జీవితంలో ఎన్నడూ విమానం కూడా ఎక్కని మనిషి వున్నట్లుండి రాకెట్లో చంద్ర మండలానికి వెళ్ళవలసి వస్తే కలిగే భయం, ఉద్వేగం నాలో కలుగుతున్నాయి. భయానికి పరాకాష్ట స్తబ్దత అయినట్లు శరీరం, మెదడు రెఫ్రిజిరేటర్లో పెట్టినట్లు గడ్డ కట్టుకు పోతున్నాయి. బస్సు కదులుతోంది. ఏవేవో పెద్ద పెద్ద బిల్డింగులు కదిలి పోతున్నాయి. కాని మొద్దు బారిన మెదడు అవేవి గ్రహించే స్థితిలో లేదు.
“ప్రక్క స్టాపులోనే దిగాలి పిన్నీ.” శ్రీను మాటలకు ఆలోచనల్లోంచి తేరుకున్నాను. అంతలోనే పరీక్షకు సమయం దగ్గర పడుతోందన్న ఆలోచనతో గుండెల్లో గాభరా. యాంత్రికంగానే బస్సు దిగి శ్రీను వెంట నడిచాను.
“సరే బాబు, నువ్వెళ్ళి ఓ గంట, గంటన్నర తర్వాత రా. నేను లేక పోతే ఇక్కడే వెయిట్ చెయ్యి,” అన్నాను.
నా జీవితం అతి సాధారణమైనది. బీద కుటుంబంలో మూడో అమ్మాయిగా పుట్టాను. నాన్న స్కూల్ టీచర్. నాకు కాస్తన్నా ఇంగ్లీషు పరిజ్ఞానం అలవడడానికి, మాట్లాడడానికి ఆయన ఇంగ్లీషు టీచర్ అవడమే కారణం. ఇన్నేళ్ళ జీవితంలో నాకోసం నేను, నా సంతృప్తి కోసం చేస్తున్న మొదటి సాహస కార్యం ఇది. ఏ వయస్సులోనూ ఏదో ‘థ్రిల్’ కావాలని కలలో కూడా అనుకొని ఎరగను. అలాంటిది ఈ వయస్సులో పురి విప్పిన ఈ కోరిక, అణచుకోలేని ఆరాటం ఎవరికయినా నవ్వు తెప్పించేవిగానే ఉండొచ్చు. జీవించడం కోసమే జీవించే నా లాంటి వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సమయంలో ఓ చిన్న అడ్వెంచర్ చేయ్యాలనిపించడం తప్పు కాదనుకొంటాను.
చేతిలో ప్యాకెట్ పట్టుకొని ఎదురుగా కనిపిస్తున్న ద్వారంలోకి అడుగు పెట్టాను. చాలా పెద్ద హాలు. ఒక ప్రక్కగా కౌంటర్లో రిసెప్షనిస్ట్ కూర్చుని ఫోనులో మాట్లాడుతోంది. తడబడే అడుగులతో దగ్గరగా వెళ్ళాను.
“యస్,” అంది మౌత్ పీస్‌కి చెయ్యి అడ్డం పెట్టి. మామూలు చీరలో అతి మామూలుగా కనిపిస్తున్న నాకు ఈ స్టార్ హోటల్లో ఏం పనా అన్నట్లు అనుమానంగానూ, రవ్వల హారంలో ఓ గాజు పూస కనిపించినంత ఆశ్చర్యంగానూ చూస్తోంది. ఈ రోజు అనుమానాలు, ఆశ్చర్య పోవడాలు చాలా చూడాలనుకుంటాను.
“రూమ్ నంబర్ రెండు వందల ఐదుకి వెళ్ళాలి” అన్నాను ఇంగ్లీషు సంభాషణకి పునాది వేస్తూ.
“ఓ.. మిస్ క్రిస్టీనా ని కలవాలా?” అర్థమైందన్నట్లు చూసింది. “అలా వెళ్ళండి. ప్రక్కనే లిప్టు ఉంది” అంది.
“ఏ అంతస్తు?” అడిగాను.
“రెండో అంతస్తు.” ఆమె ముఖంలో ఎక్కడిదీ అవతారం అన్నట్లుగా నవ్వు. పట్టించుకోకుండా “థాంక్స్” అని చెప్పి అటు వైపు నడిచాను. లైఫ్ లో లిఫ్టు ఎక్కిందే ఓసారి. అప్పుడు ప్రక్కన శ్రీవారు ఉన్నారు.
రిసెప్షనిస్ట్ ఫోనులో చెప్తోంది. “నేను చెప్పాను చూడు, క్రిస్టీనా అని స్వీడన్ నుంచి వచ్చింది, ఓ పాపను పెంచుకోవాలనుకుంటుందని. దాని కోసం కాబోలు పల్లెటూరావిడ వచ్చింది. వార్తలు మూల మూలలకీ పాకి పోతున్నాయనడానికి నిదర్శనం కదూ.”
కూడగట్టు కుంటున్న ధైర్యం ఒక్కసారిగా దిగజారి పోతున్న భావం. అడుగులు తడబడ్డాయి. చేతిలో ప్యాకెట్ జారబోయింది. గట్టిగా గుండెలకు హత్తుకున్నాను. వేంకటగిరి జరీ చీర కొనుక్కోవాలని ఏడాది పాటు శ్రమపడి దాచుకున్న డబ్బుతో కొన్న వస్తువు.
ప్రక్క గదిలోంచి వెయిటర్ ట్రే తో బయటకు వచ్చాడు. నేను నిలబడ్డ తీరు అతడిలో అనుమానం రేకెత్తించినట్లు నా మీద నిలచిన అతడి చూపులే చెపుతున్నాయి. అతడు అరవంలో ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకూడదని తలుపు మీద దబ దబా బాదేశాను.
“హు ఈసిట్? కమిన్” స్త్రీయో పురుషు డో తెలియని కంఠ స్వరం. తలుపు తెరిచి లోపలి అడుగు పెట్టాను. చేతిలో డోర్ హ్యాండిల్ నేను తూలి పడిపోకుండా ఆసరా ఇస్తోంది.
“ఎవరు మీరు? ఏం కావాలి?” ఇంగ్లీషులో అడుగుతోందావిడ. గదిలో వంటరిగానే వుంది. టీ తాగుతూ, పేపరు చదువుకుంటోంది.
“మిస్ క్రిస్టీనా.” అన్నాను నోరు పెగుల్చుకొని.
“నేనే. రండి. కూర్చోండి,” అంది చిరునవ్వుతో. మెల్లిగా వెళ్ళి సోఫా అంచున కూర్చున్నాను. ప్రక్కనే మరో గది ఉన్నట్లు అప్పుడే గ్రహించాను. నాలో భయాన్ని , ఆందోళనని గ్రహించినట్లుంది. స్నేహపూరితంగా నవ్వింది.
“కొంచెం టీ తీసుకుంటారా?” అడిగింది.
“ఊఁ” అన్నాను. వేడి వేడి టీ నా ఉద్వేగాన్ని కొంతయినా తగ్గించ వచ్చు. పాట్ లోంచి టీ కప్పులోకి వంపి అందించింది. టీ సిప్ చేస్తూ ఆమె వైపు చూశాను. నా కంటే చిన్నదే. చక్కటి గులాబి రంగు ఒళ్ళు. తేనె రంగు కళ్ళు. కలువ రేకుల్లాంటి అందమైన సొగసైన కళ్ళు కావవి. వెన్నెల నింపుకున్న కళ్ళు. మమతను ప్రసరించే కళ్ళు.
“నాకు టీ చాలా అలవాటు. అరగంటకో కప్పు తాగుతుంటాను” అంది క్రిస్టీనా. అపరిచిత్వాన్ని పరిచితం చేసుకోవడానికి ప్రయత్నం. నాలో లేనిదీ, ఆమెలో ఉన్నదీ ధైర్యం, కలుపుగోలుతనం. టీ తాగాక నిజంగానే కాస్త తెరిపిన పడ్డాను.
“నేను ఆంధ్రా నుంచి వచ్చాను. గోదావరి ప్రాంతంలో ఒక టౌన్ మాది. నా పేరు శాంత” అన్నాను.
“ఆంధ్రా అంటే మీరు మాట్లాడేది తెలుగు భాష కదూ. మా దేశంలో నేను పని చేసే హాస్పిటల్లో ఒక తెలుగు డాక్టరున్నారు. ఆయన దగ్గర కొద్దిగా తెలుగు నేర్చుకున్నాను” అంది ఉత్సాహంగా.
ఆంధ్రేతరుడైన ప్రధాన మంత్రి ఒక వాక్యం తెలుగులో అపశ్రుతులతో మాట్లాడితేనే పొంగి పోయే జనాల్లో ఒకదాన్ని కదా. “అలాగా” నిజంగానే సంతోషించాను.
“నేనెక్కువగా చదువుకోలేదు. ఇంగ్లీషు అంత బాగా రాదు” అన్నాను. నేను మాట్లాడుతున్న దానిలో వ్యాకరణ దోషాలు దొర్లడం నాకే తెలుస్తోంది.
“ఫర్వాలేదు. ఒకరి మనసులో భావాలు మరొకరికి అర్థమయ్యేటట్లు చేయడమే భాష పరమార్థం. మీ భావం అర్థమవుతున్నప్పుడు అందులో దోషాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పండి.” ఆవిడ స్వరం మారింది. మాటలు విరిచి స్పష్టంగా పలుకుతోంది.
“ఒక తెలుగు పత్రికలో మీరిచ్చిన ఇంటర్వ్యూ చదివాను. నన్ను చాలా కదిలించింది. అందుకే వచ్చాను” అన్నాను.
“తెలుగు పత్రికలోనా? నేను తమిళ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన మాట నిజమే. దాన్నే అనువదించి వేసుంటారు. మా అమ్మాయి జెనిఫర్ గురించి కూడా వ్రాశారు కదూ.”
“అవును. మీ పాప, అదే, జెన్నిఫర్ కోసం తెచ్చాను.” ప్యాకెట్ అందించాను. “ఇది చెక్క బొమ్మ. ఏనుగు అంబారి. కొండపల్లి అని ఆంధ్రాలో ఒక వూళ్ళో చేస్తారు.”
“ఓ థాంక్యు. జెన్ని స్నానం చేస్తున్నట్లుంది. తనకి ఇలాంటి వంటే చాలా యిష్టం. అంత దూరం నుంచి వచ్చారు. సంతోషం. కానీ కానుకలు దేనికమ్మా?”
“అలా అనకండి. ఏదో చిన్న కానుక. నా సంతోషం కోసం.”
“మీకెంత మంది పిల్లలు?” అడిగింది క్రిస్టీనా.
“ముగ్గురు,” చెప్తుంటే కంఠం వణికింది.
“అందులో ఎవరయినా హాండికాప్డ్ , అంటే వికలాంగులు… సారీ.. అలా అడక్కూడదనుకుంటాను.”
“ఫర్వాలేదు. కానీ అలాంటిదేమీ లేదండీ. నా ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు.” ఆవిడ అనుమానం అర్థం అయింది. రిసెప్షనిస్టు లాగా నేను పిల్లని పెంపకానికి ఇవ్వడానికి వచ్చాననుకుంటుంది. ఆవిడ అనుమానం తీర్చాలనిపించింది.
“మా ఎదురింట్లో వాళ్ళకి ఇద్దరు పిల్లలు. అందులో బాబు వికలాంగుడు. నడవలేడు. అన్నీ మంచం మీదే. ఆ ఒక్కడిని చూసుకోవడానికి వాళ్ళు చాలా అవస్థ పడుతుంటారు. సరయిన నిద్ర కూడా ఉండదు. వాళ్ళ బాధ చూసాక అసలు పిల్లలు పుట్టక పోయినా ఫర్వాలేదు. కానీ ఇలాంటి బిడ్డలు వద్దు అన్పిస్తుంది. అలాంటిది మీరు వికలాంగురాలైన ఒక పాపను పెంచుతున్నారు. మరో పాపని అలాంటి దాన్నే పెంచుకోవాలనుకుంటున్నారు. అందులో మీ గొప్ప హృదయం తెలుస్తోంది. అందుకే మిమ్మల్ని, మీ జెన్నీని చూడాలని, ఆ పాపని మీరెలా పెంచారో తెలుసుకోవాలని వచ్చాను.” మనసులో మాట చెప్పి ఊపిరి పీల్చుకున్నాను.
“కష్ట పడ్డానన్న మాట నిజమే కానీ అందులో నా గొప్పతనం ఏమీ లేదు శాంతా. మానవ జన్మ ఎత్తాను. జీవితం సార్థకం చేసుకోవడానికి భగవంతుడు నాకో అవకాశం ఇచ్చాడు. అది వదులుకోకూడదనుకున్నాను. అంతే! వృత్తి రీత్యా నేను నర్సుని. కాబట్టి పాప అనారోగ్యం, అవిటితనం నన్ను భయపెట్టలేదు,” అంది క్రిస్టీనా.
“ఈ పాపని మీరు ఈ దేశం నుంచే తీసుకెళ్ళారన్నారు. నిజమేనా?”
“అవును పన్నెండేళ్ళ క్రితం నేను మొదటి సారిగా ఇండియా వచ్చాను. దాదాపు పది మందిమి కలిసి ఒక బృందంగా వచ్చాం. ఢిల్లీ, ఆగ్రా, మధుర, బృందావనం చూశాక కలకత్తా వెళ్ళాం. తర్వాత డార్జిలింగ్ లో నాలుగు రోజులుండి తిరిగి వస్తుంటే ఎవరో చెప్పారు. కాశీ అనే ప్రదేశం హిందువులకి గొప్ప పుణ్య స్థలమని. అదీ చూద్దామని బెనారస్ చేరుకున్నాం. అక్కడే నా స్నేహితురాలికి జబ్బు చేసింది. అపెండిసైటిస్. వెంటనే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. నేను నర్సుని కాబట్టి తనతో పాటు వుండి పోవాల్సి వచ్చింది. మిగతా వాళ్ళు కోణార్క వెళ్ళారు. నేను పూర్తిగా హాస్పిటల్లో ఉండిపోయాను. అప్పుడే చూసానీ పాపని. ఏడాది వయసుంటుంది. పోలియో అటాక్ అయినందు వల్లనేమో సరిగ్గా ఎదుగుదల లేదు. ఆస్మాతో నానా అవస్థ పడుతోంది. ఊపిరి పీల్చుకోలేక ఆయాసంతో రొప్పుతోంది. అందులో బాగా జ్వరం. స్నానం చేయించక ఎన్ని రోజులయ్యిదో? శరీరం అంత మురికి పట్టి, జుట్టు అట్టలు కట్టి పోయింది. ఇవన్నిటికీ తోడు కంటికి గాయం. గడ్డ కట్టిన రక్తాన్ని కూడా నర్సులు సరిగ్గా శుభ్ర పరచలేదు. గంగ ఒడ్డున వదిలివేసిన అనాధ అట.
‘ఏ క్షణంలోనయినా చచ్చి పోతుందిలే’ అని అనుకుంటున్నారు. నేను చూస్తూ వూర్కోలేక పోయాను. తీసుకొచ్చి మేము తీసుకున్న స్పెషల్ రూములో పెట్టుకున్నాను. ముందు ఒళ్ళు శుభ్రం చేసి బట్టలు మార్చాను. జ్వరానికి మందులు తెప్పించి వేశాను. కంటికి బ్యాండేజీ వేసాను. ఏ పక్షో పొడిచినందువల్ల కన్ను గుడ్డిదయిందన్నాడు డాక్టరు. మరో రెండు రోజులకి జ్వరం తగ్గింది కానీ పాప పుట్టుకతోనే చెవిటిదని తెలిసింది. అందుకే గంగ ఒడ్డున వదిలేసి ఉంటారా తల్లి తండ్రులు. ఆ గవర్నమెంటు హాస్పిటల్లో నర్సులు, డాక్టర్లు తీసుకెళ్ళి గంగలోనే పడేసేటట్లున్నారు. నాకా పాపని చూస్తే ముచ్చటేసింది. చావుతో పోరాడి గెలిచింది. ఎంత చేదు మందులయినా గుటుక్కున మింగేది. ఎన్ని ఇంజెక్షన్లు చేసినా కిక్కురుమనేది కాదు. ఒంటి కంటితో జాలిగా చూసేదంతే. ఆ పాపని నేను దత్తత చేసుకుంటాననగానే అందరూ నన్నో పిచ్చిదాన్ని చూసినట్లు చూశారు. ‘అనాధలే ఆరోగ్యంగా వున్న పాపలున్నారు. చూపిస్తాం’ అన్నారు. నేనే ఒప్పుకోలేదు. వాళ్ళని ఎవరయినా పెంచుకుంటారు. లేదా వాళ్ళే ఎలాగయినా బ్రతుకుతారు. పాపని దత్తత చేసుకొని స్వీడన్ తీసుకెళ్ళి పోయాను. దాదాపు రెండేళ్ళు కష్టపడ్డాను.
రాత్రి పగలు శుశ్రూష చేశాను. పోలియోకి మందులతో పాటు వ్యాయామం చేయించాను. చెవికి ఆపరేషన్ చేయించడంతో వినగలిగింది. దాంతో మాట్లాడడం నేర్చుకుంది. మందులతో ఆస్మా తగ్గింది. పూర్తిగా ఆరోగ్యవంతురాలయిందని చెప్పలేను. కానీ చాలా వరకు నయం అయ్యింది. నేను నర్సును కాబట్టి ఇవన్నీ చేయించడం నాకు సులభమే అయింది. ఇప్పుడు తన పనులన్నీ తనే చేసుకుంటుంది” అంది క్రిస్టీనా.
“చదువు విషయం?” అడిగాను.
“బాగా చదువుతుంది. వీళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ క్లాసులో తనే ఫస్ట్. అదీ కాకుండా పెయింటింగ్ అంటే చాలా యిష్టం. దానికి వేరే స్కూల్‌కి పంపుతున్నాను. బాగా పెయింటింగ్ చేస్తుంది.”
“మీరు పెళ్ళి చేసుకోలేదా?” అడిగాను, ఆమెను ‘మిస్’ అని చదవడం గుర్తుకు వచ్చి.
“నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారే?” క్రిస్టీనా నవ్వింది. “మా దేశంలో పెళ్ళికి పెద్ద ప్రాముఖ్యం లేదు శాంతా. పెళ్ళి చేసుకోకుండానే కల్సి వుండొచ్చు. పిల్లల్ని కనొచ్చు. పిల్లల బాధ్యత మాత్రం ఇద్దరిదీ. ఏ కారణం వల్లనైనా జన్మనిచ్చిన వాడు పిల్లల పోషణ భారం వహించక పొతే ప్రభుత్వం అతని మీద యాక్షన్ తీసుకుంటుంది. అదీ లేనప్పుడు ప్రభుత్వమే పిల్లల భాద్యత తీసుకుంటుంది. పోషణ కయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది వరలో నాకు చాలా మంది మగ స్నేహితులుండేవారు. కాని పాపని దత్తత చేసుకున్నాక నా దృష్టి అటు వైపు లేదసలు. వాళ్ళ జాలి చూపులు, సానుభూతి కూడా నా జెన్నీకి అవసరం లేదు. జెన్నీ పెద్దదయింది కదా. అందుకే మరో పాపని తీసుకెడదామని వచ్చాను.”
“కానీ మళ్ళీ ఈ దేశానికే వచ్చారు. మళ్ళీ వికలాంగురాలైన అమ్మాయే కావాలనుకుంటున్నారని పుస్తకంలో రాశారు.”
“చెప్పానుగా శాంతా! అక్కడ పిల్లల బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే వహిస్తుందని. వాళ్ళని పెంచుకోవాల్సిన అవసరం లేదు.”
అర్థం చేసుకున్నాను. ఇక్కడ ప్రభుత్వానికే కాదు. కొందరు తల్లి తండ్రులకే ఇలాంటి పిల్లలు అవసరం లేదు.
“గుడ్ మార్నింగ్ మమ్మీ!” వినసొంపుగా వుందా స్వరం. తల త్రిప్పి చూశాను. అప్పటికే స్నానం చేసి, నీట్‌గా తయారయి వచ్చింది. రంగు కాస్త తక్కువే గాని ముఖం కళగా ఉంది. రింగులు తిరిగిన జుట్టు పోనీటెయిల్ కట్టుకుంది. లేచాక ఎంత తిట్టినా గంట వరకు ముఖమైనా కడుక్కొని నా చిన్న కూతురు గుర్తుకు వచ్చింది. జెన్నీ నడిచి వస్తుంటే చూసాను. కాళ్ళకు వేసుకునే పట్టీ బూట్లని కొద్దిగా ఈడుస్తూ నడుస్తోంది. ఎడమ కన్ను సగం మూసుకు పోయి నిర్జీవంగా కనిపిస్తోంది. చెవిలో మిషిన్ ఉంది.
“గుడ్ మార్నింగ్ బేబి.” క్రిస్టీనా పాపని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకుంది. ప్రక్కనే కూర్చోపెట్టుకుంది. ఆమె ప్రతి చేష్టలో మాతృ ప్రేమ, మమత ప్రతిబింబిస్తున్నాయి.
“ఆంటీ తెలుగు వాళ్ళమ్మా. నమస్కారం చెప్పు” అంది క్రిస్టీనా.
రెండు చేతులూ జోడించి “నమస్కారం ఆంటీ. మీ పేరేమిటీ?” అంది జెన్నీ.
నా కంట నీరు తిరిగింది. ఎంత శ్రమ పడినా ఆరోగ్యవంతులైన నా పిల్లల్లో ఇలాంటి క్రమ శిక్షణ అలవర్చలేక పోయాను.
“నా పేరు శాంత. గాడ్ బ్లెస్ యు జెన్నీ” అన్నాను. అంత కంటే ఏం మాట్లాడాలో తెలియలేదు.
“ఆంటీకి నువ్వు వేసిన బొమ్మలు చూపించమ్మా” అంది క్రిస్టీనా. జెన్నీ ఉత్సాహంగా లేచి లోపలి గదిలో కెళ్ళింది.
“వికలాంగులను పెంచుకోవడానికి కావాల్సింది ఓపిక, ధైర్యమూ శాంతా. మీ ఎదురింటి వాళ్ళకి చెప్పు. భగవంతుడు ఈ పిల్లలకి చేసిన అన్యాయానికి బాధపడి, మరొక రకంగా వాళ్ళకు నిగూఢమైన శక్తులిస్తాడు. ఆ హిడెన్ టాలెంట్‌ని గుర్తించి వాళ్ళను ఆ రంగంలో ప్రోత్సహించాలి. ముఖ్యంగా కావలసిన దేమిటంటే తల్లి తండ్రులే తమ దురదృష్టానికి అహర్నిశలూ విచారిస్తూ కూర్చోకూడదు. వాళ్ళే అలా చేసినప్పుడు పిల్లల్లో సెల్ఫ్ పిటీ మొదలవుతుంది. అదే వాళ్ళను మరింత బలహీన పరుస్తుంది.” క్రిస్టీనా చెప్పుకు పోతోంది.
“నేను కష్టపడి తొమ్మిది నెలలు మోసి బిడ్డలను కనలేదు శాంతా. కాని మాతృ ప్రేమని పంచడానికి సొంత బిడ్డలే కానవసరం లేదు. ఆప్యాయతను, అనురాగాన్ని పంచివ్వడం స్త్రీలలో సహజ గుణం. ప్రతి స్త్రీ తనలోని ఈ మమతను, తన పరాయి అన్న బేధం లేకుండా పిల్లలకు పంచి ఇవ్వగలిగితే భావి తరాల పౌరులు వసుధైక కుటుంబాన్ని ఏర్పరుస్తారు.”
నాతొ పాటు లక్షలాది మంది తల్లులు వినవలసిన పాఠం పెళ్ళి కాని, పిల్లల్ని కనని ఓ మాతృ మూర్తి చెపుతోంది. మాతృత్వానికి అర్హత పెళ్ళి, భర్త కారని, మమతను పంచే హృదయం మాత్రమేనని నిరూపిస్తోంది. నాకు గొంతెత్తి అరవాలనిపిస్తోంది.
మాతృ స్థానానికీ, మాతృ ప్రేమకు అత్యున్నత స్థానాన్నిచ్చిన గొప్ప మతం మాది. ప్రపంచంలో ఏ దేశంలోనూ తల్లీ బిడ్డల అనుబంధం యింత ఉన్నత స్థాయిలో ఉండదని గర్వించే జాతి మనది. బిడ్డను కనలేని స్త్రీని గొడ్రాలని బిరుదునిచ్చి, ఆమె జీవితం వ్యర్థం అని నిరూపించే గొప్ప సంప్రదాయం మాది. తల కొరివి పెట్టడానికి కొడుకే కావాలని, పుట్టిన ఆడ పిల్లలను కించపరచి, మరో తల్లి కన్న మగ బిడ్డను దత్తత చేసుకొని సంతృప్తి పడే గొప్ప ఆచారం మాది.
మాకు చదువుల దేవత ఒక స్త్రీ. ధనానికి అధిపతి మరొక స్త్రీ. కానీ కన్న బిడ్డలలో పుత్రుడికి మాత్రం ఆధిపత్యం యిచ్చి చదువులోనూ, ఆస్తిలోనూ, చివరకు పెట్టే తిండి లోనూ వివక్షత చూపించి ఆడ పిల్లలను కించ పరిచే సంస్కృతి మాది. ఆడ పిల్లలకు పెళ్ళే ముఖ్యం. ఏదో రకంగా ఎంతో కొంత యిచ్చుకొని పెళ్ళి చేసి వదిలించుకొంటే చాలని భావించే అభ్యుదయం మాది. మా మాతృ మూర్తులు కేవలం తాము కన్న బిడ్డల్నే ప్రేమిస్తారు. అందుకే కోడళ్ళను చంపో, ఆత్మహత్య చేసుకొనేలా చేసో తమ అహాన్ని తృప్తి పరచుకుంటారు. ‘ఈ దేశంలో స్త్రీని పూజిస్తాం’ అని గర్వంగా పైకి ఎలుగెత్తి చాటుతూ మమ్మల్ని మేము వంచించుకుంటూ, ఎదుటి వారిని వంచిస్తూ తృప్తి పడతాం.
ఎందుకు కంటున్నామో తెలియకుండా పిల్లల్ని కంటున్న మాతృ మూర్తుల్లారా!
జనాభా పెరిగితే ఓట్లు పెరుగుతాయనే ఈక్వేషన్ మాత్రం తెలిసిన రాజకీయ నాయకుల్లారా!
మా సంస్కృతి, సభ్యత అతి గొప్పది. స్త్రీని పూజించే పుణ్యభూమి మాదని ఎలుగెత్తి చాటే సంప్రదాయ వాదుల్లారా!
ఈ దేశానికీ, ఈ జాతికీ చెందని ఈ స్త్రీ దగ్గర మమత అంటే ఏమిటో తెలుసుకోండి. మాతృత్వానికి భాష్యం నేర్చుకోండి.
“ఆంటీ!” జెన్నీ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాను. తను వేసిన బొమ్మల ఆల్బం పట్టుకొచ్చింది. ప్రక్కన కూర్చుని ఒక్కొక్కటీ చూపించి దాని గురించి చెపుతోంది. చాలా వరకు ప్రకృతి దృశ్యాలే. ఆ చిన్న వయస్సులో ఆ ఒక్క కంటికే కనిపించిన ప్రకృతి రమణీయతను సజీవంగా చిత్రీకరించింది. “ఇవి రెండూ ఇండియా గురించి వేసినవి.” రెండు చిత్రాలను చూపించింది. ఒకటి నెహ్రూ పిల్లలతో ఆడుకుంటున్న దృశ్యం. రెండోది తల్లి వడిలో పడుకుని చిరునవ్వులు చిందిస్తున్న పాపాయిది. ఆ తల్లి చీర కట్టుకుంది. మెడలో మంగళ సూత్రాలు, నల్లపూసలు. పాప వాటితో ఆడుకుంటున్నది. జెన్నీని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోకుండా ఉండలేక పోయాను.
“ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా?” అడిగాను.
“ఓ.. ష్యూర్!” క్రిస్టీనా లోపలి తీసుకెళ్ళింది. ప్రక్క గదిలో ఎదురుగా ఒక ఫోటో. జెన్నీ ఏడాది వయసులో వున్నప్పటిది. బహుశా క్రిస్టీనా దత్తత తీసుకున్నప్పటిదై ఉండొచ్చు.
బాత్రూం లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాను. పంపు పూర్తిగా తిప్పాను. ఆ చప్పుడులో బయటికి విన్పించదని నమ్మకం కలిగాక రెండు చేతులతో ముఖం కప్పుకున్నాను. అణువు చీలితే విస్ఫోటనం. గుండె పగిలితే రుధిరం. ఉద్వేగాన్ని గుండెలో అణచిపెట్టి,చిరునవ్వుల మేకప్ వేస్తే చిలిపి ఆత్మ కొంటె కంటకంతో కెలికి చెలగాటం ఆడుకుంది. చిర్నవ్వు చెరిగి పోయింది. బద్దలయిన హృదయాన్ని నిశ్శబ్దపు ముసుగులో బంధించి, ప్రవహిస్తున్న రుధిరాన్ని రంగు తుడిచేసి కళ్ళ నుంచి నిష్క్రమింప చేయడంలో విజయాన్ని సాధించాను. గతించిన కాలం కళ్ళ ముందు పైశాచిక నృత్యం చేస్తోంది. కాలానికి కళ్ళెం వేయలేను. గుండె వాకిట చల్లిన కెంపు కళ్ళాపిపై అందంగా రంగవల్లులిక అల్లలేను.
ఇన్నాళ్ళూ ఈ జగతి నా ముంగిట ముగ్గులు చూసి ‘ఎంత అందమైన ఇల్లో’ అనుకుంటుంది. కానీ ఈ రోజు నా గుండె తలుపుల్ని తెరుస్తాను. ఇన్నాళ్ళూ బంధించబడ్డ చేదు నిజం ఎంత కుళ్ళు కంపు కొడుతోందో మీ ముందు బయట పెట్టుకుంటాను. నన్ను అసహ్యించుకుని పారిపోయే ముందు ఒక చిన్న విన్నపం. నా పరిస్థితిని మీరైనా అర్థం చేసుకోండి. ఆత్మ శాంతి లేక పిశాచమై తిరుగుతున్న నా గతానికి కొంతయినా నిష్కృతి కలగనివ్వండి. పన్నెండేళ్ళ క్రితం చనిపోయిందనుకున్న కన్నబిడ్డ ప్రాణాలతో ఎదురు పడితే అపరిచితురాలిగా నటించి, దుఃఖాన్ని పైకి రానివ్వకుండా అదిమిపెట్టి, నవ్వుతూ మాట్లాడి గొప్ప నటినయ్యాను. కానీ నాలో ఆవేదన, బాధ, గిల్ట్ అన్నీ కన్నీళ్ళ రూపంలో మీ ముందు ప్రవహించనివ్వండి.
ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఎంతో ఆశతో ఎదురు చూసినా మూడో బిడ్డ కూడా ఆడపిల్లే కావటం అందర్నీ బాధ పెట్టింది. మనవడిని చూడాలన్న అత్తగారి రుసరుసలు ఎక్కువైయ్యాయి. దానికి తగ్గట్టుగా పుట్టినప్పట్నుంచీ పాపకి అనారోగ్యమే. మందులు, తాహతుని మించిన ఖర్చులు, భర్త చికాకు, ‘దీన్నెందుకు పుట్టించావురా?’ అని భగవంతుడిని రోజూ తిట్టుకోవడమే.
శ్రద్ధ తీసుకోక పోలియో ఎఫెక్టు. ఆ దుఃఖంలో ఉండగా రిట్రెంచ్‌మెంట్లో భర్త ఉద్యోగం పోవడం, ‘ఇది పుట్టిన వేళా విశేషం’ అని అందరి ఈసడింపు! అదీ నిజమేనన్నట్లు ఆరోగ్యంగా వున్న మామగారి అకాల మరణం. ఆ బాధ నుంచి తేరుకోక ముందే పాప చెవిటి, మూగ అని డాక్టర్ చెప్పటం. ఇంటిల్లిపాదీ ఏడ్పులు. ఎవరి మీదో తెలియని కసి, దాన్ని గొంతు నులిమి చంపెయాలన్నంత కోపం.
ఆ రోజు నాకింకా గుర్తు. మామగారి చివరి కోరికపై ఆయన అస్థికలు గంగలో కలపడానికి వెళ్ళాం. ఉదయం కార్యక్రమం ముగిసింది. రాత్రి తిరుగు ప్రయాణం. సాయంత్రం ఉన్నట్లుండి పాపకి బాగా జ్వరం, ఆస్త్మా ఎటాక్ వచ్చాయి. కళ్ళు తేలేసింది. దగ్గర ఏదో హాస్పిటల్ వుందని, చూపించి తీసుకొస్తానని తీసుకెళ్ళారాయన. దాని అనారోగ్యంతో అప్పటికే విసుగెత్తి పోయిన నేను సామాన్లు సర్ధడంలో మునిగి పోయాను. రైలుకి ఇంకో గంట టైముండగా వట్టి చేతులతో తిరిగి వచ్చారాయన.
“డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు. కానీ లాభం లేదన్నారు. గంటో, రెండు గంటలో బ్రతికితే గొప్ప అన్నారు. అడ్మిట్ చేసుకోలేదు. తీసుకెళ్ళి పొమ్మన్నారు.”
“మరి పాపేది?” అడిగాను.
“గంగ ఒడ్డున వదిలేసి వచ్చాను,” అన్నారు నిర్లిప్తంగా.
“అదేమిటీ? ఇంకా బ్రతికుండగానే?” భయంగానే అన్నాను.
“శాంతా! ఆ బిడ్డ భారాన్ని మనం మోయాలేం. ఈ ఒక్క బిడ్డ గురించి మిగతా ఇద్దరికీ చాలా అన్యాయం చేస్తున్నాం. దీని మందుల ఖర్చుతో వాళ్ళిద్దరికీ కనీసం కడుపు నిండా తిండయినా పెట్టగలం. ఒక్కసారి ఆలోచించు శాంతా. అసలే ఆడపిల్ల. అవిటిది. చెవిటిది. మూగ. దానికి చదువు చెప్పించలేం. కట్నమిచ్చి పెళ్ళి చేయలేం. మన తర్వాత అది మిగతా వాళ్ళకి భారమవుతుంది. బ్రతికుండి రోజు రోజు చచ్చే కంటే అదిలా ఒక్కసారే చచ్చి పోవటం నయం కదా. డాక్టర్లు గంటలన్నారు. పవిత్రమైన గంగానది ఒడ్డున దాని ప్రాణం ఇప్పటికే పోయుంటుంది. దాన్ని ఎదురుగా పెట్టుకొని క్షణాలు లెక్క పెట్టుకొంటూ, చావుకి ఎదురు చూడడం మనవల్ల కాదు. లే.. లేచి స్నానం చెయ్యి. రైలుకి టైమవుతోంది” అన్నారు.
మనం ఎక్క వలసిన రైలు జీవిత కాలం లేటన్నాడు కవి. టైముకి వచ్చే రైలు తప్పి పోకూడదని ఒక ప్రాణిని బలి చేసిన దుస్థితి. నేను తల బాదుకొని ఏడవలేదు. ఎందుకిలా చేశారని నిలదియ్యలేదు. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఆ చేదు నిజం జీర్ణం చేసుకున్నాను. దారిద్ర్యం మమతనూ, మానవత్వాన్ని కూడా జయించింది. నా కడుపు కోత కంటే, నేను కన్న మరో యిద్దరి పసివాళ్ళ ఆకలి బాధ ముఖ్యం అన్పించింది. కన్నబిడ్డ చావుకి సవితి తల్లిగా ఆ క్షణానే నేను చచ్చి పోయాను.
తలారా స్నానం చేశాను. ఆ బిడ్డ జ్ఞాపకాలను కూడా కాశీలో వదలి ఇల్లు చేరుకున్నాం. పాప చనిపోయిందని చెప్పాం. నెల తిరిగే సరికల్లా మా వారికి మళ్ళీ ఉద్యోగం దొరికింది. ‘అది పోయింది. శని కూడా పోయింది’ అన్నారంతా. నా గుండెల్లో రంపపు కోత. కానీ పెదవి దాటలేదు. చేసిన తప్పుకి పరిస్థితుల ప్రాబల్యం అని సరి పెట్టుకొని, ఆత్మ వంచనతో తృప్తి పడాల్సిన లోయర్ మిడిల్ క్లాస్ గృహిణిని.
నాకు మళ్ళీ గర్భం వచ్చింది. నాలో భయం. చేసిన పాపానికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేయబోతున్నాడో? అదృష్ట వశాత్తూ పుట్టింది బాబు. అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. తప్పు చేశామేమో అన్న భావం మాలో తగ్గింది. భగవంతుడు కూడా మమ్మల్ని క్షమించాడనుకున్నాం.
వారం రోజుల క్రితం ఎవరింటికో వెళ్ళి నప్పుడు యాధృచ్చికంగా ఓ పత్రికలో క్రిస్టీనా ఇంటర్వ్యూ చదివాను. నాలో ఏదో అనుమానం. ఆలోచించి చూస్తే తేదీలు కూడా సరిగ్గా సరి పోయాయి. అప్పట్నించీ నాలో అంతర్మధనం. ఇప్పుడేం చెయ్యాలి? నా భర్తకి చెప్పాలనుకున్నాను. కానీ వివేకం నన్నాపని చెయ్యనివ్వలేదు. చెప్పినా ఏం చేస్తాడు? చేసిన తప్పుని పది మందిలో ఒప్పుకుని పాపని ఇవ్వమని అడుగుతాడా? లేదు. మా ఆర్ధిక పరిస్థితి అలాంటి అవకాశాన్ని ఇవ్వదు.
“ఎక్కడో ఓ చోట సంతోషంగా వుంది చాల్లెద్దూ” అంటాడు. ఎవరికయినా తెలుస్తుందేమోనని భయపడతాడు కూడా. ఆలోచించాక నాకొక్కటే అనిపించింది. క్రిస్టీనాను, ఆ పాపని చూడాలి. మాతృ ప్రేమ పెల్లుబికి కాదు. కన్న కడుపు ఆక్రోశం తోటి కాదు. ఆమె సుఖంగా ఉందని చూసి తృప్తి పడటం కోసం అంతకంటే కాదు. కన్న బిడ్డ కాళ్ళు పట్టుకొని ‘తల్లీ ! నన్ను క్షమించు’, అనడిగే ధైర్యం లేదు. ‘అమ్మా! ఈ బిడ్డ నా బిడ్డ. నేను మృత్యు దేవతకి ఆహారంగా వేస్తే కాపాడి ప్రాణం పోసిన దేవతవు. నా కన్నీటితో నీ కాళ్ళు కడిగి పాప ప్రక్షళన చేసుకోనివ్వు’, అని క్రిస్టీనాను వేడుకోవడానికీ కాదు. ఏ పరిస్థితులలో మేమా పని చేశామో తెలిస్తే వాళ్ళు అర్థం చేసుకొని మమ్మల్ని క్షమించవచ్చు. ఆ రకంగా నా పాపానికి కొంత నిష్కృతి లభిస్తుంది కూడా. కానీ అలా జరక్కూడదు. క్రిస్టీనా, జేన్నీలను క్షమాపణ కోరకుండానే నేను చేస్తున్న ఈ నేరం తెలిసి చేస్తున్న మరో పాపం. ఆ నేరం నాకు ప్రతీ రోజూ గుర్తుండాలి. ఎవరికీ ఏమీ చెప్పుకోలేక నేను కుళ్ళి కుళ్ళి ఏడ్చుకోవాలి. నాలోని ఈ రహస్యం నన్ను చిత్రవధ చేస్తుండాలి. కన్నీటి ఛాయలని చన్నీళ్ళతో కడిగి, చిర్నవ్వు పులుముకుని బయటకు వచ్చాను. ఇక సెలవు తీసుకోవడం మంచిదని పించింది.
“వెళ్ళొస్తాను. నమస్తే” చేతులు జోడించి చెప్పాను క్రిస్టీనాతో. జెన్నీ నేను తెచ్చిన ఏనుగు అంబారి తీసి చిత్రం గీస్తోందప్పుడే. వెళ్ళి నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను. చిన్నగా నవ్వింది. తలుపులు వైపు అడుగులు వేశాను.
“అమ్మా!” ఏమిటీ పిలుపు? నా రహస్యం బయట పడిందా? నా గుండెల్ని ఎవరో పిండుతున్నంత బాధ. వద్దు. నాకు ఆ అర్హత లేదు. నన్నెవరూ క్షమించవద్దు. జెన్నీ దగ్గరగా వచ్చి నా చేతికి ఒక ప్యాకెట్ అందించింది. క్రిస్టీనా నవ్వుతూ చూస్తోంది.
“ఏమిటిది?” అడిగాను.
“ఏమీ లేదు. మా తరపున చిన్న కానుక! మన పరిచయానికి గుర్తుగా తీసుకెళ్ళండి. మీ పిల్లలకివ్వండి,” అంది క్రిస్టీనా. థాంక్స్ చెప్పి కదిలాను. శ్రీను నా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. నన్ను చూడగానే అతని ముఖంలో రిలీఫ్ కనిపించింది. వెళ్ళేటప్పుడు ఉన్న టెన్షన్ ఇప్పుడు లేదు. వ్యధ అంతా తిరిగి గుండెల్లో నిక్షిప్తమయి పోయింది.
మర్నాడు విశాఖ పట్టణం ట్రైనెక్కాను. మళ్ళీ ఒంటరి తనం. కళ్ళ ముందు ఒకటే దృశ్యం. కాళ్ళు కదల్చలేని నిస్సహాయ స్థితిలో వొళ్ళు జ్వరంతో పేలిపోతున్న పసిపాప. ఆయాసంతో రొప్పుతూ, అమ్మ ఒడి కోసం పరితపిస్తూ, నోటితో చెప్పలేక చేతులలో రారమ్మని సైగలు చేస్తూ కొట్టుకుంటుంటే, మీద వాలిన రాబందు చాలా కాలానికి దొరికిన సజీవాహారాన్ని లొట్టలు వేసుకుంటూ తినడానికి ఉపక్రమిస్తూ… బాధతో, భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆ చిన్ని ప్రాణం అమ్మ కోసం ఆరాట పడుతూ, రక్షించమని వేడుకుంటూ… కంటి మీద పొడవగానే అది పెట్టిన చావు కేక బహుశా నేను పారిపోతున్న రైలు కూతలో కల్సి పోయి వుంటుంది.
జీవితంలో విషాదాన్ని కూడా సినిమాటిక్ గా రంగుల్లో వూహించగలిగే అధమస్థితికి దిగజారిన మాతృత్వం.
గుండె దిటవు పరచుకుని ఆలోచనలను మళ్ళించాలనే ప్రయత్నంలో జెన్నీ యిచ్చిన ప్యాకెట్టు విప్పాను. పిల్లల కోసం వాచీలు, కొన్ని ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు వున్నాయి. జీవితంలో నాకు నేనుగా కొని ఇవ్వలేని వస్తువులు. కంట నీరు తిరిగింది. ఎవరూ చూడకుండా తుడిచేశాను.
మరో పెద్ద కవర్ తెరిచాను. జెన్నీ వేసిన తల్లీ బిడ్డల చిత్రం, నా పాపాన్ని పరిహసిస్తున్నట్లుగా. అవును. దీన్ని చూస్తుంటే నా తప్పుని ప్రతి క్షణం ఇది గుర్తు చేస్తుంది. చెయ్యాలి కూడా. నేను వేసిన మరణదండనని చిరునవ్వుతో స్వీకరించి నా చిట్టితల్లి నాకు ఇచ్చిన బహుమానం. చిత్రాన్ని తిరిగి కవర్లో పెట్టబోతుంటే ఉత్తరం కనిపించింది. తీసి చూశాను. టైప్ చేసి వుంది.
శాంతా!
నువ్వు ఆంధ్రా నుంచి వచ్చానని చెప్పగానే అనుమానం వచ్చింది. జెన్నీ దొరికినప్పుడు మెడలో దొరికిన తాయెత్తు చూసి మా తెలుగు డాక్టర్ ‘ఇది తెలుగు లిపి. పాప తెలుగు అమ్మాయి కావచ్చు’, అన్నాడు. అందుకే జెన్నీకి తెలుగు నేర్పించాను. ఈ పాప నీదని అడగడానికి వచ్చేవేమోననే ఆలోచన నన్ను భయభ్రాంతురాల్ని చేసింది. కానీ మాకు నిజం తెలియకూడదని నువ్వు చేసిన ప్రయత్నం హర్షణీయం. ఏ తల్లీ కన్న బిడ్డను చూడగానే అలా నిర్లిప్తంగా కూర్చోలేదు. మా యిద్దరి మధ్య అనుబంధాన్ని కలుషితం చేయకూడదని ఎంత కష్ట పడ్డావో, మధన పడ్డావో చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. నా అనుమానం నివృత్తి చేసుకోవటానికి పాప చిన్నప్పటి ఫోటో ఎదురుగా పెట్టాను. అది చూడగానే నీ ముఖంలో క్షణం పాటైనా కదలిన విచార రేఖలు నిన్ను పట్టించేశాయి. నీ సంస్కారానికి నా జోహార్లు.
మనిషి పరిస్థితులకు బానిస. దేశ కాల పరిస్థితులు, సమాజపు రీతి రివాజులు చెయ్య కూడని పనులు చేయిస్తాయి. జరిగిన దానికి ఎన్నడూ విచారించకు. జరిగేదంతా మన మంచికే అని మీరే అంటారుగా. నువ్వు చేసిన ఆ పనివల్ల నా లాంటి అనాధకు, అభాగ్యురాలికి చక్కటి ఆసరా దొరికింది. జీవితం ఆనందమయం చేసుకునే మార్గం దొరికింది. నీకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు. నాది ఒక్క కోరిక.
నువ్వు ఆర్ధికంగా పేదరాలివే కావచ్చు. కానీ ఇలాంటి బిడ్డలకు పదిమందికి పంచి పెట్ట గల మమత, మంచితనం నీలో ఉన్నాయి. నువ్వు చెప్పిన మీ ఎదురింటి అబ్బాయి కధ నిజమే అయితే, నీ ప్రేమను ఆ బిడ్డకు పంచడంతో మొదలు పెట్టు. అలాంటి పిల్లలకి సేవ చేయడంలో వున్న తృప్తి నీలో గిల్టీ ఫీలింగ్ ని పోగొడుతుంది. క్రొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. నీ భవిష్యత్తు సుఖ మయం కావాలని కోరుకుంటూ…
క్రిస్టీనా.
నన్ను క్షమించడమే కాకుండా ఓ త్యాగమయిని చేసి క్రిస్టీనా కావలసిన దాని కంటే పెద్ద శిక్షే వేసింది. నాకు దు:ఖ్ఖం ముంచుకు వచ్చింది. ఈ సారి అది దాచుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. చుట్టూ కూర్చున్న వాళ్ళంతా నా వైపు కుతూహలంగా, భయంగా చూస్తున్నారు.
నా కన్నీరు ప్రవాహంలా సాగి పోతూనే ఉంది. క్రిస్టీనా చెప్పిన మార్గం అనుసరించడం మొదలు పెట్టే వరకూ బహుశా అదలా సాగి పోతూనే వుంటుంది.
(‘అభిషిక్తం’ కథల సంపుటి నుంచి)