అక్కరలు

పరిచయము

తెలుగు ఛందస్సులో పద్యములను మూడు విధములుగా వ్రాయవచ్చును, అవి – వృత్తములు, జాతులు, ఉపజాతులు. వృత్తములలో ప్రతి పాదములో ఒక నియమిత పద్ధతిలో గురు లఘువులు అమర్చబడి ఉంటుంది. ఇట్టి వృత్తములకు అక్షరసామ్య యతి లేక వడి, ప్రాస ఉంటాయి. ఈ వృత్తముల లక్షణములను ఎనిమిది మూడక్షరముల గణములతో, నాలుగు రెండక్షరముల గణములతో, గురు లఘువులతో వివరించుటకు వీలవుతుంది. చంపకోత్పల మాలలు, శార్దూల మత్తేభ విక్రీడితాది వృత్తములను తెలుగు కవులు ఎక్కువగా వాడినారు. జాతి పద్యములను మాత్రా గణములతో, అంశ లేక ఉప గణములతో వివరించ వీలవుతుంది. కందము, ఉత్సాహ, రగడలు మాత్రాగణ నిర్మితములైతే, ద్విపద, తరువోజ, అక్కరలు మున్నగునవి ఉపగణ నిర్మితములు. వృత్తములవలె జాతి పద్యములకు కూడ యతిప్రాసలు ఉంటాయి. ఉపజాతులలో ప్రాస ఐచ్ఛికము. అక్షరసామ్య యతినైనా, ప్రాసయతినైనా వాడవచ్చును. వీటిలో ఉపగణములను వాడుతారు. సీసము, ఆటవెలది, తేటగీతి మున్నగునవి ఉపజాతులు. ఈ వ్యాసములో తెలుగులో అరుదుగా వాడబడిన అక్కరలను గుఱించి చర్చిస్తాను.

అక్కరలను తెలుగుభాషలో వృత్తాలకు ముందే వాడినారు. నన్నయ భారతానికి ముందు, నన్నెచోడుని కుమారసంభవానికి ముందే శిలాశాసనములలో అక్కరలలో పద్యాలు చెక్కబడ్డాయి. అక్కరలు కన్నడము, తెలుగు – ఈ రెండు భాషలలో ఉన్నాయి. బహుశా రెండింటిలో ఒకే సమయములో వీటిని వాడియుంటారు. అక్కరల వివరాలను తెలిసికొనడానికి ముందు, ఈ అక్కరలలో వాడే గణములను గుఱించి మనము తెలిసికోవాలి. ద్విపదాదులలో సూర్య గణములను, ఇంద్ర గణములను వాడుతారన్న విషయము మనకు తెలిసినదే. అదనముగా చంద్ర గణములను కూడ అక్కరలలో వాడుతారు. తెలుగు ఛందస్సులోని సూర్య, ఇంద్ర, చంద్ర గణములు కన్నడ ఛందస్సులోని బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములలోని చిన్న మార్పులు మాత్రమే. ఆ గణముల వివరములను క్రింద ఇస్తున్నాను. ఇట్టి గణముల నిర్మాణరీతిని ఒకప్పుడు వివరించియున్నాను.

బ్రహ్మ గణములు లేక రతి గణములు – 4 – UU, UI, IIU, III
సూర్య గణములు – 2 – UI, III

విష్ణు గణములు లేక మదన గణములు – 8 – UUU, UUI, UIU, UII, IIUU, IIUI, IIIU, IIII
ఇంద్ర గణములు – 6 – UUI, UIU, UII, IIUI, IIIU, IIII

రుద్ర గణములు లేక బాణ గణములు – 16 – UUUU, UUUI, UUIU, UUII, UIUU, UIUI, UIIU, UIII, IIUUU, IIUUI, IIUIU, IIUII, IIIUU, IIIUI, IIIIU, IIIII
చంద్ర గణములు – 14 – UUUI, UUIU, UUII, UIUU, UIUI, UIIU, UIII, IIUUI, IIUIU, IIUII, IIIUU, IIIUI, IIIIU, IIIII

బ్రహ్మ, విష్ణు, రుద్రగణములలో ఎఱ్ఱ రంగుతో ఉండే రెండు గణములను తొలగిస్తే మనకు సూర్య, ఇంద్ర, చంద్ర గణములు లభిస్తాయి. కన్నడ ఛందస్సు వివరాలను తెలిపేటప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములని వివరించినప్పుడు తెలుగులో అవి సూర్య, ఇంద్ర, చంద్ర గణములకు సమానమని తెలిసికోవాలి. కన్నడములో మొదటి ఛందోగ్రంథమును వ్రాసిన నాగవర్మ బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములని వాడినా, తఱువాత సంస్కృతములో కన్నడ ఛందస్సు గుఱించి వ్రాసిన ఛందోనుశాసన కర్త జయకీర్తి బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములను రతి, మదన, బాణ గణములని పేర్కొన్నాడు. బ్రహ్మ గణములు, రతి గణములు ఒక్కటే, అదే విధముగా విష్ణు మదన గణములు, రుద్ర బాణ గణములు ఒకటే.

అక్కరలు

అక్కరలు ఐదు విధములు. ఎక్కువ నిడివి గల దానికి ఏడు గణములుంటే, చాల చిన్నదానికి మూడే గణాలు ఉన్నాయి. అక్కరల వివరాలను క్రింది పట్టికలో చూడవచ్చును. గణములను సూర్యేంద్రచంద్ర గణములుగా తెలిపినా కూడ, అవి బ్రహ్మ(రతి), విష్ణు (మదన), రుద్ర (బాణ లేక శర) గణములకు తుల్యములైనవి.

సంఖ్య కన్నడము తెలుగు సంస్కృతము గణములు యతి
1 పిరియక్కర మహాక్కర మహాక్షర సూ/ఇం/ఇం/ఇం/ఇం/ఇం/చం 5
2 దొరెయక్కర మధ్యాక్కర సమానాక్షర ఇం/ఇం/సూ/ఇం/ఇం/సూ 4, 5
3 నడువణక్కర మధురాక్కర మధ్యాక్షర సూ/ఇం/ఇం/ఇం/చం 4
4 ఎడెయక్కర అంతరాక్కర అంతరాక్షర సూ/ఇం/ఇం/చం 4 లేక 3 అంత్య
5 కిరియక్కర అల్పాక్కర అల్పాక్షర ఇం/ఇం/చం 3

అక్కర అనే పదము అక్షరము అనే సంస్కృత పదానికి వైకృత రూపము. కొందఱు (రామాయణ కల్పవృక్షములో శకటరేఫమే ఉన్నది) అక్కఱ అని శకటరేఫముతో దీనిని వాడుతారు, అది సరి కాదనియే నా అభిప్రాయము.

శిలాశాసనములలో అక్కరలు


1. పిరియక్కర శాసనము

ఛందశ్శాస్త్రములో ఐదు విధములైన అక్కరలు ఉన్నా, అందులో కన్నడములో పిరియక్కర (మహాక్కర), తెలుగులో మధ్యాక్కర (దొరెయక్కర) మాత్రమే కావ్యములలో వాడబడినవి. కన్నడములో త్రిపదల పిదప అక్కరలు ప్రాచీనమైనవి. తెలుగులో త్రిపదల వాడుక లేదు. అక్కరలు, తదితర ఉపజాతులైన సీసము, గీతులతో ప్రారంభ దశలో తెలుగు కవులు వాడియుండవచ్చును. ఆ కాలపు కావ్యములు లేకున్నా, అప్పటి శిలాశాసనములు దీనికి ఒక నిదర్శనము. కన్నడములోగాని, తెలుగులోగాని ఈ శిలాశాసనాలన్ని పదవ శతాబ్దము నాటివి. శ్రావణబెళగొళలో క్రీ.శ. 982 కాలపు శాసనములో ఒక పిరియక్కర (మహాక్కర) శాసనము గలదు. తఱువాతి కాలములో అక్కడే ఇదే ఛందస్సులో మఱి కొన్ని శాసనాలు కూడ వ్రాయబడ్డాయి.

శ్రావణబెళగొళ పిరియక్కర (మహాక్కర) శాసనము (క్రీ.శ. 982.)

బళసువేఱువ సుళివగల్వింతపచారణదోషమల్లదె పొట్టవ
ట్టళెగె సమనాగె గిరియ కోల్ముట్టి మిగులుం నెలలుమణమీయదింతొం
దళవియొళ్ బరపొఱగొళగెడదొళం బలదొళం కడు గడు పిన్నెబర్ప
వళయందప్పదె చారిసువోజెయం రట్టకందర్పనంతావం బల్లం

(రట్టకందర్పునివలె ఎవరికి అతి వేగముగా లోపల, బయట, కుడివైపు, ఎడమవైపు దోషములు లేకుండ వలయమును చుట్టకుండ, ఎక్కకుండ, వెను దిరుగకుండ బంతిని బడితెతో సరిగా కొట్టడానికి వీలవుతుంది?)

క్రీ.శ. 991 నాటి వెంకయచోడుని దొంగలసాని శాసనములో ఒక మహాక్కర ఉన్నది. అందులోని మొదటి రెండు పంక్తులు (తఱువాతి పంక్తులు నా ప్రతిలో సరిగా ముద్రించబడ లేదు)

వెంకయా చోళ మహరాజు తెంకణాదిత్యుఁడు కొమరు రభీముండు వుసి
ఇల్ల రాళ్మనీ ధర్మ మాచంద్రార్కతారకంబును వర్ధిలుచునుండు

ఇందులో యతి లేదు, చంద్రగణములో మొదటి పాదములో ఒక మాత్ర ఎక్కువగా ఉన్నది, రెండవ పాదములో ఒక మాత్ర తక్కువగా ఉన్నది, ఐనా ఇది మహాక్కర అనడములో సందేహము లేదు.


2. మధ్యాక్కర శాసనము

తెలుగులో యుద్ధమల్లుని బెజవాడ మధ్యాక్కర శాసనము చాల ప్రసిద్ధి కెక్కినది. ఇది క్రీ.శ. 930నాటిది. అనగా మనకు లభించిన అక్కరల శాసనాలలో ఇది అతి ప్రాచీనమయినది. శ్రావణబెళగొళలోని కన్నడ మహాక్కర (పిరియక్కర) శాసనపు కాలము క్రీ.శ. 982. బెజవాడ శాసనాన్ని మొట్టమొదట జయంతి రామయ్యపంతులుగారు పరిశీలించారు. అందులో ఐదు పద్యములు సంపూర్ణముగా, ఆఱవ పద్యములో ఒక అసంపూర్ణ పాదము ఉన్నాయి. ఈ శాసన స్తంభములను రెండవ చిత్రములో చూడనగును. క్రింద ఇవ్వబడిన పద్యములు ఆ కాలపు తెలుగు లిపిలోని పద్యములను చదువుటకు సహాయకారిగా నుండును. దాని పాఠము:

యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనము (క్రీ.శ. 930.)

స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల – సత్యత్రిణేత్ర
విస్తర శ్రీయుద్ధమల్లుఁ డనవద్య – విఖ్యాత కీర్తి
ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనా-భరణుండు సకల
వస్తు సమేతుండు రాజ సల్కి భూ-వల్లభుం డర్థి … 1

పరగంగ బెజవాడఁ గొమరసామికి – భక్తుఁడై గుడియు
నిరుపమ మతి నృపధాముఁ డెత్తించె – నెగిదీర్చె మఠము
గొరగల్గా కొరులిందు విడిసి బృందంబు – గొనియుండువారు
గరిగాక యవ్వారణాసి వ్రచ్చిన – పాపంబు గొండ్రు … 2

వెలయంగ నియ్యెట్టు డస్సి మలినురై – విడిసినఁ బ్రోలఁ
గల తానపతులును రాజు పట్టంబు – గట్టిన పతియు
నలియఁ బైవారల వెల్వరించిన – నశ్వమేథంబు
ఫల ముపేక్షించిన లింగమడిసిన – పాపంబు దమకు … 3

జననుత చేఁబ్రోలనుండి బెజవాడ – జాత్రకు వచ్చి
త్రినయన సుతుఁ డొండు సోటు మెచ్చక – తివిరి యిన్నెలవ
యనఘుండు సేకొని యిందుఁ బ్రత్యక్ష-మైయున్న నిచ్చ
గని మల్లఁ డెత్తించె గుడియు మఠమును – గార్తికేయునకు … 4

రమణతో బెజవాడ కెల్ల బెడఁగును – రక్షయుంగాను
దమ తాత మల్లపరాజు నేరడు – దాను గట్టించెన్
గ్రమమున దానిక కలశ మిడ్డట్లు-గా మొగమాడు
నమరంగ శ్రీయుద్ధ మల్లుఁ డెత్తించె – నమితతేజుండు … 5

తన ధర్ము వొడఁబడి కాచు నృపులకుఁ – ద … 6 (అసంపూర్ణము)

ఇందులో గమనింప దగిన ఒక ముఖ్యమైన విషయము, ఐదవగణముతో ఉండే మధ్యాక్కర యతి. దీనిని తఱువాత చర్చిస్తాను. మఱొకటి – కన్నడ శాసనములోగాని, తెలుగు శాసనములోగాని పాదాంత యతి పాటించబడినది. అంతేకాక, బెజవాడ మధ్యాక్కర శాసనములోని మధ్యాక్కరలలో వడి స్థానమువద్ద కూడ పదచ్ఛేదము కనబడుతుంది.