ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము

తుమ్హ చ్చిఅ ఎస భరో అణామేత్తప్పలో పహుత్తణసదో|
అరుణో ఛాఆవహణో విసహం విఅసంతి అప్పణా కమలసరా||

ఛాయ:

యుష్మాకమేవైష భర ఆజ్ఞామాత్రఫల ప్రభుత్వశబ్దః|
అరుణశ్చాయావహనో విశదం వికసన్త్యాత్మనా కమలసరాంసి||

ప్రయత్నమంతయునూ మీది. ఆజ్ఞాపించటమే ప్రభువునకు మిగిలిన కార్యము. ఉదయించుట మాత్రమే భానుని వృత్తి. సూర్యుణ్ణి చూచి కమలములు తమంతట తామే వికసిస్తాయి.

సుగ్రీవుని ప్రసంగము ముగిసిన తర్వాత జాంబవంతుడు కార్యాకార్యవిచక్షణ గురించి ప్రస్తావిస్తాడు. ఇలా కాగల కార్యమును గురించి చక్కగా వివేచించి, సంభాషణా రూపంలో కార్యాకార్యవిచక్షణ చేసే పద్ధతిని ప్రవరసేన తదనంతర కవులైన భారవి, మాఘుడు తమతమ కావ్యములలో అనుసరించుట స్పష్టముగా తెలుసుకోవచ్చు. ముఖ్యముగా భారవి ఈ విభాగమును చక్కగా మనసునకు పట్టించుకొన్నాడు. కిరాతార్జునీయంలో ధర్మరాజుతో, సహసా విదధీత నక్రియామ్… అన్న ప్రముఖ శ్లోకమును చెప్పించి, కావ్యమంతటా ఆ శ్లోక వ్యాఖ్యానమునకు తగినయట్టు పాత్రల స్వభావమును ఆ కవి తీర్చిదిద్దినాడు.

వాల్మీకి మహర్షి. సేతుబంధకారుడు కవి. ప్రాకృతకవి ఆదికవిని యంతరంగమున నిలుపుకొని, స్వీయ ప్రతిభను రంగరించి, అద్భుతకావ్యమునకు ప్రాణము పోసినాడు. సేతుబంధమునకు మూలము వాల్మీకి రామాయణ యుద్ధకాండమన్నాము. కావ్యములో ముఖ్యరసము వీరము. వీరరసమునకు స్థాయీభావముత్సాహము. అద్భుతము పోషకరసము. ఒక ఘట్టములో రావణరాజ్యమందలి అసురులకూ, వారి స్త్రీలోకమునకు మధ్య కాస్త శృంగారము, మిగిలిన తావుల భయానకమును, భీభత్సమును, రౌద్రమును కవి నిలిపినాడు. అద్భుతమును మాత్రం కవి తడవతడవకూ అసమానముగ పోషించాడు.

సేతుబంధకవి ప్రధానంగా ఉత్ప్రేక్షకు పెద్ద పీట వేసినాడు. వర్ణనలకు విలక్షణమైన, విభిన్నమైన వస్తువుల నెంచుకోవడం ఈతని యలవాటు. దీనికి ఇదివరకే దృష్టాంతములను చూసినాము. వాల్మీకి రామాయణములో సేతునిర్మాణము సులభముగా ఆరంభమవుతుంది. అది రామాయణము కాబట్టి ఆ కూర్పు. సేతుబంధములో కవి కావ్యావసరమున ఈ ఘట్టమును పెంచటమే కాక, ఔచిత్యవంతంగా, రసపరిపుష్టంగా ఒనర్చినాడు. వాల్మీకమున రాముడు సముద్రునిపై బ్రహ్మాస్త్రమును కేవల మెక్కుపెడతాడు. సేతుబంధములో రాముడు సముద్రునిపై శరముల సంధించును. ఫలితముగా అల్లకల్లోలమైన సముద్రమును మనోహరముగా, అద్భుతముగా ప్రాకృతకవి వర్ణించినాడు.

సుగ్రీవుని ప్రసంగము, ఆపై జాంబవంతుని పర్యాలోచనమూ అయిన పిమ్మట రాముని శరసంధానము, ఆపై గంగతో కూడిన సముద్రుడు రామచంద్రుని శరణు వేడుట, సేతునిర్మాణ సూచన చేయుట విపులముగా కవి వర్ణించినాడు. సేతునిర్మాణమునకు తీర్మానమయినది. ఎట్టకేలకు సేతువు కట్టటానికి కపిసైన్యము పూనుకొన్నది. కానీ ఒక క్రమపద్ధతిని కార్యము సాగడమే లేదు. కపులు పెకలించుకుని వచ్చు పర్వతాలను, శిలలను సముద్రజంతుజాలము మింగుచున్నవి.

స అలమహివేఢ విఅడో సిహరసహస్స పడిరుద్ధరఇరహమగ్గో|
ఇఅ తుఙ్గో వి మహిహరోతిమిఙ్గలస్స వఅణో తణం వ పణట్టో||

ఛాయ:

సకలమహీవేష్టవికటః శిఖరసహస్రప్రతిరుద్ధరవిరథమార్గః|
ఇతి తుఙ్గోऽపి మహీధరతిమిఙ్గిలస్య వదనే తృణమివ ప్రనష్టః||

పుడమియంత విశాలమై, సహస్రశిఖరములతోనొప్పుచు, గగనతలమందు భాస్కరుని మార్గమునడ్డగించు ఉన్నతములైన పర్వతములు కూడా, సముద్రమున పడ వేసినప్పుడు తిమిఙ్గలములనోటఁ బడిన గడ్డిపరకల వలే నశించుచున్నవి.

ఈ కల్పన వాల్మీకి రామాయణములో లేదు. వాల్మీకి రామాయణమున రాముడు విశ్వకర్మ ఔరసపుత్రుడైన నలునకు సేతువు నిర్మించుటకాదేశస్తాడు. ఆపై ఏతన్నిర్మాణమునూ క్లుప్తంగా ఉంది. సేతుబంధకారుడు ఈ ఘట్టాన్ని పెంచి, సేతుబంధసమయమున సాగరమున జరుగు కల్లోలమును విధవిధములుగా వర్ణించెను. ఆపై సేతునిర్మాణము క్రమపద్ధతిని జరుగమిని గాంచి సుగ్రీవుడు నలుని నియమించినట్టులు కల్పించాడు. యజమాని అయిన సుగ్రీవుడు స్వయముగా నలుని కాదేశమిచ్చుట ఔచిత్యవంతము.సముద్రపు తీరును వర్ణించుట రసపోషకము.

కావ్యవిస్తృతి


1. ప్రంబనన్ ఆలయ శిల్పం

జావాద్వీపమున యోగ్యకార్త అనుచోట తొమ్మిదవ శతాబ్దమునకు పూర్వము నిర్మించిన ప్రంబనన్ యను హిందూదేవాలయమున్నది. అచ్చటి విష్ణుమందిరముననున్న ఈ శిల్పమును గమనించండి.

కోతులు శిలలను మ్రోసి తెచ్చుట, సముద్రంలో పడవేయుట, ఆ శిలలను జలచరములు మ్రింగుట ఈ శిల్పములో చెక్కినారు. జావా, కంబోడియా, సయాం ఇత్యాది దేశాలలో ప్రాకిన రామాయణ సంస్కృతి భారతసంస్కృతి ఐనా కూడా, అది వాల్మీకేతరము, సంస్కృత, ప్రాకృత ప్రబంధకావ్యసంబంధమైన సంస్కృతి అది. ఆ శిల్పమునకు మూలము సేతుబంధము నందలి కల్పన గావచ్చు. లేదా సేతుబంధమును యనుసరించిన యితర కవుల రచన యేదో ఈ శిల్పరచనకు మూలము గావచ్చును. తెలుగులో మహాకవయిత్రి మొల్ల రామాయణమందు, ‘సముద్రమునఁ బర్వతములను మ్రింగివేయు మహా మత్స్యముల’ గురించిన ప్రస్తావన యున్నది. (మొల్ల రామాయణం యుద్ధకాండ, ప్రథమాశ్వాసము)


2. శిలను మింగుచున్న జలచరములను
హనుమ సంహరించుట.

మలయా రామాయణమైన హికాయత్ సెరి రామ అన్న రామాయణంలో, ఆ రామాయణమును అనుసరించిన శిల్ప, చిత్ర, నృత్యాదులలో సేతుబంధఘట్టమున మహామత్స్యములు చేసిన విఘ్నము గురించిన ప్రస్తావన ఉంది. సయాం (నేటి థాయిలాండు) దేశంలో మరకత బుద్ధుని (Emerald Buddha, Wat Phra Kaeo Temple) దేవాలయంలో పద్దెనిమిదవ శతాబ్దములో ఉద్దరించిన చిత్రము చూడండి.

క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దమున కాంబుజదేశ (Cambodia) ప్రభువైన యశోవర్మ, అక్కడ ప్రముఖ దేవాలయానికి (Angkor Wat) తూరుపున ఒక సుదీర్ఘమైన కృత్రిమ తటాకాన్ని దీర్ఘచతురస్రాకారమున నిర్మించి ఆ తటాక మధ్యమున సుమేరు పర్వతపు దేవాలయమును (East Mebon) నిర్మించి ప్రతిష్టించినాడు. క్రీ.శ. ఇరువదవ శతాబ్దమున శిథిలమైన ఆ తటాకపు నలుమూలల యందు రాతిఫలకలయందు సంస్కృత శాసనములు దొరకినాయి. ఆ శాసనములలో నొక శ్లోకమందు సేతుబంధకావ్య ప్రస్తావన కనిపిస్తుంది. (Ref: Eastern Baray stele inscription of Yasho-Varman, 34th conto, page 99, Inscriptions of kambuja, R C Majumdar, Aseatic society, 1953.)

యేన ప్రవరసేనేన ధర్మసేతుం వివృణ్వతా|
పరః ప్రవరసేనోపి జితః ప్రాకృతసేతుకృత్||

మొదటి ప్రవరసేనుడు (కాశ్మీరప్రభువు) ధర్మసేతువును నిర్మించాడు. మరొక ప్రవరసేనుడు సామాన్య సేతువు (లేదా సేతువను ప్రాకృత కావ్యమును) నిర్మించినాడు.

సేతుబంధకావ్యము మూలాన, ఆ కావ్యపు వ్యాఖ్యానాల మూలాన ప్రవరసేనుని కీర్తి విస్తృతముగా దేశవిదేశములలో వ్యాపించింది.

ప్రధానఘట్టము

దక్షిణ సముద్రమునైటువైపుననున్న మలయపర్వతమునకునూ, లంకయందున్న సువేలపర్వతమునకునూ మధ్య గిరిసేతుబంధము నలుని అధ్వర్యములో పూర్తి అయింది.వాల్మీకి రామాయణ సేతువులో వృక్షములు, శిలలు, పర్వతములు ఉపయోగించబడితే, ప్రాకృతకావ్యములో సేతునిర్మాణము శిలలతో జరిగింది. ఆ సేతువును ప్రాకృతకవి హృదయంగమంగా, ఒక్కొక్కపరి భీతావహముగా వర్ణించినాడు.

మలఅసువేలాలగ్గో పడిట్ఠిఓ ణహణిహమ్మి సాగరసలిలే|
ఉఅ అత్థమణణిరాఓ రవిరహమగ్గో వ్వ పాఅడో సేఉవహో||

ఛాయ:

మలయసువేలాలగ్నః పరిస్థితో నభోనిభే సాగరసలిలే|
ఉదయాస్తమననిరాయతః రవిరథమార్గః ఇవ సేతుపథః||

మలయ, సువేల పర్వతములను కలుపుతూ, అంతరిక్షము లాగా శోభిల్లుతూ, సాగరము మధ్య చక్కగ నిలబడిన సేతువు, ఉదయాస్తమముల మధ్య తిరుగు ఆదిత్యుని రథమార్గము వలే ప్రకాశించుచున్నది.

అహ థోరతుఙ్గవిఅడో ణేఉం ణిఅణం సవన్ధవం దహవఅణమ్|
దోహాఇ అసలిలణిహీ కఅన్తహత్థో వ్వ పసరిఓ సోఉవహో ||

ఛాయ:

అథ స్థూలతుఙ్గవికటో నేతుం నిధనం సబాన్ధవం దశవదనమ్|
ద్విధాయితసలిలనిధిః కృతాన్తహస్త ఇవ ప్రసృతః సేతుపథః||

లంకకు కట్టిన సేతువు, సాగరమును రెండుగా విడగొట్టుచూ, యముని హస్తమువలె పొడవుగా, భయంకరంగా, రావణున్ని అతని బంధువర్గాన్ని మరణానికి కొనిపోతున్నట్టున్నది.

నిర్మాణానికి సారథి – రవి అవతారుడైన సుగ్రీవుడు. కార్యము రవికులజుడైన రామునిది. వారి అధ్వర్యమున నిర్మితమైన సేతువు రవిపుత్రుడైన యముని హస్తము వోలె సముద్రమధ్యమందున్నది. ఇక్కడ ఉన్నది కేవలమొక ఉత్ప్రేక్ష కాదు, ఒక నిర్జీవమైన సేతువు అన్న వస్తువునకు, జీవన్తమైన కృతాన్తహస్తపు పోలిక. ఇది యెంత భీతావహముగా ఉందో సహృదయులూహింపగలరు.

కపి సేన వారధిని కట్టి లంకలోని సువేలపర్వతమును చేరింది. కవి సువేలమును వర్ణిస్తున్నాడు. సువేలపర్వతవర్ణన విషయమున ప్రాకృతకవి నిజముగా ‘ప్రాకృత’ కవి అనిపిస్తాడు. తెనుగు కావ్యమైన మనుచరిత్ర ప్రబంధమున మన పెద్దనగారి ప్రవరుడు హిమాలయమును జూచి, అంబర చుంబి శిరస్సరజ్ఝరీపటల ముహుర్ముహుర్ములుఠత్ అభంగ తరంగ.. అని మద్దెల వాయింస్తున్న స్వరగతితో, హృదయముప్పొంగే పద్యము చెప్పినాడు. కాళిదాసు సరే సరి. ఒక టూరిస్టు గైడు లాగా, అస్త్యుత్తరస్యాం దిశి… అని హిమాలయాలను చూపించి, ఆ తావుల పాఠకుని గొనిపోయి హృదయంగముగా ఆ సానువులను చిత్రించినాడు. మనము పరికింపవలసినది మాఘ ప్రవరసేనులను.

మాఘుడు – ప్రవరసేనుడు

ప్రవరసేనకవి ఒరవడిని అనుసరించిన కవులలో భారవి ప్రథముడు. భారవి కిరాతార్జునీయమును అద్వితీయముగ అనుశీలించి, అనుసరణలోనూ స్వాతంత్ర్యమును నిలుపుకొన్న కవి మాఘుడు. ఈ కవిని గురించి మల్లినాథసూరి అంతటి మహితాత్ముడు, మాఘే మేఘే గతం వయః అని నుడివినాడు. మాఘుని అనుశీలించుటలో మల్లినాథునికి అర్ధజీవితము చెల్లినదట. అంతటి కవిని మనబోంట్లు వ్యాఖ్యానించుట హాస్యాస్పదమే కావచ్చు కానీ సేతుబంధకారుని ప్రత్యేకత తెలియటానికి శిశుపాలవధము యొక్క పరిశీలనము కొంత ఉపకరించవచ్చు. అందుకే ఈ పోలిక.

మాఘుడు మహాకవి, మహాపండితుడు, జ్యోతిశ్శాస్త్రాది అనేక శాస్త్రములలో దిట్ట. సరస్వతి ఆయన ముఖములో ఉన్నది. భాష హస్తామలకము. ఛందస్సు జిహ్వాగ్రమందున్నది. ఏ భావమునైనా – ఏ సంవిధానమున నైనా కవిత్త్వము చెప్పగల దిట్ట. చిత్రకవిత్త్వము కూడా అలవోకగా చెప్పగల మహాధీమణి. ఒక మహాపర్వతమును జూచి నిశ్చేష్టితుడై విస్మయపడు వ్యక్తి యొకడైతే, ఆ పర్వతము యొక్క అంతు చూడాలని, శిఖరాగ్రమునకెక్కి చేతులు సాచి ఆనందపడాలని కోరెడు భావుకుడు మరొకరు. మాఘుడు ఈ రెండవ కోవకు చెందిన కవి అనిపిస్తుంది. ‘నియతికృత నియమ రహిత’మైన కవిత్త్వమాయనది. అయినా ఆయన కవిత్త్వంలో భావుకత్త్వపు పాలు కంటే పాండిత్యపు రుచి ఎక్కువగా కానవస్తుంది. భావుకత్త్వము లేకపోలేదు కానీ, ఆయన ఆ భావుకత్త్వమున మునుగటం లేదు, దానిని అధిగమించి ముందుకు సాగుట ఆ కవికి ప్రియము.