మరో విఫల యత్నం

“అబ్బా! ఇక్కడెవరూ లేరు. అయినా ఇక్కడికెవరొస్తార్లే!”

“చాల్లే! ఏకాంతం ఏకాంతం అని చెప్పి ఇంతపైకి ఎక్కించావ్!”

“ఎక్కించానే అనుకో, దొరికిందిగా ఏకాంతం?” – నవ్వు.

“ఏమో బాబూ! భయమేస్తోంది నాకసలు.”

“భయమెందుకు? ఇక్కడెవరూ చూడర్లే!”

మొదటి వాక్యం వినేసరికే ఉలిక్కిపడ్డాడు వాసు. ‘అబ్బ, ఇక్కడికెవరొస్తార్లే!’ అనుకుని తానొచ్చి అక్కడ కూర్చున్న విషయం గుర్తొచ్చింది. అయినా, ఊరుకున్నాడు. కానీ, ఈ సంభాషణ వినంగానే అక్కడ తానో, వారో ఎవరో ఒకరే ఉంటే శ్రేయస్కరమని అర్థమైంది.

‘బట్ ఐ డోన్ట్ వాంట్ టు లీవ్ బికాజ్ ఐ డోన్ట్ వాంట్ టు లివ్’ మనసులోనే స్థిరంగా అనుకున్నాడు. ‘ఇప్పుడెలా పంపేయాలి వీళ్ళని?’

ఇంతలో అతని ఫోనులోంచి పాట – ‘తూహీ బతా జిందగీ… జో భీ హువా.. క్యో హువా..’ – జేబులోంచి ఫోన్ తీసాడు. అలారం. ‘ఈపనికి కూడా అలారం పెట్టుకునేది నేనొక్కడినేనేమో!’ నవ్వుకున్నాడు. అలారం ఆపేస్తూ ఉండగా వెనుక పొదల వద్ద చప్పుడు. తిరిగి చూస్తే, ఇందాకటి గొంతుకల శరీరాలు, వెనుదిరిగి పోతూ. గట్టిగా నవ్వాలనిపించింది వాసుకి.

మళ్ళీ తానొక్కడే! మెల్లగా తల ఎత్తి ఆకాశాన్ని చూశాడు. కొంచెం ముందుకు వంగి లోయ లోతును కళ్ళతో కొలిచాడు. ’బాగానే లోతుంది. ఉన్న పళంగా, కూర్చున్న పళంగా ఏదన్నా పెద్ద గాలి వచ్చి నన్ను తోసేస్తే బాగుండు’ అనుకున్నాడు.

‘అబ్బబ్బ! దూకేయాలి’ అనుకుని కళ్ళు మూసుకున్నాడు.

ఇల్లు, కాలేజీ, స్టూడెంట్లూ, స్నేహితులూ, ప్రపంచమూ – కళ్ళముందు కదలాడితే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఇంకా తాత్సారం చేస్తే, వెనక్కెళ్ళిపోతానేమో అని భయమేసింది అతనికి. రెండడుగులు ముందుకేస్తే చాలు. స్లోప్ ఉంది కనుక మరో రెండడుగులు ఎలాగో అవే పడతాయి. అంతే, పనైపోతుంది.

ఇంతలో వెనుక ఎవరో ఏడుస్తున్న చప్పుడు. మనిషి వస్తున్న అలికిడి. ‘మళ్ళా ఎవరొచ్చారో!’

రెండు క్షణాల్లోనే అక్కడికో యువకుడొచ్చాడు. పాపం, మనిషిని చూస్తేనే పీకల్లోతు కష్టాల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. వయసు ముప్పైలోపే. పైగా ఏడుపొకటి!

‘సిగ్గుండాలి ఈ వయసొచ్చాక ఏడవడానికి’ విసుక్కున్నాడు వాసు. అతనికి ఏడ్చేవాళ్ళంటే గిట్టదు.

ఆ మనిషి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఎక్కిళ్ళ మధ్య ఏదో గొణుక్కుంటూ, వాసు కూర్చున్న చోటుకి వచ్చాడు. అయితే, తన ధోరణిలో తనుండి, తాను నిలబడ్డ చోట ఉన్న చెట్టుకు ఆవలివైపు ఓ మనిషి కూర్చుని తనని గమనిస్తున్నాడన్న విషయం అతను గమనించలేదు. అతను వచ్చి కిందకు తొంగి చూసి ‘అమ్మో!’ అనుకున్నాడు పైకే. భయం వల్ల కాబోలు అతనికి నెమ్మదిగా చెమట్లు పట్టడం వాసు గమనించాడు. అటూ ఇటూ చూడ్డం, ఆపై చేతులు జోడించి ఆకాశం వైపు చూడ్డం, ఏడుస్తూ ముక్కు ఎగబీల్చడం – ఇదంతా చూస్తూంటే వాసుకి చిరాకెక్కువైంది.

‘ఏం బాబూ, భయమేస్తోందా?’ అంటూ లేచి అతన్ని సమీపించాడు. దెబ్బకి కలిగిన ఉలికిపాటుకి అతను కొండ అంచుపై పట్టు తప్పి కిందపడబోయి భయంతో అరవడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు వినలేక వాసు అతని చేయి పట్టుకున్నాడు. దానితో అతను కోలుకుని, మళ్ళీ నిలబడి – “థాంక్సండీ, ప్రాణం నిలబెట్టారు” అన్నాడు. వాసు పెద్దగా నవ్వాడు. అప్పటిగ్గానీ అర్థం కాలేదతనికి తానన్న మాట ఎంత అసంబద్ధంగా ఉందో. అతను కూడా ఇబ్బందిగా నవ్వాడు.

“పోనీ, ఇద్దరం ఇక్కడ మల్లయుద్ధం లాంటిది మొదలుపెడదాం. అప్పుడు తేలిగ్గా అవతలివైపుకి పడతాం” – లోయలోకి చూస్తూ అన్నాడు వాసు.

“ఏమిటి? ఏమిటన్నారు? అసలు మీరు – మీరెవరు?” వాసు వాలకం చూసి అనుమానంగా అడిగాడా అబ్బాయి.

“ఎవర్నైతే ఏంటి? నీలాగే – ఆపని మీదే వచ్చాను.”

“అదేమిటి… మిమ్మల్ని చూస్తే అలా లేరే!”

“ఎలా?”

“మీరు చూస్తే హాయిగా నవ్వుతున్నారు!”

“నవ్వకూడదా?”

“ఏడుపు రాదా?”

“ఎందుకూ?”

“ఎవరండీ‌ మీరు? వింత మనుషుల్లా ఉన్నారు! నాకు బ్రతుకులో సుఖం లేదు. అన్నీ కష్టాలే. ఇవన్నీ దాటి ముందుకు పోలేనేమో అనిపిస్తోంది. మనుష్యులంటే అసహ్యం, బ్రతుకంటే విరక్తీ కలుతున్నాయ్! చావొక్కటే పరిష్కారమేమో ఇక..” అతనింకా చెప్పేవాడే కానీ వాసు ఆపాడు.

“చూస్తే చిన్నవాడిలా ఉన్నావ్? పరీక్ష పాసవలేదా? ప్రేమ వైఫల్యమా?” – అడగ్గానే అతనికి జీవితం గుర్తొచ్చినట్లుంది. కళ్ళలోంచి నీరు కారడం మొదలైంది.

“సరే, చెప్పకులే. ఏడుపాపు. నాకు ఏడ్చేవాళ్ళంటే అసహ్యం” విసుగ్గా అన్నాడు వాసు. ఆ మాటలకి అతనికి కోపమొచ్చిందిలా ఉంది.

“అయినా మీకెందుకు నా ఏడుపు? మీరెందుకిక్కడికొచ్చినట్టు? అసలు చూస్తే బానే ఉన్నారు, మీకసలు ఆత్మహత్య చేసుకునేన్ని సమస్యలు ఉన్నాయంటారా? మిమ్మల్ని చూస్తే అలా లేరు. అంత అవసరం ఏమొచ్చింది?”

వాసు సన్నగా నవ్వి, నిట్టూర్పు విడిచాడు.

“బ్రతకాలన్న కోర్కె లేనప్పుడు చావు తప్ప మార్గమేముంటుంది?”

“నాకు బ్రతకాలనే ఉంది కానీ, ఇలా కాదు. సుఖంగా, సంతోషంగా.”

“అయితే, మరి వెళ్ళు. వెళ్ళి బ్రతికి, సుఖమయం చేస్కో జీవితాన్ని.”

“అది చేస్కోలేకే కద!”

“నీమీద ఆధారపడ్డ వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఉన్నారా?”

“ఉన్నారు.”

“మరి వాళ్ళ గతేమిటో ఆలోచించావా?”

“నేనున్నాకూడా వాళ్ళ గతి అంతేగద్సార్! ఇంకా చెప్పాలంటే, నేను పోతేనే వాళ్ళకి నయమేమో. ఆర్థికంగా అన్నా కాస్త వెసలుబాటు ఉంటుంది.”

“కానీ, నువ్వుండవుగా. వాళ్ళు నిన్ను కోల్పోయి ఎంత బాధపడతారో ఆలోచించావా?” – కొంచెం తీవ్రంగానే అన్నాడు వాసు.

“కొన్నాళ్ళే. ఆ తరువాత ఎవరి జీవితాలు వాళ్ళవి. నిజం చెబుతున్నాన్సార్! ఎవరైనా, ఎప్పుడైనా, మర్చిపోదగ్గ మనుషులమే అని నా నమ్మకం” – అతను కూడా అంతే తీవ్రంగా అన్నాడు.

“సరే, అలాగే అనుకుందాం. ఆ కొన్నాళ్ళైనా ఎందుకు కష్టపెట్టాలి వాళ్ళని? ఒకళ్ళని అంత క్షోభకి గురిచేసే హక్కు మనకెవరిచ్చారు? మనపై ఉన్న ఆశలన్నింటినీ కొల్లగొట్టే స్వేచ్ఛ మనకెవరిచ్చారు?’

“ఇంతలా ప్రతిదాన్నీ విశ్లేషించుకుపోతే ఏపనీ చేయలేమేమో! ఏపని చేసినా ఎవరికో ఒకరి బాధ కలగకపోదు. ఎవరికీ కలగకపోతే, మనకే కలగొచ్చు. మనగురించి కూడా మనం ఆలోచించుకోవాలి” అన్నాడతను స్థిరంగా.