తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు

తెలుగులో అచ్చుపుస్తకాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇన్ని వస్తున్నా కూడా, ఇప్పటికీ ఒక ఇంగ్లీషు పుస్తకం దగ్గర పెడితే, దానికీ తెలుగు పుస్తకానికీ ఆకారంలో, నిర్మాణంలో, అచ్చు వేసే శ్రద్ధలో, తప్పులు లేకపోవడంలో తేడాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి.

అచ్చు అలవాటైన నూటయాభై ఏళ్ళ తర్వాత కూడా తెలుగులో చెప్పుకోదగిన ప్రచురణ సంస్థలు లేవు. ఈ సంస్థలకి ప్రచురణాపరంగా ఒక వ్యవస్థ లేదు. ఫలానా వారు ప్రచురించిన పుస్తకం అనగానే ఆ పుస్తకానికి ఒక గౌరవం కలగాలి అన్న పట్టుదల లేదు. సరదా మాటల్లో చెప్పాలంటే పుస్తకాలు అచ్చు వేసే వాళ్ళు ఉన్నారు కాని, ప్రచురించే వాళ్ళు లేరు. ప్రచురణ అనే మాటకి అర్థం ఏమిటి, దాని వెనకాల ఉన్న బాధ్యత ఏమిటి అన్న విషయం గురించి మనం ఎప్పుడూ వివరంగా ఆలోచించలేదు. మనకి పుస్తకం అచ్చు అవ్వడమే గొప్ప. పూర్వపు మాటల్లో చెప్పాలంటే మన రచనకి ‘ముద్రణ భాగ్యం’ కలగడమే గొప్ప.

పుస్తక నిర్మాణం అంటే పుస్తకంలో ఉన్న విషయానికి సంబంధించిన చర్చ కాదు, రచయిత ఎవరు, అందులో ఉన్న విషయం చెప్పుకోదగ్గదా కాదా, అందులో లోపాలు, గుణాలు ఏమిటి అన్న చర్చ కాదు. పుస్తకం ఒక వస్తువు. దాన్ని నిర్మించడంలో ఒక పనివాడితనం కావాలి. ఆ పనివాడితనం మన పుస్తకాలకి ఉందా? లేకపోతే ఎందుకు లేదు?

పుస్తక నిర్మాణం అంటే బైండింగు, కవరుపేజీ, లోపల టైటిల్ పేజి, విషయసూచిక, పేజీల కూర్పు, బొమ్మల కూర్పు, టైపోగ్రఫీ, అధ్యాయాలు, పేజీలు, పేరాల విభజన, చివర్లో ఉండవలసిన రిఫరెన్సులు, ఇండెక్సులు నిర్మించే తీరూ మొదలైనవి. వీటిని నిర్మించే తీరులో ఉండవలసిన శ్రద్ధ, ఎవరో ఒకరు, లేదా కొందరు పుస్తక నిర్మాణాన్ని పర్యవేక్షించ వలసిన అవసరం — ఇవీ మేం చర్చించదలచుకున్న విషయాలు. ఈ చర్చకీ, పుస్తకంలో విషయానికీ కొంత సంబంధం ఉంది కానీ, పుస్తకంలో విషయాల మంచి చెడ్డలు ఈ వ్యాసంలో చర్చకి రావు.

ఈ పరిస్ఠితిని గమనిస్తూ, తెలుగు ముద్రణ చరిత్రని పుస్తక నిర్మాణ దృష్ట్యా పరిశీలించడం ఈ వ్యాసంలో సంకల్పించిన పని.


తెలుగు ముద్రణ చరిత్రని పుస్తకనిర్మాణ దృష్ట్యా మూడు భాగాలుగా చూడవచ్చు.

  1. పురాణాలు, కావ్యాలు, ఇతర మత గ్రంథాలు.
  2. గుజిలీ ప్రతులు.
  3. ఆధునిక కవిత్వం.

1. పురాణాలు, కావ్యాలు, మత గ్రంథాలు


1అ. పంక్తులపోగు పద్యం
(భాగవతం, 1857)

పూర్వం పండితులు తాటాకుల పుస్తకాన్ని చదవడానికి అలవాటు పడబట్టి, ఆ పద్ధతిలోనే పుస్తకాలు అచ్చు వేసేవాళ్ళు. దీనిలో, ఒక పంక్తి ఎక్కడా ఆగకుండా తిన్నగా పోయి, అది కాగితం చివరకి వచ్చాక, దాని వెనక మరలా రెండో పంక్తి ఏర్పడి — ఇలా పుస్తకం అంతా పంక్తుల మయంగా కనిపిస్తుంది.


1ఆ. పంక్తులపోగు వచనం
(చారుదర్వీషు, 1876)

ఛందస్సు పేరు ఒక అక్షరంతో సూచించడం ఉన్నప్పటీకీ (కం, చం, శ,) ఇవి పంక్తిలో భాగంగానే ఉంటాయి. పుస్తకం చదివే వారు, ఆ పుస్తకాన్ని ఎలా చదవాలో ముందే నేర్చుకుని ఉంటారు కాబట్టీ, వారికి చదివే పద్దతి గురించి ఈ అచ్చుపుస్తకం ఏ సౌకర్యాన్నీ కల్పించే అవసరం ఉండేది కాదు. పుస్తకం ఎలా చదవాలో ముందే తెలియని పాఠకుడికి ఈ పుస్తకం చదవడం సాధ్యం కాదు. తెలుగులో అచ్చు ప్రారంభం అయిన తొలినాళ్ళలో కావ్యాలూ, పురాణాలూ అన్నీ ఇలాగే అచ్చయ్యేవి.


2. మలినాటి కాలం
(భాగవతం, 1961)

తర్వాతి కాలంలో, అంటే ప్రబంధాలు అచ్చు వేసే కాలంలో పాఠకుడికి కొంత సౌకర్యం కల్పించడం అలవాటయ్యింది. పద్యం తర్వాతి పద్యం మధ్యలో కాస్త జాగా, నాలుగు పంక్తుల పద్యం వేరేగా కనిపించడం, ఆ పద్యం పేరు (కం, చం, శ,) పద్య ఆరంభంలో పద్యానికి దూరంగా అచ్చు వెయ్యడం మొదలైన తర్వాత పాఠకుడికి చదువుకోడానికి కాస్త సౌకర్యం కలిగింది.


3. వాక్యముఖపత్రం
(భాగవతం, 1857)

ఈ పద్దతికి తోడు, పుస్తక ముఖపత్రం ప్రచురించే పద్దతి పాతరోజుల్లో విశేషంగా ఉండేది. ముఖపత్రం ఒక పెద్ద వాక్యంగా ఉండేది. అందులో పుస్తకానికి పోషకులైన వారి బిరుదులు, రచయితల గురువులు, వారి పేర్లు, రచయిత బిరుదులు, ఆ పుస్తకాన్ని పరిష్కరించిన వారి పేరు, వారి బిరుదులు అన్నీ కలిపి ఏకవాక్యంగా ఆ ముఖపత్రం ఉండేది. కొంచెం జాగ్రత్తగా చూస్తే, పాత పుస్తకాల ఆశ్వాసాంత గద్యలకి ఇది ముఖపత్ర రూపం. కొన్ని ముఖపత్రాలు పద్యరూపంలో కూడా వుండేవి.

తర్వాత తర్వాత ముఖపత్రం కొంచెం స్పష్టంగా, పుస్తకం పేరు పెద్ద అక్షరాలలో పైన, దాని తర్వాత రచయిత పేరు, అడుగున ప్రచురణకర్త పేరు, ఇలా రావడం మొదలైంది.


4అ. వాక్యరూపముఖపత్రం
(1876)

ఆ కాలంలో ముద్రణశాలలు పండితులే పెట్టుకొనేవారు. జాగ్రత్తగా అచ్చుముద్రలు వారే చూసేవారు. ఆ రోజుల్లో పుస్తక నిర్మాణ శైలి ఎలా ఉన్నా, పుస్తకాలలో అచ్చుతప్పులు ఉండేవి కావు. అరసున్నలు, బండిర(ఱ)లు, జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉండబట్టి పండితులు ఆ రకమైన శ్రద్ధ చూపించేవారు. ఉదాహరణకి, ఆదిసరస్వతి ముద్రణాలయము, దాని తర్వాత వచ్చిన వావిళ్ళవారి సంస్థ, దాదాపు అదేకాలంలో వేదం వెంకటరాయశాస్త్రిగారు అచ్చు వేయించిన పుస్తకాలు ఆ కోవలోనివి.


4ఆ. పద్యరూపముఖపత్రం
(1849)

ఆ రోజుల్లో అచ్చయ్యే పుస్తకాలలో పేజీ అంతా అక్షరాలతో నిండిపోయి వుండేది. పేజీ వెడల్పు తగినంత ఉండని కారణం చేత, ఉత్పలమాల, చంపకమాల, ముఖ్యంగా సీసం వంటి పద్యాల మొత్తం చరణం అంతా ఒక పంక్తిలో పట్టేది కాకపోవడం చేత, ముద్రాపకులు చివరి రెండు, మూడు అక్షరాలు ఆ పంక్తికి పైన కొసరు లాగ అచ్చు వేసేవారు. దీంతోపాటు, ఆ పుస్తకం అచ్చు వేసేవారి మతమర్యాదలు, పుస్తకం పట్ల భక్తి పుస్తకాలలో కనిపించేవి. మన పాత పుస్తకాల పేర్లేవీ శ్రీ లేకుండా ఉండవు (శ్రీమదాంధ్ర మహాభారతము, శ్రీమద్రామాయణము.) పుస్తకం ఆరంభంలో శారాదాంబైయనమః, శివాయనమః, శ్రీకృష్ణపరమగురుభ్యోనమః, శ్రీహయగ్రీవాయనమః (వావిళ్ళ), శ్రీమత్పరదేవతాయైనమః (చెళ్ళపిళ్ళ) వంటి మాటలు ఉండేవి.


5. శ్రీముఖాలు మర్యాదలు
(యాత్రాచరిత్ర, 1915)

పుస్తకం వెల, ప్రచురించబడిన సంవత్సరం, మొదలైన వివరాలు ఎక్కడ ఉండాలనే నియమం ఉండేది కాదు. ఎవరికి తోచినట్టు వారు వేసేవారు. పుస్తకం పేరు వెన్ను మీద వేసే అలవాటు కూడా ఒక క్రమంలో ఉండేది కాదు. పుస్తకం కొంత సన్నపాటిదైతే వెన్ను మీద ఏమీ ఉండేది కాదు. భారీ పుస్తకాలకు వెన్ను మీద పేర్లు నిలువు గాను, అడ్డు గాను, ఇంకా రకరకాల పద్ధతులలో ఉండేవి. ఫుస్తకం మీద రచయిత పేరు, అనువాదకుల పేర్లు ఎలా వెయ్యాలనే విషయంలో కూడా ఒక పద్ధతంటూ ఏమీ ఉండేది కాదు. ఆరోజుల్లో వావిళ్ళవారు కళాపూర్ణోదయం వేసిన పద్ధతి చూస్తే ఈ సంగతి వివరంగా బోధపడుతుంది. ఆ పుస్తకం ముఖపత్రం మీద కట్టమంచి రామలింగారెడ్డి పేరు ప్రముఖంగా వుంటుంది. ఆయన కళాపూర్ణోదయానికి తన సొంత తరహాలో విమర్శ వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని వావిళ్ళ వారు కళాపూర్ణోదయానికి ముందు మాటగా వాడుకున్నారు. కాని ఆ పుస్తకానికి ప్రతిపదార్థాలు రాసిన పండితుడి పేరు ముఖపత్రం మీద ఎక్కడా కనిపించదు. ఓపిగ్గా వెతుక్కుంటే ఆయన చదలవాడ జయరామశాస్త్రి అని పుస్తకం చివరి పేజీలో అధస్సూచికగా కనిపిస్తుంది. వావిళ్ళవారే వేసిన భర్తృహరి సుభాషితానికి సంస్కృత భాష్యం ఎవరు రాశారో, తెలుగు వ్యాఖ్యానం ఎవరు రాశారో ముఖపత్రం మీద కనిపించదు. ఉపోద్ఘాతంలో సంస్కృతం భాష్యం ఎవరిదో తెలుస్తుంది కానీ, తెలుగు వ్యాఖ్యానం ఎవరిదో తెలియదు. ఇవన్నీ మనం వెతికి చూసుకోవాలి. పండితుల పేర్లు చెప్పకపోవడం వావిళ్ళవారికి బహుశా సి. పి. బ్రౌను దగ్గర నుంచి వచ్చిన అలవాటు కావొచ్చు.

ఇది, పండితులు అచ్చు వేయించిన పుస్తకాల కథ.

2. గుజిలీ పుస్తకాలు


6అ. గుజిలీ పుస్తకం నమూనా
ఎన్. వి. గోపాల్ అండ్ కో

సరిగ్గా ఇదే సమయంలో, సమాంతరంగా ఇంకో ప్రచురణ రంగం నడిచింది. పెద్ద బొబ్బిలిరాజు కథ, బాలనాగమ్మ కథ, కామమ్మ కథ, సహస్ర శిరఛ్ఛేద అపూర్వ చింతామణి లాంటి పుస్తకాలు ఈ కోవలోవి. రోడ్ల పైన, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారాల మీద, చేత్తో పుస్తకాల కట్టలు పట్టుకుని, వాటి పేర్లు అరుచుకుంటూ వీటిని అమ్మేవారు. వీటికీ చూడగానే గుర్తు పట్టేలా ఒక ప్రత్యేకమైన ఆకారం ఉండేది. చవకరకం కాగితం మీద, పేజీ అంతా నింపేసిన అక్షరాలతో, ఇవి తయారై వచ్చేవి. వీటిమీద ‘పండితులచేఁ బరిష్కృతము’ అనే మాట ఉండేది. ఇవి అచ్చు వేసిన సంవత్సరం కానీ, ఎన్ని కాపీలు వేశారు అనే వివరం కానీ ఈ పుస్తకాలపై ఉండేవి కావు. కానీ, ఈ పుస్తకాలు విపరీతంగా అమ్ముడు పోయేవని మాత్రం మనకి తెలుసు. కొండపల్లి వీరవెంకయ్య, కాళహస్తి తమ్మారావు, సిద్ధేశ్వర, ఎన్. వి. గోపాల్ అండ్ కో. వంటి ప్రచురణ సంస్థలు ఈ తరహా పుస్తకాలని వేసేవి. ఈ పుస్తకాల అట్టల లోపల పేజీ లోనూ, చివరపేజీ లోనూ రకరకాల మందుల ప్రకటనలు — యవ్వనాన్ని తిరిగి పొందడం యెలాగ, సౌందర్యాన్ని నిలబెట్టుకోవడం యెలాగ, మంత్రాలు తంత్రాలు వాడటం యెలాగ, వగైరా — ఉండేవి.


6ఆ. గుజిలీ పుస్తకంలో ప్రకటనలు
ఎన్. వి. గోపాల్ అండ్ కో

ఈ రెండు రంగాలు చాలాకాలం పాటు ఇలా ఒక పద్ధతిలో కొనసాగాయి. ఇదే సమయంలో, పంచాంగాలు అచ్చు వేసేవారి పద్ధతి మరొకలా ఉండేది. ఇప్పటికీ ఈ పద్ధతిలో పంచాగాలు అచ్చు వేస్తున్నారు. ఈ పుస్తకాల ఆకారాన్ని బట్టీ, నిర్మాణాన్ని బట్టీ ఇది పండితుల వేయించిన ప్రామాణిక గ్రంథమా, లేక బజారులోనో రైల్వే బుక్ షాపులోనో దొరికే పుస్తకమా లేక పంచాంగమా అని చెప్పడానికి శ్రమ పడక్కరలేదు. వీళ్ళందరికీ అచ్చు ఒక సౌకర్యమే గానీ, దాని నాణ్యత మీద ఒక దృష్టి లేదు. ఈ పద్ధతి ఈనాటికీ కొనసాగుతోంది.

3. ఆధునిక కవిత్వం

అచ్చు వేసిన పుస్తకం అందంగా ఉండాలి అనే ఊహ భావకవిత్వం తోనే మొదలైంది. భావకవులకు పద్యానికి ‘రూపం’ ఉండాలని తెలుసు. వైతాళికులు ప్రచురణ తెలుగు కవిత్వం అచ్చు వెయ్యడంలో వచ్చిన పెద్ద మార్పు. పద్యం ఎక్కడ విరిచి ఎలా చదవాలో దానికి తగ్గట్టుగా పంక్తులు విడగొట్టి వేసిన మొదటి పుస్తకం వైతాళికులు. ఈ పుస్తకం నుంచే తెలుగులో ఆధునిక పద్యానికి ఒక ‘రూపం’ వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు దొరకడం లేదు కానీ వైతాళికులు మొదటి ముద్రణ ఎవరైనా చూస్తే ఈ సంగతి బోధపడుతుంది. ఇంగ్లండు నుంచి తెప్పించిన ఖరీదైన ఫెదర్ వెయిట్ పేపరు మీద ఒక పద్ధతిలో ప్రతి పద్యం చక్కగా కూర్చి, పరిష్కరించి, అచ్చు వేసిన పుస్తకం ఇది.


7. విశ్వనాథ – బాపిరాజు
కిన్నెరసాని పాటలు.

తల్లావఝ్ఝల శివశంకరస్వామిగారు మనకి పుస్తక నిర్మాణం మీద శ్రద్ధపెట్టిన మొదటి వ్యక్తి. ఆ రోజుల్లో ఆయన స్వయంగా ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్సులో కూర్చుని తోటి కవుల పుస్తకాలు అచ్చు వేయించేవారు. భావకవిత్వానికి, అచ్చుయంత్రానికి మధ్య ఒక ప్రేమకలాపం ఉందని చెప్పవచ్చు. పద్యాన్ని పాత పుస్తకాలలో లాగా బండగా కాకుండా అర్థం కోసం పాదాన్ని ఎక్కడ విరుస్తామో అక్కడ విరిచి, దాన్ని ఐదు, ఆరు, ఏడు పాదాలుగా కూడా అచ్చు వేయించడం భావకవులే మొదలు పెట్టారు. తెలుగులో ఆధునిక కావ్యం ఎలా అచ్చు కావాలో వాళ్ళే నిర్ణయించారు. ఇప్పుడు దొరుకుతున్న వైతాళికులు బోలెడు తప్పులతో, ఒక పిచ్చి ఆకారంలో విశాలాంధ్రవారి పుణ్యమా అని బయటకొస్తున్న మాట నిజమే కాని, భావకవుల పుస్తకాల మొదటి ముద్రణలు ఇప్పటికైనా దొరికితే, అవి ఎంత చూడ ముచ్చటగా ఉండేవో మనకి తెలిసివస్తుంది. (ఉదాహరణకి, విశ్వనాథ సత్యనారాయణగారి కిన్నెరసాని పాటల పుస్తకం అప్పట్లో అడవి బాపిరాజు గారి బొమ్మలతో అచ్చయ్యింది.)


8అ. మహాప్రస్థానం తొలి ముద్రణ
(నళినీమోహన్ ప్రచురణ)

భావకవిత్వం వెనకపట్టిన తర్వాత, ఆ వాసనలు ఇంకా పోని ఆధునిక కవులు కూడా అచ్చుని గురించి శ్రద్ధ పెట్టేవాళ్ళు; కనీసం అలా మాట్లాడేవాళ్ళు. శ్రీరంగం శ్రీనివాసరావు తన మహాప్రస్థానం పద్యాలు నిలువుటద్దం సైజులో అచ్చు వేస్తానని అనేవాడు. చాలాకాలం అచ్చు కాకుండా నోటిమాటల్లోనే ప్రచారం లోకి వచ్చిన మహాప్రస్థానం మొదటిసారి అచ్చు వేసిన పద్ధతి చూస్తే దానిపై భావకవిత్వపు రోజుల్లోని పుస్తకనిర్మాణపు ప్రభావం స్పష్టంగానే తెలుస్తుంది.


8ఆ. మహాప్రస్థానం లండన్ ప్రతి
(గూ. కృష్ణమూర్తి ప్రచురణ)

ఈ సందర్భంలో మహాప్రస్థానం పుస్తకాన్ని చాలా ఖరీదైన ప్రచురణగా, శ్రీశ్రీ చేతిరాతతో పద్యాలు రాయించి, వాటికి బాపు చేత బొమ్మలు వేయించి ప్రచురించిన గూటాల కృష్ణమూర్తిగారిని తలుచుకోవాలి. ఆ పుస్తకంతో పాటుగా శ్రీశ్రీ స్వయంగా పాడిన మహాప్రస్థాన గీతాల కేసెట్ టేప్ కూడా జతచేశారు. అంతే కాదు, ఆయన ఆ పుస్తకం, ఆ కేసెట్ టేప్ ఉంచడం కోసం ఒక పెట్టె కూడా తయారు చేయించారు. ప్రతీ ప్రతి అలా ఒక అందమైన పెట్టెలో ఒక బహుమతి లాగా వచ్చింది. ఈ వరుసలోదే నార్ల వెంకటేశ్వరావు వేయించుకున్న కొత్తగడ్డ నాటకాల సంపుటి.

కానీ, ఇవేవీ పుస్తక నిర్మాణం పట్ల మన ప్రచురణ రంగంలో ఉన్న సంప్రదాయాన్ని సూచించవు. ఇవి ఎడారిలో ఒయాసిస్సుల లాగా అక్కడక్కడ కనిపించే అందమైన పుస్తకాలు మాత్రమే. ఇవి మన ప్రచురణ రంగంలో, పుస్తకనిర్మాణ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన అంశాలు.

తెలుగులో ప్రచురణ ప్రక్రియ చరిత్ర


9. అచ్చు బిళ్ళలు

ఇక తెలుగులో డిజిటల్, ఆఫ్‌సెట్ ప్రింటింగ్ రావడానికి ముందు పుస్తకాల ముద్రణ ఎలా జరిగేదో చూద్దాం. చాలా కాలం పాటు తెలుగులో అచ్చు అక్షరాలు చేత్తో కూర్చడం మూలంగానే సాగింది. సీసంతో చేసిన తెలుగు అక్షరాల అచ్చు బిళ్ళలు చాలా గళ్ళల్లో ఒక పెద్ద బల్లమీద సర్ది వుంచుకొని, దాని దగ్గర నిలబడి అక్షరాలు కూర్చడానికి అవసరమైన ఒక మఱబందు (Composing stick) లాంటిది చేత్తో పట్టుకుని రాసిన కాగితం వైపు చూస్తూ ఒక నిర్దిష్టమైన వెడల్పుగల చట్రంలో అక్షరాలు కూర్చేవారు.


10. గ్యాలీ చట్రం

అలా కూర్పరి (కంపోజిటర్ అని పిలుస్తారు) బిగించి పెట్టిన చట్రం మీద నల్లని సిరా పూసి దానిపైన ఆ చట్రపు నిడివి ఉన్న పొడుగాటి కాగితం పెట్టి ఒక పొత్రంతో ఆ కాగితం మీద రుద్దేవారు. ఈ అక్షరాలు అలా ఆ కాగితం మీద అచ్చు పడేవి. దీన్ని గ్యాలీ ప్రూఫ్ (Galley proof) అనే వారు. సాధారణంగా పదహారు అరఠావుల పొడుగు వుండే ఈ గ్యాలీని మొదటి ప్రూఫుగా చూసేవారు. అక్షరాలు సరిగా వున్నాయా, ప్రూఫులు (అంటే అచ్చు ముద్రలు) సరిగా పడ్డాయా ఇలాంటి స్థూలమైన వివరాలకోసం.


11. గ్యాలీ ప్రెస్సు

ఆ దిద్దుబాట్ల తరవాత ఈ నమూనాని అచ్చు యంత్రం మీద బిగించి తీసిన మొదటి ప్రింటుని పేజి ప్రూఫ్ (Page proof) అనేవారు. ఈ పేజి ప్రూఫులో జాగ్రత్తగా అచ్చుతప్పులు లేకుండా దిద్ది, ఆ దిద్దుబాట్లు కూడా చేసిన తరవాత, ఆ ఫారం మీద ప్రింట్ అని సంతకం పెట్టి ముద్రణశాలకి (printing press) ఇచ్చేవారు. ఆ తరవాత చట్రంలో కూర్చిన అక్షరాల సీసపు అచ్చులన్నీ మళ్ళీ వేటికవి విడిగా వాటి వాటి గళ్ళలో సర్దుకునేవారు, తరువాతి ప్రూఫు తయారీకోసం.


12. కాగితపు సైజులు
(క్వాత్రో = 275 X 215 మిమీ)

ఈ పద్ధతిలో పుస్తకం అంతటినీ ఒక్కసారిగా పరిష్కరించి తప్పులు దిద్దుకోవడానికి అవకాశం వుండేది కాదు. పొరపాటున ఒక మాట పదహారు పేజీల ఫారంలో తప్పుగా అచ్చయితే, ఆ సంగతి తరువాత ఎప్పుడో గమనిస్తే ఆ తప్పు దిద్దుకోడానికి ఇక వీలుండేది కాదు. అయినప్పటికీ, ఆ రోజుల్లో అలా అచ్చయిన పుస్తకాల్లో అచ్చుతప్పులు తక్కువుండేవి. ఉన్న ఆ కొద్దినీ ఒక తప్పొప్పుల పట్టికగా ముద్రించి పుస్తకం చివర్లోనో, లోపలి అట్ట మీదో అతికించడం చేసేవారు. ఆ రోజుల్లో తెలుగు అక్షరాలకి రెండే ఫాంట్లు వుండేవి. ఒకటి జి.పి. (GP – Great Primer) రెండోది ఇ.బి. (EB – English Body). తెలుగులో కొన్నివేల పుస్తకాలు ఈ రెండు ఫాంట్లతోనే అచ్చు అయ్యాయి.

పంతొమ్మిది వందల తొంభయి ప్రాంతాల వరకు తెలుగు పుస్తకాలు ఈ విధంగానే అచ్చయ్యాయి. వీటిని కలిపి కుట్టటానికి, జిల్లుకట్టడానికి (to bind) రెండు మార్గాలుండేవి. ఒకటి ఫారములన్నీ వరసగా మడత పెట్టి, వాటిని దారంతో కుట్టి, ఆ కుట్టిన పుస్తకాన్ని క్యాలికోతో అట్ట వేయడం. ఇది కాకుండా దళసరిగా వుండే అట్ట వేసి అతికించడం రెండవ పద్ధతి. మొదటిది బౌండ్ ఎడిషన్, రెండవది పేపర్ ఎడిషన్. ఏ ఫారానికి ఆ ఫారం దారంతో కుట్టి ప్రచురించే విధానానికి సెక్షన్ సోయింగ్ (Section sewing) అని పేరు.


13. సెక్షన్ సోయింగ్ (స్మైత్ సోన్)

ఇది ఖరీదయిన పని.అలా కాకుండా అన్ని ఫారములు ఒకచోట పెట్టి అడ్డంగా కుట్టేయడం ఇంకొక పని. ఇలా అడ్డంగా కుట్టడంలో ఇబ్బంది ఏమిటంటే పేజీలు స్పష్టంగా విడవు. మీకు ఇప్పటికీ పాత పుస్తకాల్లో ఇలా అడ్డంగా కుట్టినవి కనిపిస్తాయి. కుట్టు అంతా అయిన తరువాత బైండింగు అవక ముందు పుస్తకం మూడు పక్కలా మిషన్‌లో పెట్టి నునుపుగా కోసేవాళ్ళు. ఈ కోత ఒక చూపువాసి అటూ ఇటూ అయితే పుస్తకం ఆకారం, పుస్తకంలో వారలు (margins) దెబ్బతినే ప్రమాదం వుండేది. ఇప్పటి దృష్ట్యా చూస్తే ఈ పద్ధతి చాలా పురాతన పద్ధతిలా కనిపిస్తుంది. (ఆండ్ర శేషగిరిరావు ఇంట్లోనే అచ్చుబిళ్ళలు పెట్టుకుని అక్షరాలు సొంతంగా కూర్చుకునేవారు. పేజీలు బిగించిన తరువాత వాటిని ప్రెస్‌కి తీసుకెళ్ళి అచ్చు వేయించుకునేవారు.)

తొంభయ్యవ దశకం నుండీ కంప్యూటర్ల పుణ్యమా అని మనకు డిజిటల్ కంపోజింగ్ అందుబాటు లోకి వచ్చింది. దీనినే డిటిపి – డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్ (Desktop publishing) అని కూడా అంటారు. పెద్ద ముద్రణాలయం, బోలెడన్ని అక్షరాల పోతలు, వాటిని చేత్తో కూర్చడం — ఇలాంటివేవీ అవసరం లేకుండా పోయాయి. ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని పుస్తకం అంతా టైపు చేసుకున్న తరవాత ఆఫ్‌సెట్ పద్ధతిలో (Offset printing) అచ్చు వేయడం సాధ్యమయ్యింది. ఇది ఆధునిక ప్రచురణ ప్రపంచం. ఈ ప్రపంచంలో వున్న అనేక సౌకర్యాలలో ఒకటి పుస్తకం అంతటినీ ఒక్కసారిగా కంపోజ్ చేసి అందులో వున్న తప్పులన్నీ ఒక్కసారిగానే దిద్ది సమగ్రమయిన పుస్తకం అచ్చు వేయడానికి వీలు వుండటం. ఈ యాంత్రిక సౌకర్యాలన్నీ మనకి ఇప్పుడు తెలుగు పుస్తకాలు అచ్చు వేయడానికి అందుబాటులో వున్నాయి. దానితో పాటు బొమ్మలను కొన్ని లక్షల రంగుల్లో అతి సూక్ష్మమయిన ఛాయా భేదాలతో అచ్చు వేయగల సామర్ధ్యం కూడా మనకు వుంది. హైదరాబాదు లోని కళాజ్యోతి, చరిత వంటి ముద్రణాలయాలు ప్రపంచస్థాయిలో ప్రసిద్ధి చెందినవి.

సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన తరువాత కూడా ఆకారంలో, నిర్మాణంలో తెలుగు పుస్తకాలు చాలా వెనకపడే వుంటున్నాయి. ఈ సంగతి గమనించడానికి మన ప్రచురణకర్తల్ని రెండుగా విభజించి పరిశీలిద్దాం: ఒకరు లాభాపేక్ష లేని సంస్థలుగా యేర్పడ్డవారు. మరొకరు వ్యాపార దృష్టితో పని చేసిన సంస్థలు.

ఈ మొదటి విభాగంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణలు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణలు, తెలుగు అకాడెమీ ప్రచురణలు, చెదురుమదురుగా విశ్వవిద్యాలయ ప్రచురణలు చేరతాయి. వీటిని ప్రధానంగా తీసుకుని ఈ పుస్తకాలు ఎలా వున్నాయో చూద్దాం. దాదాపుగా వీళ్ళందరూ పెద్దపెద్ద నిఘంటువులు ప్రచురించారు. భారతాలు, రామాయణాలు ప్రచురించారు. అనేక ప్రామాణిక గ్రంథాలు, చెప్పుకోదగ్గ వైజ్ఞానిక గ్రంథాలు కూడా ప్రచురించారు. అయితే ఈ ప్రచురణల గొప్పతనం యెంతదయినా వీటి నిర్మాణం మాత్రం గొప్పదిగా వుండదు.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలు


14. తితిదే మహాభారతం సంపుటాలు

ఉదాహరణగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన రెండు ముఖ్యమైన ప్రచురణలు చూద్దాం. అందులో మొదటిది ఆంధ్ర మహాభారతం. ఎందరో పండితులు వ్యాఖ్యానం రాసిన అనేక సంపుటాల గ్రంథం. దీనిలో అచ్చుతప్పుల మాట పక్కన పెట్టి పుస్తక నిర్మాణం సంగతి చూద్దాం. పదికాలాల పాటు దాచుకోవలసిన పుస్తకం. అందుచేత బైండింగ్ కలకాలం కాకపోయినా కాలానికి నిలవగలదిగా వుండాలి. కొన్న నాలుగురోజులకే ఈ పుస్తకాల బైండింగ్ వడలిపోయి ఊడి వచ్చేసేలా వుంటుంది. ఈ పుస్తకాల అట్ట మీద ఒక సారూపకత లేకుండా పర్వాల పేర్లు, సంపుటాల సంఖ్యలు అడ్డదిడ్డంగా వుంటాయి. పుస్తకాలన్నీ ఒకచోట చేర్చి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే ఏ పుస్తకంలో ఏ పర్వాలున్నాయి, అది ఎన్నో సంపుటం అనే విషయం స్పష్టంగా కనిపించదు. పుస్తక సంపుటుల సంఖ్య ఒకటి, రెండు, మూడు, నాలుగు అని ఒక వరసలో వెన్ను మీద కనిపించదు. ఈ మహాభారతపు ప్రతులు నాసిరకం రంగుల బొమ్మలతో — ఆ రంగులు కొంత వెలిసి, కొంత పులుముకొనిపోయి — అంతే నాణ్యత గల అట్టలతో కనిపిస్తాయి.


15. తితిదే మహాభారతం – నాసిరకం
బైండింగు, ముఖచిత్రం.

ఆ పైన, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు కాబట్టి పద్మావతీవేంకటేశ్వరుల బొమ్మలు రంగులలో పూర్తి పేజీలలో ఆర్టు పేపరు మీద మనకి దర్శనమిస్తాయి. (మధురావిజయం వంటి చారిత్రకంగా విలువైన పుస్తకంలో కూడా ఇలాగే వేంకటేశ్వరుడి బొమ్మ కనిపిస్తుంది.) వేంకటేశ్వరుడికీ మహాభారతానికి సంబంధం యేమిటో మనకి తెలియదు. ఇంక లోపలికి చూస్తే వీటి ప్రచురణకు యేర్పాటు చేసిన కమిటీలు, ఆ కమిటీలలోని సభ్యుల పేర్లు, ఆ కమిటీలు సమావేశమైన తేదీలు, ఈ సమాచారమంతా వుంటుంది. ఇదీ ఎందుకో మనకి తెలియదు.

మహాభారతం ముఖపత్రం, మచ్చుకి ఒక నాలుగు సంపుటాల వెన్నులు చూస్తే నాణ్యత పట్ల అశ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని సంపుటాల పొడవు ఒకలాగ ఉండదు, వెన్నుల మీద సంపుటాల పేర్లు, వాటి సంఖ్యలు వేసిన పద్ధతి ప్రతి పుస్తకానికీ వేరుగా ఉంటుంది. వెన్ను మీద పుస్తకం పేరు తిన్నగా లేకుండా, వాలుగా కనిపిస్తుంది. ఇలా సంపుటానికీ సంపుటానికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

పుస్తకం తెరవగానే ముందుగా అనేక అనావశ్యకమైన వివరాలతో కూడిన పెద్ద ఉపోద్ఘాతం ఉండి, ఆ తరువాత గానీ మహాభారతం మొదలు కాదు. పదునెనిమిది పర్వాల తెలుగు మహాభారతం వంటి ప్రామాణిక గ్రంథానికి ఉండవలసిన గౌరవం లేకుండా, ఇంగ్లీషులో షేక్స్‌పియర్ కంప్లీట్ వర్క్స్ లాగా, ఎందుకు అచ్చయి దొరకదో తెలుసుకోవడానికి మనం ఆట్టే శ్రమ పడనక్కరలేదు. (ఉదా. Shakespeare complete works knickerbocker అని గూగులించి చూడండి.) మనకి సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల కాదు; ఆధునిక ముద్రణా సౌకర్యాలు లేకపోవడం అంతకంటే కాదు. మరేమిటి కారణం? పుస్తకాన్ని, రచనని వేరు చేసి, పుస్తకాన్ని ఒక అందమైన వస్తువుగా తీర్చిదిద్దాలనే అవగాహన, శ్రద్ధ లేకపోవడం, పనిలో పనివాడితనం చూపించాలనే పట్టుదల, తమ పనితనం పట్ల గర్వమూ అభిమానమూ లేకపోవడం.


16. తితిదే అన్నమయ్య పదాలు

తి.తి.దే.వారి ప్రచురణలలో రెండవది, ప్రత్యేకంగా చెప్పుకోదగినది వాళ్ళు ప్రచురించిన అన్నమయ్య పదాలు. ఇది 29 సంపుటాల ప్రచురణ. ఇవి పరమ చవకబారు కాగితం మీద ముట్టుకుంటే చిరిగి పోయే అట్టతో అందవికారంగా వుండే బొమ్మతో, ఏ రకమైన శ్రద్ధాసక్తులూ లేకుండా ప్రచురించిన గ్రంథాలు. దీని కోసం ఈ ప్రచురణకర్తలు మునుపు ప్రచురితమైన అన్నమయ్య పదాల సంపుటుల్ని తిరిగి ఒక పద్ధతిలో కూర్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పాత సంపుటుల్ని వాటి పుట సంఖ్యలు కూడా మార్చకుండా ఛాయాముద్ర (Photocopy) నకళ్ళతో ఈ 29 సంపుటాలు అచ్చు వేశారు. వీటి పేజీ సంఖ్యలు వేటికి అవే వేరేగా వుంటాయి. పూర్వం అచ్చు వేసేసిన వాళ్ళు ప్రతి సంపుటికీ ఒక అకరాది క్రమంలో పదాల సూచిక వేశారు కాబట్టి అది వుంటుంది. ఈ 29 సంపుటాలన్నిటికీ కలిపి ఒక సూచిక తయారు చేయాలి అనే ఆలోచన కూడా వీళ్ళకి కలగలేదు. ఒక అన్నమయ్య పదం ఎక్కడుందో వెతుక్కోవాలంటే ప్రతి సంపుటీ వేరువేరుగా వెతుక్కోవలసిందే. దేవస్థానానికి డబ్బు లేదా?! అన్నమయ్య పేరుతో ఇన్ని ఉత్సవాలు, ఇన్ని సంగీత కార్యక్రమాలు, రకరకాల ప్రచురణలు చేసే తి.తి.దే.వారు అన్నమాచార్య ప్రాజెక్టు పేరుతో ఇలాంటి ప్రచురణ తెచ్చినందుకు సిగ్గుతో తల దించుకోవాలి. ప్రపంచ సాహిత్యంలో ఉన్నత స్థాయిలో నిలవగల ఒక మహాకవి రచనలని ఈ విధంగా బయటకి తేవడం మనమే సాధించగల ఔన్నత్యం.

రవ్వా శ్రీహరిగారు శ్రద్ధగా చేసిన అన్నమయ్య పదకోశం ఆర్భాటంగా బయటకు ఐతే వచ్చింది కానీ, ఆ పుస్తకం బైండింగు కూడా ముచ్చటగా మూడు రోజులుండదు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణల్లో ఏ ఒక్కటీ చెప్పుకోదగ్గ రూపంలో ఉన్నది లేదు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణలు


17. సూర్యరాయాంధ్ర నిఘంటువు
ఆరు సంపుటుల ప్రతి

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణల్లో తెలుగువాళ్ళు అందరూ చెప్పుకోదగ్గది సూర్యరాయాంధ్ర నిఘంటువు. ఈ నిఘంటువు నిర్మాణ చరిత్ర ఒక ప్రత్యేకమైన కథ. అది పరిశోధన చేసి వివరంగా రాయవలసిన అవసరం వుంది. కాని, అది ఏ రూపంలో బయటకు వచ్చింది అనేది ఇక్కడ ప్రస్తుతమైన విషయం. తెలుగువాళ్ళు గర్వంగా చెప్పుకోదగ్గ గొప్ప తెలుగు నిఘంటువు ఇదొక్కటే! అనేక ఒడిదుడుకుల తరువాత మొదట ఎనిమిది సంపుటాల్లో (1988 నుంచి ఆరు సంపుటాలుగా) వెలుగు చూసిన ఈ నిఘంటువు చివరగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ద్వారా మన చేతిలోకొచ్చింది. ఆ నిఘంటువు ఊడిపోయే బైండింగుతో, వెలిసిపోయిన అట్టతో, ముట్టుకుంటే చిరిగిపోయే కాగితాలతో మనకి కనిపిస్తుంది. మొట్టమొదట 1979లో అచ్చయిన ఈ సంపుటులు మంచి కాగితం మీద అచ్చు వేయడానికి తగిన సాధనసంపత్తి అకాడమీకీ అప్పట్లో లేదనుకుందాం. అయినప్పటికీ బైండింగు ఇంత నాసిరకంగా ఎందుకుండాలి? నాలుగుసార్లు వాడితే అట్టలు ఊడిపోయే పరిస్థితి ఈ నిఘంటువుకి ఎందుకు పట్టాలి? వెల పదిహేను రూపాయలు అనే మాట పుస్తకం వెన్ను మీద ఎందుకు కనిపించాలి? ప్రథమ సంపుటము, ద్వితీయ సంపుటము, తృతీయ సంపుటము, చతుర్థ సంపుటము అని సంస్కృతం పేర్లతో సంపుటాల సంఖ్యని చెప్పి అకస్మాత్తుగా తెలుగులో అయిదో సంపుటము, ఆరో సంపుటము, ఏడో సంపుటము, ఎనిమిదో సంపుటము అని ఎందుకుండాలి? (ఈ పొరపాటు ఆరుసంపుటుల ప్రతిలో సవరించారు.)


18. సూర్యరాయాంధ్ర నిఘంటువు
నుంచి ఒక పుట

ఇంకా చెప్పాలంటే, కొన్ని సంపుటాలు తల్లకిందులుగా బౌండు అయివుంటాయి. లోపల మాటలలో న, ప, స లకి తేడాలు తెలీవు. టైపు చాలా చిన్నగా వుండి, చదవడానికి వీలుగా ఉండదు. ఇవన్నీ ఎందుకంటే, పుస్తక నిర్మాణంలో దక్షత కలిగిన ఏకవ్యక్తి పర్యవేక్షణ లేకపోవడం వల్ల. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన వేరే పుస్తకాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా వుండదు. పోలిక కోసం చెప్పాలంటే, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక క్రింద అచ్చు వేసిన పుస్తకాలు చూస్తే, ప్రచురణ ప్రమాణాలు ఎంత చక్కగా పాటించారో తెలుస్తుంది.


19. సమగ్ర ఆంధ్ర సాహిత్యం
అకాడెమీ ‘విశిష్ట’ ప్రచురణ

కనీసం, సూర్యరాయాంధ్ర నిఘంటువులో అచ్చుతప్పులు ఇంచుమించుగా లేవు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు వేసిన ఇతర పుస్తకాల్లో లెక్కలేనన్ని అచ్చుతప్పులు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని తెలుగు విశ్వవిద్యాలయంలో కలిపి వేసిన తరవాత కూడా పుస్తక ప్రచురణ ప్రమాణాల్లో మార్పులేమీ లేవు. తెలుగు అకాడెమీ ‘విశిష్ట’ ప్రచురణగా ప్రకటించి 2004లో ప్రచురించిన సమగ్ర ఆంధ్రసాహిత్యం నాలుగు సంపుటాలు నాలుగు రకాలుగా ఉంటాయి. లోపల నాసిరకం కాగితమూ, అచ్చుతప్పులూ షరా మామూలే. వీళ్ళు ప్రచురించిన పుస్తకాలు తెలుగు సాహిత్యానికి ప్రధానమైన ఆధారాలు. అటువంటి పుస్తకాలు ప్రచురించే సంస్థ పుస్తకనిర్మాణంపై ఎటువంటి శ్రద్దా కనపరచకపోవడం విచారించవలసిన సంగతి.

ఆధునిక గ్రంథాలు

ఇక వ్యాపార సంస్థలు చేసిన ఆధునిక గ్రంథాల ప్రచురణల సంగతి చూద్దాం. వీటిలో విశాలాంధ్ర ప్రచురణాలయం ఒకప్పుడు వావిళ్ళ వారి సంస్థ ఎంత పెద్దదో, ఇప్పుడు అంత పెద్దది. మొదట్లో కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) ఆలోచనలకు అనుగుణమైన పుస్తకాల ప్రచురణకే పరిమితమైనా, కాలక్రమంలో అన్నిరకాల పుస్తకాలూ ప్రచురిస్తూ కోట్ల రూపాయల వ్యాపారం చేసే సంస్థగా ఇది పెరిగింది. కానీ పుస్తక ప్రచురణ ప్రమాణాలు మాత్రం పరమ దారుణంగా పడిపోయాయి. ఈ ప్రచురణ సంస్థ గురించి మంచి మాటలు చెప్పడం కష్టం. ప్రచురణ రంగంలో మనం చేరుకున్న దయనీయ స్థితికి ఈ సంస్థ తిరుగులేని ఉదాహరణ. విశాలాంధ్ర ప్రచురణలలో ఏ పుస్తకం చూసినా కోకొల్లలుగా అచ్చుతప్పులు, అర్థం పర్థం లేని ముఖపత్రాలు ఇంకా సవాలక్ష ఇతర అవలక్షణాలు కనిపిస్తాయి. ఈ ప్రచురణ సంస్థ గురజాడ రచనలకి చేసినంత అపకారం ఇంకే ప్రచురణ సంస్థా ఏ ఇతర ఆధునిక రచయితకీ చెయ్యలేదు.


20. కవితల పుస్తకాలు

మన ప్రచురణ రంగంలో ఇంకొక విశేషం వుంది. కవులు, రచయితలూ ఎవరి పుస్తకాలు వాళ్ళే ప్రచురించుకుంటారు. కవులకి తమ కవిత్వం మీద ఆదరం, అభిమానం వుంటుంది కాబట్టి పుస్తకాలు స్వయంగా అచ్చు వేసుకుని దానికి కావలసిన అట్టలూ, బొమ్మలూ సమకూర్చుకుని ఎవరికి తోచినట్టు వారు, వారి కంటికి నచ్చిన తీరులో అచ్చు వేయించుకుంటారు. అందువల్ల వీటికి ఒక కచ్చితమైన పద్ధతి, నియమావళి వుండవు. కొన్ని బాగుంటాయి, కొన్ని నాసిరకంగా వుంటాయి. వాటినిండా బోలెడు అభిప్రాయాలూ, అతిశయోక్తులూ, కొల్లలుగా వుంటాయి.

ఇక పిఎచ్. డి. సిద్ధాంత గ్రంథాల సంగతి చూస్తే మన పుస్తక నిర్మాణ దక్షత ఇంకో మెట్టు కిందకి దిగి కనిపిస్తుంది. ఈ సిద్ధాంత గ్రంథాలు సొంతంగా ఆయా పిఎచ్. డి పట్టాలు పొందిన వారే వేసుకుంటారు కాబట్టి, అందులో అవలక్షణాలకి ఇంక ప్రచురణ సంస్థని తప్పు పట్టవలసిన పని లేదు; అది కేవలం ముద్రణాలయం మాత్రమే కాబట్టి.


21. కథాసాహితి సంపుటాలు

అయితే, వీటితో పాటే దాదాపుగా సొంత ప్రచురణలే అని చెప్పదగిన కథా సంపుటులు తెలుగులో వస్తున్నాయి. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ కలిసి ప్రచురించే కథ సంపుటాల వంటివి లాభాపేక్ష లేనివాళ్ళు ప్రచురించే పుస్తకాలు. వీళ్ళకి పుస్తకాన్ని అందంగా ప్రచురించాలనే అభిలాష కూడా వుంది. ఈ పుస్తకాల ప్రచురణని పర్యవేక్షించే వాళ్ళకి ప్రచురణ పద్ధతుల పట్ల అవగాహన ఉంది. అందుచేత ఈ రకమైన పుస్తకాలు మన ప్రచురణ రంగంలో కొంతలో కొంత ఒక మంచి మార్పు అని అనుకోగలం.

మన ప్రచురణ రంగం ఇలా ఎందుకు వుంది?


22. పేజీలే మాయమయిన
డిటిపి పుస్తకం

అసలు సమస్య ఏమిటంటే, తెలుగులో ప్రచురణ కర్తలు, ముద్రాపకులు (Publishers, Printers) ఉన్నారు కానీ తెలుగులో అచ్చుకళాకారుడు (Typographer), పుస్తకరూపనిర్ణేత (Book designer) అనే ఉద్యోగాలు ఎప్పుడూ ఉన్నట్టు లేవు. ఇప్పుడు డి.టి.పి అనేది హోమియో వైద్యంలా ఎవరైనా చెయ్యగలిగే పని అయ్యింది. దీనివల్ల కొన్ని లాభాలు ఉండగా నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు అక్షరాలు చేత్తో కూర్చేటప్పుడు అక్షరాల తప్పులు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు డి.టి.పి వచ్చిన తరవాత పుస్తకంలో పేజీలు పేజీలు పోతున్నాయి. మనకి రచయిత, ప్రచురణకర్త, పరిష్కర్త లేదా సంపాదకుడు, ముద్రాపకుల మధ్య ఉండవలసిన వ్యవహారం అంతా పెద్దగా అభివృద్ధి కాలేదు. అందువల్ల మనకి పుస్తక ప్రచురణ నిర్మాణం గురించి ఒక సమగ్రమయిన విధానం అభివృద్ధి చెందలేదు. అటువంటి విధానాన్ని ఏర్పరుచుకునే దిశలో మొదటి ప్రయత్నంగా, ఈ వ్యాసంలో పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందిన పుస్తక నిర్మాణ ప్రక్రియ గురించి చూద్దాం.

పుస్తకనిర్మాణం


23. కొన్ని తెలుగు పుస్తకాల వెన్నులు

మీరొక పుస్తకాల షాపులోకి వెళ్ళారనుకోండి. అక్కడ కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి. అప్పటిదాకా మీకు తెలియని ఒక రచయిత పుస్తకాన్ని ఎందుకు మీరు చేతిలోకి తీసుకుంటారు? మీ కంటికి నదురుగా కనిపించే ఆ పుస్తకం ఎలా వుంటుంది? పుస్తకం రూపం, బరువు, వాడిన పేపరు, కవర్ డిజైన్ మొదలైనవన్నీ కూడా ఆ పుస్తకంపై మనకి ఆపేక్ష ఏర్పడేలా, మనం కొనేలా చేస్తాయి. అంటే, విషయం ఏదైనా కూడా పుస్తకమూ ఒక వస్తువే! ఈ విధంగా ఒక వస్తువుగా పుస్తకానికి వుండే లక్ష్యాన్ని బట్టి దాని తయారీ, రూపమూ ఉంటాయి.

ఉదాహరణకి, ఏ పుస్తకమైనా చూడగానే అది ఎలాటి పుస్తకమో తెలియాలి. నిఘంటువులూ, విజ్ఞాన సర్వస్వాలూ, ప్రముఖ కవుల రచనలు, శాస్త్ర గ్రంథాల వంటివి ముఖ్యంగా పరిశోధకులు, విద్యావేత్తల వంటి కొద్దిమంది కోసం అచ్చు వేసే పుస్తకాలు హుందాగా వుండాలి. వీటిమీద కంటికి నదురుగా వుండే సినిమా పుస్తకాల తరహా బొమ్మలు ఉండకూడదు. పుస్తక రూపనిర్మాణం (బుక్ డిజైన్) అంటే కేవలం అందమైన ఆర్ట్‌ పేపరు మీద బొమ్మలు, రంగులు అద్దటం కాదు. నిఘంటువులు, రామాయణాలు, భారతాల వంటి ఇతిహాసాలు అయితే తప్ప, మిగిలిన పుస్తకాలు పట్టుకోడానికి, మనతో తీసుకుపోవడానికి వీలుగా వుండాలి. ఏ పుస్తకమైనా సరే, బల్ల మీద పెట్టి తెరవగానే అది చక్కగా తెరుచుకునే వుండాలి. పుస్తకం తెరిచినప్పుడు పేజీలు వెన్నులోకి పోకుండా పేజీ అంతా చక్కగా బల్లపరుపుగా కనిపించేటట్టు వుండాలి.


24. మానవల్లి కవి వ్యాసాలు

పుస్తకం చాలా కాలం పాటు దాచుకోవడానికి అనువుగా వుండాలి. ఒకసారి చదివిన తర్వాత పుస్తకాన్ని బీరువాలో పెడతాం; మరోసారో, మరి కొన్నిసార్లో తీసి చదువుతాం, లేదా ఇంకెవరికో ఇస్తాం. అలా ఆ పుస్తకం ఈ నలిపిడిని తట్టుకొనేదిగా ఉండాలి. పుస్తకం కొలత – ముఖ్యంగా పొడవు చాలా పుస్తకాల బీరువాల్లో పట్టేదిగా ఉండాలి. ఒకసారి బీరువాలో దాన్ని నిలువుగా ఉంచితే అది వంగిపోకుండా ఎంత కాలమైనా నిలబడాలి.


25. కైఫీయత్తులు

ఇవన్నీ కూడా పుస్తకం రూపు దిద్దేటప్పుడు ఆలోచించవలసిన విషయాలు. ఇవన్నీ సాధించాలంటే, పుస్తకం శ్రద్ధ పెట్టి తయారు చెయ్యవలసిన వస్తువుగా పరిగణించాలి. ఈ స్పృహ వుండటం వల్లే అంతర్జాతీయ ప్రచురణ సంస్థలలో పుస్తక రూపనిర్మాణం ఎంతో పకడ్బందీగా వుంటుంది. ఈ లక్షణాలేవీ తెలుగు పుస్తకాలకి వుండవు. మొన్నమొన్ననే ప్రతిష్ఠాత్మకంగా వేసిన కొడవటిగంటి కుటుంబరావు సంపూర్ణ సాహిత్యం విషయంలోనూ; మహాపండితుడు, పరిశోధకుడు అయిన మానవల్లి రామకృష్ణకవి వ్యాసాల విషయంలోనూ; ఎంతో విలువైన చరిత్రను అందించే కైఫీయత్తుల విషయంలోనూ ఈ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇందుకు సాక్ష్యాలు ఇక్కడ ఇచ్చిన బొమ్మలే!

తెలుగులో కానీ, ఇతర భారతీయ భాషలలో గానీ ఇప్పుడు ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. ఒకప్పుడు పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవనో, చవకగా వుంటేనే అమ్ముడు పోతాయనో అనుకునేవారు. ఇప్పుడు, పుస్తకం ధర కాస్త ఎక్కువున్నంత మాత్రాన ఎవరూ కొనడం మానలేదు. ఎంతో ఖరీదైన కాఫీ టేబుల్ పుస్తకాల వంటివి కూడా పాఠకులు కొంటున్నారు. ప్రతి ఏడాది పుస్తకాల సంతల్లో ఎన్ని పుస్తకాలు అమ్ముడుపోతున్నాయో, ఇంటర్నెట్‌లో తెలుగు బ్లాగులు చూసినవారికెవరికైనా తెలుస్తుంది. మనదేశంలో ఇంగ్లీషు పుస్తకాలు వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతోంది.

టెక్నాలజీకి కూడా మనకి కొరతేం లేదు. ప్రపంచస్థాయి ప్రింటర్లు మనదేశంలో, ముఖ్యంగా హైదరాబాదు లోనే ఉన్నారు. గ్రాఫిక్ డిజైను, బుక్ డిజైనులో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడానికి సాంకేతిక విద్యాసంస్ఠలలో కోర్సులు ఉన్నాయి. అయితే ఈ నైపుణ్యం అంతా ఇంగ్లీషు పుస్తకాలు ప్రచురించడానికే వినియోగించబడుతోంది. తెలుగులో పుస్తకనిర్మాణ ప్రమాణాలు ఎందుకు ఏర్పడలేదు అనే ప్రశ్నకి – మనకి ప్రామాణికత మీద, పుస్తకాన్ని సుష్టుగా, పదికాలాలు ఉండేటట్టుగా నిర్మించుకోవాలనే పట్టుదల లేకపోవడమొక్కటే కారణం అని చెప్పుకోవాలి. ఈ పరిస్థితి త్వరలో మారుతుందని ఆశిద్దాం.

ప్రమాణాలు, ప్రణాళికలు, పరిగణనలు

పుస్తకం తయారీలో మూడు ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి:

  1. సంపాదకీయ ప్రణాళిక: రచయిత తన రచనని పూర్తిచేసి వ్రాతప్రతిని ముఖ్యసంపాదకునికి (లేదా పరిష్కర్తకు) పంపాక, దానిలో చాలా మార్పులు జరుగుతాయి. పాఠకులకి చదవడంలో ఇబ్బందులు లేకుండా ప్రకటించడం ప్రతిసంపాదకుల (Copy editors) కర్తవ్యం. పాఠకుడి కోసం పుస్తకాన్ని తయారు చేసే క్రమంలో కాపీ ఎడిటింగ్ చాలా ముఖ్యమైన అంశం.
  2. పుస్తకం రూపురేఖల ప్రణాళిక: పుట రూపురేఖలు – పంక్తుల మధ్య ఖాళీ, వార వెడల్పు (మార్జిన్,) ఫాంటు; పుస్తకం శీర్షిక, విషయసూచిక, గ్రంథసూచి, పై అట్ట, పుస్తకంలో బొమ్మలు; ఇవన్నీ పుస్తకం రూపురేఖలని నిర్ణయిస్తాయి.
  3. సాంకేతిక ప్రణాళిక: పుస్తక నిర్మాణం నిర్ణయించే క్రమం. పుస్తకపు కుట్టు, పుటల అమరిక, పుస్తకపు కొలతలు మొదలైనవన్నీ ఇందులో వస్తాయి.

ఈ మూడు వేరు వేరు నైపుణ్యాలు. అన్నీ కలిస్తేనే మంచి పుస్తకం తయారు అవుతుంది.

పుస్తకం కొలతలు, కాగితపు నాణ్యత, ఇత్యాది: ప్రతి పుస్తకానికి ఒక లక్ష్యం ఉంటుంది. రచయిత, సంపాదకుడు, ప్రచురణ సంస్థ కలిసి సంయుక్తంగా ఆ పుస్తకాన్ని పాఠకుడు ఎలా చదవాలో, ఏ రకంగా చదవడానికి ఉద్దేశించిందో నిర్ణయిస్తారు. దానికి తగ్గట్టుగా పుస్తకపు ఆకారం, బరువు వగైరాలు ఉంటాయి. ఉదాహరణకి, ఇంగ్లీషులో పల్ప్ ఫిక్షన్ (Pulp fiction) అనే పుస్తకాలు ఒక తరహాలో ఉంటాయి. పేజీలు ఎక్కువున్నా పుస్తకం తేలిగ్గా ఉంటుంది – బస్సులోనో, రైలులోనో ప్రయాణం చేసేటప్పుడు చదువుకోడానికి వీలుగా ఉంటాయవి, కానీ ఎక్కువ కాలం దాచుకోవడానికి పనికి రావు. అదే విద్య, శాస్త్రజ్ఞాన సంబంధి పుస్తకాలైతే మరోలా ఉంటాయి – ఇవి లైబ్రరీలలో ఎక్కువ కాలం, ఎంతోమంది చదివినా తట్టుకునేటట్టు ఉంటాయి. లైబ్రరీలు బైండింగు చెయ్యడానికి, లైబ్రరీ అరల్లో ఉంచడానికి అనువుగా ఉంటాయి. ఈ పుస్తకాలలో బొమ్మలు, ఫాంట్లు; పుస్తకం మొదట్లో అనుక్రమణిక, చివరిలో అకారాదిగా విషయసూచిక; నిర్దేశిత, పరామర్శిక గ్రంథసూచి; ఆధారాలు, ఉపయుక్త రచనలు, ఈ పుస్తకాలలో ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి ప్రచురించి వుంటాయి.


26. ప్రతిసంపాదకుడి చిట్టా

పుస్తకపు రూపం, విషయం: పుస్తకపు విషయం (content) దాని రూపాన్ని (format) నిర్ణయిస్తుంది. పుస్తకం లోని విషయం, దాని లక్ష్యం, మొత్తం పదాల సంఖ్య ఆధారంగా సుమారుగా పుస్తకానికి కావలసిన పుటల సంఖ్య తెలుస్తుంది. పరిష్కరణ పూర్తయిన తర్వాత వచ్చిన వ్రాతప్రతి ఆధారంగా రూపశిల్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వుంటుంది. పుటల సంఖ్య మరీ ఎక్కువైపోయేట్టయితే కాగితపు కొలత పెంచాలి, లేదా ఫాంట్లు, ఫాంటు కొలత మార్చాలి; పుట పరిణామాన్ని బట్టి విషయం ఒక వరసలో (Column) వెయ్యాలా, రెండు వరసల్లో వెయ్యాలా? అనేది ముఖ్యమైన నిర్ణయం. బాగా వెడల్పయిన పుట మీద ఒకటే వరుసలో పంక్తులు చదవడానికి వీలుగా ఉండవు. పుస్తకంలో బొమ్మలు ప్రధానమైన ఆకర్షణగా ఉండే కాఫీ టేబుల్ పుస్తకాలు, అట్లాసుల వంటివి పెద్ద కాగితం మీద ముద్రిస్తారు.

(ఇక్కడ తి.తి.దే మహాభారతాల గురించి మరొక సారి చెప్పుకోవాలి – పెద్ద సైజు పేపరు మీద, చాలా పెద్ద ఫాంటు వాడి అవసరం లేకపోయినా పేజీల కొలత, సంఖ్య పెంచినట్టుగా ఉంటాయి. ఇటువంటి రిఫరెన్సు పుస్తకాలు సాధారణంగా ఆక్టేవో (Octavo) సైజులో, కాస్త చిన్న ఫాంటులో ప్రచురిస్తారు. పుస్తకం ఫార్మాటుకి సంబంధించి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రత్యేకమైన కారణం ఉంటే తప్పించి, ప్రచురణ కర్తలు సాధారణంగా ఎక్కువ శాతం పుస్తకాలు ఆక్టేవో సైజులో ప్రచురిస్తారు. 150 నుంచి 300 పేజీల వరకూ ఉన్న పుస్తకాలకి, విషయప్రధానమైన పుస్తకాలకి ఈ రూపం అనువైనది. చదువుకోవడానికి, పుస్తకాల అరల్లో అమర్చుకోవడానికి అనువుగా ఉండే ఆకారం ఇది. నవలలకి, కవిత్వం పుస్తకాలకి, కాల్పనికేతర పుస్తకాలకి ఈ కొలతలనే ఎక్కువగా వాడతారు. ఇక, క్వార్తో (Quarto) సైజు బొమ్మలు ఎక్కువగా ఉన్న పుస్తకాలకి వాడతారు.)

రచయిత చెప్పదలచుకున్న విషయాన్ని సమర్ధవంతంగా ప్రదర్శించడం, పుస్తకం తయారీలో పొదుపు, పుస్తకాల రవాణా, వాటిని భద్రపరచుకోవడం, వాటిని చదవడానికి వీలుగా ఉండేటట్టుగా రూపు దిద్దడం ఒక ఎత్తైతే, ప్రతి పుస్తకానికి ఒక ‘వ్యక్తిత్వం’ ఉండేటట్టుగా వాటిని అందంగా, కంటికి ఇంపుగా తీర్చిదిద్దడం మరో ఎత్తు. పాఠకులని ఆకర్షించడానికి ప్రచురణ సంస్థలు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford University Press) వారి పుస్తకాల వెడల్పు కాస్త తక్కువగా ఉంటుంది; అడిసన్-వెస్లీ (Addison-Wesley) వారి పుస్తకాలు కాస్తంత వెడల్పుగా ఉంటాయి. సాధారణంగా పొడవు-వెడల్పుల నిష్పత్తి 4:3 గానీ, 7:4 గానీ ఉంటుంది.


27. టైపోగ్రఫీలోని సూక్ష్మాంశాలు

అచ్చుకళ (Typography): పుస్తకానికి తగిన అక్షరాల రూపును ఎంచుకోవడం పుస్తకపు అలంకరణలో అతి ముఖ్యమైన అంశం. ముద్రాక్షరాలని ఇంగ్లీషులో టైప్ (Type) అంటారు, అందుకని ముద్రాక్షరాలకి వాటి ఆకారాల తయారీకి టైపోగ్రఫీ అనే పేరొచ్చింది. అర్థమే కాకుండా, అక్షరపు రూపం కూడా పాఠకుడిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రతి పుస్తకం నిండా మనకి కనిపించేవి అక్షరాలే. అందుకనే అక్షరాల రూపు ఎన్నిక (Type composing) ముఖ్యమైన భాగం. ఐతే, టైపోగ్రఫీ అంటే కేవలం తగిన ఫాంట్లు ఎంచుకోవడం ఒక్కటే కాదు. దీనిలో ఎన్నో సాంకేతికంగా సూక్ష్మమయిన అంశాలున్నాయి.

ముద్రాక్షరాల నిర్మాణం (structure of Type): ముద్రాపరంగా లాటిన్ అక్షరానికి సుమారుగా 20 భాగాలు ఉంటాయి. వీటిని మారుస్తూ ఎన్నోరకాల ఫాంట్లు చిత్రించవచ్చు. కానీ, ఈ నిర్మాణ ప్రక్రియ భారతీయ లిపులకి సరిపోదు. భారతీయ లిపులన్నిటిలోనూ సంయుక్తాక్షరాలుంటాయి. మనకి ఒక హల్లు ఒక అచ్చుతో కూడితే అక్షరం వస్తుంది. కొన్ని హల్లులు ఒక అచ్చుతో కలిసి సంయుక్తాక్షరం ఏర్పడుతుంది. అందుకని, ఈ లిపులకి ఒత్తులు, హల్లుని, అచ్చులని కలిపే అక్షర సంజ్ఞలు అవసరమవుతాయి. ఉదాహరణకి ఉంది. ఇది ర అనే హల్లుతో కలిస్తే గ్ర అవుతుంది — గ్, ర్, అ అనే మూడు శబ్దాలు కలిస్తే వచ్చిన అక్షరం ఇది. ఈ సంయుక్తాక్షరాల వల్ల వల్ల మనకి లాటిన్ ముద్రాక్షరాల రూపనిర్మాణం యధాతథంగా పనికి రాదు. ప్రధానమైన హల్లుతో, మిగిలిన హల్లులు కలుస్తూ ఏర్పడే అక్షరాలని రూపు దిద్దడానికి వినియోగపడే సూత్రాలు ఏవీ మనం ఇప్పటి వరకూ ఏర్పరుచుకోలేదు. ఇలాంటి ప్రశ్నలు మనం ఎప్పుడూ వేసుకున్నట్టు లేదు.

మరొక సమస్య: పంక్తిలో ఒక్క పదంలో ఎక్కువ సంయుక్తాక్షరాలున్నా మొత్తం పంక్తి ఎత్తు ఎక్కువైపోతుంది, ఆ పంక్తికి కిందనున్న పంక్తి దానికి దూరంగా ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే, భారతీయ భాషలు, ముఖ్యంగా పంక్తి కింద ఎక్కువగా హల్లు-సంజ్ఞలు చేర్చే తెలుగు భాషలాంటి భాషలని అచ్చువెయ్యడానికి ఎక్కువ పేజీలు అవసరమవుతాయి. చాలా తెలుగు పుస్తకాలలో కనిపించే ఇంకొక సమస్య ఇంగ్లీషు అక్షరాలు, తెలుగు అక్షరాలు, సంఖ్యలు కలిపి ముద్రించవలసి రావడం. అలా వచ్చినప్పుడు, తెలుగు ఫాంటుతో ఒదిగిపోయే ఇంగ్లీషు ఫాంటుని వాడవలసి ఉంటుంది. ఇప్పుడు వస్తున్న డిజిటల్ ఫాంట్లలో, ఎన్నోరకాల లిపులకి సంబంధించిన అక్షరాలని ఒకే ఫాంటులో ఇమడ్చవచ్చు. ప్రతి తెలుగు ఫాంటుకి, దానికి తగినట్టు ఉండే ఇంగ్లీషు అక్షరాలు, సంఖ్యలు, కామా, బిందువు తదితర సంజ్ఞావాచకాలు మొత్తం ఆ ఫాంటుకి తగ్గట్టుగా చిత్రించుకోవాలి. ఇప్పుడు వస్తున్న చాలా ఫాంట్లలో ఉంటున్న ఇటువంటి సాంకేతికమైన అంశాలని తెలుగులో ఎవరూ అధ్యయనం చేయలేదు. (ముందే చెప్పుకున్నట్టు ఆ రకమైన ఉద్యోగం మనకు లేదు.)

డిజిటల్ ఫాంట్లకి పూర్వం, పైన చెప్పినట్లుగా తెలుగులో ఫాంట్లు ఎక్కువగా ఉండేవి కావు. ఇప్పుడు చాలా ఫాంట్లు అందుబాటులో ఉన్నాయి. అను, శ్రీలిపి ఫాంటు కుటుంబాలతోబాటు, గత రెండు సంవత్సరాలలో యూనికోడ్ ఫాంట్లు కూడా చాలానే వచ్చాయి. పుస్తకాల రూపనిర్మాణానికి ఇప్పుడు చాలా వెసులుబాటు ఉంది.

అచ్చు అక్షరాల ఎన్నికలో పరిగణించవలసిన అంశాలు

పుస్తకం ఎటువంటి పాఠకులకోసం ఉద్దేశించబడిందో, పుస్తకం లక్ష్యానికి అనుగుణంగా అచ్చురూపం (Typography) ఉండాలి. ఉదా. చిన్నపిల్లల పుస్తకాలలో ఫాంటు పెద్దగా, గుండ్రంగా ఉంటుంది. ఒకవేళ, అచ్చు వేస్తున్న పుస్తకం ఒక సంకలనంలో భాగమైతే, ఆ సంకలనం అంతా ఒకే టైపోగ్రఫీ ఉండాలి. పెద్ద సంకలనాలైతే, వాటికోసం ప్రత్యేకంగా టైప్ తయారు చేస్తారు. మూర్తి క్లాసికల్ లైబ్రరీ వారి ప్రచురణలు ఇందుకు ఉదాహరణ.


28. పేజ్ ఎలిమెంట్స్

టైపోగ్రఫీలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం – స్పష్టత (legibility.) కాగితం మీది ప్రతీ వివరమూ చదవడానికి వీలుగా స్పష్టంగా ఉండాలి. ఇంతకు ముందు చెప్పినట్టుగా, తెలుగులో మన లిపులకి తగ్గ ఫాంట్ల రూపకల్పనకి నిబంధనలు లేవు కాబట్టీ కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఫాంట్ కొలతని నిర్ణయించడం మనకి పెద్ద సమస్య. ఇంగ్లీషు లిపిలో అక్షరం అంటే అది మార్పులేని ఆకారం, మన లిపులలో అది పదాన్ని బట్టి, సంయుక్తాక్షరాల బట్టి మారుతూ ఉంటుంది, అందుకని మనకి అచ్చు అక్షరం కొలత నిర్ణయించేటప్పుడు కేవలం ప్రధానమైన అక్షరమే కాకుండా, సంయుక్తాక్షరాల ఒత్తులని కూడా పరిగణన లోకి తీసుకోవాలి. ఫాంటు స్పష్టతలో, వాలు అక్షరాలు (Italics), ముద్ద అక్షరాలు (Bold) పంక్తిలో వాడినప్పుడు అవి పంక్తి ఎత్తుని మార్చకూడదు. అక్షరానికి – అక్షరానికి మధ్య, పదానికి – పదానికి మధ్య, పంక్తికి – పంక్తికి మధ్య ఖాళీ ఎంత ఉండాలి అని సరిగ్గా నిర్ణయించుకుంటే ఉన్న వనరుల పరిమితులకు లోబడే స్పష్టతని సాధించవచ్చు.


29. మొదటి అక్షరం (డ్రాప్ కాప్)

అలాగే వాక్యంలో కేవలం అక్షరాలే కాకుండా సంఖ్యలు, విరామ చిహ్నాలు, ఇతర సంజ్ఞావాచకాలు ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా అమరినప్పుడే పుస్తకం అందం గానూ, చదవడానికి అనుకూలం గానూ ఉంటుంది. విషయపరమైన పేరాలు మాత్రమే కాకుండా పాదపీఠికలు, అధ్యాయం శీర్షిక, అధ్యాయం ప్రారంభవాక్యం, ప్రథమాక్షరం (Initial or Drop Cap), ఇవన్నీ కూడా శ్రద్ధగా పరిగణించాలి. వీటన్నిటినీ కలిపి పేజ్ ఎలిమెంట్స్ (page elements) అని పిలుస్తారు.

పుస్తకం లోని ఇతర అంశాలు

పుస్తకంలో విషయప్రధానమైన పుటలే కాకుండా, ప్రచురణ పరంగా పుస్తకాన్ని గుదిగుచ్చి దానికొక సంపూర్ణతని తెచ్చే మరికొన్ని భాగాలున్నాయి. రచయిత రాయని విషయం ప్రతి పుస్తకం లోనూ ఉంటుంది – అసలు విషయం మొదలు కావడానికి ముందు, రచన వెనకాల బోలెడు సమాచారం ఉంటుంది. ఇదంతా సంపాదకులు, పుస్తక రూపనిర్మాతలు, ప్రతిసంపాదకులూ శ్రద్ధగా చెయ్యవలసిన పని. వీటికి ఒక ప్రత్యేకమైన క్రమం, వీటిని ప్రచురించడంలో కొన్ని పద్ధతులూ ఉన్నాయి.

పుస్తకం తెరవకుండానే మనం గమనించే భాగాలను పుస్తకపు ముఖసమాచారం (Front matter) అంటారు. ముందు అట్ట (top cover), వెనుక అట్ట (botom cover), వెన్ను (spine), తొడుగు (Jacket) వంటివి. అలాగే పుస్తకం లోపల కనిపించే ఇతర భాగాలు ఇవి:

1. అర్ధశీర్షిక (half title) 2. ప్రధాన శీర్షిక (title) 3. గ్రంథవివరణ (bibliographic information) 4. అంకితం 5. కృతజ్ఞతలు 6. విషయసూచిక 7. బొమ్మల సూచిక 8. పీఠిక 9. ఉపోద్ఘాతం 10. తప్పొప్పుల పట్టిక 11. ప్రధాన విషయం 12. అనుబంధం (appendix) 13. రచయిత టీక (author notes) 14. పదకోశం (glossary) 15. అన్వయాలు (references) 16. అనుక్రమణిక (index) 17.పాదసూచికలు (foot notes.)

వీటిల్లో కొన్నిటి వివరాలు చూద్దాం.


30. అర్ధశీర్షిక (half-title)

అర్ధశీర్షిక (half-title) సుమారుగా ఇంగ్లీషు పుస్తకాలన్నింటీకి, పుస్తకం తెరవగానే, పై అట్టకి, టైటిల్ పేజీకి మధ్యలో రెండు ఖాళీ పేజీలుంటాయి – అవి అట్టకి అంటుకుని ఉంటాయి, అందుకని తెరవగానే అవి ఒకవైపుకి ఒరిగిపోతాయి. అందులో రెండో పేజీలో చిన్న అక్షరాలతో పుస్తకం పేరు వేస్తారు – దీన్ని అర్ధశీర్షిక లేదా హాఫ్-టైటిల్ అంటారు. దీని అవసరం చాలా ఉంది. ఎందుకంటే, జిల్లుకడుతూ అట్టకి పుస్తకం అంటించేటప్పుడు ఒక కాగితం పూర్తిగా అట్టకి అంటుకుని ఉంటుంది, దాన్ని ఆనుకుని ఉన్న పుట కూడా అట్టకి అతుక్కుని ఉండటం మూలంగా అది తెరవగానే కాస్త పైకి లేచి వస్తుంది.


31. హాఫ్ టైటిల్ ఉదా.
(విశ్వగుణాదర్శచంపు)

ఆ కాగితం మీద పుస్తకం పేరు వేస్తే అది బైండింగుకి అంటుకుపోయినట్టుగా ఉంటుంది, అందుకని ఆ పుట మీద హాఫ్-టైటిల్ వేస్తారు. హాఫ్-టైటిల్ వుండటం ఆ పుస్తకం నిర్మాణం పట్ల శ్రద్ధకి ఒక ప్రత్యక్షమైన సంకేతం. ఇది తెలుగు పుస్తకాలకి దాదాపుగా వేటిలోనూ వుండదు. (తానా ప్రచురించిన విశ్వగుణాదర్శ చంపూ అన్నిరకాల ప్రచురణ ప్రమాణాలని పాటిస్తూ అచ్చయిన అతి కొద్ది తెలుగు పుస్తకాలలో ఒకటి. ఆ పుస్తకపు హాఫ్-టైటిల్ చూడండి.)

శీర్షికాపత్రం (title page): ఈ పుట మీద పుస్తకం శీర్షిక, రచయిత పేరు, ప్రచురణాలయముద్రిక (publisher’s logo) ప్రధానంగా ఉంటాయి. ప్రధాన శీర్షికా పత్రం ఎప్పుడూ కుడివైపు ముద్రిస్తారు (రెక్టో.) ఏ దేశంలో ప్రచురించబడిందో ఆ వివరం ప్రచురణ సంస్థ పేరు కింద ఉంటుంది. పుస్తకం ఒక సంకలనంలో భాగం అయితే, ఆ సంకలనం పేరు, దాని సంపాదకుడి పేరు ఎడం వైపు పుట మీద వేస్తారు. ఈ వివరం చిన్న అక్షరాలలో వుండాలి. శీర్షికాపత్రం మీద ఇంతకు మించి బొమ్మలు, రచయిత బిరుదులు, అంకితం వివరాలు, భగవంతుడి స్మరణలు మొదలైనవి ఉండవు, ఉండకూడదు. ఉదాహరణకి: కవిత్రయ విరచిత శ్రీమదాంధ్రమహాభారతము అని అంత పెద్ద పేరు అవసరం లేదు. మహాకవి తిక్కన అనో, తిక్కనామాత్యుడు అనో, ఉండక్కరలేదు, తిక్కన అని వుంటే చాలు.

హక్కులు, గ్రంథ వివరణ: ప్రధానశీర్షికాపత్రం వెనుక వైపును వెర్సో (verso) అని పిలుస్తారు. ప్రచురణ హక్కులు (copyrights), గ్రంథవివరణ సమాచారం, ప్రచురణ సంస్ఠ వివరాలు, గ్రంథాలయసూచి (library catalog no.), ISBN నెంబరు, ఈ వైపు ఉంటాయి. ముఖ్యంగా పుస్తకం ఎన్నో ప్రచురణో ఈ పేజీలో సమాచారం ఇవ్వాలి. అది మొదటి ప్రచురణ అయితే ఆమాట చెప్పి, సంవత్సరం చెప్పాలి. తర్వాతి ఎడిషన్ అయితే అది ఎన్నోదో అదీ ఆ సంవత్సరం ఇచ్చి, మొదటి ఎడిషన్ ప్రకటించబడిన సంవత్సరం కూడా ఇవ్వాలి. ఈ సమాచారం చాలా తెలుగు పుస్తకాలలో ఉండదు. ‘ఆరవ ముద్రణ 2012’ అని ఉంటే చాలదు. ఆ పుస్తకం మొదటి ముద్రణ ఏ సంవత్సరంలో అయిందో చెప్పాలి. సంవత్సరం చాలు, నెల, తేదీలు అవసరం లేదు. వీటితోపాటు ఒక వరసలో కొన్ని సంఖ్యలు కూడా వుంటాయి. ఆ వరసను నంబర్స్ లైన్ (numbers line) లేదా ప్రింటర్స్ కీ (printers key) అని అంటారు. ఈ అంకెల్లో ఆ పుస్తకపు ముద్రణ వివరాలుంటాయి.


32. కాపీరైట్, ఇండెక్స్ పేజీలు

తెలుగులో కూర్పుకీ, ముద్రణకీ (ఎడిషన్‌కి, ప్రింట్‌కి) తేడా లేదు. ఒకసారి అక్షరాలు కూర్చిన పుస్తకాన్ని, అదే విధంగా తిరిగి అచ్చువేస్తే అది ముద్రణ. లేదా మళ్ళా అక్షరాలు కూరిస్తే, తిరిగి పరిష్కరిస్తే అది కూర్పు. ప్రతిసారి మళ్ళా మళ్ళా అక్షరాలు కూర్చుకునే పూర్వపు రోజుల్లో ప్రతిది కూడా కూర్పే. కాని డిటిపి వొచ్చిన ఈ రోజుల్లో కొత్తగా మళ్ళా డిటిపి చేస్తే, దాన్నే వేరే కూర్పుగా భావించాలి. కొత్త కూర్పు అయితే, పేజి నంబర్లు మారతాయి. కేవలం మరో ముద్రణే అయితే పేజీ నంబర్లు మారవు. ఈ సమాచారం అంతా చిన్న అక్షరాలలో ఉండాలి.

ప్రిఫేస్ / ఫోర్‌వర్డ్: ఈ పదాలకి తెలుగులో ప్రామాణికమైన పదాలు లేవు. ఎవరిష్టం వచ్చినపేర్లతో వారు వేస్తున్నారు – ముందుమాట, తొలిపలుకు, పరిచయం, నామాట, ఇలా రకరకాల పేర్లు వాడుతున్నారు. పేరు ఏది వాడినా ప్రచురణ సంస్థలు ఒక ప్రమాణాన్ని పాటించడం ముఖ్యం.

అనుక్రమణిక, గ్రంథ, పాద సూచికలు: ఒక రచనలో ఉపయోగించిన పుస్తకాల జాబితా ఇచ్చేటప్పుడు పాశ్చాత్య పుస్తక ప్రచురణలో ఒక నిర్దుష్ట క్రమంలో ముందుగా రచయిత(త్రి) ఇంటిపేరు, పేరు, పుస్తకం పేరు (వాలు అక్షరాలలో,) ప్రచురణకర్త పేరు, ఊరు, అచ్చయిన సంవత్సరం ఉంటాయి. అలాగే వ్యాసాల జాబితా ఇచ్చేటప్పుడు కూడా కొన్ని పద్ధతుల్ని పాటిస్తారు. పాదసూచికల విషయంలోనూ ఇలాగే. వీటి వేటి విషయంలో కూడా తెలుగులో ఒక పద్ధతి అంటూ లేదు. తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించి గొప్ప రిఫరెన్సుగా చెప్పబడే ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఈ లేమికి ఒక మంచి ఉదాహరణ.


33. పుట వారలు

పుట అలంకరణలు, వారలు (margins): తెలుగు పుస్తకాలు ఇప్పుడు చాలవరకూ డిటిపి షాపుల్లో కూర్పు అవుతుండడం మూలాన, మనకి రకరకాల వారలు, నమూనాలు కనిపిస్తాయి. పేజీ డిజైనుకి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. పుస్తకం బైండింగు దగ్గరి లోపలి మార్జిన్లు బైటి మార్జిన్లకంటే కాస్త తక్కువగా ఉంటాయి, అందువల్ల కుడి, ఎడమ పుటలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. వెలుపలి వార ఒక మనిషి బొటనవేలు పరిమాణం కంటే కొంచెం పెద్దగా ఉండాలి. అందువల్ల, పుస్తకం వాడిన వేలి మరకలు వారలోనే ఉంటాయి కానీ, విషయం మీదకి పోవు. ఎడంవైపు పుట మొదట్లో పుస్తకం పేరు, కుడివైపు పుట మీద అధ్యాయం పేరు వేస్తారు. పుట సంఖ్య కింద గానీ, పైన గానీ ఎడం వైపు కాగితపు ఎడం వైపున, కుడి కాగితానికి కుడివైపున వేస్తారు – అసలు విషయం చుట్టూ గీతలు, ముగ్గులతో ప్రహరీలు వంటి అలంకారాలు సాధారణంగా ఉండవు.


34. జాకెట్ డిజైన్

తొడుగు (dust jacket) బైండింగ్ చేసిన పుస్తకానికి, పైన దళసరి ఆర్టు పేపరు పైన వేసే ముఖపత్రపు తొడుగుని డస్ట్ జాకెట్ అంటారు. తెలుగులో ఈ తొడుగు ఎక్కువ పుస్తకాలకి కనిపించదు. ఈ తొడుగు పుస్తకపు బైండింగు లోకి మడతపెట్టి ఉంటుంది. పుస్తకం ముందు వైపున్న మడత మీద పుస్తకం గురించి, పుస్తకం వెనక వైపు ఉన్న మడతపై రచయిత గురించి పరిచయవాక్యాలు ఉంటాయి.


35. ఒక చక్కటి పుస్తకం
మనుచరిత్ర, 2015
మూర్తి క్లాసికల్ లైబ్రరీ.

ఇంతవరకూ, ఒక పుస్తకాన్ని ఒక అందమైన వస్తువుగా తీర్చిదిద్దడంలో, ఇంగ్లీషు ప్రచురణరంగంలో ఉన్న కొన్ని మార్గదర్శకాలు చూశాం. అయితే అంతకన్నా ముఖ్యంగా, పుస్తకాలకి ప్రచురణ సంస్థలు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని, తమదైన ఒక శిల్పాన్ని, నమూనాని తయారుచేస్తాయి. పుస్తకం చూడగానే అది ఎటువంటి పుస్తకమో, ఎవరు ప్రచురించారో సులువుగా గుర్తించవచ్చు. ఇది పుస్తక ప్రచురణలో అతి ముఖ్యమైన అంశం. ఉదాహరణకి, పెంగ్విన్ పుస్తకాలు ఏవైనా సరే, వాటికి ఒక నమూనా ఉంది. అలాగే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి ప్రెస్సు పుస్తకాలు, అమెరికన్ ప్రచురణ సంస్థల పుస్తకాలకి వాటిదైన ఒక ముద్ర ఉంటుంది. ఆ ప్రత్యేకరూపాన్ని తయారుచెయ్యడానికి ప్రత్యేకంగా డిజైనర్లు ఉంటారు. అలాగే, ప్రసిద్ధి చెందిన ప్రచురణ సంస్థలు అవి ప్రచురించే పుస్తకాల విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాయి – ఒక్కో ప్రచురణ సంస్థ పుస్తకం అనగానే దానికో విలువ, నాణ్యత ఉంటాయని పాఠకులకి ముందుగనే తెలుస్తుంది.

ఆ నాణ్యతే ఒక పుస్తకాన్ని పాఠకులు చేతిలోకి తీసుకునేలా చేస్తుంది!


(మహాప్రస్థానం మొదటి ప్రచురణ ముఖచిత్రాలు పంపిన మన్నం ‘మనసు’ రాయుడుగారికి మా కృతజ్ఞతలు. ఈ వ్యాసం లోని కొన్ని చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకున్నాము.)

[02 సెప్టెంబర్ 2015: స్పష్టత కోసం వ్యాసం కొంతగా పరిష్కరించాము – సం.]

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం \"తెలుగులో కవితా విప్లవాల స్వరూపం\" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...