ఈనాటికీ సమాజపు అంచుల లోని కొందరు స్త్రీలు వ్యభిచారం చేసి పొట్ట పోసుకుంటున్నారన్నది వాస్తవం. సంస్కరణ వాదం ఆ కాలపు సమాజం లో చైతన్యం తెచ్చిన మాట నిజమే అయినా సమస్య లోతుల్లోకి అది వెళ్ళలేకపోయింది. ప్రస్తుతం ఆవృత్తి వారసత్వంగా అందకపోయినా, వారసత్వంగా అందే పేదరికం ఆ స్త్రీలను చాలా సులభంగా అటు వైపు తోస్తుంది. ‘కమర్షియల్ సివిలైజేషను’ అని రావిశాస్త్రిగారు పిలిచిన స్వాతంత్ర్యానంతరపు భారతంలో వేశ్యావ్యవస్థ కొత్త రూపం తెచ్చుకుంది. కులవృత్తి అనే ఆచ్చాదన తొలిగిపోయాక, నియమిత వెల లేని వస్తువూ, తనని తానే అమ్ముకోవాల్సిన వస్తువుగా శరీరసౌఖ్యం అందించే పరికరంగా స్త్రీ శరీరం మారిన విధానం నగ్నంగా మన కళ్ళ ముందుకొచ్చింది. అలా ‘అమూల్యమైన దానికి మూల్యం నిర్ణయించే’ పాపానికి ఆవేదన చెందుతూ 1949లో వచ్చిన కథ, రావిశాస్త్రి గారి విలువలు.
స్త్రీ తన శరీరాన్ని గతిలేక అమ్ముకుంటుంటే, చట్టం ఆమెకు రక్షణ కల్పించక పోగా, ‘టేరిబుల్ న్యూసెన్సు అనీ, కమ్చీతో కొట్టాలనీ’ పోలీసులు సాగించే జులుం, 1961లో రావిశాస్త్రి గారిని ఆరు సారా కథల్లో ఒకటైన న్యాయం అనే కథ రాసేందుకు ప్రేరేపించింది. నూకరాజు కంపెనీ నుంచి ఆమెను కొందరు షిప్పు లోంచి దిగిన ముష్కరులు ఒక రాత్రికని కొనుక్కుంటారు. తాగించి, క్రూర జంతువుల్లా హింసించి, పోలీసు స్టేషను ముందు ఒళ్ళు తెలియని ఆమెను నగ్నంగా పడేసి పోతారు. పోలీసులు కబురు పెడితే కంపెనీ ఓనరు బట్టలు మాత్రం పంపి ఊరుకుంటాడు. పోలీసులు ఆమెపై న్యూసెన్సు కేసు పెడతారు. జడ్జీ ఆమెను నేరం చేసేవా? అని అడిగితే కేసు ఒప్పేసుకుంటానండీ అని జవాబు ఇస్తుంది. ‘ఈ పన్లు చేసుకోడం వారి బతుకు, వారిని పట్టుకోడం మా బతుకు, ఏ బతుకు బతికే వారు ఆ బతుకు బతకాలి కదా’ అని వేదాంతం చెప్పే హెడ్డు మాటలకు గుండెలు పగిలి ఆ స్త్రీ మెజిస్ట్రేటు ముందు ‘నా కొద్దీ బతుకు, నన్ను చంపేయండి’ అంటూ విలపించే సన్నివేశం ఆ వృత్తి లోని ఘోరాన్ని ఎలుగెత్తి చాటుతోంది.
1969లో వచ్చిన కాళీపట్నం రామారావుగారి కథ, హింస – పదేళ్ళకు మించని సంగి కోణం నుండి వ్యభిచారుల కుటుంబాల వ్యధనూ, నిస్సహాయతనూ చిత్రిస్తుంది. సంగి తల్లి ఆవాల జగ్గమ్మ, తన పెద్ద కూతురు పైడమ్మకు పాతూరి గొల్లల సంబంధం చేసింది. అత్త వారు ఆమెను పొగాకు పనులకు పంపేరు. పొగాకు పందిళ్ళలో చెడిపోయి, కాపురమూ చెడి, భయపడి పైడమ్మ పట్నం పోయింది. మొదట మోసానికి లొంగిన మనిషి బలవంతానికి పడిపోయింది. ఆ పడ్డం, పడ్డం దిగజారి దిగజారి సబ్బారపు సంజీవమ్మ కంపెనీలో తేలింది. వ్యభిచారంలో దిగబడిపోయిన అప్పను ఇక పైకి లాగలేమని తీర్పునిస్తుంది బంధుగణం. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది తల్లి, కనబడని శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తుంది చెల్లి. జరగవలసిన దానికీ, జరిగిన దానికీ మధ్య ఉన్న అగాధాన్ని చూపించడం కారా గారి శిల్పం. కులవృత్తిని రూపుమాపామని ఒక వైపు చెబుతూ, మరోవైపు కుటుంబపు తోడూ నీడా లేకుండా ఒక అమానవీయమైన వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేసి, దురదృష్టం కొద్దీ దానిలో చిక్కుకున్నవారిని దానిలోనే మగ్గమని చేతులు దులుపుకుంటున్న సమాజానికి, అది సాగిస్తున్న హింసను అద్దం లో చూపించడం – రామారావు గారి దృక్పథంగా మనకు కనిపిస్తుంది. అటువంటి దురదృష్టవంతులను తిరగబడమని ఉద్బోధించడమే ఆయన ఆశయం.
పైడమ్మ జీవితమే కథాంశం అయినా నోరులేని పాత్రలా ఆమె కేవలం సాక్షిగా మిగిలి ఉంటుంది. ఆ మూగ బాధకు ప్రతిస్పందన యిదా అన్నట్టూ నోరు గల్ల ఆడది కథ లోని స్వర్ణ ఏటికి ఎదురీదుతుంది. ‘ఆ నోరు బెట్టుకోకపోతే యీ వూళ్ళో నిలవనీడుణ్ణా ఆ యమ్మికి? యీ పొద్దుటికి గూడా ఆయమ్మి మానంగా బతకతా వుండాదంటే ఆ నోటివల్లనే గదా నాయినా…’ అంటూ అవ్వ స్వర్ణక్క గురించి చెప్పిన మాటలు సమాజాన్ని ఎదుర్కునే తరుణోపాయం లాగా కనిపిస్తాయి.
1969లో వచ్చిన రంగనాయకమ్మ గారి అంధకారంలో అనే నవల వేశ్యల దుర్భర జీవితాలను వివరంగా చిత్రీకరించింది. అప్ప చెల్లెళ్ళ నిస్సహాయత హింస కథలో మనకు కారా వారు చూపిస్తే, ఈ నవలలో, అక్కా తమ్ముళ్ళ మధ్య తలవని తలంపుగా జరిగిన ముఖాముఖీ మనను నిశ్చేష్టులను చేస్తుంది. రాజేశ్వరి తల్లిపోయాక, సవతి తండ్రి తనపై చేసిన దురాగతం వల్ల పట్నం వచ్చి వ్యభిచారం పాలౌతుంది. పద్దెనిమిదేళ్ళ సవతి తమ్ముడు రమణ బ్రోతల్ హౌస్ లోకి వస్తాడు. అక్కడ అక్కను గుర్తించి తల ఎత్తలేకపోతాడు. ‘ఎంత పాపం తప్పిందక్కా’ అని ఏడుస్తున్న తమ్ముడికి బుద్ధి చెప్తూ ‘నేనేనా అక్కని? ఇక్కడి ఆడవాళ్ళందరూ అక్కలూ చెల్లెళ్ళూ కారా? అదంతా పాపం కాదా?’ అని అడిగే రాజేశ్వరి ప్రశ్నకు సమాజమే సమాధానం చెప్పాలి. వారి జీవన స్థితి గతులపై రచయిత ఆవేదననూ, దృక్పధాన్నీ ఈ వాక్యంలో మనం అర్ధం చేసుకోవచ్చు: ‘రోడ్డు పక్క కంపుకొట్టే యూరిన్ దొడ్డిలా, శారీరక కామాన్ని నివారించుకునే మరుగు దొడ్డి ఆ బ్రోతల్ హౌస్!’
1975-78 మధ్య వచ్చిన పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి కథల్లో కటిక పేదరికం కారణంగా ఆ వృత్తికి చిక్కుకున్న స్త్రీలు మనకి తెలియని వారి చరిత్రలు వివరిస్తారు. చీకటి అనే కథలో కనీసం ఒక పావలా అప్పు దొరికితే కాసిని టీనీళ్ళు తాగుదామని ఆరాటపడుతున్న సావిత్రి జీవితం కంటిక్కడుతుంది. తల్లి కాయకష్టం చేసి ఆమెను పెంచింది కానీ సావిత్రికి ఈ శాపగ్రస్త జీవితం తప్పించలేకపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం కనుక కర్ఫ్యూ రోజుల్లో పైసా సంపాదన దొరక్క ఆకలికి మలమల మాడి పది రూపాయలు అప్పు తీసుకుంటుంది. వడ్డీగా ఆమె శరీరం శిథిలమైపోతున్నా ఆ అప్పు మాత్రం అలాగే ఉండడమనేది, ఆ వృత్తిలో ఉండేవారి జీవితాలకు ప్రతీకగా తోస్తుంది. ‘తనకు పాపపు బ్రతుకిచ్చిన దేవుడు పైనుండి వసూలు చేస్తున్న వడ్డీ లాంటి చీకటి’ అనే వాక్యం సమాజం వీరి నుండి అనాదిగా వసూలు చేస్తున్న అధర్మ వడ్డీని మనకు గుర్తు చేస్తుంది. మరో కథ, సతీ సావిత్రి, వేశ్యల వృత్తి లోని పరాధీనతకు చరమ సీమలను చూపిస్తుంది. ఏ ‘కంపెనీ’ లోనూ చేరకుండా తన ఒళ్ళమ్ముకున్న డబ్బు తాను తిందామనుకోవడమే పేరాశ ఔతుంది ఈ సావిత్రికి. ఒక పసిబిడ్డ తల్లిగా కనిపిస్తే, కాస్త సులభంగా వృత్తి చేసుకోవచ్చని ఊహిస్తుంది. ఐదు నెలల పసికందు తల్లికి తనింటిలో ఆశ్రయమిస్తుంది. ఆ బిడ్డను రాత్రిపూట ఎత్తుకుని రోడ్డెక్కుతూ ఉంటుంది. దురదృష్టం! ఒకనాడు ఆ పసిగుడ్డుతో సహా దొరికిపోతుంది. లాకప్‌లో బిడ్డ ఆకలితో రాత్రంతా గగ్గోలు పెడుతుంది, కన్నతల్లి కాదు కనక పాలివ్వలేని అసహాయతతో సావిత్రి కుమిలిపోతుంది. ఓడిపోయి మాణిక్యం కింద వృత్తి చేసుకు బ్రతికేందుకు ఒప్పుకుంటుంది, అప్పుడు మాణిక్యం జరిమానా చెల్లించి ఆమెను బయట పడేస్తుంది. అతి కష్టం మీద పసిబిడ్డను ప్రాణాలతో తల్లికి ఒప్పచెప్పిన సావిత్రికి తన దురదృష్టం తలుచుకుని ఏడుపు పొంగుకొస్తుంది.
వేశ్యల దుస్థితి ఇలా దిగజారుతూనే ఉండగా, ఈ శతాబ్దారంభంలో ఎయిడ్స్ మహమ్మారి వీరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ పరిణామాన్ని, దాని పర్యవసానాలనూ 2001లో కుప్పిలి పద్మ, కొత్తచావు అనే కథలో వర్ణించారు. వేశ్యల దుస్థితికి అసలు కారణాలు – అవకాశవాదుల దురాశ, ఆకలి, దరిద్రం, చట్టం పేరుతో జరిగే హింస; వీటితో – మందు లేని ఎయిడ్స్ వ్యాధిని పోల్చడం చాలా సరైన ఉపమానమనిపిస్తుంది. దారిద్ర్యం కొందరికి ఆ వృత్తిని తప్పనిసరిగా చేస్తే, వారితో బిజినెస్ నడిపే కంపెనీలు దాని నుండి బయట పడాలనుకునే వారిని అడ్డుకోడం ఈ కథలో మనం చూస్తాం. సమాజం మీది తిరుగుబాటు ధోరణీ, అంతటి వ్యాధి పైబడినా బ్రతుకు మీది తీపితో వేశ్యాగృహం లోంచి బయటపడాలని వారి ప్రయత్నం లోని ఆశావాదమూ – ఈ కథలోని ప్రత్యేకతలు.
మానవ సమాజంలో – ఆకలి కన్నా, అధిక శ్రమ కన్నా, నిరుద్యోగం కన్నా, కులం కన్నా, అన్నిరకాల దురంతాల కన్నా – అతి క్రూరమైన, అతి నీచమైన దురంతం వ్యభిచారం. వేశ్యావృత్తి అలాగే కలకాలం వర్ధిల్లాలనే కోరుకునేవారు సమాజంలో ఈనాటికీ ఉండనే ఉన్నారు. వ్యభిచరించడమనేది ప్రజల స్వంత విషయమని వీరి వాదం. దానికి వీలు కల్పించే వేశ్యా వృత్తి కూడా అన్ని వృత్తుల వంటిదేనని వీరి నమ్మకం. కొందరు సమ్మతించి ఆ వృత్తిలో ప్రవేశిస్తే సమాజం వారిని నీచంగా చూడడం అన్యాయమనీ, దానికి మిగిలిన వృత్తులతో సమానమైన గౌరవం కల్పించాలనేది ఆధునికమైన వేశ్యావృత్తి సానుభూతిపరుల లక్షణమని చెప్పుకోవచ్చు.
కానీ దీనిలో ఉన్నవారు అత్యధిక శాతం నిరుపేదలనీ, మరొక దారి దొరక్క కొందరూ, ఎదురు తిరగడానికి ధైర్యం చాలక ఆ వృత్తిని మోస్తున్నవారు మరికొందరూ, పారిపోయే ప్రయత్నాలు ఫలించక అణచివేతకు గురౌతూ ఇంకొందరూ – ఈ వృత్తిని సాగిస్తున్నారనీ, తమ ఇష్టంతో వారక్కడ జీవించడం లేదనీ ఈ సాహిత్య కారులు భావిస్తున్నట్టు అనిపిస్తోంది. ఆకలికి ఆగలేని పసివాడు ఎంగిలాకుల్లోంచి అన్నం ఏరుకోబోతూ ఉంటే, ఒక కుక్క అతని చేతిలో నుండి ఆ అన్నం లాక్కోబోయే చందంగా పోలీసులూ, గూండాలూ వేశ్యలను వేధిస్తున్నారన్నది అందరూ ఏకగ్రీవంగా అంగీకరించే వాస్తవం. కానీ ఎంగిలాకులు ఏరుకునే దుస్థితిలో తమను ఉంచుతున్నందుకు సమాజం బాధ్యత వహించాలని పోరాటం సాగించే బదులు, కుక్కలు లేకుండా పోతే మాకంతకంటే ఇంకేమీ అక్కరలేదనే వాదం ఎంత తెలివి మాలినదో, ఈ ఆధునిక సానుభూతి ధోరణులు అంత ప్రమాదకరం.
వాస్తవంగా ఎదురయ్యే సమస్యలను పుస్తకాలు ఏం తీరుస్తాయన్న సంశయం కొంతమందికి కలగవచ్చు. మనుషుల జీవితాల లోని వాస్తవ సంఘర్షణ వెనుక నైతిక, ధార్మిక సమస్యలు విధిగా ఉంటాయి. అవి ఎంత ఎక్కువగా చర్చ లోకి వస్తే సమస్యా పరిష్కారానికి అంత దగ్గరౌతాం. ‘వ్యభిచారం అనేది కుట్టు పనీ, నేతపనీ, వడ్రంగం వంటి వృత్తే ఐతే, ఆ వృత్తుల్లాగే ఇది కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. కానీ సెక్స్ అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు, వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదు,’ అని ఈ సమస్య పై రంగనాయకమ్మ తమ అభిప్రాయం చెప్తారు.
వేశ్యావృత్తిలో ఉన్న వారి పట్ల సానుభూతినీ, వారి వ్యక్తిత్వం పట్ల గౌరవాన్నీ ప్రకటించిన రచయితలు తమ కాలం లోని ప్రజా బాహుళ్యపు విశ్వాసాలకు భిన్నమైన దృక్పథాలతో రచనలు సాగించారు. వీరందరూ ఇటువంటి ప్రత్యేక వ్యక్తిత్వంతో సృష్టించిన వేశ్యల పాత్రల ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే అసహజమైన వృత్తిని సమాజం వారిపై రుద్దింది కానీ సహజసిద్ధమైన వారి విలక్షణతలను రూపు మాపలేకపోయింది అని. మానవత్వానికీ, న్యాయవర్తనానికీ, ఆత్మగౌరవానికీ, కళాభిమానానికీ ప్రతీకలుగా వేశ్యలను కొందరు దర్శిస్తే, ఆ చీకటిరాజ్యంలో చిక్కుకుని వెలుగు లోకి వచ్చే అవకాశం కోసం వారి ఆరాటాన్నీ, పోరాటాన్నీ మరి కొందరు చిత్రించారు. ఈనాడు వ్యభిచారం మునుపటి కంటే మరింత భయంకరమైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటే, సమస్య మరింత క్లిష్టమైపోయి, వేశ్యలు వారి కథ వారే చెప్పుకున్న సందర్భంలో ఈ రచయితల స్పందనను మరొక్కసారి పరామర్శించవలసిన అవసరం ఉంది.
సెక్స్‌ని అమ్మే, కొనే పరిస్థితులు సమాజంలో పోతేగానీ ఈ సమస్య పూర్తిగా సమసిపోదు. ముందు ముందు అలాటి స్వప్నం సిద్ధించిన నాడు ఈ వృత్తిని తప్పనిసరై చేసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవచ్చు. కానీ అంతవరకూ ఆ వలయంలో చిక్కుకుని బయట పడాలనుకునే వారికి తగిన పునరావాసమూ, వృత్తిని తప్పనిసరియై సాగిస్తున్నవారికి తగిన సామాజికన్యాయమూ అందాలనేదే ఈ సాహిత్యకారుల ఆకాంక్ష అని మనం అర్ధం చేసుకోవాలి.
[ఈ వ్యాసపు సంక్షిప్త రూపం డిసెంబర్ 7, 2015 ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురించబడింది -సం.]