అయ్యబాబోయ్‌ లక్షరూపాయలే!!

ఏ నాటిదో చాలా పాత సినిమా. పాతాళభైరవేమో; బాగా గుర్తు లేదు. అందులో, “ఓరీ రాక్షసుడా! నీకు ఏం కావాలో కోరుకో” అని అనంగానే,ఆ రాకాసి పీనుగ, యస్‌ వీ. రంగా రావు కూడా అదిరిపడేటంత అట్టహాసంగా నవ్వి, “వెయ్యి ఏనుగులు కావాలిరా,” అంటాడు. అప్పుడు, బాలకృష్ణో, రేలంగోడో (మా రోజుల్లో అల్లాగే అనేవాళ్ళం!), “అయ్య బాబోయ్‌ వెయ్యి ఏనుగలే? రాక్షసుడా! బుల్లి బుల్లి కోరికలు కోరుకో; కోడిగుడ్డులో,కొబ్బరి కాయలో” అని ప్రాధేయ పడతాడు. అప్పుడు వాడు, “అయితే నాకు కోటి కోడిగుడ్లు కావాలి!” అంటాడు. వెంటనే కోటి కోడిగుడ్డులూ ఆకాశం నుంచి గడగడ వడగళ్ళలా కురిసి, పెద్ద గుట్ట తయారవుతుంది, వెండితెరమీద! అదే, ఇప్పుడయితే, ఆ రాక్షసుడు, కనీసం వెయ్యికోట్ల కోడిగుడ్లు కోరుకొని వుండేవాడే! ఎందుకంటారా! ద్రవ్యోల్బణం స్వామీ, అందుచేత! ద్రవ్యోల్బణం అంటే అర్థం కాలేదూ? అదే, తెలుగులో దాన్ని ఇన్‌ఫ్లేషన్‌ అంటారు.

నిజం చెప్పద్దూ! ద్రవ్యోల్బణము, అంటే, ద్రవ్య, ఉల్బణము, అవునా కాదా అని కంగారుపడి, నిఘంటువు వెతికేశా, ఏ మహేశప్రసాదుడో, ఏ సంస్కృతవీరభద్రుడో, నన్ను చీల్చి చెండాడకముందే! నా సంధిక్రమం కరెక్టే! దీనిని గుణసంధి అనో, యణాదేశం అనో అంటారు కాబోలు. ఉల్బణము అనగా “అధికము,””మిక్కుటమైనది,” అని నిఘంటుకర్త రాశాడు. అంతే కాదు. “తస్యాసీ దుల్బణో మార్గః” ర.వం. 4 33 అని కూడ వాక్రుచ్చాడు. ఇలా, ర.వం.4 33, కా.ఖ. 8 11, ఋ.వే. 10 95 అని రాస్తే, నాకు ఎప్పుడూ,టీవీలో అమెరికా ఫుట్‌బాల్‌ ఆటే గుర్తుకొస్తుంది. ఆట మంచి పసందుగా ఉండగా జనానికి అడ్డంగా గేలరీలో నించొని,ఒక అట్టమీద జాన్‌ 3 16 అని పెద్ద అక్షరాలలో రాసి, నిర్భయంగా నవ్వుతూ నిలబడ్డ వాళ్ళే గుర్తుకొస్తారు. మనం ఇంటికెళ్ళి, బైబిల్‌లో జాన్‌ 3 16 సూక్తి వెతికి చూసుకొని తరించాలని ఈ అర్భకుడి కోరిక! కొత్త రోజుల్లో ఈ 3 16 కీ, ఫుట్బాల్‌ ఆటకీ ఏదో అవినాభావ సంబంధం ఉన్నదని భ్రమపడి బైబిల్‌ చూశా! నిజం చెప్పద్దూ! ఈ సూక్తికి, ఫుట్బాల్‌ ఆటకీ,ఏ సంబంధం లేదు, కేవలం బాదరాయణ సంబంధమే! ఈ సూక్తి ఏమిటంటారా? ఉజ్జాయింపుగా జాన్‌ 3 16 తాత్పర్యం ఇది “దేవుడు ఈ ప్రపంచకాన్ని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టే తన ఒక్క గాను ఒక్క బిడ్డనీ ఈ ప్రజలకి ఇచ్చాడు. అందుకనే, ఈ బిడ్డని నమ్మిన వాడికి నశింపులేదు, సరిగదా తను చిరకాలం జీవిస్తాడు.” మరి మీరే చెప్పండి, ఫుట్బాల్‌ ఆటకీ దీనికీ ఉన్న సంబంధం?

ఇంతకీ, అసలు విషయం ఏమిటంటే, మా లాగ ఎప్పుడో ధాత నామ సంవత్సరంలో ఈ అమెరికా అనే ఫాదర్‌లాన్డ్‌ కి వలస వొచ్చేసిన వాళ్ళకి, లక్ష అనంగానే కన్ను కుట్టేసే అవకాశం ఎక్కువే. కాదు మరీ! నేను మన మదర్‌లాన్డ్‌లో, కాలేజీలో మేష్టరుగిరి వెలిగించిన రోజుల్లో,కరువు భత్యంతో కలుపొకొని రెండువందల నలభై రూపాయలు నెలజీతం. అదీ అంతా ఒక్కసారే ఇచ్చి చచ్చేవాళ్ళు కాదు. అదేదో యూ.జీ.సీ. గ్రాంటు వచ్చేదాక మనకి నూట యాభయ్యే గతి! మరి, లక్ష అనంగానే, గుండె గుభేల్‌ మనదూ! అప్పట్లో లక్షాధికారి అంటే ఎంత పరువు, ప్రతిష్టా, పలుకుబడీనో వేరే చెప్పాలా! ఇప్పుడు, వీధిలో మాధాకోళం అడుక్కునే వాడు కూడ లక్ష అంటే కన్నెత్తి చూడడు, ఖాతర్‌ చెయ్యడు. ఆయనెవరో, మంత్రి గారు అన్నారని వినికిడి. ఎవరో బడిపంతులు ట్రాన్స్‌ఫర్‌కోసం,మంత్రి గారికి ఏదో మామూలు ఇద్దామని వస్తే,ఆయనగారు బహిరంగంగానే అన్నారట “నా పేరులోనే కాసులూ వజ్రాలూ ఉన్నాయి. అంతకన్నా ఎక్కువయితేనే, ఆ పంతులుని లోపలికి రమ్మను. లేకపోతే… ఆయన మొహం మనకి చూపించనక్కరలేదు,” అని.

ఇది ఉల్బణమా, లేకపోతే అదేదన్నా రోగమా? మీరే చెప్పండి. ముందటేడు హైదరాబాదులో అదేదో హోటల్లో మధ్యాన్నం భోజనానికి వెడితే,తస్సాదియ్య, ఒక్కొక్కడికీ, మూడువందల నలభై రూపాయలయ్యింది, టిప్పు కాకండా. ఇంతా ఏడిసి, తిన్నది ఆకులూ అలాలూను. కనీసం ఆ హోటల్‌ వాడు ఒక్క కోడిగుడ్డు కూడా పెట్టలేదు. ఇహ, కోడిమాట, మేక మాట మరిచిపోవాల్సిందే!

చెప్పొచ్చేదేమిటంటే, మాకు, మా “పీర్స్‌”,కి లక్ష అనంగానే అసూయ కలగటం పెద్ద చెప్పుకోదగ్గ విశేషం కానేకాదు.

అసూయ అంటే గుర్తుకొచ్చింది. ఎక్కడో చదివాను. ఆశఖరీదు అణా అని. అదే నిజమయితే, అసూయ ఖరీదు గ్యారంటీగా లక్ష వుండితీరుతుంది.

మీ సంగతి తెలీదు గానీ, నామటుకు నాకు లక్ష అంటే, మా తాతమ్మే గుర్తుకొస్తుంది. ఆవిడ, తాటాకుతో అల్లిన బుట్టలో రోజూ దూదితో దీపం వత్తులు చేసి పెట్టుకునేది. ఆబుట్టకి పైన మూత కూడా ఉండేది. అతి జాగ్రత్తగా ఆ పెట్టె మడిగా మూసి పెట్టేది. అయితే, రోజూ రెండో మూడో వత్తులు, ఆ వత్తులపెట్టెలోనించి తీసి,తులసి కోటముందు దీపం పెట్టి ఒకఘంటసేపు ఏదో గొణుగుతూ కూచునేది. మా అమ్మకూడా దేవుడిగదిలో దీపారాథనకి ఆ పెట్టెలోనుంచే వత్తులు తీసుకునేది. “లక్ష వత్తులూ అవంగానే, లక్షవత్తుల నోము చెయ్యాలి,” అని మా తాతమ్మ రోజూ అంటూ ఉండేది. నాకు తెలిసినంతవరకూ, ఆవిడ నిజంగా లక్ష వత్తుల నోము చేసిన రోజున లక్ష వత్తులూ వెలిగించ లేదు. లక్ష వత్తుల నోము అంటే మాటలా! పోలాల అమావాస్యనాడో, కార్తీక పూర్ణిమ నాడో గుర్తులేదు. ఆ రోజు,బియ్యపుపిండి తడిపి, ముద్దచేసి, దానితో బుల్లిబుల్లి దీపపు కుండీలు కట్టి, వాటిల్లో పేరినెయ్యి పోసి, లక్ష వత్తులూ వెలిగించి, జాగర్తగా అరటి దోనెల్లో ఆ దీపాలన్నీ వరసగా పెట్టి, ఏలూరు అగ్రహారంలో ఆంజనేయస్వామి గుడికెదురుగా వున్న కాలవ మెట్లుదిగి, ఆ దీపాలతో వున్న అరిటి దోనెలన్నింటినీ ఆ కాలవలో వదలాలి. ఆ రోజే తోటకూర ఇగురు; పిండి వడియాలు వేయించిపెట్టిన ఇగురు… అబ్బ! ఆ కూర ఎంత బాగుంటుందో! ఆ ఇగురు తినాలి. మరయితే, ఇప్పట్లా కాదు లే! అప్పట్లో, ఏలూరు కాలవలో నీళ్ళు నీలంగా నిండుగా బాగానే వుండేవి. స్నానానికి శుభ్రంగా ఉండేవి. తాగడానికి రెండు చిళ్ళగింజలు అరగదీసి పడేస్తే చక్కగా తేటగా వచ్చేవి తియ్యటి మంచినీళ్ళు. కృష్ణా గోదావరీ నదులు కాలవ ద్వారా మా ఏలూరులోనే కలిశాయి! అందుకేకాబోలు! మా వాళ్ళు ఏ పూజ ప్రారంభంలో నైనా సరే,మన “యెడ్రస్‌” సంస్కృతంలో చెప్పేటప్పుడు “కృష్ణాగోదావరీ యూరమధ్యేశే,” అని మా ఏలూరు ఉనికి గురించి “కర్రెక్ట్‌ గా చెప్పుకుంటారు. అంతేగానీ, కొల్లేరు పక్కనే వున్న ఏలూరు అని చెప్పరు!!

నేను మా తాతమ్మతో ఎప్పుడూ అనేవాడిని! ఆ వత్తుల బుట్టలో లక్ష వత్తులు వుండవు, అని. “ఏడిశావులేరా వెధవనాగన్న! లక్ష వత్తులకి పైనే వుంటాయి. రోజూ వత్తులు చేసి బుట్టలో పెట్టానుగా,” అని డబాయించేసింది. కానీ, ఆవిడకి మనసులో అనుమానమే! లక్ష అంటే మాటలా? చాలా పెద్ద అంకె కదా! చచ్చి ఇప్పుడు ఎక్కడుందో కానీ, పాపం! ఒక సారి నన్ను అడిగింది “ఒరే! వెంకటీ! నీకు అమెరికాలో జీతం వెయ్యి రూపాయలన్నా ఇస్తారురా, అని. లేదే! లక్ష రూపాయలిస్తారు,” అని చెప్పా! నమ్మినట్టు లేదు; నవ్వేసి వూరుకుంది.

అసలు కథ ఏమిటంటే, ఈ మధ్య అమెరికాలో తెలుగువాళ్ళు నవలలు రాయడానికి పోటీలు పెట్టి, ఆ పోటీల్లో ఒక నవలకి లక్ష రూపాయలు పారితోషకం ఇచ్చారని విన్నా. చెప్పద్దూ! నాకుకూడా, కాస్తోకూస్తో అసూయ కలిగిన మాట నిజమే. పైగా, అమెరికాలో ఉన్న తెలుగు రచయితలు ఈ పోటీలో పాల్గొనటానికి అర్హులు కారని తెలియంగానే, నా మటుకు నాకు మహచెడ్డ కోపంగూడా వచ్చింది! అసూయ కాదు, కోపమూ కాదు; తపన అంటారా! మరి మీ ఇష్టం. దీని సిగతరగ! ఇంతాచేస్తే, ఆ బహుమతి పొందిన నవల నూటయాభై పేజీలుకూడా లేదు. పేజీ సైజు, 1్‌8 డెమ్మీ. పోనీ వెయ్యి పేజీలు ఉంటే, ఫరవాలేదు అనుకోవచ్చు. కాగా, ప్రతి పేజీలో అక్షరాల కన్నా ఆశ్చర్యార్ధకాలు, వరసగా ఫులిస్టాపులే ఎక్కువ! దానికి తోడు, వాక్యానికీ, వాక్యానికీ మధ్య గజాల కొద్దీ ఖాళీ! పుస్తకం చదివేసింతరువాత నాకు అనిపించింది. ఓస్‌ ఇంతేనా! ఇలా నేనూ రాయగలను, అని. నాకే కాదు, నాలాగా కన్ను కుట్టిన చాలా మందికి అల్లాగే అనిపించివుంటుంది. నేనయితే, మా అవిడతో అనేశాను కూడాను. మా ఆవిడ మహ తెలివిగలది. వెంటనే, “మీరు రాయలేదు. అతనెవరో రాశాడు, అంతే!” అని నా నోరు మూయించింది. పోనీ ఊరుకుందా? ఎబ్బే! పెద్ద
లెక్చర్‌ మొదలెట్టింది!

“నిజంచెప్పాలంటే, బహుమతి ఏ ఐదువేలో, పదివేలో అయితే, మీబోటి వాళ్ళకి ఇంత తపన వుండేది కాదు. ఈ మనోవ్యాధీ వుండేది కాదు. ఈ మనోవ్యాధి,ఈ తపనా,లక్ష రూపాయల బహుమానం మూలంగానే! ఇల్లా మనోవ్యాధి పట్టి ఉసూరు మనే వాళ్ళకి, ఒక్కే ఒక్క మందు. ఈ నవలకి నలభై రెండులక్షల ఎనభైవేలు, పారితోషికం అని ఘట్టిగా అరిచి చెప్పి; మెల్లిమెల్లిగా ఎవడికీ వినపడీ వినపడకుండా నట్లుగా, అదే! అలనాటి ధర్మరాజులాగా “అశ్వథ్థామ హతః,కుంజరః” అన్నట్టు “లీరాలు,” అనాలి. దాంతో, మీబోటి ముసలి ఘటాలకి గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు. ఇకమీద, మీలాగా ఇలా అసూయతో అలమటించే కొందరు మహానుభావులకి రోగం ఠక్కున కుదురుతుంది; వాళ్ళ తపనా తీరుతుంది. బహుమతులు ఇచ్చే మరికొందరు మహారాజులకి పీడా విరగడౌతుంది; వాళ్ళ కుతీ తీరుతుంది.

ఏ మాటకి ఆమాట చెప్పుకోవాలి. బహుమతి వచ్చిన ఏ పుస్తకం చాలా బాగున్నది అని ముచ్చటగా ఎప్పుడయినా, ఏ విమర్శకుడు, పుస్తకం చదివిన విమర్శకుడైనా, చదవని విమర్శకుడైనా సరే, రాశాడా?

ఇప్పటికీ, ఆ విశ్వనాథ సత్యనారాయణగారి వేయిపడగలు నవలకి,ఆ రోజుల్లో “వెయ్యి రూపాయలు” (అయ్య బాబోయ్‌ వెయ్యి రూపాయలే!!)ఎందుకిచ్చారా అని కుమిలి కుమిలి బాధ పడేవాళ్ళే తప్ప! కాలం ఎంత మారినా, మన నైజం మాత్రం చచ్చినా మారదు! అందుకే అన్నారు, పుఱ్ఱెతో పుట్టిన బుద్ధి పుడకలతోగానీ పోదు, అని!

ఈ బహుమతి వచ్చిన నవల ధోరణి చైతన్య స్రవంతి ధోరణి. మీ బోటి డమ్మీలకి ఆ ధోరణి అంటే ఏమిటో కాస్తన్నా బోధపడుతుందేమో అన్న చిరు ఆశతో రాసిపెట్టాను! ఇదిగో…” అంటూ నా వేపు విసిరింది,ఆ నాలుగు కాగితాలూ!

(తపన for Dummies
Nah! It ain”t no aping
Ulysses for Dummies.)

ఒకటి

“ఆత్మ మధ్యలో ముకురం
ప్రపంచపు తునకల్ని
తునకలు తునకలుగా
ప్రతిబింబించి
పదిలపర్చుకుంటుంది.

చీకట్లను చీలుస్తూ
కనుపించని తార్రోడ్డు
ని మింగేస్తూ
బస్సు

మంచుగాలి
చల్లటి మంచుగాలి
కనుపించని పొడుగాటి
వేళ్ళతో
వెంట్రుకల్ని
వెనక్కి దువ్వుతూ…

చీకటిని చీల్చుకుంటూ
వెన్నెల
మంచుగాల్ని కావలించుకొని
తెలీని రుచిగా
నా పెదాల్ని తాకుతూ
నన్ను కవ్విస్తూ
ఎక్కడిదీ గాలి?
ఎప్పుడు పుట్టిందీ గాలి?

రెండు

రాత్రి రంపంలా కోస్తుంది
రాత్రి కరుస్తున్నది
కలలనీ
కామాన్నీ
రాత్రి కురుస్తున్నది
తెగిపోయిన నెత్తురు చుక్కలు
పక్కలోదొర్లి దొర్లి
కోరికల ఉధృతాన్ని
ఊహల్తోతీర్చుకోబోయి
పిచ్చెక్కి
అలసి సొలసి
ఆ అంపశయ్యమీద
ఎప్పుడో నిద్రపోతాడు…
బాధ బాధ
నరనరాల్నీ
వేధిస్తున్న బాధతో!

మూడు

Watched through the webbed window
The lapidary”s fingers
Prove a dulled chain again.

Dust slept on dull coils
of bronze and silver;
Dust webbed the window and
showtrays.

Dust slept on
Lozenges of cinnabar
on rubies
Leprous and winedark
Stones.

Throb within and throb without;
Your heart you sign of
I between them

What did you buy that for?
To learn French??

“Se el yilo nebrakada
femininum! Amore me solo!
Sanktus!
Amen.”

నాలుగు

కోమలి
పెట్టెలు సర్దుతుంటే
కవర్లో
వెంట్రుక.
పొడుగాటి
వెంట్రుక.

అమృతానిది…
అని చెప్పినా
ఏమి ప్రయోజనం?

“ఎక్కడికి ఈ చీకట్లో?”
“ఎక్కడికో తెలిస్తే, ఇకనేం?…
గమ్యం లేదు.”

“నడవగలవా నువ్వు?”
“ఓ! అని మూతి సున్నాలా చుట్టి.”

రాళ్ళు, గుట్టలు, పొదలు
అంతా చీకటి.
పైనా కిందా
అన్నీ
నక్షత్రాలే!
కోటివజ్రాలై,
ఎవరికీ అందకండా.

రెండు కొండల మధ్యనుంచి
అవతలకి.
అవతలంటూ లేని
అవతలకి.
అవతలకి చేరుకున్నా నడిచి నడిచి
నడిచి నడిచి
నడిచి నడిచి…
మళ్ళీ అక్కడికే!

ఐదు

అనుభవానికి
హద్దుల్లేవు.
అందుకే
Hamletని
పరపరా చింపేయి.

నేనే ఏ బెర్నార్డ్‌షా నో అయివుంటే, చదవడానికి తీరికచిక్కలేదని
చెప్పుతూ, అద్దాలమేడలో కూర్చొని డెర్రిడా పుస్తకాలు అలమరలో
అందంగా అమర్చి పెట్టుకున్న విమర్శకుల మేలుకోరి వచనంలో ఒక
నాలుగో పదో వాక్యాలు ప్రత్యేకంగా వాళ్ళ కోసం రాసి పారేసి
వుండేదాన్ని!

ప్చ్‌. ఆ భాగ్యం లేదు మీకు, పాపం!!

p.s –

తపన కి అంపశయ్య
Ulysses లో చివరకిమిగిలేది
చైతన్యస్రవంతి
అని label
చేసుకోండి. మీ ఇష్టం.
అంతే.

అసలు విషయం
రావి శాస్త్రీ చలం
కృష్ణశాస్త్రి వచనం
అన్నీ
కవితలే! అర్థం
కాదంటే
మీ ఖర్మం.
అంతే.