సేతుబంధకారుని సీతాదేవి అసహాయ. అయినప్పటికీ ధీర. పరమ ముగ్ధ కాదు. ఆమె మాటలలో రాచకన్య యొక్క ధీరత్వము, ప్రతీకారేచ్ఛ కానవస్తుంది. సీతయందు ప్రవరసేనుడు నిలిపిన ధీరత్త్వము ’కుందమాల’ అను దృశ్య కావ్యమున తిరిగి కానవచ్చును. జానకిని ఊరడించుట త్రిజట వంతయ్యింది. సేతుబంధకవి రాముడు సాక్షాత్తు నారాయణుడు. ఈ విషయమును త్రిజట ముఖమున కవి చెప్పించినాడు. చివరకు వానరుల యుద్ధసంరంభమును, భేరీ నినాదములను విని సీత ఊరడిల్లును.
ఈ ఆశ్వాసము నందు సేతుబంధకారుడు సీతయొక్క పాత్రచిత్రణమునూ, రావణుని ఉన్మత్త మానసిక అవస్థను అపూర్వముగా చిత్రించినాడు. పూర్వఘట్టములందు సుగ్రీవుని పాత్రచిత్రణమును, నాయకత్త్వప్రతిభను గురించిన ప్రస్తావన ఇదివరకు ఉటంకింపబడినది.
యుద్ధము మొదలైనది. వానరయోధుని బలమును, పరాక్రమమును కవి చిత్రించుచున్నాడు.
కఇవచ్ఛత్థలపరిణఅణిఅఅముహత్థమిఅదన్తిదన్తప్ఫలిహమ్|
ణిహఅ భడ మహిఅ ణివడిఅ సురవహుచల వలఅ ముహలపవ అవఇవగమ్||ఛాయ:
కపివక్షఃస్థలపరిణత నిజముఖాస్తమిత దన్తిదన్తపరిఘమ్|
నిహత భట మహిత నిపతిత సురవధూచల వలయ ముఖరప్లవగ గతిపథమ్||
అసురసైన్యమందలి యుద్ధగజమొక్కటి ఒకానొక వానరయోధుని పాషాణసదృశమైన వక్షఃస్థలమును తన కొమ్ములతో కుమ్మింది. ఆ అదటుకు వానరశ్రేష్టునికి యేమీ నొప్పి కలుగలేదు కానీ, గజము యొక్క దంతము మాత్రము వెనుకకు వంగి దానిముఖములోనికే చొచ్చినది. ఇక్కడ వానరయూధుల దేహదారుఢ్యము వ్యంజితము. నిహతులైన వానరయోధుల కొనిపోవుటకు వచ్చిన స్వర్గలోకవాసులైన అప్సరల నూపురనాదములతో యుద్ధపథమతిశయించినది.
రౌద్రభీభత్సములు – కవిహృదయము – అనుశీలనము
భారతీయ కావ్యమున యుద్ధరంగమును వర్ణించుట ప్రాచీనమైన విషయము. దృశ్యనాటకాలలో యుద్ధములు, వధ ప్రత్యక్షముగా చూపరాదని నాట్యశాస్త్రనియమమున్నది కానీ శ్రవ్యకావ్యములలో ఆ నిబంధన లేమి చేత యుద్ధమును మహాభీభత్సముగా, వీర, రౌద్రరసపోషకముగా కవులు వర్ణించియున్నారు. యుద్ధములో లూనశీర్షము – అనగా తెగిన తల గల మొండెమును వర్ణించుట ఒక ఆనవాయితీగా సంస్కృత, ప్రాకృతకావ్యములలో నిలచినది. కదనరంగమున సహస్రపూరణము అన్నది ప్రసిద్ధమైన విషయము. అనగా, యుద్ధమున వేయి తలలు త్రెగినచో, ఆ మరణించిన కళేబరములందు ఒక్క తలలేని మొండెము లేచి నృత్యము చేయునట. తలలేని మొండెమునకు కబంధమని పేరు. దీనిని కవులు తమ కావ్యములలో ఉపయోగించినారు. ఇప్పుడు కవుల యుద్ధవర్ణనమును తులనాత్మకముగ చూతము.
కాళిదాసు:
కశ్చిద్ద్విషత్ఖడ్గ హృతోత్తమాఙ్గః సద్యః విమానప్రభుతాముపేత్య|
వామాఙ్గసంసక్తసురాఙ్గనః స్వం నృత్యత్కబంధం సమరే దదర్శ|| (రఘు. 7.51)
సమరాంగణములో ఒక యోధుడు శత్రువుతో పోరాడగా, శత్రువాతని శిరమును ఖండించెను. వెంటనే యోధుడు అసువులు బాసి, స్వర్గమునుండి తనకై వచ్చిన విమానమధిరోహించి, ఆ విమానమున పక్కనున్న అప్సరను కౌగిలించి, (సహస్రపూరణమగుట చేత) నృత్యము చేస్తున్న తన మొండెమును చూచినాడు.
ఇచ్చట కశ్చిద్ద్విషత్ఖడ్గ హృతోత్తమాఙ్గః = ఒకానొక శత్రువు చేత ఖండింపబడిన బడిన శిరముగల వీరుడు – అన్నచోట భీభత్సప్రతీతి. వామాఙ్గసంసక్తసురాఙ్గనః = ఎడమవైపు కౌగిలించిన అప్సర (గలవాడు) – అనుట శృంగారమును వ్యక్తపరుస్తోంది. ఈ రెండు సమాసములకు మూలమైన రణోత్సాహము వీరరసము. అనగా భీభత్స వీర శృంగారములు ఒక్కచోట కలిసినవి. భీభత్స శృంగారములు వైరిరసములు. వీటినొక్కచోట కలుపుట రసవిరోధహేతువగును కావున ఒక్కపట్టున ఉపయోగించరాదు. కానీ కాళిదాసు శ్లోకములో ఈ రసవిరోధమును పరిహరించుటకు ఆ రెండు రసముల మధ్య యెడముగా వీరరసమున్నది. కనుక ఇది అనౌచిత్యము కాదు. అదేవిధముగా భీభత్సమునకు కబంధము, శృంగారమునకు వీరుని దివ్యశరీరము ఆలంబనమగుట వలన రసవిరోధము లేదు. ధ్వన్యాలోకమున, కావ్యప్రకాశమున రసవిరోధప్రకరణమున ఇదే విధమైన ఉదాహరణము ప్రకటింపబడియున్నది. (భూరేణుదిగ్ధాన్నల – ధ్వన్యాలోకము 3.102,103,104, కావ్యప్రకాశము – 7.334,335)
కుమారదాసు:
వధాయ ధావన్నభిశత్రువిద్విషః శరేణ కృత్త్యచ్యుతమస్తకోऽపరః|
హృతాయురప్యాదికృతేన కానిచిత్పదాని వేగేన జగామ రాక్షసః|| (జానకీహరణము -5.40)
ఒక రాక్షసయోధుడు తన శత్రువైన రాముని వధించాలని అభిముఖంగా వేగముగా పరిగెత్తుతూ వచ్చినాడు. అతని శిరస్సును రాముని శరము ఖండించినది. ఆయువు కోల్పోయినప్పటికీ వేగమును నిలుపుకోలేక రాక్షసుని కబంధము కొన్ని అడుగులపాటు ముందుకు నడిచినది.
ప్రవరసేనుడు:
బన్ధువహబద్ధవేరం సహస్సపూరణకబన్ధజణి ఆమోఅమ్|
వడ్ఢఇ భడదిణ్ణరసం భుజపవ్వలపహుఅవీరపడణం జుజ్ఝమ్||సంస్కృతఛాయ:
బంధువధబద్ధవైరం సహస్రపూరణకబంధజనితామోదమ్|
వర్ధతే భటదత్తరసం భుజప్రబలప్రభూతపరిపతనం యుద్ధమ్|| (సేతుబంధము – 13.64)
బంధువధ కారణమున పెరుగుచున్న వైరముతో, వేయిశూరులపతనముతో కలిగిన సంతోషముతో (కబంధ నృత్యమునకు హేతువై), భటుల సమరోత్సాహముతో, యోధుల భుజబలము పెచ్చరిల్లగా సంభవించిన శత్రువుల పతనముతో యుద్ధముత్కర్షముగ సాగుచున్నది. ఇచ్చట రౌద్రరసప్రతీతి. స్థాయీభావము క్రోధము. శత్రువులు ఆలంబన విభావము. బంధువుల మధ్య వైరము, భుజబలము ఉద్దీపనము. భటుల మోదము అనుభావము. శత్రువుల తలలు తెంచుట యను ఉగ్రత్త్వము వ్యభిచరీభావము. కబంధ నృత్యము వ్యంగ్యమై యొప్పుచున్నది.
వ్యాసుడు:
కబంధాని సముత్థస్థుః సుబహూని సమన్తతః|
తస్మిన్ విమర్దే యోధానాం సంఖ్యావృత్తికరాణి చ|| హరివంశము (2.36.9)
ఆ ఘోరయుద్ధమున వెంట వెంటనే యనేక శిరములేని మొండెములు లేచి ఆడుచుండెను. అది పోరాడి నశించిన యోధుల సంఖ్య ఆవృత్తి యగుచున్నట్లున్నది.
వేయి కళేబరములకొక్క శిరరహితకళేబరము లేచి నృత్యమాడును కదా, ఈ శ్లోకమున అట్టి కబంధనృత్యము వెంటవెంటనే అనేకమార్లు జరుగుచున్నదని కవి కల్పన. అనగా, వేల సంఖ్యలో యోధులు నిముషమున నశించుచున్నారు. ఇది యుద్ధతీవ్రతను వ్యంజింపజేయుచున్నది.
మాఘుడు:
సహస్రపూరణః కశ్చిల్లూనమూర్ధాऽసినా ద్విషః|
తథోర్ధ్వ ఏవ కబన్ధీమభజన్నర్తనక్రియామ్|| శిశుపాలవధమ్ (19.51)
యుద్ధరంగమున సహస్రవీరులను మూర్కొనగల శక్తి గల ఒక భటుడు శత్రువుచేత ఖండించబడిన శిరముతో వేయి సంఖ్య పూర్తి అయిన మొండెము వలే నిలబడి నర్తించుచున్నాడు.
భట్టి:
సంబభూవుః కబంధాని ప్రోహుః శోణితతోయగాః|
తేరుర్భటాస్యపద్మాని ధ్వజైః ఫేనైరివాబభే|| (రావణవధ -14.27)
కబంధములు సంభవమగుచున్నవి. (వేల మంది యోధులు హతమగుచున్నారు). రక్తపుటేరులు ప్రవహించుచున్నవి. రథములు, భటుల ముఖపద్మములు, ధ్వజములతో కూడి నురగలగుచున్నవి.
కబంధనృత్యము గురించి ఇంకనూ అనేక కావ్యములలో దృష్టాంతములు కలవు. హర్షచరితమునందునూ, బౌద్ధగ్రంథము, పాళీ ప్రాకృతరచన అయిన మిళిందపన్హలో ’సహస్రపూరణము’ కాకుండా కొంత లెక్క తేడాతో కబంధ నృత్యప్రస్తావన ఉంది.
వివిధ కవుల సమాంతర యుద్ధవర్ణనలను చూస్తే, కొన్ని విషయము లగుపడుతున్నవి. సాధారణముగా కాళిదాసు కవి రీతి వైదర్భి. శబ్దప్రయోగములు పరమలలితములు. ఇవి శృఙ్గారరసమునకు ప్రధానముగా సహకరించేవి. ఓజోగుణప్రవిష్టమైన రౌద్ర, భీభత్సములు కాళిదాసు కవిత్త్వమున అంతగా నొప్పుట కనబడదు. ఒక్క వేళ అట్టి ఘట్టములు సంభవించినా, ఆ కవి శబ్దప్రయోగములు ఈ రసములకు పోషకములు గావు. అంతియే గాక కాళిదాసు క్వాచిత్కముగా దక్క పరుషములను, సంయుక్తాక్షరములను, దీర్ఘసమాసములను కావ్యములలో కూర్చిన సందర్భముల నంతగా కానము. జానకీహరణకావ్య కర్త అయిన కుమారదాసుడు కాళిదాసునకు పరమ అభిమాని, భక్తుడు. ఈతని శబ్దసౌష్టవము కాళిదాసు కవిత వంటిదే. పై ఉదాహరణమందలి పదచిత్రము చక్కగానున్నది. కానీ ప్రత్యేకముగా చెప్పుకొనేదేమీ లేదు. ప్రవరసేనుడు ప్రాకృతకవి. ప్రాకృత భాష అనాయాసమైననూ, ఈతని రచనలలో దీర్ఘపదబంధములు, సంయుక్తాక్షరములూ ఎడనెడ కనిపిస్తాయి. సేతుబంధమున శ్లోకము మొత్తమును కేవలము రెండు సుదీర్ఘపదబంధములతో ముగించుట అనేకమార్లు (కావ్యమంతటనూ కలిపి అరువదిమార్లకు పైగా) గమనించవచ్చు. ఈ కావ్యమందే కాదు, గాథాసప్తశతి లోనూ, సుదీర్ఘసమాసము లనేకములు కలవు. భాష ప్రాకృతము కావున, అట్టి దీర్ఘసమాసములు సంస్కృతములో వలే ఆయాసము కలిగింపవు. సేతుబంధకావ్యము వీరరసప్రధానము గాన శైలిలో సరళతకన్నా, బిగువెక్కువ. ఇది కావ్యఘట్టమును బట్టి మారుచుండును. కాళిదాసు వలె, సుకుమారత, మృదుత్వముల వంటి పట్టింపులు ప్రవరసేనకవిలో కానము. ఈ కవి ప్రధానముగా విభిన్నమైన విలక్షణ భావములను కూర్చుటకు ముచ్చటపడు కవి. యుద్ధవాతావరణమున యుద్ధమును మిక్కిలి నుద్యోతించుచూ, తత్సంబంధిత విషయ విలక్షణతకు ప్రాధాన్యత జూపి, అందుకు తగిన శైలిని ఎంచుకొనునట్టు కనపడును. పరస్పరపోషకరసవిషయమున ప్రాకృతకవి యందు కాళిదాసుకన్న కొంత తడబాటున్నట్టు అగుపడును.
వ్యాసమహర్షిని గురించి చర్చించుట అవివేకము. మాఘకవి గురించి చెప్పుటకేమున్నది? మాఘే సన్తి త్రయో గుణాః. పైగా ఇదివరకే మాఘుని గురించి మాట్లాడుకొన్నాము. భట్టి కావ్యము యొక్క ఉద్దేశ్యము వ్యాకరణపాఠము జెప్పుట కనుక, ఆ కవిత్త్వానుశీలనము అనవసరము.