శ్రీనాథుని భీమేశ్వర పురాణము: స్థానీయత, కొన్ని అపూర్వాంశాలు

పాయ కొక చోటఁ జదికిలఁబడగ నుండ
నైన ఫలమేమి? యటు వినోదార్థ మరిగి
సంచరింతముగాక యీ జలజ హితుని
ధర్మ మౌర్జిత్యమును బొంద దక్షపురిని
– భీ.పు. 5-16.

కవిగా గొప్ప దిమ్మరి కావడం వల్ల శ్రీనాథుని కాలంనాటి ఆంధ్రభూమికి చెందిన చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక ఆనవాళ్ళు ఆయన కావ్యాల్లో, చాటువుల్లో శిలాక్షరాలయ్యాయి. పై పద్యం కైలాసనాథుని ద్వారా శ్రీనాథుడు సందర్భానుసారం చెప్పించినప్పటికీ (శివుడూ దిమ్మరే కదా!) భావం మాత్రం శ్రీనాథుని జీవితానుభవంలోనిది.

ఊసుపోకకో (భీ.పు. 5-15), రాజ సందర్శనార్థమో, రాయబారిగానో, పొట్టగడవడానికో, తీర్థయాత్రాది కృత్యంగానో ఆ కాలం నాటి ఆంధ్ర ప్రాంతమంతా ఆయన కలయదిరిగాడు. అంతేగాక ప్రౌఢదేవరాయల ఆస్థానపు కన్నడ ప్రాంతమూ (విద్యానగరం), పెదకోమాటి వేమారెడ్డితో కాశీ, సంచరించాడు. శైవారాధన తత్పరుడు (శైవమే పరమమనే సంకుచితుడు కాడు. ఇదే కావ్యంలో అవతారికలో రాధాగోపాలుని కొలిచాడు, భీ.పు. 1-3) గాబట్టి శ్రీనాథుడు పేర్కొనని దక్షిణభారత శైవక్షేత్రాల్ని ఆయన పేర్కొనకపోవటానికి కారణం ఆయన ఆ ప్రాంతాలను సంచరించక పోవడమే కావచ్చు. తాను కాలుపెట్టిన ప్రాంతపు విభావాన్నీ, దైన్యాన్నీ ఉన్నదున్నట్టు చెప్పడం శ్రీనాథుని నైజం.

భీమేశ్వర పురాణం చెప్పడానికి ముందు పల్నాడు తిరిగి ఆ ప్రాంతపు అన్నపానాల లోటుకు (అంగడి యూరలేదు, రసికుడు పోవడు – చాటువులు) ఎంతగానో నోరు చేసుకొన్నాడు. అక్కడి శుచీ శుభ్రతా లేని పురోహితుని యింటి స్థితి మొత్తాన్నీ (దోసెడు కొంపలో – చాటువులు) ఈసడించాడు. తాగడానికి నీళ్ళుగాని, తినడానికి వరియన్నముగాని లేని పలనాటి నుండి భీమవాటికి పయనమై ఈ భీమమండల విభవానికి మైమరచాడు.

ఎక్కడఁజూచినన్సరసి, యెక్కడఁజూచిన దేవమందిరం,
బెక్కడఁజూచినందటిని, యెక్కడఁజూచినఁబుష్పవాటికం,
బెక్కడఁజూచినన్నది, మహీవలయంబున భీమమండలం
బెక్కడ? యన్యమండలములెక్కడ? భావనచేసి చూచినన్‌!
– భీ.పు. 3-23.

రాజమహేంద్రవరపు రాజుల ప్రాపకం పొందడానికి ముందు శ్రీనాథుడు వారి మంత్రి బెండపూడి అన్నయ కోరిన మీదట భీమవాటి మహిమను, భీమమండల ప్రాభవాన్నీ ప్రబంధ రీతిలో కావ్యం కట్టాడు.

ఈ భీమేశ్వర పురాణం ఒక అచ్చమైన తెలుగు ప్రబంధం. తెలుగు కావ్యాలకు సంస్కృతమూలాలు చెప్పుకోవడం సాధారాణం. తెలుగున నన్నయాదిగా ఈ రీతి చెప్పుకుంటున్నా అలా చెప్పుకున్న వారి కావ్యాల్లోనే సంస్కృత మూలం కొంచమై స్వకపోల కల్పితాలు కొల్లలు. ఐతిహాసిక కావ్యాలు కూడా. మిగిలిన తెలుగు కావ్యాలన్నీ దాదాపు ఈ దాపున అందుకు ఎక్కువభాగం ఉదహరించవచ్చు. ఆత్మన్యూనతో, గీర్వాణ గారవమో తెలుగు కవిత్వాన్నీ చిన్నచూపు చూసింది.

భీమేశ్వర పురాణం సంస్కృత భీమఖండానికి (స్కాందపురాణంలో గోదావరీ ఖండం లోనిది) అనుసృజన కాదనడం యిప్పటికి సాధారణమే. ఈ క్రింది మిగుల హేతువులు కూడగడితే ఈమాట మరింత తెల్లమౌతుంది. భీమేశ్వరపురాణానికి భీమఖండమనే పేరు అర్వాచీన కాలంలో ప్రసిద్ధమైంది. (స్వారోచిష మనుసంభవం మనుచరిత్రమైనట్టు.)

  1. అవతారికలో కవులు తాము రాయదలుచుకొన్న కావ్యాంశాలను కృతిభర్తలు తమను అడిగి రాయించుకొన్నారని చెప్పడం పరిపాటి. శ్రీనాథుడు భీమమండల దర్శనపులకితుడు. మండల మధ్యస్థిత దేవరూపం తన కారాధ్యము. దీనితో బాంధవుడైన అన్నయ పేర కృతి చెప్పడానికీ, తద్వారా రాజమండ్రి కొలువున పాదం మోపడానికీ తోవ తొక్కిన కాలిబాటౌతుంది. అన్నయ భక్తిపూర్వకంగా భీమనాథుని ప్రాంగణానికర్పించిన మండపాలు (భీ.పు. 1-27), దాన శిలాక్షరాలు చూచినవాడు కదా కవి. అందుకే అన్నయే తన నడిగినట్లూ (భీ.పు. 1-28) ‘సబహుమానంగా తనకు కర్పూర తాంబూల జాంబూనదాంబరాభరణంబు లొసంగెనని’ (భీ.పు. 1-29) కూడా చెప్పుకుంటాడు. ఇది నిజమైనా కాకున్నా ఈ విధమైన రివాజు నన్నయాదిగా వస్తున్నదే.

    ఇలా అన్నయ, ‘స్కాందపురాణంలో గోదావరీ ఖండాన్ని పరిపాటి రచింపమని’ అడిగాడట. తప్ప భీమఖండం కాదు.

  2. కర్పూర తాంబూలం అందుకొన్న కవి వెంటనే తన మూలాలోచనమైన రాజమండ్రి వీరభద్ర, వేమపృధ్యీశ్వరుల విక్రమాన్ని పొగిడి వారి మంత్రికి కృతి నిస్తున్నానన్నాడు. ఇక్కడొక వివరణ కూడా ఇస్తున్నాడు కవి.

    పంచలక్షణాలతో శోభిల్లే సంస్కృత పురాణమైన స్కాందంలో గోదావరీ ఖండం దక్షారామ భీమేశ్వర మహాత్మ్య సంయుత మవటం వల్ల భీమేశ్వరపురాణం అంటాననీ, పురాణమని ఆఖ్యానించినా ఆంధ్ర ప్రబంధంగా చెప్తాననీ తన కోరిక నెరవేరేందుకు రాజమహేంద్రవర రెడ్ల వంశవర్ణన చేస్తాడు. ఈ రెండు చోట్లా ఎక్కడా భీమఖండం అని అనకుండా కృత్యంతభాగంలో, ‘స్కాందపురాణాంబునందు, గోదావరీ ఖండంబునందు జెప్పంబడిన భీమఖండం, భీమేశ్వర మహాత్మ్యంబును, భీమేశ్వర పురాణంబుననంబరగు’ నని కావ్యఫలశ్రుతి చెప్తాడు.

    అసలు విషయం సంస్కృత స్కాంద పురాణంలో భీమఖండం లేదనీ (పేజి 706, ఆరుద్ర స.సా.), లండన్ లైబ్రరీలో మెకంజీ సేకరించిన దక్షారామ ప్రతులను శోధించిన వెల్చేరు నారాయణరావు, డేవిడ్‌ షూల్మన్‌లు (పుట 187. శ్రీనాథ, 2012) కూడా చెపుతున్నారు.

దానికి తోడు తెలుగు లిపిలో మాత్రమే వున్న సంస్కృత భీమఖండం గోదావరీ మండలానికే పరిమితమై వుండడం గమనార్హం. దీనిద్వారా భీమేశ్వరపురాణం తర్వాతే శ్రీనాథుడు గానీ మరెవరైనా భీమఖండాన్ని సంస్కృతంలో కర్త పేరు చెప్పకుండా (చెప్పకపోవడం అవసరం కూడా) 32 అధ్యాయాలు తెలుగులిపిలో రాయగా 1879లో మొదట అచ్చయింది. తర్వాత జయన్తి సూర్యనారాయణ శాస్త్రి గారి తెలుగు తాత్పర్యంతో 1943లో కాకినాడలో ముద్రణకు నోచుకుంది. ఈ పుస్తకం చివర 8 తెలుగు అష్టకాలూ, 4 లాలిపాటలూ, 1 జోలపాట, సంవాదం పేరుతో 51 చరణాల పాట, 10 చరణాల ఏకాంతసేవ పాట, మంగళహారతి వున్నాయి. ఇవి ఎవరి రచనలో పేర్కొనలేదు. ఆ తర్వాత జయన్తివారి మాణిక్యాంబ, భీమేశ్వరాష్టకాలూ, భాగవతి వాసుదేవ దీక్షుతుల భీమేశ్వరాష్టకం వున్నాయి.

ప్రథమాశ్వాసం చివర శౌనకాది మునులు ‘స్కాందపురాణంలో పూర్వఖండంలో పారాశర్యుండు నిజాపరాధంబు కారణంబుగా విశ్వనాథుచే నధిక్షేపింపబడి వారణాశి వెల్వడియె’ (భీ.పు.1-120) అని విన్న వారగుటచే సూతుని తదనంతర కథ వినవేడుకౌతుందని చెప్పమనగా సూతుడు కథ ప్రారంభించడంతో రెండవ ఆశ్వాసం మొదలౌతుంది.

పై అంశాలలో ఏకసూత్రత లేదని, భీమఖండం అనేవి స్కాందంలో లేదని, అది శ్రీనాథుని కల్పితమని స్పష్టమవుతున్నాయి. ఇంకొక మౌలికాధార అంశం తర్వాతి వివరణల్లో ఉంది.

భీమేశ్వర పురాణం స్థలమాహాత్మ్యం తెలియజేసే ప్రబంధం. దక్షారామ భీమనాయకుని మహిమ పేరున ఈ ప్రాంతపు తత్కాల భౌగోళిక, సాంస్కృతిక వాస్తవాలకు ఈ కావ్యం ఆలవాలమైంది. ఇది కొత్త ఒరవడి. స్థలపురాణాలలో ఎర్రన నృసింహపురాణం దీనికి ముందుదైనా కర్నూలు జిల్లా అహోబిలపు ప్రాంత వాసనలేవీ లేని నారసింహ భక్తియుతమైన కావ్యమే ఐంది.

ఆశ్వాస విభజన

కావ్యేతివృత్తం కొంచెమైనా ప్రాంతవిశేషాదులను వర్ణణాత్మకంగా తీర్చి తర్వాతి ప్రబంధ కవులకు శ్రీనాథుడు అనుసరణీయమయ్యాడు. కథావస్తువును స్థూలంగా చూస్తే:

  • ప్రథమాశ్వాసం – అవతారికతోపాటు దక్షారామ పురవర్ణన 20 పద్యాలలో కొలువై వుంది.
  • ద్వితీయాశ్వాసం – ప్రబంధ వర్ణనలూ, శాపగ్రస్తుడైన వ్యాసుడు యాత్రకు వెడలుట, కాశి నుండి ప్రధాన క్షేత్రాల ద్వారా ఆంధ్రభూమిలో అడుగిడుట, అగస్త్యుని కలయిక, శాపకారణం తెలియరావడం.
  • తృతీయశ్వాసం – అగస్త్యుడు వ్యాసునికి దక్షారామ మహిమ చెప్పుట, భీమమండల విభవం గాంచుట, వ్యాసాదుల దక్షారామ ప్రవేశం, ఇంద్రుడు దేవతలకు శివలింగ మహాత్త్యం చెప్పడం, వ్యాసుని భీమనుతితో మూలమైన వ్యాసకథ దాదాపు ఇక్కడితో అయిపోతుంది.
  • చతుర్థాశ్వాసం – అగస్త్యుడు తీర్థమహాత్త్యం చెప్పడం, శివలీలలు, భీమనాథుడు స్వయంభువుగా వెలయుట.
  • పంచమాశ్వాసం – సూర్యుడు కైలాసానికి వెళ్ళి శివుని దక్షారామంలో కొలువుండమని కోరడం, శివుని రాక, భూదాన మహిమ.
  • చివరి ఆశ్వాసంలో దక్షవాటి, భీమమండలాల ప్రాశస్త్యం, ఫలశ్రుతి.

స్థానీయత

స్థానీయత వాస్తవికమైనది, అద్దం లాంటిది. సాహిత్యంలో గానీ ఇతరశాస్త్రాలలో గానీ విశ్వజనీన ప్రమాణాలు డొల్లలుగానే మిగులుతాయి. స్థలకాల నిబద్ధమైన ఐతిహాసిక కథనాలు వ్యాపితమయ్యే కొద్దీ స్థానీయ అంశాలు అనే వాస్తవ ప్రేరేపితాలు కలిసి కథ ఎక్కడికక్కడి ప్రాంతీయతను సంతరించుకుంటుంది. రామాయణంలోని కొల్లలైౖన అవాల్మికాంశాలు ఇందు కుదాహరణ. మలి చారిత్రక యుగంలో పుట్టుకొచ్చిన పురాణ సాహిత్యం స్థానీయతలకు పట్టుగొమ్మలై నిలిచింది. కావ్యసాంప్రదాయంలో అవసరమైన చోటల్లా స్థానీయ పునాదులపై వస్తుగతంగా కథాక్రమమూ, ఆత్మగతంగా వర్ణనలూ, మానవాళి సమస్త సాంప్రదాయ వనరుల ఉటంకింపులూ, కదలాడుతూంటాయి. కాబట్టి స్థానీయత శిష్టకావ్యాలలో కూడా ఒక పాత అంశమే. జానపదం నిండుగా స్థానియాంశాల సమాహారం. వలసవాదుల చూపులనుండి స్థానీయ అంశాల వెదుకులాట, మూలవాసుల, జానపదుల, వివిధ జాతుల, ప్రాంతీయ అంశాల గవేషణ, ఉద్దరణ జరిగిందనుకోవడానికి పై వివరణ ఒక విరుగుడు కావొచ్చు.

మానవ సమాజం తాను నడిచిన, గడపిన స్థల కాలాదులను పదిలపరుచుకొని భావానువాదం నిరంతరం చేస్తునేవుంటుంది. భీమేశ్వర పురాణం స్థలపురాణం కావడం మాత్రమే కాకుండా కవి నడచిన దారిలో తన నత్యంత మైమరిపించిన ప్రాంతపు జాడలు పదిలపరచిన కావ్యంగా కూడా అగుపిస్తోంది.

అవతారికలో రాజమండ్రి పుర విశేషాలు (1-41,42) లింగమంత్రి అన్నదానం పేరుతో బ్రాహ్మణ భోజన వర్ణన (1-61), అన్నయమంత్రి దాతృత్యాన్ని చెప్పే బోడసకుర్తి (1-65), చోడవరం, (1-65), పలివెల (1-78) దక్షారామపురవర్ణన (1-88 నుండి 20 పద్యాలు), వ్యాసుడు కాశి, పూరీ, శ్రీకూర్మం, సింహాచలం మీదుగా (2-51) పిఠాపురం రావడం, ఏలానది పారుతున్న ప్రాంత శోభ, అక్కడ పండే పంటలు (రకరకాల ఫలశాకములు, దుంపలు 2-51 నుండి 60) కుమారారామ శోభ (2-61 నుండి 64), సర్పవర వర్ణన (2-65 నుండి 68), తుల్యభాగ నదీతీర సాంపరాయ గ్రామసీమ వర్ణన (2-72 నుండి 80), అగస్త్యుడు దక్షారామ మహిమను వ్యాసునకు చెప్పడం (3-12 నుండి 40), ఈక్రమంలో ఆ చుట్టుతా వున్న ఊర్ల పేర్లు సంపర, పులగుర్త, ఓదూరు, శీల, కోటిపల్లి, పిఠాపురం, సంగమేశ్వరం, పలివెల, రాజమండ్రి మొదలైనవాటి ఉటంకింపు, పలు తోటలూ (3-57 వచనం) వ్యాస అగస్త్యులు దక్షపురిని కీర్తించు యక్షగాన ప్రదర్శన (3-61), భూదాన మహిమలో అనువులు, మినుములు, గోధుమలు, శనగలు పండే భూమిని చెప్పడం (5-68), భీమమండలానికి హద్దులు చెప్పుట (5 -77,78,84), వసంత ఋతువర్ణనలో జాజర పాటలు పాడు అచ్చరలు ( 5-103) మొదలగు ఘట్టములు పూర్వ శోధకులు స్పృశించి పులకరించి తెలియజెప్పినవి.

నాకై పూర్వశోధకులు మిగిల్చిన కొన్ని కొత్త అంశాలతో భీమేశ్వరపురాణంలోని స్థానీయతను చారిత్రకాది కోణాలలో పరిశీలిస్తున్నాను.

1. యాత్రా కావ్యం

శాపగ్రస్తుడైన వ్యాసుని దక్షిణకాశి అనబడిన (కాశి అన్నపూర్ణచే) దక్షారామ యాత్రతో పాటు, అగస్త్యుడు వ్యాసునికి చూపించిన భీమమండల, దక్షారామ పరిసర ప్రాంతాల పరిచయం, గోదావరీ నదీ పాయల గమన యాత్రా విశేషాలతో ఉన్న యాత్రా కావ్యంగా కూడా భీమేశ్వరపురాణాన్ని చూడవచ్చు. ఈ ప్రయాణంలో వ్యాసుని కాశి నుండి పూరీ జగన్నాథం, శ్రీకూర్మం, సింహాచలం దాటించడం ఒకే సీస పద్యంలో (2-42) చేసి అనంతర భీమమండల యాత్రని అడుగడునా నాలుక తీరా (పద్యపద్యానా) శ్రీనాథుడు వర్ణించాడు.

మొదట పిఠాపురంలో ఏలానదీ తీరపు పలుపంటలు, తోటలు, పిఠాపుర క్షేత్ర దేవతలు, పలుపూలు, దుంపలు, పొలాలు (2-51 నుండి 60) కవి వ్యాసుని ద్వారా చూపించాడు. కుమారారామ (సామర్లకోట) సర్పవర క్షేత్రాలు (2-61 నుండి 68) తిప్పించి సాంపరాయ గ్రామ తుల్యభాగ నదీ తీర బిల్వవనాల (ఇప్పుడు కానరానివి) నీడలో (2-71 నుండి 86) సేద తీర్చాడు. అక్కడ తారసపడ్డ అగస్త్యునితో ముచ్చటలాడి వ్యాసుడు తన యాత్రకు హేతువు చెప్పి కాశిని విడిచినందుకు కళ్ళనీళ్ళు (3-4) పెట్టుకున్నాడు. ఎంత భీకర తపస్సులాచరించినా మునులు మానవ మాత్రులే కదా! శ్రీనాథుని దృష్టి ఇది. వెంటనే బాధ దిగమింగుకుని వ్యాసుడు కమండలంలో నీళ్ళతో కళ్ళు కడుక్కొన్నాడట. ఇది స్వాభావిక వర్ణన. అగస్త్యుని అర్థించగా వ్యాసునికి దక్షామ తోవతోపాటు ఆ స్థల మహిమ చెప్పి ఆ ప్రాంతమంతా వ్యాసుని అగస్త్యుడు కలయత్రిప్పాడు (3-12 నుండి 40.) (భారతేతిహాస, సకల పురాణకర్త అయిన వ్యాసుడు (అ) సర్వజ్ఞుడని సాంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి. అయితే వెల్చేరు నారాయణరావు, డేవిడ్‌ షూల్మన్‌లు వ్యాసుడు ఈ పురాణంలో సకల జన సామన్య లక్షణాలు కలవాడని తమ శ్రీనాథ పుస్తకంలో చెప్తున్నారు. ఈ పురాణ వ్యాసుని వ్యాస (ఆ) అని విభజించడం సమంజసం.)

వ్యాసుని భీమమండలం తిప్పడంలో శ్రీనాథుడు అగస్త్యునిచే ఒక విచిత్రం చేయించాడు. ఓంకారపురి (నేటి ఓదూరు) చెంత వుండి ఈ వూరు ఈ మండలానికి మధ్య ప్రాంతమని చెప్పాడు. అక్కడి నుండి ఆకాశమార్గాన ఈ మండల వైభవం చూద్దామని లోపాముద్ర వ్యాసాదులతో అగస్త్యుడు ఆకాశమెక్కి భీమమండలం మొత్తాన్ని (5-77) పక్షిచూపుతో చూపించాడు.

పూర్వ కావ్యాలలో విమానాలపైనుండి క్రింది ప్రాంతాలు చూడటం ఎక్కడైనా ఉన్నా, శ్రీనాథుడే గ్రద్ద చూపులాంటి చూపుతో ఆకాశం నుండి ఈ మండల క్షేత్రాలను (కోటిపల్లి, సంవేద్యం, దక్షారామం, సప్తగోదావరం, రాజమండ్రి, గౌతమి సాగరసంగమం – నేటి యానం కావచ్చు, పలివెల, పట్టిసం, కూమారారామం, కుక్కుటేశ్వరం, మొదలైనవి) అగస్త్యుని చూపుడు వేలికొసతో గుర్తించి చూపాడు. ఇది ఒక అబ్బురం. ముందుగానే చెప్పకున్నట్టు భీమమండలంపై అనుకంపతో ఒళ్ళు మరచేలా వర్ణించగల క్షేత్ర భౌగోళిక రేఖల ఆనవాళ్ళు బాగా ఎరిగినవాడైన శ్రీనాథుడు రచనలో ఈ క్రొందీరును తొక్కాడు. చదివే పాఠకుడైనా వినే శ్రోతైనా ఈ సన్నివేశం వద్ద ఒక వింత అనుభూతిని పొందేలా శ్రీనాథుని కలం ఈ ప్రాంతపు భౌగోళిక రేఖలను గీసింది. మొత్తానికి భీమపురాణ ప్రధాన కథ (వ్యాస యాత్ర) భీమమండల యాత్రా విశేషాలతో ఉన్న కావ్యం.

2. కపట భిల్లుండైన చలిగొండఱేని యల్లుని కథ

వ్యాసుడు దక్షారామం చేరడానికి ముందు తుల్యభాగ తీరంలోని సాంపరాయగ్రామ సమీప ముక్తీశ్వరుని దర్శించి బిల్వదళాలూ, రేలపూలూ, పద్మాలతో పూజ చేశాడు. అయితే ముక్తీశ్వర స్వామి రూపం చెప్పడంలో శ్రీనాథుడు ఆనాటికున్న అరుదైన శివలింగాన్ని మన ముందుంచుతున్నాడు. చూడండి.

‘తుల్యభాగా తీరంబున సాంపరాయణగ్రామంబు చేరువ బిల్వాటవీ వాటిఁగపట భిల్లుండైన చలిగొండఱేని యల్లుని ముక్తీశ్వరు దర్శించి’ – (భీ. పు. 3-72.)

వేద విభాగముల బరిఢవించిన పుణ్యుండు వేడ్కఁబూన్చెబి
ల్వీదళ పూజనంబు గడులెస్సగఁ గూరిమిశిష్యపంక్తితో
నాదిమ భిల్లు నిత్యకరుణామృత పూరము జల్లు పుండరీ
కోదర భల్లు నృత్తకరియూధపు మల్లుని గొండయల్లునిన్‌
భీ. పు. – 3-73.

పై వచనము, పద్యాలలో శివలింగం పై కపటభిల్లుని రూపం స్పష్టమౌతుంది. (చిలుకూరి పాపయ్య శాస్త్రిగారు శ్రీనాథ కృతిసమీక్షలో (పుట-9) ‘నా డీశ్వర లింగమునఁ కిరాతవేషపు గుర్తులేమైన నుండెడివేమో!’ అనే సందేహించారు. కవి అంత స్పష్టంగా చెపుతున్నా కూడా!) కపటభిల్లుడైన శివలింగ రూపాలు తొలి చారిత్రక యుగాల్లో వుండడం గమనించవచ్చు.


గుడిమల్లం నిగడ వేల్పు (శివలింగం)

భారతదేశంలోనే అటువంటి మొదటి శివలింగం చిత్తూరు జిల్లా గుడిమల్లం గ్రామంలో పరశురామాలయంలోని శివలింగం. క్రీ. పూ. 2, 3 శతాబ్దాల నాటిది. వెనుక మాయా కిరాత వేషధారితో పానపట్టం లేని శివలింగం. రాజు తన అధికారానికి ప్రతీకగా పురుషాంగాన్ని ప్రతిష్టించిన కాలం. (దక్షారామ, కుమారారామాలు అలాగే చాళుక్యభీముని పేరున వెలసినవే. అయితే మలి చారిత్రక యుగానికి మార్పుచెందిన శివలింగాలవి.) క్రీ. పూ. 2వ శతాబ్దం నుండి ఈ క్రమం అనువాదమౌతూ వస్తోంది

మలిపౌరాణిక యుగానికి వచ్చేసరికి వ్యవసాయ సమాజాలు, బ్రాహ్మణీయ మార్పులకు గురౌతున్న క్రమంలో అప్పటి వరకూ విడిగా వున్న లజ్జగౌరి, ఇతర గ్రామదేవతల రూపం పానవట్టంగా మారి నేటి శివలింగరూపం ఏర్పడింది.


పానపట్టం లేని శివలింగం (కీసరగుట్ట)

నేటి తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో (క్రీ. శ. 4, 5 శతాబ్దాలు) కొండమీది నాలుగు వరసల్లో 70 లింగాలు (చెక్కేపని నేర్పేక్షేత్రం), లజ్జగౌరి ఆనవాళ్ళను ఐ.కె.శర్శ 1982లో కనుగొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో కూడా ఇటువంటి మాయాకిరాతుని ప్రతిమవున్న శివలింగం (క్రీ. శ. 5,6 శతాబ్దాలనాటి ఈ లింగం కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్‌ రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలో భధ్రపరచినది) దొరికింది.

ఇదే విషయమై చరిత్రలో ఇంకొంచెం ముందుకు వెళితే బౌద్ద గోళాకార స్థూప కట్టడాలు, జైన దిగంబర విగ్రహాల ప్రభావాలతో పానపట్టంతో కూడిన శివలింగ రూపంలో వజ్రయానం నాటికి కుదురుకున్నాయన్న వాదాలు వున్నాయి.

పై క్రమం పరిశీలిస్తే సాంపరాయగ్రామ ముక్తీశ్వర శివలింగంపై కపట వేటగాని రూపంలో ప్రతిమ శ్రీనాథుని కాలం వరకూ నిలిచి వుండడానికి కారణాలు ఏమై వుంటాయో? ఈ ప్రాంతం వేంగివిషయలో వున్నా మారుమూలాన వుండటంవల్ల ఆ పాత విగ్రహాన్ని తదనంతర పాలకులు పట్టించుకొని వుండకపోవచ్చు. వలసవాదుల కాలం వరకు శ్రీనాధుడు చెప్పిన శివలింగం ఇక్కడ వుండేదని, తర్వాత దాని స్థానే నేటిరూపంలో వున్న శివలింగం వచ్చిందని చిలుకూరి పాపయ్య శాస్త్రి శ్రీనాధకృతి సమీక్షలో చెప్తున్నారు. కాని, ఆయన ఈ రెండు శివలింగ రూపాలపై దృష్టి సారించలేదు.

ఏదేమైనా కపట కిరాతుని ప్రతిమ వున్న శివలింగం వల్ల శ్రీనాథుని భీమేశ్వరపురాణానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటి? అంటే ఇంత స్పష్టంగా సాంపరాయగ్రామ ముక్తీశ్వర లింగ ప్రతిమను కవి పేర్కొంటే సంస్కృత భీమఖండంలో (తెలుగులిపిలో గోదావరీ ఖండంలోనే లభిస్తున్న) వ్యాసుని సాంపరాయగ్రామ ముక్తీశ్వర దర్శన సందర్భంలో శ్రీనాథుడు చెప్పిన ఆనవాళ్ళులేని నేటి శివలింగ రూపాన్ని చూపిస్తోంది. ఆ శ్లోకాలివిగో:

తుల్యభాగాతటే రమ్యే బిల్వకాననారాజితే
సాంపరాయ మహగ్రామ సమీపే స్థితమవ్యయమ్‌
ముక్తీశ్వర మమాకాంతం దృష్ట్వాభక్తీవశం గతః
శిష్యసంఘేన సహిత స్సమ్యగ్బిల్వదళార్చనం
శీతాచలేంద్ర మాతుతురకరోత్తస్య సంయమీ
– చతుర్థాధ్యాయమ్‌ – 15,16,17 – భీ.ఖం.

శుద్ధస్వర్ణ ప్రతీకాశై రారగ్వధసుమైర్నవైః
సాంపరాయ మహగ్రామ సమీపస్థాయినం ప్రభుం
శంకరం పూజ్యమాన వ్యాసోనారాయణ స్స్వయం. – చతుర్థాధ్యాయమ్‌ – 18 – భీ. ఖం.

సంస్కృత భీమఖండంలో లేని కపట కిరాతుడై వున్న శివలింగాన్ని శ్రీనాథుడు ఉటకించాడు కదా! కాలం వెనకకు మరలదు కదా! ప్రాచీనమైన యీశ్వరలింగము మాత్రం నేడు లేదు. నేటి రూపంలో వుండే శివలింగం, పార్వతి విగ్రహం అక్కడ వున్నాయి. శ్రీనాథుడు పార్వతి విగ్రహ ప్రస్తావన అసలు చేయనే లేదు. పైన చెప్పిన మలిపురాణ కాలం (5, 6 శతాబ్దాలు) ముందరి శివలింగాలు విడిగా, పురుషాంగం రాజుకు ప్రతీకగా వేటగాని ప్రతిమలో చెక్కించడం, లజ్జగౌరి ప్రతిమలు వేరుగా వుండడం చారిత్రకాలు. బహుశా ఈ ముక్తీశ్వర క్షేత్రం ఈ విషయంతో పరిశీలిస్తే మరింత ప్రాచీనమైనదై వుండవచ్చు.

ఈ విషయాల ద్వారా సంస్కృత భీమఖండం అర్వాచీన కాలంలో (18 లేదా 19 శతాబ్దాలలో) తెలుగులిపి లోనే కర్త పేరు (వ్యాస) వ్యక్తం చేయకుండా (అలా చేయడం అవసరంకూడా కదా!) ఎవరో రచించినట్లు ప్రబలమైన సాక్ష్యంగా ఊహించవచ్చు.

3. తుల్య భాగ – చారిత్రక వాస్తవాలు

గోదావరీ లోయలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ పాయల మినహా పంట అవసరాలకు కాలవల తవ్వకమనే అంశం ఈ ప్రాంతపు ఆర్థిక, సాంస్కృతిక, ప్రగతిని వేగవంతం చేయడం చరిత్రలో నమోదైనదే. మధ్య యుగాల నుండి నీటివనరులతో సాగులోకొచ్చిన భూమి చుట్టూ వ్యవస్థ రూపు దిద్దుకోవడం. తద్వారా భూస్వామ్యం పెరగడం వల్ల ఈ విషయం భీమేశ్వరపురాణంలోని భూదాన మహిమ ద్వారా (5-60 నుండి 80) విపులంగా విశదమౌతుంది. కోటిపల్లి గౌతమీశాఖ నుండి దక్షిణాన వశిష్ట అంతర్వేదిపాలెం వరకువున్న కోనవిషయ (సీమ) వరదలకూ, ఉరవడికీ అనువైన ఆవ. అందుకే అక్కడ కొబ్బరిపంట విశిష్టసాగు అయ్యింది.

కోటిపల్లి గౌతమికి తూర్పుగోదావరి జిల్లా ప్రోలునాడు (పిఠాపురం, గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలాలు సుమారుగా) కొంతభాగము, చాగల్నాడు, మెట్ట మినహా మధ్య సాగు (డెల్టా) భూమిగా వున్న ప్రాంతంలో నీటివనరుని అనువుగా మార్చుకోవడం వ్యవసాయ సమాజం ఏర్పడిన మలిదశలో (ఇక్కడి సందర్భంలో తొలిమధ్య యుగాలలో చోళ, చాళుక్యుల కాలంలో) మొదలైంది. అలా చోళ చాళుక్యుల పాలనలో కాలవ వ్యవస్థ పటిష్టమయ్యే క్రమంలో ధవళేశ్వరం దాటిన తర్వాత ఏర్పరిచిన కాలవే తుల్యభాగ. ఈ పేరు కూడా అదే విషయాన్ని సూచిస్తుంది. ఈ తుల్యభాగ మరిన్ని పిల్లకాలువలై మధ్య సాగు ప్రాంతాలకు నీరు పారుస్తుంది. గౌతమి నుండి తుల్యభాగ విడివడిన ప్రాంతం నుండి కొద్ది పైభాగం నుండి ఏలేరు పాయ విడివడి ప్రోలునాడుకి ప్రధాన నీటి వనరు అయ్యింది. ఈ ఏలేటి పంట భూముల వైభవాన్ని వ్యాసుడు పిఠాపురం చేరిన సందర్భంలో శ్రీనాథుడు వివరంగా చెప్పాడు. ఈ నది (తుల్యభాగ) ఉత్పత్తి క్రమంలో జరిగిన వంతు పంపకాల గొడవను సద్దుమణిచే కథ తుల్యభాగుని పౌరాణీకరణ. (స్థానిక అంశాలను పౌరాణీకరించే శిష్ట వర్గ భావజాలంతో ఈ కథలన్నీ నిండిపోయినట్లే) ఈ కథలో కూడా వాతాపి, ఇల్వలుల పేర అంతకు ముందున్న పేర్లు ఇప్పనపాడు (ఇల్వలపురం), (వా)తాపేశ్వరంగా (పూర్వపు పేరు తెలియదు) రూపు దిద్దుకొని వుండవచ్చు.

సప్తర్షులు గౌతమిని భీమనాథుని చెంతకు తేవడానికి వెళ్ళిన క్రమంలో జరిగిన కథలో రాక్షస ఋషులు, సప్తర్షులు శాప ప్రతిశాపాలు ఇచ్చుకున్నారు. సప్తగోదావరి స్వాభావికతను (లేని దానిని) మార్మికంగా పౌరాణికం చేయడం (లుప్తమైన నదిని అంతర్వాహినిగా) కన్పిస్తుంది. అలాగే ఆ కాలానికి తుల్యభాగ పిల్లకాలవలు శుష్కించిన విషయాన్ని కూడా.

4. గ్రామదేవతలపై ప్రత్యేక చూపు

శిష్ట కవులలో శ్రీనాథుడు విభిన్నుడు. ఎంత శైవమతానుకంప తనలోవున్నా ఇతర దైవాలను అవసరమైన చోట కీర్తించాడన్నది ముందే చెప్పుకున్నాం. ఇంకొంచెం విస్తృత హృదయమున్న కవి కాబట్టే శ్రీనాథుడు పూర్వులెవరూ చేయని విధంగా, గ్రామదేవతల వర్ణనను భీమేశ్వర పురాణంలో చేశాడు. మొదటి ఆశ్వాశంలో దక్షారామ పురవర్ణనలో:

– ‘దక్షవాటిక’ పశ్చిమ ద్వారభూమి ప్రతివసించు — గోగులమ్మా’ (పద్యం – 99)
– ‘దక్షపురమున నుత్తరద్వారమందు — మండతల్లి’ (పద్యం – 100)
– ‘సారమతి దక్షవాటిక తూరుపుగవనిం — నూకాంబ’ (పద్యం – 101)
– ‘మట్టయినట్టి దకక్షుని పట్టణమున దక్షిణంబు ఘట్టాంబిక’ (పద్యం – 102)


మండాలమ్మతల్లి

అనే నలుగురమ్మలూ ఈ వాటిని కాచేవారని చెప్పాడు. అయితే పశ్చిమ, దక్షిణ దిక్కులున్న గోగులమ్మ, ఘట్టాంబికలు ఇప్పుడు దక్షారామానికి అవే దిక్కుల్లో వున్నాయి. నూకాలమ్మ వాయవ్యాన, ఆలయపు చెంత రావిచెట్టు క్రింద మండతల్లి మారుప్రాంతాలలో ఇపుడు కొలువైయున్నారు. అవసరమైన చోటల్లా శ్రీనాథుడు పై గ్రామదేవతల ప్రస్తావన తెచ్చాడు. ఆయనకు జానపదుల శక్త్యారాధనపై చిన్నచూపు లేదు.


నూకాలమ్మ గుడి

నూకాలమ్మ, గోగులమ్మ, మండాలమ్మల పేర్లు ప్రాకృతికమైనవి. ఘట్టాంబిక అనే పేరు సంస్కృతీకరించినది. ఇది శ్రీనాథుని కాలం నాటికే జరిగివుండవచ్చు. ఇపుడాపేరును (ఘంటాంబిక) ఘంటాలమ్మగా పిలుస్తున్నారు. ఘట్ట అనే శబ్దం శ్రీనాథుడు పేర్కొనడంలో దక్షవాటిలో జరిగిన ఘట్టాలను సూచించేదిగా వున్నా ఈ అంశంతో గ్రామదేవత లుద్భవించడం స్వాభావికం కాదు. అందునా దక్షారామ భీమేశ్వరాలయానికంటే ముందే ఈ దేవతారాధనలు చారిత్రకం. ఘటం అనే తెలుగు కుండకు సంస్కృతి రూపు దిద్దుకునే దశలో చాలా ప్రధానమైన స్థానముంది. గ్రామదేవతల జాగరణ కార్యక్రమంలో (గరగ రూపం కూడా అదే) ఊరేగింపులలో ప్రత్యేకించి వేసవి గాడ్పుల కాలంలో కొలిచే దేవతగా కుండాలమ్మ రూపు దిద్దుకొని వుంటే సంస్కరింపబడి ఘటాంబిక –> ఘట్టాంబికగా అయివుండొచ్చు.

5. ఒక ప్రేరణ – అపూర్వ ఉటంకింపు

శ్రీనాథునికి అన్నమయ్య (సుమారుగా 1408-1500) ఒక తరం (30 సం.లు) తర్వాతివాడు. అసమానుడు.

శ్రీనాథుడు కవితారీతులతోనూ, పద్యపు నడకలలోనూ, పలు అంశాలలో తర్వాతి కవులకు ఎలా అనుసరణీయమైయ్యాడో ఇప్పటికి పూర్వ పరిశోధనల వల్ల విశదమే. అయితే అన్నమయ్య తన పదాలను గ్రంథచౌర్యం చేసిన వారిని సంబోధిస్తూ

వెఱ్ఱులాల మీకు వేడుక కలిగితేను
అఱ్ఱు వంచి తడుకల్లంగ రాదా!

అనే కీర్తన ఆగ్రహంతో 10 చరణాలు చెప్పాడు. అన్నమయ్య కీర్తనలేవీ ఇన్ని చరణాలు కలవికావు. అందుకాయనలో కలిగిన ధర్మాగ్రహమే కారణం కావచ్చు.

పై కీర్తనకు, శబ్దార్థరీతులలో కూడా దారి చూపినదిగా శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో నాల్గవ ఆశ్వాసంలో క్షీరసాగర మథన కథా ప్రారంభంలో దేవదానవులను మందలిస్తూ శ్రీమన్నారాయణుడు పలికినట్లుగా ఉన్న పద్యాలు ఇవి.

ఓ వెఱ్ఱులార! యేటికి – నీ వెడగు విచారములు సహింపగరాదా?
యే వారికైన మేలా – చా4వుల తార్కితములుగ్రసంగ్రామములన్‌?
– 52

కుడిచి కూర్చుండి మీరేల కొంతయైన – కుమ్ములాడెద? రోయన్నదమ్ములార!
గొఱ్ఱె క్రొవ్వియు సెలగట్టె గొరికినట్లు – కటకటా! మీ వివేకంబు గాటుపడగ!
– 53

6. భీమవాటి – పౌరాణీకరణ

ప్రబంధరీతిలో చెప్తున్న కావ్యంలో స్థలపురాణం, క్షేత్రమహాత్త్యం వంటి అంశాలను పొందుపరచే క్రమంలో కవి ఆయా అంశాలను అతిశయించి చెప్పడం అరుదేమి కాదు. భీమేశ్వరపురాణం అడుగడుగునా ప్రతి పద్యంలోనూ ఈ మండల నదులనూ, వివిధ క్షేత్రాలనూ చూపిస్తూనే మండల మూలనాయకుడైన భీమనాథుని కూడా మహిమలతో స్థానీయం చేయడం జరిగింది.

శాపగ్రస్త వ్యాస కథకు ఆలంబనగా కాశీ దక్షారామ సాదృశ్యం (4-40), భీమనాథుని కొలవడం వల్ల ఫలమేమి? (4-32), దక్షారామ, భీమమండల దైవత్వ నిరూపణతో వున్న ఆరవ ఆశ్వాసం వీని కుదాహరణలు. మొదటి చాళుక్యభీముని పేర వెలసిన ఈ ఆలయ నాయకుని మహిమ చెప్పే హాలహల భక్షణ సందర్భంలో,

భీమమగు గరళకూటము – భూమిని గగనము దిశల బొడసూపినచో
భీమగతి మ్రింగెగావున- భీమేశ్వరుడయ్యె నితడు బిరుదాంకమునన్‌
– భీ. పు. 4-46.

అన్న పద్యంతో పౌరణిక ప్రాశస్త్యం సంతరించాడు శ్రీనాథుడు. అందుకే వెల్చేరు నారాయాణరావు, డేవిడ్‌ షూల్మన్‌లు వెలయించిన పుస్తకం Srinatha, the poet who made gods and kings అన్న మాట అక్షరసత్యమని నేను నిరూపించనవసరం లేదు.

7. కొసరుముచ్చట్లు

వర్ణనల్లో ఏకవికాకవి గొప్పవాడే. అయినా నేలబారు జనజీవితం తెలిసినవాడు, తన భాషా ప్రాంతపు ఎల్లల మధ్య ప్రజలభాష, నేలల, నెరిగినవాడు శ్రీనాథుడు. ఆయన అనుభవంలో నుండి పుట్టిన వర్ణనల సొబగును మూడే మూడు పదాల ద్వారా ఉదహరిస్తాను.

  1. మొదటి ఆశ్వాశంలో దక్షారామపుర వర్ణనలో శివుని మహిమ చెబుతూ, ‘హాలాహలంబను నల్లొనేరేడుపండు మిసిమింతుడును గాక మ్రింగినాడు’ (111) — హాలోహలాన్ని అల్లొనేరేడుపండుతో పోలిక చెప్పడం,
  2. రెండవ ఆశ్వాసంలో సూర్యాస్తమయ వర్ణనలో, ‘సంజె కెంపును దిమిరపుంజంపునలుపు – గమిచి బ్రహ్మండ భాండంబు గరిమమెరసె, పరమపరిపాకథ వృంతబాంధ మెడలి – పతనమగు తాటిపండుతో ప్రతిఘటించి’ – (30) — ఆకాశంపై సాయంసంజె ఎరుపూ, అలముకునే చీకటీ కలిసి బ్రహ్మాండం మిగలముగ్గి ముచ్చు తెగి పడడానికున్న తాటిపండులా ఉందట. మిగలముగ్గిన నల్లటి తాటిపండు ముచ్చుక దగ్గర, క్రింది భాగము, మధ్య పొట్ట మెల్లగా చీలుతుండగా ఎర్రటి చారికలతో కనుబడుతుంది. దానిని సూర్యాస్తమయ బ్రహ్మాండంగా భావించడం,
  3. నాల్గవ ఆశ్వాసంలో దేవాసురులు అమృతానికై దెబ్బలాడుకునే సందర్భంలో, ‘ఱంతులు మీఱ మిక్కిలిగ ఱాగతనంబున దొమ్మిచేసి……. ‘ (96) అనుచోట దొమ్మి అనే నేటికీ ఉన్న పదప్రయోగం చేయడం,

పై మూడు పదాలూ శ్రీనాథునికున్న జన జీవిత సాగత్యాన్ని, పద ప్రయోగ నైపుణిని తెలుపుతున్నాయి.

ముగింపు

‘శ్రీనాథునిపై ఎందరెన్ని పరిశోధనలు చేసిన ఇంకా చేయవలసిందెంతో ఉంది. ఇతని జీవిత చరిత్ర మీదా, కవితా తత్వం మీదా ఎన్నో గ్రంథాలను వ్రాసినా ఈ విషయం పుష్పక విమానం లాంటిది’ అన్న ఆరుద్ర మాట (పుట 754 స.సా.) ఉచితమైనది. కావ్యరీతి తెలుగు పురాణాలలో (పేరులో మాత్రమే) రెండవదైనా (బసవపురాణం పలు దక్షిణభారత ప్రాంతాలను చెప్పినా శివలీలలను మాత్రమే ఉటంకిస్తుంది), స్థానీయ నిబద్ధమైన పురాణంగా (ప్రబంధ రీతిలో) అద్వితీయ ముద్రను శ్రీనాథుని భీమేశ్వర పురాణం బలంగా వొత్తింది.

పూర్వ పరిశోధకులు శ్రీనాథుని భీమేశ్వర పురాణంలోని కొన్ని చెప్పలేదనుకున్న అంశాలను స్థానీయతను దృష్టిలో ఉంచుకుని నా దృష్టి, శక్తుల మేర పరిశీలించిన ప్రయత్నం ఈ వ్యాసం.

(అట్లాంటా ఎమొరీ యూనివర్శిటీలో (అమెరికా) గత ఏప్రిల్‌ 16, 17 తేదీలలో తెలుగు సాహిత్యంలో నూతన ఆవిష్కరణలు అన్న అంశంపై జరిగిన గోష్ఠిలో ముచ్చటించి, సమర్పించిన పత్రం.)


    పునాది పుస్తకాలు:

  1. భీమేశ్వరపురాణం – కొత్తపల్లి అన్నపూర్ణమ్మ సాహాయ్యంతో -వావిళ్ళ రామశాస్త్రులు & సన్స్, చెన్నపురం, 1919.
  2. భీమేశ్వరపురాణం – చిలుకూరి పాపయ్యశాస్త్రి పీఠికతో ,సరస్వతీ పవర్ ప్రెస్,రాజమహేంద్రవరం, 1958.
  3. తోడ్పడ్డ పుస్తకాలు:

  4. ఆరుద్ర – సమగ్రాంధ్ర సాహిత్యం, తెలుగు అకాడమీ, హైదరాబాద్. మొదటి సంపుటం, 2002.
  5. ఈశ్వరదత్తు కుందూరి – శ్రీనాథుని కవితా తత్త్వము, ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాద్, 1964.
  6. కార్తికేయశర్మ ఇంగువ(సంపా) – ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతి. 2వ సంపుటం, పొ.శ్రీ. తె.వి.వి.,జులై 2008.
  7. తమ్మయ్య బండారు – శ్రీనాథ మహాకవి, ఆంధ్ర సాహిత్య పరిషత్,కాకినాడ, 1968.
  8. దుర్గాప్రసాద్ జాస్తి – శాసనాల్లో దాక్షారామ భీమేశ్వరాలయ చరిత్ర, ఎమెస్కో బుక్స్, హైదరాబాద్, 2015.
  9. పాపయ్య శాస్త్రి చిలుకూరి – శ్రీనాథ కవితా సమీక్ష, శ్రీనాథుడు శృంగారియా!పాపులర్ ప్రెస్,కాకినాడ. వికారి సంవత్సరం,మకరసంక్రాంతి.
  10. పాపయ్య శాస్త్రి చిలుకూరి – శ్రీనాథ కవితా సమీక్ష, 2వ సంపుటం, రిపబ్లిక్ ప్రెస్, కాకినాడ, ప్లవ సంవత్సరం,జేష్ఠ పూర్ణిమ.
  11. పాపయ్య శాస్త్రి చిలుకూరి – శ్రీనాథ కృతి సమీక్ష, పాపులర్ ప్రెస్, కాకినాడ.
  12. ప్రభాకరశాస్త్రి వేటూరి – శృంగార శ్రీనాథము, 1923.
  13. బాలగంగాధరరావు యార్లగడ్డ – కవిసార్వభౌముడు శ్రీనాథుడు, నిర్మలా పబ్లికేషన్, విజయవాడ, 2013.
  14. లక్ష్మీనారాయణ గుండవరపు – శ్రీనాథుడు-సందేహాల చర్చలు, పాలాక్ష ప్రచురణ, గుంటూరు, 2002.
  15. వీరభధ్రరావు చిలుకూరి – శ్రీనాథ కవి (జీవితం), ఆర్య పుస్తకాలయము, రాజమండ్రి 1930.
  16. శశిశేఖర్ టి – నిగడ వేల్పు వ్యాసం, కమతం వారపత్రిక, సీతానగరం, ఫిబ్రవరి 2012.
  17. శ్రీనివాసరావు ఎం (సంపా) – గోదావరి స్మృతులు కళలు జీవనం, మలసాని పబ్లికేషన్స్, జులై 2003.
  18. శ్రీరామమూర్తి కొర్లపాటి – శ్రీనాథుడు, 1995.
  19. సూర్యనారాయణశాస్త్రి జయంతి – భీమఖండం తెలుగు తాత్పర్యం, కాకినాడ ముద్రాశాల, 1943.
  20. సోమశేఖరశర్మ మల్లంపల్లి – రెడ్డిరాజ్యాల చరిత్ర, అఖిలభారత రెడ్లసమాఖ్య, శ్రీశైలం, 2004.
  21. Velcheru Narayana Rao & David Shulman- SRINATHA-The Poet Who Made Gods and Kings, Oxford University press, New York, 2012.