కృష్ణశాస్త్రి గారు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆయనే ఎక్కడో ఎప్పుడో ప్రస్తావించిన దృశ్యం నా మనస్సులో బొమ్మ కడుతుంది. కవిత్వం రాయటం ప్రారంభించిన తొలిరోజుల్లో, అంటే డెబ్భై ఏళ్ళ క్రితం, ఒక అర్ధరాత్రి సామర్లకోట ప్లాట్ఫాం మీద ఈయనా, నండూరి సుబ్బారావు తారసపడ్డారట. నువ్వేం రాస్తున్నావు? అంటే, నువ్వేం రాస్తున్నావు? అని కుశల ప్రశ్నలు వేసుకుని, ఒకరి గేయాలొకరికి వినిపించి, సుబ్బారావు రైలు ముందు రాగా, ఆయన్ని రైలెక్కించి, తన రైలు కోసం ప్రతీక్షిస్తూ దీపస్తంభపు క్రీనీడలో పిట్టలాగా ముడుచుకు కూచున్నాని రాశారు శాస్త్రిగారు. ఒంటరితనంతో బరువెక్కిన ఈ చిత్రం ఆనాటి కృష్ణశాస్త్రికి ప్రతీకగా నాకు తోస్తుంది.
ప్రతి మనిషీ తన అస్తిత్వకేంద్రంలో ఒక మహాశూన్యంతో పుడతాడు. ఆ శూన్యాన్ని బహిఃప్రపంచంతో, ప్రాపంచిక సౌందర్యంతో, తత్ఫలితమైన ఆనందంతో నింపగలిగే శక్తి, సాధనా బహు కొద్ది మంది సృజనకారులకు ఉంటుంది. మానవ జన్మకు శాపమైన ఆ శూన్యాన్ని కృష్ణశాస్త్రిగారు అద్భుత సౌందర్యమయ ప్రపంచంతో నింపారు. ఆత్మస్వేచ్ఛకీ, సృజనశక్తికీ ప్రతీక ఐన ఊర్వశిని ఆ శూన్యంతో నిలిపారు.
ఈ తపస్సూ, అన్వేషణా ఒకనాటికి కావు. “కృష్ణపక్షం”లో ప్రకృతితో తాదాత్మ్యంతో మొదలై, ఆత్మకీ, స్వేచ్ఛకీ, అద్వైతాన్ని తెలుసుకుని సౌందర్యాన్వేషణలో పండి, ప్రేమకై తపించి, విరహాగ్నిలో కాగి, లోకం చేత నిరసింపబడి, అత్మదైన్యంతో క్రుంగి; తరవాతి కావ్యమైన “ప్రవాసం”లో అన్వేషణ తీవ్రతరం కాగా, దుఃఖంతో నిర్వేదంతో ఐక్యం చెంది, చివరికి “ఊర్వశి” కావ్యంలో సాక్షాత్కరింప చేసుకున్నారు. తనలోని మౌలిక శూన్యాన్నించి కృష్ణశాస్త్రి సాగించిన ఈ అన్వేషణ, దు@ఖమూ, నిర్వేదమూ సాధనాలుగా, చివరికి ఊర్వశీ మూర్తిని అందుకుంది.
కృష్ణశాస్త్రి గారి కవిత్వం రెండు ప్రవాహాల సంగమం. ఒకటి భాషకి సంబంధించింది. రెండోది ఆలోచనకీ, వ్యక్తిత్వానికీ సంబంధించింది. తెలుగు భాషా, దాని నుడికారపు సొంపులూ తరతరాలుగా ఆయన వంశీయుల రక్తంలో జీర్ణమైపోయాయి. నాలుగు వందల యేళ్ళనించి వారి పూర్వీకులు పిఠాపుర సంస్థాన కవులూ, పోషితులూనూ. వారి నాన్న గారు తమ్మన్న శాస్త్రిగారూ, పెదనాన్నగారు సుబ్బరాయశాస్త్రి గారు గొప్ప పండితులూ, కవులూ. వారి వద్ద స్వయంగా భారత, భాగవతాదులూ, ప్రబంధాలూ చదువుకున్నారీయన. శాస్త్రిగారికి ఇష్టతముడైన కవి నన్నయభట్టు. తరువాత తిక్కన. ఆ తరవాత రామకృష్ణుడు. శబ్దప్రయోగం, కవిత్వ శైలుల విషయంలో ఈయన నన్నయ నుంచి నేర్చుకున్నది చాలా ఎక్కువ. “శబ్దానికి ప్రాణమే కాదు, పక్షాలూ ఉన్నాయి. ఒక శబ్దాన్నీ మరొక శబ్దాన్నీ ఒక ధోరణిలో కలిపి, ఒక విలక్షణమైన గానం పుట్టించి, దాని రెక్కల మీద కూర్చోబెట్టి, ఎట్టి దూరానుభవాలనైనా అందజేసి, ఎట్టి దూరలోకాలనైనా కనపరచి విహరింపజేస్తూ ఇంకా వెనకాల నున్నవేవో స్ఫురింపజేసే శక్తి ఒకటి ఉంది. అది నన్నయది. శబ్దం పలకడమే కాదు, పాడుతుంది.” అంటారీయన.
శబ్దం చేత పాడింప జేసే నైపుణ్యం ఈయన నన్నయ దగ్గిరే నేర్చుకున్నారు. శాస్త్రిగారికి పాటంటే మోజు. మాటకు లేని శక్తి పాటకుందని ఈయన నమ్మకం. ఈయనంటారు: “పాటకు ఒక శక్తి ఉంది. మాటలకందని వాటిని చెప్పుతుంది. ఏ అనుభవమైనా, తన్మయత్వం దాకా తీసుకుని పోయేటప్పటికి మనం దానిని వ్యక్తపరచడానికి సంగీతాన్నో దాని ఆభాసాన్నో సాయంగా తీసుకుంటాము. ఒక మహాకవికి మామూలు దృశ్యాలను మించినవి సాక్షాత్కరిస్తాయి గదా! మామూలు ఆవేశాలని మించినవి ఊగిస్తాయి గదా! వాటిని ప్రకటించడానికి సామాన్య శబ్దాలూ, ఎక్కడెక్కడి మాటలూ ఏరి తెచ్చి వాటిని రకరకాల కూర్పుల్లో పెట్టి, చిత్ర చిత్రాలుగా నడిపించి, ఒక వింతగానం పుట్టించి, తనకు సాక్షాత్కరించిన దాన్ని మనకు కూడా ప్రత్యక్షం చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఈ శక్తి నన్నయ కున్నట్లు ఆంధ్రకవులలో ఎవరికీ లేదు”.
కృష్ణశాస్త్రిగారి కవితాశైలి మీదా, పద్యం, పాటా నడిపించే ఒడుపు మీదా నన్నయప్రభావం మిక్కుటంగా ఉన్నట్టుతోస్తుంది.
***
కృష్ణశాస్త్రిగారి కవిత్వంలోని రెండో వాహిని ఇంగ్లీష్ విద్యా సంస్కారం. ముఖ్యంగా బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడి గారి వద్ద అధ్యనం చేసిన ఇంగ్లీష్ రొమాంటిక్ కవిత్వమూ, సూఫీ కవిత్వమూ, రవీంద్రుని కవితార్ణవమూ.
పద్దెనిమిదో శతాబ్దం చివర ఫ్రెంచి తాత్త్వికుడు రూసో భావాలనించి అంకురించిన రొమాంటిక్ ఉద్యమం వ్యక్తిస్వేచ్ఛని ప్రాతిపదికగా తీసుకుంది. మనిషి సహజంగా మంచివాడు. సమాజంవల్ల చెడతాడు. సమాజం కన్నా వ్యక్తి ముఖ్యం; వ్యక్తి స్వేచ్ఛ పునాదిగా లేని సామాజిక నియమాలకు తలవంచనఖ్ఖర్లేదు అని వీరంటారు. ఈ ఉద్యమం మౌలిక మానవ స్వభావంలోనే గొప్ప మార్పు తీసుకువచ్చినట్లుంది. అంతవరకు మహత్తర మానవశక్తిగా కొలిచిన బుద్ధిని(reason) పదవీచ్యుతం చేసి, ఇంద్రియానుభూతుల్ని(sensibility) సింహాసనం ఎక్కించారు. విశ్వాన్ని నడిపించే అదృశ్య శక్తుల్ని ఇంద్రియానుభూతి, లేదా చేతన, ద్వారానే తెలిసికోగలమని వీళ్ళు ఖచ్చితంగా నమ్మారు. మానవ ప్రకృతికీ, భౌతిక ప్రకృతికీ సన్నిహితాలూ, సమాజానికి అతిరిక్తాలూ ఐన భావోద్రేకాన్నీ, వ్యక్తిచేతననీ వీళ్ళు పైకెత్తారు.
వ్యక్తి స్వేచ్ఛ అంటే మనిషి తన స్వధర్మాన్ని వ్యక్తపరచ గలగటమే. ప్రేమా, ప్రకృతితో తాదాత్మ్యమూ ఈ స్వేచ్ఛయొక్క అభివ్యక్తులే. ఆత్మస్వేచ్ఛా, ప్రేమా తాదాత్మ్యమూ అన్నీ ఒక్కటే. వేరువేరు కావు. తన స్వధర్మాన్ని అన్వేషించటం, దాన్ని వాస్తవీకరించు కోవటమూ, ఇవి రెండు కృష్ణశాస్త్రిగారి కవితా ప్రస్థానంలో ముఖ్యాంశాలు. తన ఆత్మాభివ్యక్తికి ప్రతీక ఐన ఊర్వశిని సాక్షాత్కరిచుకోవటంతో కృష్ణశాస్త్రిగారికి చివరికి తపస్సిద్ధి కలిగింది.
****
అగ్నిపర్వతం మరిగి మరిగి, సెగలు వెలిగ్రక్కి, చల్లారాక, వర్షాలు కురిసి నిర్మలాకాశాన్ని ప్రతిఫలించే సరస్సుగా మారి, అందమైన పద్మాల్ని వికసిస్తుంది. కృష్ణశాస్త్రిగారి తరవాతి రచనలైన పాటలూ, యక్షగానాలూ, రేడియో నాటికలూ అటువంటివి. ఆత్మమధనం, అన్వేషణా, సమన్వయం కోసం సంఘర్షణా, ఏవీ లేవు. భాషతో, సంగీతంతో పదాల సొగసులతో, వంపులతో అభినివేశం ఒక్కటే మిగిలింది. తెలుగు కావ్య సంప్రదాయానిదే పైచెయ్యి. నన్నయా, తిక్కనా, రామకృష్ణుడూ దగ్గరివారయ్యారు.
కవిత్వానికీ, సంగీతానికీ సన్నిహిత సంబంధం ఉందని శాస్త్రి గారి అభిప్రాయం. కవిత్వం సంగీత స్థాయికి ఎదగాలంటారు. సంగీతమంత భావస్ఫోరకంగా ఉండాలంటారు. “కవిత్వంలో శబ్దం పలకడమే కాదు – పాడుతుంది. వచన కావ్యానికీ, పద్య కావ్యానికీ ఉన్న తేడా గమన తీవ్రతే అంటాడు మిడిల్టన్ మర్రే. ఈ గమన తీవ్రత సాధించడానికే పద్యనిర్మాణంలో శబ్దాలను మరీ సార్థకంగా ఏరడం, మరీ బిగువుగా చేర్చడం,వింత వింత చందస్సులలో కూర్చడమున్నూ. భావ సంగీతం వంటి పద్యకావ్యం దగ్గిరికి వెళ్ళేటప్పటికి శబ్దం పాటే అయిపోతుంది. “కవిత్వం శబ్దరూపంలో ఉన్న గానం” అని దీనినే అన్నాడు కార్లైల్.
ఇంకా ఇలా అంటారు: “మంచి పాటలు వ్రాసేవాడికి, నిజమైన పాట వ్రాసేవాడికి లోపల కూడా అంతరంతరాల్లో సంగీతం వచ్చి ఉండాలి. ఏ అనుభూతికి ఏ రాగమో, ఏ వరసో ఏ విరుపో, ఎక్కడ ఏ నొక్కో, ఏ ఒదుగో, సరిగా మాటా అవీ కలిసి వస్తాయి. నేననుకుంటాను, గేయానికి ఎక్కువ నగలు తొడగకూడదని – శబ్దార్థాలంకారాలూ అవీ! వాటి బరువు పాటని ఎగరనివ్వదు. లోతులకు రివ్వుమని దిగనివ్వదు.”
ఎన్ని రకాల పాటలు రాశారో శాస్త్రిగారు. తెలుగు ప్రపంచమంతా, తన పొలాలతో, గట్లతో, కాలవలతో, పాటకజనంతో, పిల్లలతో, స్త్రీలతో, వాళ్ళ ఆనందాలతో, ఆశలతో, దుఃఖాలతో వాటిల్లో ప్రతిఫలిస్తుంది. తెలుగు ఇళ్ళల్లో, వీధుల్లో, పెళ్ళిపందిళ్ళల్లో, చేలల్లో, తోటల్లో కాలవగట్ల మీదా యుగయుగాలుగా నిగ్గు తేరిన పదాల, జావళీల నుడికారపు అందం, మలపుల సొగసూ, విరుపుల ఒయ్యారమూ ఆయన పాటల నిండా విరిసి మనల్ని అలరిస్తాయి. క్షేత్రయ్య తరువాత ఇంతటి గేయకారుడు రాలేదని నా అభిప్రాయం.
***
కృష్ణశాస్త్రి గారి పద్యం కన్నా గద్యమే గొప్పగా ఉంటుందని పద్మరాజు గారు అంటుండేవారు. చాలా మంది గొప్ప కవుల గురించి ఇటువంటి రిమార్కులు వింటుంటాం. నిజానికి, కవైన వాడికి గద్యం, పద్యం రెండూ ఒక్కటే.
శాస్త్రిగారి గద్యరచనలు చాలా మట్టుకు రేడియో కోసం రాసినవి. వీటి వైవిధ్యానికి అంతు లేదు. సాహిత్య విమర్శ మొదలు బామ్మగారి ముచ్చట్లవరకు అన్ని జీవిత కోణాల్ని స్పృశిస్తాయి.
ఎందుకంటే, కృష్ణశాస్త్రిగారి గుండెల్లో అందరికీ, అన్నిటికీ చోటుంది. నేను మానవతా వాదిని, వట్టి హృదయవాదిని అని తరచు అంటుండేవారు. ఇది ముమ్మూటికీ నిజం. ఆయనలా అరమరికలు లేకుండా జనాన్ని ప్రేమించిన వాళ్ళని నేను చూడలేదు. ఎల్లప్పుడూ ఆయన చుట్టూ జనం ఉండవలసిందే. ఆయన కబుర్లు చెబుతుండాల్సిందే. గొంతుక ఆపరేషనై, స్వరపేటిక తీసేశాక కూడా ఆయన నోట్బుక్కుల ద్వారా సంభాషణ సాగిచేవారు. ఇటువంటి నోట్బుక్కులు కొన్ని వందలో వేలో పోగయాయి.
ఇంత కరుణార్ద్ర హృదయం ఏ వరం వల్ల సిద్ధిస్తుంది? అని ఆశ్చర్యపడుతుంటాను అప్పుడప్పుడు. ఆయనే అంటాడు : “బాధ వరం. బాధకి చాలా శక్తులున్నాయి. బాధలో కాలిపోయేవాడు పాషాణం కాలేడు. బాధ దృష్టిని నిశితంగా చేస్తుంది. దయార్ద్రంగానూ చేస్తుంది. వేదనలో వేగిపోయేవాడు బాహ్యవిశ్వంలోకీ, మానవ ప్రకృతిలోకీ చొచ్చుకొని లోపల లోపల పెల్లగించిచూస్తాడు… అప్పుడొక విధమైన అనుకంప కలుగుతుంది. ఒక విశ్వజనీన బాంధవ్యం ఏర్పడుతుంది…వేదన వల్ల గాని ప్రేమ కలగదు. ఈ రెండూ కలిస్తే కరుణ అవుతుంది. ఈ రెండూ కల హృదయం సదా స్నిగ్దం.”
“అలాగే కావ్య కల్పనలో కూడా. ఏ కావ్య సృష్టికయినా ఈ కరుణే కారణం. కనుక, ఈ విశ్వప్రేమ – ఈ కరుణ కావ్య నిర్మాణానికి కారణమవుతుంది. అంతే కాదు. ఈ విశ్వప్రేమను, కరుణను ఇతరుల హృదయలలో కలిగించడమే కావ్యానికి ముఖ్యోద్దేశ్యమని కూడా తత్త్వవేత్తలంటారు. ”
“నిందించడానికీ, కీర్తించడానికీ కాదు. మానవుని మానవునిగా చేయడానికే కావ్య నిర్మాణం.
ఈ అనుకంప ఎంతలోపల ఉంటే అంత మానవత్వం మానవుల్లో ఉన్నదన్నమాట. దానిని ఎంత ప్రభవింపచేస్తే అంత గొప్పదన్నమాట ఆ కావ్యం!”
“అటువంటి కావ్యాలు చదివి విశ్వప్రేమే తాత్కాలికంగా అనుభవిస్తున్నప్పుడయినా, ఆ దయా విధానంలో అందరూ అత్యవసరమేనని గ్రహించుకుంటాం. దానివల్ల లోకంలో ద్వేషం కరిగిపోతూ ఉంటుంది.”
ఇదీ కృష్ణశాస్త్రిగారి కవిత్వతత్త్వం.
“కృష్ణశాస్త్రి బాధ – ప్రపంచం బాధ; ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ” అన్న చలం మాట అర్ధసత్యం మాత్రమే!
30-10-93