ఒక జాతి సాంస్కృతిక జీవన విధానాన్ని ఆ జాతి నిర్వహించే వేడుకలను బట్టి గ్రహించవచ్చు. మానవుడు తన జీవనక్రమంలో పదిమందితో కలిసి ఆనందోత్సాహాలను నింపుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పవిత్రమయిన, ఆరోగ్యప్రదమైన వేడుకలే పండుగలు. ఐహిక ఆముష్మిక కామ్యప్రదాలు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క రకమైన సందడి. వినాయక చవితికి వివిధ వృక్షాల పరిచయం పెంచుకుని పత్రి సేకరించడం ప్రధాన విషయం. దసరాకు బొమ్మలు పెట్టడం, సంక్రాంతికి గొబ్బిళ్ళు, దీపావళికి బాణాసంచా ప్రత్యేకమైన విషయాలు. కొంచెం దృష్టి పెట్టి చూస్తే బొమ్మల కొలువు పెట్టడం, గొబ్బిళ్ళు పెట్టడం కేవలం ఆడపిల్లలు, అందునా కన్నెపిల్లలు నిర్వహించేవి అని తెలియవస్తుంది.
బొమ్మల కొలువు అనగానే మనకు రెండు పండగలు తలపుకు వస్తాయి. ఒకటి దసరా, రెండు సంక్రాంతి. ఈ మధ్య ఒకనాటి ఫోన్ సంభాషణలో వెల్చేరు నారాయణరావు గారు – బొమ్మల కొలువు ఎప్పుడు పెడతారు? ఎలా పెడతారు? ఎందుకు, ఎవరు పెడతారు? పెట్టి ఏం చేసాస్తారు? వంటి ప్రశ్నల పరంపర సంధించారు. ఆయా ప్రశ్నలకు విభుద జనుల వలన విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత విషయాన్ని తేటపరచడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ చిన్న వ్యాసం.
బొమ్మల కొలువు ఎప్పుడు పెడతారు? ఆంధ్రదేశంలో ఈ బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్ళు తప్పకుండా పెడతారు. ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు. మరికొందరు సంక్రాంతికి ఈ కొలువు పెడతారు. బొమ్మలు పెట్టడం, బొమ్మలు నిలపడం, బొమ్మలు ఎత్తడం, అనే వ్యవహారం ప్రాంతీయభేదాన్ని బట్టి ప్రయోగిస్తూ ఉంటారు.
మరి, బొమ్మల కొలువు ఎందుకు పెడతారు?
దసరా బొమ్మల కొలువు
దసరా పండగకు బొమ్మల కొలువు పెట్టడానికి కారణాలు ఇవి:
శరదృతువు ఆరంభం ఆశ్వీయుజ మాసంతో. ఈ మాసంలో మొదటి రోజు పాడ్యమి మొదలు నవమి వరకు గల తొమ్మిది రోజులూ ఆదిశక్తి, ఆదిమకుటుంబిని అయినా పరమేశ్వరిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులు అంటారు. ఋతువు ప్రాధాన్యాన్ని బట్టి శరన్నవరాత్రులు అని కూడా అంటారు. తొమ్మిది రోజుల పాటు ఈ పూజ చేయడానికి గల కారణాన్ని భవిష్యపురాణం, దేవీభాగవతం వివరిస్తున్నాయి. జగన్మాత దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి – ఈ తొమ్మిది నాళ్ళలో తొమ్మిది అవతారాలు ఎత్తింది. ఆ తొమ్మిది అవతారాలూ తొమ్మిది రోజులు పూజ చేసే సంప్రదాయం నెలకొంది.
ఆ అవతారాలు వరుసగా: 1. మహాకాళి, 2. మహిషాసుర మర్దని, 3. చాముండి, 4. మహామాయ, 5. రక్తదంతి, 6. శాకంభరి, 7. దుర్గ, 8. మాతంగిని, 9. భ్రామరీదేవి. దేవీ ఉపాసకులు లలితాపరమేశ్వరిని ప్రధానమూర్తిగా పెట్టి ఈ తొమ్మిది మందినీ ఆమె చుట్టూ నిలిపి పరివారదేవతలుగా కొలిచి నియమనిష్టలతో పూజ నిర్వహిస్తారు. ఈ దేవతలకు వారు ఇచ్చే రూపం నిర్గుణమే. అంటే ప్రత్యేకించి కన్ను, ముక్కు, చెవి వంటి అవయవాలు కాకుండా పసుపు ముద్దలను తమలపాకుల్లో కుంకుమ బొట్టు పెట్టి కొలుస్తారు. కొందరు మట్టితో శివలింగంగా చేసి పసుపుకుంకుమలు పెట్టి, ఆయా దేవతలను ప్రాణప్రతిష్ఠ చేసి అర్చన చేస్తారు. ఇది ఒక విధంగా అమ్మల కొలువు. (ఈ వివరం తెలిపిన వారు కాకినాడ వాస్తవ్యులైన డా. కాశీభట్ల సత్యనారాయణ గారు.)
ఈ నవరాత్రులలో మరో విశేషమైన పూజావిధానం కూడా ఉంది. రెండు సంవత్సరాల వయసు నుండి, పది సంవత్సరాల వయసు గల బాలికలను దేవీస్వరూపిణులుగా భావించి పూజ చేయడం. మొదటి రోజు రెండేళ్ళ బాలికకూ, రెండో రోజు మూడేళ్ళ అమ్మాయికీ, మూడో రోజు నాలుగు ఏళ్ళ బాలికకూ, నాలుగో రోజు ఐదేళ్ళ అమ్మాయికీ, … తొమ్మిదో రోజు పదేళ్ళ అమ్మాయికీ – ఇలా తొమ్మిది రోజులూ ఈ పూజలు చేస్తారు. అమ్మలగన్న అమ్మతో పాటు, ఆమె ప్రతిరూపాలయిన కన్నెపిల్లలను పూజించే ఆచారం ఈ పండుగలో చోటు చేసుకోడం ఔచితీభరితమైన విషయం. కన్నెపిల్లలకు ఇంతటి ప్రాధాన్యం గల పూజావిధానం ఉండబట్టి, బొమ్మల కొలువు పెట్టే అధికారం ఆడపిల్లల సొత్తయింది అనుకోవచ్చు.
బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఎలా ఏర్పడింది?
ఈ విషయాన్ని వివరించే పూర్వగాథ ఒకటి మా నాన్నగారు శ్రీ ఆండ్ర శేషగిరిరావు, 1938 అక్టోబరు ప్రజామిత్ర పత్రికలోని పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారి వ్యాసం నుండి ఉద్ధరించి, తమ పండుగలు – పరమార్థాలులో ప్రస్తావించారు. (తి.తి.దే. ప్రచురణ.) ఆ సమాచారం వివరాలు ఇవి:
భాద్రపద మాసంలో చివరి పదిహేను రోజులకు, అంటే పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి మొదలు అమావాస్య వరకు గల రోజులకు మహాలయ పక్షమని పేరు. దీనికే యుద్ధ పక్షమని, పితృ పక్షమని కూడా పేర్లు ఉన్నాయి. పక్షం అంటే పదిహేను రోజులు. ఈ పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేస్తారు కాబట్టీ పితృ పక్షమన్నారు. ఈ పదిహేను రోజులలో, ఎప్పుడో ఒకప్పుడు దేవతలకూ రాక్షసులకూ పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో క్రమంగా దేవతలు ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారు రాక్షసుల ధాటికి తట్టుకోలేక, యుద్ధభూమి నుండి దూరంగా పారిపోయి అరణ్యాల్లో ఆశ్రమాలు నిర్మించుకుని జీవించసాగారు. తమను ఈ అపజయ పరాభవం నుండి గట్టెక్కించమనీ, ఈ ఆపద నుండి కాపాడమనీ తమ ఇష్టదైవాలను ప్రార్థించారు. కొందరు దుర్గను, కొందరు సరస్వతిని, కొందరు లక్ష్మిని, మరి కొందరు ఆయుధ దేవతలను ఉపాసించారు. అలా కొన్ని సంవత్సరాలు నిష్ఠతో ఆ పూజలు సాగాయి. ఒక విజయదశమి నాడు జగన్మాత ప్రసన్నురాలై పురుషులకు విల్లంబులు, వివిధ రకాల ఆయుధ విశేషాలూ ఇచ్చింది. వారి వారి స్త్రీలకు రంగులతో అలంకరించిన దేవతా విగ్రహాలను ఇచ్చింది. పురుషులందరూ దేవి ప్రసన్నం కావడంతో ఉత్సాహ భరితులై, సాహసోపేతులై రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. వారు యుద్ధానికి వెళ్ళిన ముహూర్తం ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల నడిమి కాలం. దీనికే అభిజిత్ లగ్నమని పేరు.
పురుషులందరూ యుద్ధసన్నద్ధులై వెళ్ళగా, స్త్రీలు తమకిచ్చిన విగ్రహాలను ఒకచోట నిలిపి పూజించారు. ఆ విధంగా స్త్రీలు ఆ దేవతలను పూజించిన పుణ్యశక్తి తోడు కావడంతో దేవతలు జయాన్ని సాధించారు. అందువల్ల ఆ దశమి విజయదశమిగా ప్రసిద్ధి పొందింది.
ఆనాడు ఆ స్త్రీలు తమకు లభించిన దేవతావిగ్రహాలను ఒకచోట కొలువుగా పెట్టి పూజించిన – బొమ్మల కొలువే – దసరాకు బొమ్మలను కొలువుగా పెట్టే ఆచారంగా పరిణమించింది. తరతరాల నుండీ నేటిదాకా కొనసాగుతూనే ఉంది. బొమ్మల కొలువు అంటే బొమ్మలన్నీ ఒకచోట చేర్చి అందంగా అమర్చటం. కొలువు అంటే సభ వంటిది. నాయకుడు తన ప్రధానస్థానంలో కూర్చుని, తన వారికి దర్శనం ఇచ్చి, వారి యోగక్షేమాలు కనుక్కుని, తగు నిర్ణయాలు తీసుకునే ప్రదేశం.
‘కొలువై యున్నాడే కోదండపాణి,’ ‘కొలువైతివా రంగశాయీ,’ వంటి కీర్తనల్లో ఈమాట వింటూ ఉంటాం. ఈ బొమ్మల కొలువులో ప్రధాన దైవతంగా ఆదిశక్తిని నిలిపి, తక్కిన దేవతలను, సమస్త ప్రాణికోటినీ వరుసగా వాటి వాటి స్థానాల్లో పెట్టడమే కొలువు. ఇదీ దసరాకు బొమ్మలు పెట్టే ఆచారం వెనుక ఉన్న కథ.
బొమ్మల కొలువు ఎవరు పెడతారు? ఎలా పెడతారు?
ఆడపిల్లలు ప్రధానంగా ఈ బొమ్మల కొలువు పెట్టడానికి అధికారం కలవాళ్ళు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబాలలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది.
ఆడపిల్ల గల కుటుంబంలో వాళ్ళి ఆమె చేత ఈ బొమ్మలు పెట్టిస్తారు. ఇంట్లో పెద్దలందరూ పూనుకొని బొమ్మలనుఒక క్రమంలో మెట్లు మెట్లుగా అమర్చిపెడతారు. చెక్కతో మెట్ల బల్ల చేయించి పెట్టుకుంటారు కొందరు. బొమ్మల బల్ల అనీ మెట్ల బల్ల అనీ దాన్ని వ్యవహరిస్తారు. ఈ బల్ల మెట్లు ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఉంటాయి. మూడు, ఐదు, ఏడు – ఇలా వారి వారి బొమ్మల సంఖ్యను బట్టి అన్ని మెట్లుగా బల్ల ఉంటుంది. బొమ్మలు పెట్టేముందు బల్లను కేవలం తెల్లటి గుడ్డతోనే కప్పుతారు. ఆ బల్ల మీద మామూలు రోజుల్లో పుస్తకాలు తప్ప ఏమీ పెట్టనివ్వరు కొందరు. మరికొందరు ఆ బల్లను గుడ్డ కప్పి పదిలంగా దాచిపెడతారు.
ముందుగా పాడ్యమి నాడు బొమ్మలు పెట్టే గది కడిగి ముగ్గు పెట్టి, బొమ్మల బల్ల కడిగి పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి – పడమటి ముఖంగా కాని, ఉత్తరముఖంగా కాని బల్లను పెడతారు. బల్లలు లేనివాళ్ళు, పెట్టెలు, పుస్తకాలు, సీనారేకు డబ్బాల వంటి వాటిని మెట్లుగా అమర్చి, తెల్లటి గుడ్డ పరచి బొమ్మల కొలువు పెట్టడానికి ఆసనాలు ఏర్పాటు చేస్తారు. వర్జ్యం గాని దుర్ముహూర్తం గాని లేకుండా చూసి పసుపు వినాయకుణ్ణి చేసి మొదటి మెట్టు మీద చిన్న పళ్ళెంలో బియ్యం పోసి తమలపాకు మీద పెట్టి, దీపం పెట్టి పూజ చేస్తారు. ఆ పూజ అయ్యాక అసలు కొలువు పెట్టడం ఆరంభిస్తారు. ఇంటి ఆచారాన్ని బట్టి – పార్వతీ పరమేశ్వరులను గాని, సీతారాములను గాని, రాధాకృష్ణులను గాని, లక్ష్మీ సరస్వతులను గాని పెట్టిస్తారు, ఆ ఇంటి అమ్మాయి చేత. ఆ అమ్మాయి మొదటి దేవతామూర్తిని పెట్టాక, ఆ యేడు కొన్న కొత్త బొమ్మను తల్లి కూడా పట్టుకుని పెట్టిస్తుంది. ప్రతీ ఏడు ఒక కొత్త బొమ్మ తప్పనిసరిగా కొనడం ఆచారం.
బొమ్మల ఆకారాన్ని బట్టి ఏ మెట్టు మీద ఏ బొమ్మ పెట్టాలి అనేది నిర్ణయించుకుని క్రింద నుండి పైకి పెట్టుకుంటూ వెళతారు. ప్రతి మెట్టు మీద కనీసం ఒక్క బొమ్మ క్రింద నుండి పై మెట్టు దాకా పెట్టాక తక్కిన బొమ్మలు పేర్చుకుంటూ వస్తారు.
దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. పంచాంగం బ్రాహ్మడు, పెద్ద ముత్తైదువ, పచారీ కొట్టు కోమటి, అతని భార్య, తల్లీ పిల్ల, ఆవూ దూడ వంటివి. ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు – ఇలా వారి వారి దగ్గరున్న బొమ్మలన్నీ ఆ కొలువులో పెడతారు. కాలక్రమంలో దేశనాయకుల బొమ్మలు, పురాకట్టడాల బొమ్మలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మల వంటివి కొలువులో చోటు చేసుకున్నాయి.
ఈ క్రమం లోనే, కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశదేశాల బొమ్మలు సేకరించి బొమ్మల కొలువులో పెట్టడం వ్యాప్తి లోకి వచ్చింది. రైల్వే స్టేషన్, విమానాశ్రయం, పార్క్ వంటివి కళాత్మకంగా ఇంట్లో వారందరూ కలిసి కట్టి పెట్టడం పిల్లలలో సృజనాత్మకత పెంపొందించే విధంగా ఉంటున్నాయి. ఆవాలు, మెంతులు వంటివి మట్టి మూకుళ్ళలో గాని, ఇసుక దిబ్బల మీద గాని జల్లి మొక్కలు మొలిపించి వాటితో చిన్న చిన్న పార్కులు కట్టడం వంటివి మారుతున్న కాలంతో పాటు బొమ్మల కొలువులోకి వచ్చి చేరిన వేడుకలు. తాము స్వయంగా చేసిన బొమ్మలు, అల్లిన బొమ్మలు – ఉదా. ఏలకుల తొక్కలతో, ఇంజెక్షన్ సీసాలతో, రకరకాల మూతలతో మందిరాలు, గోపురాలు కట్టడం, వాటిని బొమ్మల కొలువుల్లో అలంకరించడం ఒక కళ.
అందంగా, కళాత్మకంగా అమర్చిన బొమ్మల కొలువు పేరంటానికి బంధు మిత్రులను పిలిచి తొమ్మిది రోజులూ పేరంటం చేస్తారు. పేరంటానికి పిల్లలూ పెద్దలూ కూడా వస్తారు. బొమ్మలకు హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెడతారు. అరటి పళ్ళు గాని, కొబ్బరి ఉండలు గాని, పప్పు బెల్లాలు, అటుకులూ బెల్లం గాని, సాతాళించిన శనగలు గాని, రోజుకో రకం ప్రసాదాలు పెడతారు. పిల్లలందరి చేత పాటలు, పద్యాలు పాడిస్తారు. భజన చేయిస్తారు. ముత్తైదువలకు తాంబూలం ఇస్తారు. ప్రతిరాత్రి బొమ్మలకు పవళింపు సేవ చేస్తారు. పేరంటం అంతా అయిపోయాక హారతి ఇచ్చి ఏదో ఒక బొమ్మను పడుకోబెట్టి నిద్ర పొమ్మని తలుపులు వేసేస్తారు. మరునాడు పొద్దుటే ఆ బొమ్మకు మేలుకొలుపు పాడి నిద్ర లేపే పూజ చేస్తారు.
దసరాకి బొమ్మల కొలువు పెట్టడం తమిళదేశంలో అధికంగా వ్యాప్తిలో ఉంది. ఇళ్ళలోనే కాకుండా నవరాత్రులలో దేవాలయాలలో కూడా బొమ్మల కొలువులు పెడతారు. మధుర మీనాక్షీ దేవాలయంలో ప్రతీ ఏటా నవరాత్రులకు పెట్టే బొమ్మల కొలువులో వివిధ దేవీమూర్తులు కనిపిస్తాయి. ఆలయాలలో కూడా జరిపించడాన్ని బట్టి బొమ్మల కొలువు ఏనాటినుండో వస్తున్న సంప్రదాయంగా భావించవలసి వస్తుంది.
సంక్రాంతి బొమ్మల కొలువు
ఆంధ్రులకు సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పండుగ వచ్చేముందు ధనుర్మాసంలో ముప్ఫై రోజులూ కన్నెపిల్లలు ఉషఃకాలంలో ఆవుపేడతో గొబ్బిళ్ళు చేసి పూజ చేస్తూ సంక్రాంతికి స్వాగతం పలుకుతారు. దసరా రోజుల్లో కన్నెపిల్లలకు పూజ, సంక్రాంతి నాళ్ళలో గొబ్బిళ్ళకు పూజ, కన్నెపిల్లలు కుటుంబ వృద్ధి కోసం, ఉత్తమ వరుని కోసం చేస్తారు. గొబ్బిళ్ళ పాట గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలియవస్తుంది.
సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణియ్యవే
తామర పువ్వంటీ తమ్ముణ్ణియ్యవే
చేమంతి పువ్వంటీ చెల్లెల్నియ్యవే
మొగలీ పువ్వంటి మొగుణ్ణియ్యవే
అని బాలికలు గొబ్బెమ్మను ప్రార్థిస్తుంటారు. తనకు తమ్ముడు, చెల్లెలు కలగాలని, మంచి భర్త రావాలని, ‘సుబ్బడు,’ అంటే పిల్లవాడు కలగాలనీ కోరుకుంటున్నారు. ఇక పెద్దలు సంకురమయ్యకు స్వాగతం పలికి పూజించడం సంక్రాంతి పండుగలో ప్రధాన అంశం.
ఈ సంకురమయ్య ఎవరు?
ప్రతి సంక్రాంతికీ కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా సంక్రమణ పుణ్యకాలంలో భూలోకానికి దిగివచ్చి భూలోక వాసులనందరినీ పరిపాలిస్తాడు. ప్రతి సంవత్సరం, అతని వాహనం, అతని పరివారం మారిపోతూ ఉంటాయి. ఈ వివరాలన్నీ పంచాంగం చెప్తుంది. ఆ సంక్రాంతి పురుషుణ్ణే సంకురమయ్య అంటారు. అతడే ఈ చరాచర జగత్తునూ నడిపిస్తూ ఉంటాడు. ఆయనను స్వాగతిస్తూ, అతని గౌరవార్థం సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. మనమంతా కాలపురుషుని దృష్టిలో బొమ్మలమే. ఈ బొమ్మలను రక్షించే భారం నీదే సుమా, అని సంకురమయ్యకు విన్నపం చేసేందుకే ఈ బొమ్మల కొలువు అని చెప్పుకుంటారు.
ఆ విధంగా సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువులో ప్రధాన దైవం సంకురమయ్య. పసుపు వినాయకుడిని పూజించాక, పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి సంకురమయ్యగా సంభావించి, ఆహ్వానం పలికి, పూజిస్తారు. ఆ తరువాత తక్కిన బొమ్మలు పెడతారు. ముఖ్యంగా సంతానభాగ్యం కోసం, పాడిపంటల కోసం, సుఖమయ కుటుంబజీవనం కోసం ఈ బొమ్మల కొలువు పెడతారు. వినాయకుడితో, కుమారస్వామితో ఉన్న శివపార్త్వతుల బొమ్మ తప్పకుండా పెడతారు. పిల్లవాడిని ఎత్తుకున్న తల్లిబొమ్మ కూడా తప్పకుండా పెడతారు. మిగతా వివరాలలో దసరా బొమ్మల కొలువు పద్ధతినే పాటిస్తారు. భోగినాడు పెట్టి, కనుమ రోజున కొలువు ఎత్తేస్తారు. అలా మూడు రోజులే ఉంటుంది ఈ కొలువు. సంక్రాంతి రోజు ప్రసాదాలతో పాటు పసుపు కుంకుమలు, తాంబూలం, ముత్తైదువలకు తప్పనిసరిగా ఇస్తారు. ధనుర్మాసం నడిపించిన గోదాదేవి బొమ్మ కూడా తాంబూలంలో ఇస్తారు. (ఈ వివరాలు అందించినవారు డా. మల్లాప్రగడ శ్రీవల్లి, పొన్నూరు.)
సంకురమయ్య బొమ్మలు కుమ్మరి వారు ప్రత్యేకంగా చేసి మోతుబరి రైతులకు బహుమానంగా ఇచ్చేవారనీ, వీధుల్లోకి తెచ్చి మిగతా బొమ్మలతో పాటుగా అమ్మేవారనీ, ప్రస్తుతం ఆ బొమ్మల తయారీ కానీ, అమ్మకం కానీ, జాడ కానీ లేదని ఖండవల్లి వాస్తవ్యులైన డా. భూపతిరాజు బంగారు రాజు తెలియజేశారు. ఈ సంకురమయ్య ఎలా ఉంటాడు అని పరిశీలిస్తే, రేలంగి వారి పంచాంగంలో ఒక శ్లోకం కనిపించింది.
అష్టకర్ణో విశాలాక్షో లంబభ్రూ దీర్ఘనాసికః
అష్టబాహుశ్చతుర్వక్త్ర సంక్రాంతి పురుషస్మృతః
సంక్రాంతి పురుషునకు నాలుగు ముఖాలు, ఎనిమిది భుజాలు, ఎనిమిది చెవులు, విశాలమైన కళ్ళు, వ్రేలాడే కనుబొమ్మలు, పొడుగాటి ముక్కు ఉంటాయి.
ఈ బొమ్మల కొలువు పెట్టడం అనేది కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా సంస్కృతీ సంపన్నమై సంప్రదాయ పరిరక్షణతో పాటుగా కళాత్మక దృష్టినీ పెంపొదిస్తుంది. యాంత్రిక జీవనంలో తలమునకలవుతున్న ఈ కాలంలో కూడా, నవరాత్రులు చేయడం వీలు కాని వారు కనీసం దుర్గాష్టమి, మహార్ణవమి, విజయదశమి – ఈ మూడు రోజులైనా తీరిక చేసుకుని ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తుండడం, ఈ ఆచారపు విశిష్టతను తెలియజేస్తోంది. అయితే రాను రానూ ఈ బొమ్మల కొలువులకు ఉన్న ప్రత్యేక ఆకర్షణ తగ్గుముఖం పడుతూ వస్తోంది.
బొమ్మలన్నీ పెట్టెల్లో పాత పట్టుగుడ్డలు (బొమ్మ పొత్తికలు) చుట్టి దాచడం ఒక పని, ఒక కళ. బొమ్మలకు ప్రత్యేకం చెక్కపెట్టెలు ఉండి, బొమ్మల పెట్టెలు ఆడపిల్లలకు బొమ్మలతో సగా సారె పెట్టే ఆచారం ఉండేది. బొమ్మల కొలువు పెట్టేందుకు బొమ్మల పెట్టె తెరవడం ఒక సంబరం. పెట్టెకు పెద్దవాళ్ళు, మగవాళ్ళు – తండ్రి, పినతండ్రి – పూజ చేసి , హారతి ఇచ్చి, ధూపం వేసి, అమ్మల గన్న యమ్మ పద్యం పిల్లలతో పాడించి జయజయధ్వానాలతో పెట్టె మూత తీయడం, పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టడం అదో అపురూపమైన వేడుక. ఇలాంటి వేడుకలెన్నో ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి.
రండు మాయింటి కీరు పేరంటమునకు
బొమ్మలెత్తును మా పిల్ల యమ్మలార!
అంటూ పింగళి – కాటూరి కవులు తొలకరి అనే ఖండకావ్యంలో సంక్రాంతి అనే శీర్షికన వ్రాసిన ఈమాటలు తరతరాలకూ వినిపిస్తాయనే ఆశిద్దాం.
(కుమ్మరులు చేసిన సంక్రాంతి పురుషుని బొమ్మ ఎలా ఉండేదో, ఎవరైనా తెలిసినవారు తెలియజేస్తే సంతోషం.)