5. ఒక ప్రేరణ – అపూర్వ ఉటంకింపు
శ్రీనాథునికి అన్నమయ్య (సుమారుగా 1408-1500) ఒక తరం (30 సం.లు) తర్వాతివాడు. అసమానుడు.
శ్రీనాథుడు కవితారీతులతోనూ, పద్యపు నడకలలోనూ, పలు అంశాలలో తర్వాతి కవులకు ఎలా అనుసరణీయమైయ్యాడో ఇప్పటికి పూర్వ పరిశోధనల వల్ల విశదమే. అయితే అన్నమయ్య తన పదాలను గ్రంథచౌర్యం చేసిన వారిని సంబోధిస్తూ
వెఱ్ఱులాల మీకు వేడుక కలిగితేను
అఱ్ఱు వంచి తడుకల్లంగ రాదా!
అనే కీర్తన ఆగ్రహంతో 10 చరణాలు చెప్పాడు. అన్నమయ్య కీర్తనలేవీ ఇన్ని చరణాలు కలవికావు. అందుకాయనలో కలిగిన ధర్మాగ్రహమే కారణం కావచ్చు.
పై కీర్తనకు, శబ్దార్థరీతులలో కూడా దారి చూపినదిగా శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో నాల్గవ ఆశ్వాసంలో క్షీరసాగర మథన కథా ప్రారంభంలో దేవదానవులను మందలిస్తూ శ్రీమన్నారాయణుడు పలికినట్లుగా ఉన్న పద్యాలు ఇవి.
ఓ వెఱ్ఱులార! యేటికి – నీ వెడగు విచారములు సహింపగరాదా?
యే వారికైన మేలా – చా4వుల తార్కితములుగ్రసంగ్రామములన్? – 52
కుడిచి కూర్చుండి మీరేల కొంతయైన – కుమ్ములాడెద? రోయన్నదమ్ములార!
గొఱ్ఱె క్రొవ్వియు సెలగట్టె గొరికినట్లు – కటకటా! మీ వివేకంబు గాటుపడగ! – 53
6. భీమవాటి – పౌరాణీకరణ
ప్రబంధరీతిలో చెప్తున్న కావ్యంలో స్థలపురాణం, క్షేత్రమహాత్త్యం వంటి అంశాలను పొందుపరచే క్రమంలో కవి ఆయా అంశాలను అతిశయించి చెప్పడం అరుదేమి కాదు. భీమేశ్వరపురాణం అడుగడుగునా ప్రతి పద్యంలోనూ ఈ మండల నదులనూ, వివిధ క్షేత్రాలనూ చూపిస్తూనే మండల మూలనాయకుడైన భీమనాథుని కూడా మహిమలతో స్థానీయం చేయడం జరిగింది.
శాపగ్రస్త వ్యాస కథకు ఆలంబనగా కాశీ దక్షారామ సాదృశ్యం (4-40), భీమనాథుని కొలవడం వల్ల ఫలమేమి? (4-32), దక్షారామ, భీమమండల దైవత్వ నిరూపణతో వున్న ఆరవ ఆశ్వాసం వీని కుదాహరణలు. మొదటి చాళుక్యభీముని పేర వెలసిన ఈ ఆలయ నాయకుని మహిమ చెప్పే హాలహల భక్షణ సందర్భంలో,
భీమమగు గరళకూటము – భూమిని గగనము దిశల బొడసూపినచో
భీమగతి మ్రింగెగావున- భీమేశ్వరుడయ్యె నితడు బిరుదాంకమునన్ – భీ. పు. 4-46.
అన్న పద్యంతో పౌరణిక ప్రాశస్త్యం సంతరించాడు శ్రీనాథుడు. అందుకే వెల్చేరు నారాయాణరావు, డేవిడ్ షూల్మన్‌లు వెలయించిన పుస్తకం Srinatha, the poet who made gods and kings అన్న మాట అక్షరసత్యమని నేను నిరూపించనవసరం లేదు.
7. కొసరుముచ్చట్లు
వర్ణనల్లో ఏకవికాకవి గొప్పవాడే. అయినా నేలబారు జనజీవితం తెలిసినవాడు, తన భాషా ప్రాంతపు ఎల్లల మధ్య ప్రజలభాష, నేలల, నెరిగినవాడు శ్రీనాథుడు. ఆయన అనుభవంలో నుండి పుట్టిన వర్ణనల సొబగును మూడే మూడు పదాల ద్వారా ఉదహరిస్తాను.
- మొదటి ఆశ్వాశంలో దక్షారామపుర వర్ణనలో శివుని మహిమ చెబుతూ, ‘హాలాహలంబను నల్లొనేరేడుపండు మిసిమింతుడును గాక మ్రింగినాడు’ (111) — హాలోహలాన్ని అల్లొనేరేడుపండుతో పోలిక చెప్పడం,
- రెండవ ఆశ్వాసంలో సూర్యాస్తమయ వర్ణనలో, ‘సంజె కెంపును దిమిరపుంజంపునలుపు – గమిచి బ్రహ్మండ భాండంబు గరిమమెరసె, పరమపరిపాకథ వృంతబాంధ మెడలి – పతనమగు తాటిపండుతో ప్రతిఘటించి’ – (30) — ఆకాశంపై సాయంసంజె ఎరుపూ, అలముకునే చీకటీ కలిసి బ్రహ్మాండం మిగలముగ్గి ముచ్చు తెగి పడడానికున్న తాటిపండులా ఉందట. మిగలముగ్గిన నల్లటి తాటిపండు ముచ్చుక దగ్గర, క్రింది భాగము, మధ్య పొట్ట మెల్లగా చీలుతుండగా ఎర్రటి చారికలతో కనుబడుతుంది. దానిని సూర్యాస్తమయ బ్రహ్మాండంగా భావించడం,
- నాల్గవ ఆశ్వాసంలో దేవాసురులు అమృతానికై దెబ్బలాడుకునే సందర్భంలో, ‘ఱంతులు మీఱ మిక్కిలిగ ఱాగతనంబున దొమ్మిచేసి……. ‘ (96) అనుచోట దొమ్మి అనే నేటికీ ఉన్న పదప్రయోగం చేయడం,
పై మూడు పదాలూ శ్రీనాథునికున్న జన జీవిత సాగత్యాన్ని, పద ప్రయోగ నైపుణిని తెలుపుతున్నాయి.
ముగింపు
‘శ్రీనాథునిపై ఎందరెన్ని పరిశోధనలు చేసిన ఇంకా చేయవలసిందెంతో ఉంది. ఇతని జీవిత చరిత్ర మీదా, కవితా తత్వం మీదా ఎన్నో గ్రంథాలను వ్రాసినా ఈ విషయం పుష్పక విమానం లాంటిది’ అన్న ఆరుద్ర మాట (పుట 754 స.సా.) ఉచితమైనది. కావ్యరీతి తెలుగు పురాణాలలో (పేరులో మాత్రమే) రెండవదైనా (బసవపురాణం పలు దక్షిణభారత ప్రాంతాలను చెప్పినా శివలీలలను మాత్రమే ఉటంకిస్తుంది), స్థానీయ నిబద్ధమైన పురాణంగా (ప్రబంధ రీతిలో) అద్వితీయ ముద్రను శ్రీనాథుని భీమేశ్వర పురాణం బలంగా వొత్తింది.
పూర్వ పరిశోధకులు శ్రీనాథుని భీమేశ్వర పురాణంలోని కొన్ని చెప్పలేదనుకున్న అంశాలను స్థానీయతను దృష్టిలో ఉంచుకుని నా దృష్టి, శక్తుల మేర పరిశీలించిన ప్రయత్నం ఈ వ్యాసం.
(అట్లాంటా ఎమొరీ యూనివర్శిటీలో (అమెరికా) గత ఏప్రిల్ 16, 17 తేదీలలో తెలుగు సాహిత్యంలో నూతన ఆవిష్కరణలు అన్న అంశంపై జరిగిన గోష్ఠిలో ముచ్చటించి, సమర్పించిన పత్రం.)
- భీమేశ్వరపురాణం – కొత్తపల్లి అన్నపూర్ణమ్మ సాహాయ్యంతో -వావిళ్ళ రామశాస్త్రులు & సన్స్, చెన్నపురం, 1919.
- భీమేశ్వరపురాణం – చిలుకూరి పాపయ్యశాస్త్రి పీఠికతో ,సరస్వతీ పవర్ ప్రెస్,రాజమహేంద్రవరం, 1958.
- ఆరుద్ర – సమగ్రాంధ్ర సాహిత్యం, తెలుగు అకాడమీ, హైదరాబాద్. మొదటి సంపుటం, 2002.
- ఈశ్వరదత్తు కుందూరి – శ్రీనాథుని కవితా తత్త్వము, ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాద్, 1964.
- కార్తికేయశర్మ ఇంగువ(సంపా) – ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతి. 2వ సంపుటం, పొ.శ్రీ. తె.వి.వి.,జులై 2008.
- తమ్మయ్య బండారు – శ్రీనాథ మహాకవి, ఆంధ్ర సాహిత్య పరిషత్,కాకినాడ, 1968.
- దుర్గాప్రసాద్ జాస్తి – శాసనాల్లో దాక్షారామ భీమేశ్వరాలయ చరిత్ర, ఎమెస్కో బుక్స్, హైదరాబాద్, 2015.
- పాపయ్య శాస్త్రి చిలుకూరి – శ్రీనాథ కవితా సమీక్ష, శ్రీనాథుడు శృంగారియా!పాపులర్ ప్రెస్,కాకినాడ. వికారి సంవత్సరం,మకరసంక్రాంతి.
- పాపయ్య శాస్త్రి చిలుకూరి – శ్రీనాథ కవితా సమీక్ష, 2వ సంపుటం, రిపబ్లిక్ ప్రెస్, కాకినాడ, ప్లవ సంవత్సరం,జేష్ఠ పూర్ణిమ.
- పాపయ్య శాస్త్రి చిలుకూరి – శ్రీనాథ కృతి సమీక్ష, పాపులర్ ప్రెస్, కాకినాడ.
- ప్రభాకరశాస్త్రి వేటూరి – శృంగార శ్రీనాథము, 1923.
- బాలగంగాధరరావు యార్లగడ్డ – కవిసార్వభౌముడు శ్రీనాథుడు, నిర్మలా పబ్లికేషన్, విజయవాడ, 2013.
- లక్ష్మీనారాయణ గుండవరపు – శ్రీనాథుడు-సందేహాల చర్చలు, పాలాక్ష ప్రచురణ, గుంటూరు, 2002.
- వీరభధ్రరావు చిలుకూరి – శ్రీనాథ కవి (జీవితం), ఆర్య పుస్తకాలయము, రాజమండ్రి 1930.
- శశిశేఖర్ టి – నిగడ వేల్పు వ్యాసం, కమతం వారపత్రిక, సీతానగరం, ఫిబ్రవరి 2012.
- శ్రీనివాసరావు ఎం (సంపా) – గోదావరి స్మృతులు కళలు జీవనం, మలసాని పబ్లికేషన్స్, జులై 2003.
- శ్రీరామమూర్తి కొర్లపాటి – శ్రీనాథుడు, 1995.
- సూర్యనారాయణశాస్త్రి జయంతి – భీమఖండం తెలుగు తాత్పర్యం, కాకినాడ ముద్రాశాల, 1943.
- సోమశేఖరశర్మ మల్లంపల్లి – రెడ్డిరాజ్యాల చరిత్ర, అఖిలభారత రెడ్లసమాఖ్య, శ్రీశైలం, 2004.
- Velcheru Narayana Rao & David Shulman- SRINATHA-The Poet Who Made Gods and Kings, Oxford University press, New York, 2012.