నా స్వేచ్ఛాగానంలోని బంధాలు

స్వేచ్ఛాగానం

దివిలో ఊగే విహంగాన్ని
భువిలో పాకే పురుగు బంధిస్తుంది
గడియేని ఆగని సూర్యుణ్ణి
గడియారపు బాహువులు బంధిస్తాయి
పీతడెక్కల చంద్రుణ్ణి
చేతులెత్తే సముద్రం బంధిస్తుంది
గలగలలాడే తరంగాల్ని
జలకాలాడే అంగాలు బంధిస్తాయి
తన చుట్టూ తాను తిరిగే చక్రాన్ని
మలుపులు తిరిగే రోడ్డు బందిస్తుంది.
తెగవాగే జలపాతపు నాలికని
సెగలెగిసే గ్రీష్మం బంధిస్తుంది
ముడుతలు పడ్డ ముసలి సాయంత్రాన్ని
మాటలు రాని కాలవ బంధిస్తుంది
రాత్రి వచ్చిన రహస్యపు వానని
ధాత్రిన దాగిన వేళ్ళు బంధిస్తాయి
గురిమరిచిన గాలి బాణాన్ని
తెరయెత్తిన నౌకా ధనుస్సు బంధిస్తుంది
ఈ మనిషి ఆ మనిషిని బంధిస్తాడు
ఇద్దర్నీ కలిపి బంధిస్తుంది మనీష

తెలుగులో మొదటి స్వేచ్ఛాగానం కృష్ణశాస్త్రి గారు రాశారు. 1925లో ప్రచురించిన ‘కృష్ణపక్షమూ లో అది ఒక ఖండిక. అంటే 63 ఏళ్ళ క్రితమన్నమాట. అప్పటికి నేను పుట్టలేదు.

తిమిరలత తారకా కుసుమముల దాల్ప
కర్కశ శిలయు నవజీవ కళల దేర
మ్రోడుమోక చివురులెత్తి మురువుసూప
జగము నిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు

యుగ యుగంబుల నీశ్వర యోధులగుచు
స్వేచ్ఛకై ప్రాణ సుమము లర్పించువారి
అమల జీవిత ఫలము ధన్యతను గాంచ
జగము నిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు

అని ఉత్సాహంగా, ఉద్రేకంగా ఉరకలేస్తూ సాగుతుందీ గీతి.

తెలుగులో రెండో స్వేచ్ఛాగానం కూడా కృష్ణశాస్త్రి గారే రాశారు. దాన్ని స్వేచ్ఛాగానము-2 అన్నారు. మొదటి దానికన్నా ఆవేశంగా, విశృంఖలంగా, గెంతులేస్తూ నడుస్తుందిది.

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు?
నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు?
కల విహంగమ పక్షముల దేలియాడి
తారకామణులలో తారనై మెరసి
మాయమయ్యెదను నా మధురగానమున!
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు?

రొమాంటిక్ టెంపరమెంట్. అంటే కాల్పనిక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఈ పాటలు. ఈ శతాబ్దం మొదటి రెండు దశకాల్లో తెలుగుదేశంలో రొమాంటిక్ ఉద్యమం తలెత్తింది. వర్డ్స్‌వర్త్, షెల్లీ, కీట్స్ వంటి ఇంగ్లీషు రొమాంటిక్ కవులవల్లా, టాగోర్‌వల్లా ప్రభావితులయ్యారు మన కవులు. రొమాంటిక్ ఉద్యమానికి వ్యక్తిస్వేచ్ఛ ప్రాణం. విశ్వానికి వ్యక్తి కేంద్రమంటారు. సంఘం కన్నా వ్యక్తి ముఖ్యం. స్వేచ్ఛాజీవి ఐన వ్యక్తికి అసాధ్యమైనదేదీ లేదు. ఈ వ్యక్తి స్వేచ్ఛని అందుకోడానికి ఎగబడే ఆరాటం, అసహనం ఈ పాటల్లో ఎగతన్నుతున్నట్టు తోస్తుంది మనకు.

ఇక, నాది మూడో స్వేచ్ఛాగానమన్నమాట. ఇది 1970లో రాశాను. కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛాగానాలకీ, దీనికీ 45 ఏళ్ళ మేరవుంది. ఈ నలభై ఐదేళ్ళలో ప్రపంచం ఎంత మారి వుంటుందో మీరు ఊహించగలరు. పరదేశీయ నియంతృత్వంమీదేకాక, మన సమాజంలో పారంపర్యంగా వస్తున్న ఛాందస, సాంప్రదాయక నియంతృత్వం మీదా, అన్యాయాలపైనా తిరుగుబాటు చేయించిన ఆ జాతీయ పునరుజ్జీవనం ఎప్పుడో చల్లారిపోయింది. ప్రపంచం పూర్తిగా మారిపోయింది. రాజకీయ స్వాతంత్ర్యం సిద్ధించింది కాని, ఆనాటి కలలు పిందెలుగానే రాలిపోయాయి. పాత బానిసత్వాలు వదిలాయనుకుంటే, కొత్త బానిసత్వాలు వచ్చి మనల్ని పెనవేసుకున్నాయి. నిరాశ, నిస్పృహ మళ్ళీ ముసురుకున్నాయి.

అందుకనే, కృష్ణశాస్త్రి గారి స్వేచ్ఛా గానాల్లోని పొంగూ, పొర్లింపూ నా స్వేచ్ఛాగానంలో కనిపించదు. అసలు స్వేచ్ఛ అనే మాటే అగుపించదు. పైగా, ఇందులో దర్శనమిచ్చేవన్నీ బంధాలే. రకరకాల భయంకరమైన నియంతృత్వాల మీదా, అన్యాయాల మీదా సంగ్రామం జరిపిన మీదట చివరికి మనకి మిగిలిందేమిటి? మన సొంత అవకతవకల్తో మనమే మిగిలాం. స్వేచ్ఛ ఎక్కడుంది? ఉంటే మనలోనే ఉండాలి. సాటి మనిషితో తను కలుపుకునే బాంధవ్యంలో తప్ప మనిషికి వేరే స్వేచ్ఛ లేదని ఈ కవి గ్రహించినట్లు తోస్తుంది.

స్వేచ్ఛ అనేది సంకల్పబలం చేత మాత్రమే సాధ్యమయేది కాదు. అది సంఘాన్ని పూర్తిగా నిరసించిన రొమాంటిక్ కవుల భ్రమ, మానవతా బంధాల నించి మనం ఎన్నడూ తప్పుకోలేం. స్వేచ్ఛా, సంతృప్తీ అంటూ వుంటే ఈ బంధాల్లోనే. ఇదే మన అస్తిత్వం తాలూకు ఐరనీ (irony) స్వేచ్ఛని బంధాల్లో దర్శించడం ద్వారా నా స్వేచ్ఛాగానం ఈ ఐరనీని వ్యక్తపరుస్తోంది.

ఎక్కడికి వెళ్ళినా ఊరిగోడల మీద వెంటాడే నక్సలైట్ నినాదంలా, స్వేచ్ఛా గానం రాసినప్పుడు ఎక్కడో ఫ్రెడరిక్ ఎంగెల్స్ సూక్తి ఒకటి మెదలుతోందనుకుంటాను. ‘Freedom is the recognition of necessity’ అని. ‘స్వేచ్ఛ అంటే ఆవశ్యకతని గుర్తించడమే’ అని దానర్థం. అంటే సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు ఉత్పత్తి శక్తులవల్ల నిర్ణయింపబడినవని తెలిసికొన్నప్పుడే మనిషి వర్గ బానిసత్వాన్ని అధిగమించి స్వేచ్ఛని సాధించగలడు అని. ఆవశ్యకతకు అర్థం కార్యకారణ సంబంధం. భౌతిక ప్రకృతిలోని కార్యకారణ సంబంధాలు తెలిసికోవడం వల్ల శాస్త్రజ్ఞుడు ఏ విధంగా ప్రకృతిని జయించగలుగుతున్నాడో ఆ విధంగానే మనిషి చైతన్యానికి, మనుషుల మధ్య ఉత్పత్తి సంబంధాలకీ గల కార్యకారణ సంబంధం అవగాహన చేసికొన్నప్పుడే మనం నిజమైన సామాజిక స్వేచ్ఛ సాధించ గలమని మార్క్స్ సహభావుకుడైన ఎంగెల్స్ అభిప్రాయం.

ఎంగెల్స్‌తో నేను పూర్తిగా ఏకీభవించలేకపోయినా, స్వేచ్ఛ అనేది కొన్ని ఆవశ్యక నియమాలచే బాధితమై వుంటుందన్న విషయం గ్రహించాను. నా దృష్టి పరిధిలోవన్నీ వ్యక్తుల మధ్య సంబంధాలు – అంటే ప్రేమా, స్నేహం, బాంధవ్యం వంటివి. ఈ మానవీయ సంబంధాలకు మించి మనిషికి సంతృప్తీ, స్వేచ్ఛా లేవు. ఏదైనా వీటిలో వెతుక్కోవలసిందే. ఈ సత్యాన్ని ప్రదర్శించే పద చిత్రాలే (images) ఈ కవిత నిండా మీకు దర్శనమిస్తాయి.

దివిలో ఊగే విహంగాన్ని
భువిలో పాకే పురుగు బంధిస్తుంది

పక్షి స్వేచ్ఛగా ఆకాశంలో ఎత్తున ఎగురుతుందనుకుంటాం. కాని, దాని లక్ష్యమేమిటి? ఆహారం వెతుక్కోవటమే. ఎంత ఎత్తున ఎగిరినా, భూమిలో పాకే పురుగు దన్ని కట్టిపడేస్తోంది.

మరొకటి తీసుకుంటాను.

ముడుతలు పడ్డ ముసలి సాయంత్రాన్ని
మాటలు రాని కాలవ బంధిస్తుంది.

సాయంకాలం ఉజ్జ్వలంగా వెలిగి చల్లారిపోయినా, దాని అవశేషాలు, జ్ఞాపకాలూ చాలా రాత్రివరకు కాలవ కళ్ళలో తేలుతుంటాయి. చీకటి పడుతుంటే భరించలేక సాయంత్రాని పొడిగించడానికి మా వూరి బంకింగాం కాలవొడ్డున సాయం వేళల్లో ఎన్ని మైళ్ళు నడిచానో! కాలి బూడిదైపోయిన సాయంత్రం కాలవ తలపోతల్లో అమరత్వం సాధించినట్లు మనం గతించినా మన ప్రియుల జ్ఞాపకాల్లో అమరత్వం పొందుతామని అనిపిస్తుంది. మిగిలినవి మీ ఊహకి వదిలేస్తున్నాను. చివర్ని-

ఈ మనిషి ఆ మనిషిని బంధిస్తాడు
ఇద్దర్నీ కలిపి బంధిస్తుంది మనీష

మనుషుల్ని కలిపే ఈ “మనీష” వట్టి “బుద్ధి” మాత్రమే కాదు. సానుభూతితో కూడిన అవగాహన, సహృదయత, ఇప్పటి ప్రపంచానికి ముఖ్యావసరం ఇదీ. ఇది అలవర్చుకున్నప్పుడే మనిషి స్వేచ్ఛని సాధిస్తాడు.

26-6-1988