన రసమైన కరుణ రసాన్ని ఈ పాటలో ప్రతిష్టించి, రాజా చేత రాజాలా పాడించిన సాలూరికి సలాం చేస్తూ ఈ వ్యాసం ముగించే ముందు ఘంటసాలని మరొక్క సారి గుర్తు చేసుకుందాం!
1963 సంవత్సరంలో విడుదల అయిన లవకుశ సినిమా బహుశా తెలుగువారెవ్వరూ మరచిపోలేరేమో! సంగీత దర్శకునిగా ఘంటసాల సినీజీవితంలో లవకుశ ఒక కలికితురాయి. ఈ సినిమాలో ప్రతి పాట, పద్యం, న భూతో న భవిష్యతి అన్నట్టు ఉంటాయి. ఈ సినిమాలో, పి. లీల, పి. సుశీలల చేత అత్యద్భుతంగా పాడించిన మూడు పాటల్లో – శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… పాట శివరంజని రాగంలో కట్టబడ్డదే! పాట మొత్తంలో మామూలుగా శివరంజని రాగంలో వాడని అన్య స్వరాలు ఉపయోగించటం వల్ల ఈ పాటని మిశ్ర-శివరంజని అనవచ్చు!
విషాద, కరుణ రసాలు ప్రధానంగా చూపగలిగే శివరంజని రాగాన్ని గమ్మత్తుగా బందిపోటు సినిమాలో ఘంటసాల ఎలా ఉపయోగించాడో ఈ క్రింది పాటలో తెలుస్తుంది.
శివరంజని రాగంలో లేని ని- స్వరాన్ని అందంగా ఉపయోగించాడు ఘంటసాల ఈ పాటలో!
వగల రాణివి నీవే
వగల రాణివి నీవే – సొగసు కాడను నేనే
(సాసాసా దాదద పదపదగ – సాసాసా దాదద పదపదగ)
ఈడు కుదిరేను – జోడు కుదిరెను మేడ దిగి రావే
(పాదనినిదప – గాపదదపగ రీగపపదాసా’)
పిండి వెన్నెల నీ కోసం – పిల్ల తెమ్మెర నా కోసం
(సా’సానినిదని పాపాపా – సా’సానినిదని పాపాపా)
రెండు కలసిన నిండు పున్నమి – రేయి మన కోసం
(పాదనిసనిద గాపగదపగ – రీగపపదాసా’)
దోర వయసు చినదానా – కోర చూపుల నెరజాణ
(సా’సానినిదని పాపాపా – సా’సానినిదని పాపాపా)
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడ నే కానా
(పాదనిసనిద గాపగదపగ – రీగపపదాసా’)
కోపమంతా పైపైనే – చూపులన్ని నాపైనే
(సా’సానినిదని పాపాపా – సా’సానినిదని పాపాపా)
వరుని కౌగిట – ఒరిగినంతనే కరిగి పోదువులే
(పాదనిసనిద గాపగదపగ – రీగపపదాసా’)
ఉపకరాలు
- “Raganidhi, A Comparative Study of Hindustani and Karnatic Ragas”, B. Subba Rao, The Music Academy, Madras, 1966.
- YouTube నుంచి ఎన్నో పాటలు ఈ వ్యాసానికి వాడుకోబడ్డాయి. ఇందుకు ముఖ్యోద్దేశ్యం పాఠకులకి ఈ పాటలను వినే అవకాశం వల్ల “శివరంజని” రాగాన్ని తేలికగా గుర్తు పడతారనే!
- ఈ వ్యాసానికి ఉపయోగపడిన కీబోర్డ్ బొమ్మలు ఇంటర్నెట్ నుంచి తీసుకోబడ్డాయి.